బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని చట్టము 1813

బ్రిటిష్ ఈస్టు ఇండియా చట్టము 1813 (Charter Act 1813)

క్రి.శ.1600 న లండన్ లో స్థాపించబడిన బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీకి భారతదేశములో కేవలము వ్యాపారము చేసుకునటకు ఇంగ్లీషు రాణీ ఎలిజబెత్ చే ఆమోదించబడిన సన్నదు (పట్టా) ఇవ్వబడింది. ఈ కంపెనీ నిర్వహణకు 24 మంది వాటాదారులు ఒక గవర్నరుతో "జనరల్ కోర్టు ఆఫ్ ప్రొప్రైటర్లు" అని తరువాత "కోర్టు ఆఫ్ డైర్కటర్ల"ని (Court of Directors) అనుహోదాతో కార్యనివాకముచేయసాగిరి. ఆ పట్టాను అప్పుడప్పుడు నవీకరణచేసి పునః ఆమోదము పొందవలసియున్నది. పట్టాను నవీకరణచేయునప్పుడు కంపెనీ వ్యవహారాల నిమిత్తమను నెపముతో అనేక పరిపాలన అధికారములు కూడా ఇయ్యబడుచుండెను. కంపెనీ డైరెక్టర్లు పలుకుబడికలిగి బ్రిటిష్ ప్రభుత్వ అబిమతములతో ఏకీభవించి తమ ప్రతినిధులను, ఉద్యోగులను నియమించి కంపెనీ నడిపించుటకు పంపించుచుండిరి. ఆ విధముగా 1623,1661,1676,1686,1694 సంవత్సరములలో అనేక రాజ్యాదికారములు, శాసన నిర్మాణములు, యుద్దములు, న్యాయవిచారణ, రాజస్వకోశ సంబంధిత అధికారములు మొదలగు అధికారములు చెలాయించుటకు పట్టా నవీకరణచేసినప్పుడల్లా విస్తృతాధికారములు పట్టాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వమువారు ఈ కంపెనీకి ఇచ్చారు. 1765 లో కంపెని వారికి మొగల్ చక్రవర్తిరెండవ షా ఆలం ఇచ్చిన ఫర్మానాతో దివాన్గిరి అధికారమును పొంది వంగ, బీహారు, ఒరిస్సా రాజ్యములలో రాజస్వము వసూలు చేసుకును రాజ్యాధికారము లభించినప్పటినుండి కంపెనీకి ఇయ్యబడిన పట్టాలు చట్టరూపమున శాసనములై బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదము పోందబడు చుండెను. అందువలన వాటిని సన్నదు చట్టములని ప్రసిద్ధిచెందినవి. అటువంటి సన్నదు చట్టము మొదటిగా 1767 లో అమలుచేయబడింది. కంపెనీ వారు భారతదేశములో దాదాపు రెండు వందల సంవత్సరములలో క్రమేణా రాజ్యతంత్రములతో బ్రిటిష్ వలసరాజ్యమును విస్థిరించి రాజ్యాపాలన చేయసాగిరి. 1773 లో రెగ్యులేటింగ్ చట్టము అమలుచేయబడి గవర్నర్ జనరల్ పదని కలకత్తాకార్యాలయములో నెలకొల్పబడిన తరువా 1793 పట్టా నవీకరణచేసినప్పుడు కంపెనీ వారికి 1813 వరకూ 20 సంవత్సరములపాటు భారతదేశములో వ్యాపారము చేసుకునుటకు విసిష్టాధికార హక్కు ఇయ్యబడియున్నది. 1813 చట్టము ద్వారా అట్టి హక్కు కేవలము తేనీటియాకు (tea) కు తప్ప మిగతా సరకుల వ్యాపారములో తీసివేయబడింది. 1833 సంవత్సరపు చట్టము ద్వారా పూర్తిగా వ్యాపార రహితమైన కంపెనీగా చేయబడింది. చూడు 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము [1]

1813 సంవత్సరపు చట్టముచేసిననాటి పరిస్తితులు

మార్చు

1792-1815 మధ్య కాలములో ఫ్రాన్సు దేశనాయకుడైన నెపోలియన్తో జరిగిన ఫ్రెంచి విప్లవ యుద్దములలో కలిగిన పరాజయములవలన ఐరోపా ఖండమునందు నవీ బ్రిటిష వారి వ్యాపారములకు, వలస రాజ్యవిస్తరణకు పగ్గములు తగిలినవి. ఫ్రాన్సు పక్షమునయుండిన మిత్రదేశములతో 1806-1807 మధ్య నెపోలియన్ కుదుర్చుకున్న రెండు సంధి వప్పందములు ( బెర్లిన్ సంధి, మిలన్ సంధి ) ల ఫలితముగా ఐరోపా ఖండములో చాల దేశాలతో బ్రిటిష్ వారి వ్యాపారములు స్తంభించిపోయినందున బ్రిటన్ దేశ వ్యాపారస్తుల ఆందోళన చేపట్టిరి. అట్టి అంతర్జాతీయ, దేశీయ ఆందోళనకర పరిస్థితులలో కంపెని వారికిచ్చిన సన్నదును 1813 లో నవీకరణచేయుచు అందుగల నిబందనలు చట్టముగా శాసించి బ్రిటిష్ పార్లమెంటు వారి చే ఆమోదం పొందబడింది.

చట్టములోని ముఖ్య నిబంధనలు (provisions) నిర్ధేశములు

మార్చు

(1) భారతదేశములో రాజ్యధికారములతో పరిపాలించు కంపెని పై బ్రిటిష ప్రభుత్వముయొక్క రాజ్యాధికారము స్పష్టీకరించబడింది. (2) కంపెనికి మరొక 20 సంవత్సరములపాటు యధావిధిగా భారతరాజ్యభాగములలో వసూలుచేసుకునుచున్న దేశాదాయము వారే అనుభవించుట ఆమోదించబడింది. కానీ పరిపాలన చేయుటకగు లెఖ్కలు, వ్యాపారముచేయుటకగు లెఖ్కలు వేరు వేరుగా చూపవలయునని నిర్దేసించబడింది. అట్టి లెఖ్కల ఖాతాలును ‘బోర్డు ఆఫ్ కంట్రోలు’ (Board of Control) వారి తనిఖీక్రిందనుంచబడినవి. (3) 1794 నుండి 20 సంవత్సరములు బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనికి భారతదేశములో వ్యాపారముచేసుకొను విసిష్టాధికార హక్కును (trade monopoly) ఈ 1813 చట్టముతో అంతరించింది. ఒక్క తేనీటి ఆకు (tea) వ్యాపారములో తప్ప మిగత అన్ని సరకుల వ్యాపారములలో ఇతర బ్రిటిష్ కంపెనీలు వ్యాపారము భారతదేశములో కొనసాగించుకునవచ్చును (4) బ్రిటిష్ ప్రభుత్వమువారు కంపెనీకిచ్చు రెండు లక్షల సైనికదళము కగు ఖర్చులు కంపెనియే భరించవలయును. (5) కంపెని వారు గణించు లాభము నూటికి 10.5 (శాతము) కన్నా మించరాదని నిర్దేశించ బడింది. (6) కంపెని ఉద్యోగస్తుల నియమించు అధికారము యధావిదిగా కంపెని డైరెక్టర్లకే యియ్యబడింది. (7) ఆంగ్లేయ క్రైస్తవ మతసంస్థలు భారతదేశములో విద్యబోధన చేయుట అనుమతించ బడింది. (8) సాలునా లక్షరూపాయలు భారతదేశములో విద్యాభివృద్దికి వినియోగించవలసియున్నది (9) ధేశములోని ఫ్రాంతీయ న్యాయస్తానములు భారతదేశములోనుండిన యూరోప్ దేశ ప్రజలను న్యాయవిచారణ చేసే వ్యవస్థ పటిష్ఠము చేయబడింది. (10) కంపెనీ ప్రభుత్వము వారు ప్రజలపై వ్యక్తిగత సిస్తు వేసి సిస్తు వసూలు చేసే అధికారము ఇయ్యబడింది.

1813 చట్టము సమీక్ష

మార్చు

ఈ చట్టములోని నిబంధనలలో ఈస్టు ఇండియా కంపెని వారికి విసిష్టాధికార హక్కును (trade monopoly) కల్పించకపోవటంతో బ్రిటిష్ వ్యాపరస్తులు ఇచ్చటికి వచ్చి వ్యాపారము, వృత్తి చేసుకునటకు ప్రోత్సహించటమైనది. ఈ చట్టము అమలు చేసినతరువాతనే బ్రిటిష ప్రజలు వ్యాపార రీత్యా వృత్తిరీత్యా భారతదేశానికి విరివిగా వలస వచ్చుట మొదలైనది. వచ్చి భారతదేశ ప్రజల వాడుకలకు అవసరములకు సరకులను విరివిగా విక్రయించే ప్రయత్నములు జరిగినవి. భారతదేశములోని కంపెనీ ప్రభుత్వము భరించవలసిన వ్యయములోసాలునా 25 లక్షల రూపాయలు క్రైస్తవ మతబోధకుల శాఖకు వినియోగించ వలసినదిగా ఈ చట్టములో నిర్ణయంచటంతో భారతదేశములోని హిందూ, మహమ్మదీయ మతములకు పోటీగా క్రైస్తవ మతమును ప్రోత్సహించుటం జరిగింది. ఈ చట్టము అమలుచేసిన నుండియే భారతదేశములో క్రైస్తవ మతబోధకులకు పలుకుబడి మొదలై క్రైస్తవ పాఠశాలలు స్థాపించబడి వారి పాఠశాలలో బైబిలు పఠన ప్రవేశపెట్టుటయు మొదలైనవి.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "The British Rule in India" D.V.Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ pp220-240