భారత న్యాయ వ్యవస్థ

భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వహణ శాఖలతోపాటు స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం, శాసన, కార్యనిర్వహణ శాఖలు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాయో లేదో సమీక్షించడం మొదలైన కార్యకలాపాల ద్వారా భారత న్యాయ వ్యవస్థ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాది రాయి లాంటిది.

సుప్రీం కోర్టు,న్యూడిల్లీ

స్వతంత్ర న్యాయ వ్యవస్థ

మార్చు

ఎలాంటి భయం, పక్షపాత ధోరణి లేకుండా న్యాయాన్నందించే స్వేచ్ఛ న్యాయమూర్తులకు ఉండటం; వీరిచ్చే తీర్పులు, జారీ చేసే ఉత్తర్వులు శాసన, కార్యనిర్వాహక శాఖ ఒత్తిళ్ళకు లోను కాకపోవడమే స్వతంత్ర న్యాయవ్యవస్థ. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులకు రాజ్యాంగ బద్ధంగా పదవీ భద్రత ఉంది. న్యాయమూర్తులను తొలగించాలంటే పార్లమెంటులోని ఉభయసభల్లో 2/3ప్రత్యేక మెజారిటీ ఆమోదం అవసరం.

  • సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలు సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఇలా వేతనాలు పొందడానికి శాసన సభల ఆమోదం అవసరం లేదు.
  • న్యాయమూర్తుల విధి నిర్వహణ సంబంధమైన ప్రవర్తనను పార్లమెంటులో లేదా రాష్ట్ర శాసనసభల్లో చర్చించడాన్ని నిషేధించారు.
  • సుప్రీంకోర్టు, హైకోర్టులకు తమను ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం ఉంది.
  • 50వ అధికరణం ప్రకారం న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థనుంచి వేరు చేశారు.

ఏకీకృత న్యాయ వ్యవస్థ

మార్చు

సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు న్యాయవ్యవస్థలుంటాయి. కానీ, భారతదేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థ అమల్లో ఉంది. దీని ప్రకారం సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానం. సుప్రీం కోర్టు క్రింద వివిధ రాష్ట్రాల హైకోర్టులు, వాటి కింద ఇతర న్యాయస్థానాలు పని చేస్తాయి. ఏకీకృత న్యాయ వ్యవస్థ ను బ్రిటన్ నుండి గ్రహించారు

సుప్రీం కోర్టు నిర్మాణం

మార్చు

భారతదేశంలో సుప్రీంకోర్టుని 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. మొదట దీన్ని ఫెడరల్ కోర్టు అని పిలిచే వారు. రాజ్యాంగం ఆమోదించిన తరువాత సుప్రీంకోర్టుగా మారింది.సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశం 1950 జనవరి 28న ఢిల్లీలో జరిగింది. మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా హెచ్. జె. కానియా వ్యవహరించాడు.

న్యాయమూర్తుల నియామకం

మార్చు

సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు, ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర కేబినెట్ సలహాపై రాష్ట్రపతి నియమిస్తాడు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తుల నియమకానికి కావలసిన అర్హతలున్నాయి. ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన అర్హతల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న న్యాయమూర్తిని అనుభవం ఆధారంగా చేసుకుని ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం ద్వారా నియమించడం సాంప్రదాయం.

అర్హతలు

మార్చు

సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యే వ్యక్తికి కింది అర్హతలు ఉండాలి.

  1. భారతీయ పౌరుడై ఉండాలి
  2. హైకోర్టు న్యాయమూర్తిగా కనీసం అయిదేళ్ళు లేదా హైకోర్టు న్యాయవాదిగా పదేళ్ళ అనుభవం ఉండాలి.
  3. రాష్ట్రపతి అభిప్రాయంలో ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త అయిఉండాలి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నియామకంలో కనీస వయోపరిమితి లేదా స్థిరమైన కాలపరిమితి గురించి రాజ్యాంగం ప్రత్యేకంగా పేర్కొనలేదు. నియామకం జరిగిన తరువాత వారు 65 సంవత్సరాల వయససు నిండేంతవరకు పదవిలో ఉంటారు.

భారత న్యాయ వ్యవస్థలో ప్రథాన లోపం హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం-కొలీజియం ద్వారా ఏర్పాటు. భారతదేశంలో అత్యున్నత స్థాయి పదవులైన ఐ.ఏ.యస్. లేదా ఐ.పీ.యస్.కు ఎంపిక కావాలంటే యు.పి.యస.సి. నిర్వహించే రెండంచెల వ్రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలలో అత్యథిక మార్కులు వచ్చిన అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నారు. భారత దేశంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి ఇవే విథానాలు అనుసరిస్తారు.భారత న్యాయ వ్యవస్థలొనే క్రింద కోర్టులు లేదా జిల్లా కోర్టుల జడ్జీల నియామకం కూడా వ్రాత పరీక్షలు, మౌఖిక పరీక్షల ఆధారంగా చేపడతారు.

భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవులైన హైకోర్టు, సుప్రీం కోర్టుల జడ్జీల నియామకాలు కొలీజియం అనే లోపభూయిష్ఠమైన వ్యవస్థ ద్వారా చేపడుతున్నారు.ఈ పద్దతిలో హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకాలకి ఎటువంటి సామూహిక పోటీ పరీక్షలు రాయనవసరం లేదు. ప్రస్తుతం పదలలో ఉన్న హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలతో కూడిన కొలీజియం ద్రుష్టిని ఆకర్షించే సామ , దాన, వేద ,దండోపాయాలు తెలిసిన వారు మాత్రమే నెగ్గుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం (2019-2024) మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ లోపభూయిష్ఠమైన కొలీజియం విధానం (బ్రిటిష్ విథానం) రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ భారత న్యాయ వ్యవస్థలో అత్యన్నత పదవుల్లో ఉన్న వారు అడ్డుకున్నారు.[ఆధారం చూపాలి]

జీతభత్యాలు

మార్చు

పార్లమెంటు రూపొందించే చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తమ జీత భత్యాలను పొందుతారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం 2,80,000, న్యాయమూర్తుల వేతనం 2,50,000 రూపాయలు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు