భారతీ శతకము(గిడుగు సీతాపతి)

వాడుక భాషలోని తియ్యని పలుకుల తీరు, వాటి పరిణామము, ప్రయోగములు మొదలైన విషయాలను ఈ భారతీ శతక[1]రూపములో గిడుగు వేంకట సీతాపతి నిరూపించాడు. లోకవ్యవహారములో నిత్యము వాడే భాషయొక్క సౌష్టవాన్ని,ఆ భాషను మహాకవులు తమ గ్రంథాలలో ప్రయోగించిన విధానాన్ని ఈ శతకములో చూపించాడు. భాషాభివృద్ధిని నిరూపిస్తూ, భాష తనంతట తాను వృద్ధిచెందే రీతిని, ఇతర భాషల సాంకర్యంవల వృద్ధిపొందే రీతిని ఈ శతకం వివరిస్తుంది. పూర్వకవులంతా వ్యావహారిక భాషలోనే గ్రంథాలను వ్రాసేవరనిన్నీ, శిష్ట వ్యవహారిక భాషను విసర్జించి, కేవలం ప్రాచీన శబ్దాలతో గ్రంథాలను వ్రాయడం, కొత్త చిగుళ్లను వూడదీసి, రాలిపోయిన పండుటాకులను తిరిగీ అంటించడం వంటిది అని ఈ శతకం చాటుతుంది. కొందరు వైయాకరణులు గ్రామ్యమని గర్హించినప్పటికీ, శిష్ట వ్యవహారికంలో వున్న చక్కని తెలుగు పలుకులను మహాకవులు తమ కావ్యాలలో ఏ విధంగా ప్రయోగించినదీ చూపిస్తూ లక్ష్యలక్షణ సమన్వయం ఈ శతకంలో చేయబడింది. సంధి, విసంధి, శకటరేఫ మొదలైన వాటిని గురించి కూడా ఈ శతకము చర్చించింది. భాష తాలూకు స్వరూప స్వభావాలను చాలా సుబోధకంగా ఈ శతకం వివరిస్తుంది.

భారతీ శతకము
కవి పేరుగిడుగు వేంకట సీతాపతి
మొదటి ప్రచురణ తేదీ1940
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంభారతీ!
విషయము(లు)వాడుక భాష
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుఉత్పలమాల,చంపకమాల పద్యాలు
ప్రచురణ కర్తనవ్యసాహిత్య పరిషత్తు, గుంటూరు
ప్రచురణ తేదీ1940
మొత్తం పద్యముల సంఖ్య101

కొన్నిపద్యాలు మార్చు

నలువకు రాణివై వెలసి నల్వురి నోటను నాట్యమాడుచున్
బలుకు వెలందివై సకల భాషలు విద్యలు శాస్త్రముల్ కళల్
వెలయఁగఁజేసి యీ యఖిల విశ్వమునందును జ్ఞానతేజము
జ్వలముగ భాసిలన్ బఱపి పాపుదు మోహతమంబు భారతీ!

అణుమాత్రంబగు మఱ్ఱివిత్తనము మొల్కైలేచు;నేపారు;చి
క్కనిచెట్టై ననలెత్తి కాచు; నురుశాఖల్‌సాచు; సందుండి నే
లను దాఁకన్ బడు మాడలం విడుచు వేళ్లన్ బర్వు; నట్లే కదా
తనరున్ భాషయుఁ, బ్రాణమున్న వఱకున్ దప్పేమి? యో భారతీ!

జెలలైపుట్టి, స్రవించి, వర్షములకున్ జెన్నొంది, శాఖానదుల్
గలయన్ బెంపును బొంది, పుష్కలతరంగశ్రేణి నృత్యంబుతో
నలరన్ బాఱెడు నమ్మహా నదుల సామ్యంబొంది, భాషానదుల్
విలసిల్లున్ భువినెల్లకాలమును నిర్విఘ్నంబుగా భారతీ!

"రోసిందేటికి, రోతలేటికి మహా రోగస్థుఁ"డంచుంగదా,
వ్రాసెన్ ధూర్జటి అశ్వయుక్తపునవర్ణంబందు నజ్లోపమున్,
జేసెన్ మూఁడు పదంబులందు నికనేఁ జెప్పింది యొప్పైన నే,
వ్రాసిందెందుకు నొప్పుగా పరిగణింపంజాలవో భారతీ!

ఒప్పుగ "కోస" మంటకు ప్రయోగములన్నవి "ముక్తికోసమై",
అప్పకవీయ మందు గననయ్యెడు, తమ్మయ పాపరాజులుఁ
జెప్పిరి; హంసవింశతిని జేరెను; తిర్పతి వెంకటేశ్వరల్,
"కొప్పరపుంగవీశ్వరుల కోసము" చెప్పిరి గాదె భారతీ!

మూలాలు మార్చు

  1. [1] Archived 2016-03-05 at the Wayback Machineభారతి మాసపత్రికలో 1940 జూన్ సంచిక పేజీలు 125-128