ముదలాళ్వారులు

(భూత యోగి నుండి దారిమార్పు చెందింది)

ఆళ్వారులు (Alvars, Alwars) శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ ఆళువారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాథలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు.

మొత్తం పన్నెండుమంది ఆళ్వారులలో పొయ్‌గయాళ్వార్ (సరోయోగి), పూదత్తాళ్వార్ (భూతయోగి), పేయాళ్వార్ (మహాయోగి) - ఈముగ్గురూ ప్రథములు. కనుక వారిని ముదలాళ్వారులు అంటారు. ఆళ్వారుల జీవిత కాలాల గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు అందడంలేదు. ముదళాల్వారులు ద్వాపర యుగాంతంలో ఉద్భవించారని సంప్రదాయ గాథలు. కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం సా.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు. ఆళ్వారుల జీవిత విశేషాలగురించి కూడా అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వ్యాసంలో ఆ గాథలలోని విశేషాలు ఇవ్వబడ్డాయి.

పోయిగై ఆళ్వార్

సరోయోగి
నామాంతరములుపొయ్ గయాళ్వారు
జన్మస్థలం బంగారు తామర పుట్టుక
దైవాంశ పాంచజన్య శంకము
రచనలు ఇయఱ్పా
విశేషములు తొలిముగ్గురు ఆళ్వారులలో ఒక్కరు

ఆళ్వారులలో మొదటివాడు పొయ్‌గాళ్వార్. సంప్రదాయ గాథల ప్రకారము ఇతడు ద్వాపర యుగమున 8,60,900వ సంవత్సరమగు సిద్ధార్థి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ అష్టమి జయవారము శ్రవణ నక్షత్రమున కాంచీ నగరములో యధోక్తకారి సన్నిధియందలి పుష్కరిణిలో తామర పుష్పమున అవతరించాడు. 'పొయ్‌కై' అనగా చెరువు. సరసునందు అవతరించినందువలన 'పొయ్‌కై ఆళ్వార్' అని పిలువబడెను. కాసార యోగి, సరోయోగి అనునవి ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు శంఖమైన పాంచజన్యమునకు ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

పొయ్‌గైయాళ్వారుల ఆచార్యుడు సేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. ముగ్గురు ఆళ్వారులు భగవద్దర్శనము కలిగి పులకించినపుడు పొయ్‌గైయాళ్వార్ పాడిన నూరు పాశురములు 'ముదల్ తిరువందాది' (మొదటి వంద ముక్తగ్రస్త గేయాలు) అనబడుచున్నాయి. దివ్య ప్రబంధాలలో ఇవి మొదటి భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా నుండుట వలన ఈ పాశురములు "అందాది" అనబడ్డాయి. ఈ ముదల్ తిరువందాదిలో శ్రీరంగము, కంచి, తిరుమల, తిరుక్కోవలూరు దివ్య దేశములలోని సర్వేశ్వరుని స్తుతి చేయబడింది.

పొయ్‌కైయాళ్వార్ తిరుక్కోవలూర్‌లో పరమపదించాడు.

ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్ (స్మరణ ప్రణామ శ్లోకము) :

తులాయాం శ్రవణే జాతం | కాఞ్చ్యాం కాఞ్చన వారిజాత్ ||
ద్వాపరే పాఞ్చజన్యాశం | సరోయోగి సమాశ్రయే ||
కాఞ్చ్యాం సరసి హేమాబ్జే | జాతాం కాసార యోగినమ్ ||
కలయే యశ్శ్రియఃపత్యూ | రరవిన్దీప మకల్పయత్ ||

పూదత్తాళ్వార్

మార్చు
పూదత్తాళ్వార్
నామాంతరములుభూతాహ్వయుడు, మల్లపురాధీశుడు
జన్మస్థలం మహాబలిపురము
జన్మ నక్షత్రము ధనిష్ట
దైవాంశ కౌమోదకి (విష్ణువు గద)
రచనలు ఇరణ్డాన్ తిరువందాది

ఆల్వారులలో రెండవవాడు పూదత్తాళ్వార్. సంప్రదాయ గాథల ప్రకారము ఇతడు సిద్ధార్ధి సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ నవమి బుధవారము ధనిష్ఠా నక్షత్రమున (పొయ్‌గై ఆళ్వారు అవతరించిన మరుసటినాడు) మహాబలిపురము (తిరుక్కడల్మల్లై) లో బండి గుఱిగింజ పూవులో అవతరించాడు. 'పూతము' అనగా యథార్థము, ఆత్మ అని అర్ధాలు. తన పాశురాలలో యథార్థమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన ఇతనికి 'పూదత్తాళ్వార్' అన్నపేరు వచ్చింది. భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు గదాయుధమైన కౌమోదకికి ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

పూదత్తాళ్వార్ ఆచార్యుడు నేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. ముగ్గురు ఆళ్వారులు భగవద్దర్శనము కలిగి పులకించినపుడు పూదత్తాళ్వార్ పాడిన నూరు పాశురములు 'ఇరణ్డాన్ తిరువందాది' (రెండవ వంద ముక్తగ్రస్త గేయాలు) అనబడుచున్నాయి. దివ్య ప్రబంధాలలో ఇవి రెండవ భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా నుండుట వలన ఈ పాశురములు "అందాది" అనబడ్డాయి. ఈ ఇరణ్డాన్ తిరువందాదిలో శ్రీరంగము, తిరుమల, మహాబలిపురము, తిరుక్కోవలూరు, కంచి, అడకసింగరు, తిరుక్కోట్టియూర్, తిరునీర్మలై దివ్య దేశములలోని సర్వేశ్వరుని స్తుతి చేయబడింది.

పూదత్తాళ్వార్ తిరుక్కోవలూర్‌లో పరమపదించాడు.

ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్ :

తులా ధనిష్ఠా సంభూతం | భూతం కల్లోలమాలినః ||
తీరే ఫుల్లోత్పలేమల్లా | పుర్యామీడే గదాంశకం ||
మల్లాపుర వరాధీశం | మాధవీ కుసుమోద్భవమ్ ||
భూతం నమాఙియోవిష్ణోః | జ్ఞానదీపమకల్పయత్ ||

పేయాళ్వార్

మార్చు
పేయాళ్వార్
నామాంతరములుమహదాహ్వయుడు, మైలాపురాధీశుడు
జన్మస్థలం మైలాపూరు
జన్మ నక్షత్రము శతభిష
దైవాంశ నందకము
రచనలు మూన్ఱాన్ తిరువందాది

ఆళ్వారులలో మూడవవాడు పేయాళ్వార్. సంప్రదాయ గాథల ప్రకారము ఇతడు సిద్ధార్ధి సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ దశమి గురువారము శతభిషా నక్షత్రమున (పొయ్‌గై ఆళ్వారు అవతరించిన రెండవనాడు, పూదత్తాళ్వార్ అవతరించిన మరుసటినాడు) చెన్నపట్టణం సమీపంలోని మైలాపురిలో మణికైరవం అనే బావిలో ఎర్రకలువ పుష్పంలో అవతరించాడు. భగవధ్యానములో మైమరచి పిచ్చివానివలే సంచరించినందున ఇతనికి 'పేయ్' (పిచ్చి) ఆళ్వార్ అనే పేరు వచ్చింది. మహదాహ్వయుడనీ, మైలాపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు ఖడ్గమైన నందకమునకు ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము.

పేయాళ్వార్ ఆచార్యుడు నేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. శిష్యుడు తిరుమళిశయాళ్వార్ (భక్తిసారుడు).

ముగ్గురు ఆళ్వారులు భగవద్దర్శనము కలిగి పులకించినపుడు పేయాళ్వార్ పాడిన నూరు పాశురములు 'మూన్ఱాన్ తిరువందాది' (మూడవ వంద ముక్తగ్రస్త గేయాలు) అనబడుచున్నాయి. దివ్య ప్రబంధాలలో ఇవి మూడవ భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా నుండుట వలన ఈ పాశురములు "అందాది" అనబడ్డాయి. ఈ మూన్ఱాన్ తిరువందాదిలో శ్రీరంగము, తిరువల్లిక్కేణి, కాంచి, తిరుమలై, తిరువెక్కావేళుక్కై, తిరుక్కుడన్‌దై, తిరుక్కోట్టియూర్ దివ్య దేశములలోని సర్వేశ్వరుని స్తుతి చేయబడింది.

పేయాళ్వార్ తిరుక్కోవలూర్‌లో పరమపదించాడు.

ఈ ఆళ్వారు తిరునక్షత్ర తనియన్:

దృష్ట్ తుష్టావయో విక్ష్ణుం | రమయా మయిలాధిపం||
కూపే రక్తోత్పలే జాతం | మహదాహ్వయ మాశ్రయే ||
తులా శతభిషగ్జాతం | మయూర పురికైరవాత్ ||
మహాన్తమ్ మహదాఖ్యాతం| వన్దే శ్రీ నందకాంశకమ్ ||

ముగ్గురు ఆళ్వారుల దివ్యానుభవం

మార్చు

ఈ ముగ్గురు ముదలాళ్వారుల సమావేశం గురించీ, ద్రవిడ వేదం ఆవిర్భవించడం గురించీ ఒక గాథ ప్రచారంలో ఉంది. ఇది తిరుక్కోవలూర్‌లో జరిగింది అని చెబుతారు.

వర్షం కురుస్తున్న ఒక చీకటిరాత్రి పోయ్‌గై ఆళ్వారు ఒక ఇంటి యజమాని అనుమతి తీసికొని ఆయింటి చిన్న అరుగుపైన పడుకొని భగవధ్యానము చేసికొంటున్నాడు. కొంత సేపటికి పూదత్తాళ్వారు అక్కడికి వచ్చి తాను కూడా తలదాచుకొనవచ్చునా అని అడిగాడు. అప్పుడు పోయ్‌గయాళ్వారు - 'ఈ అరుగు మీద ఒకరే పండుకొనవచ్చును కాణి ఇద్దరు కూర్చుండవచ్చును' అని పూదత్త ఆళ్వారును ఆహ్వానించాడు. మరి కొంత సేపటికి పేయాళ్వాఱు వచ్చి తనకు కూడా చోటు దొరకునా అని అర్ధించాడు. కూర్చొని ఉన్న ఇద్దరు ఆళ్వారులు - 'ఈ అరుగు మీద ఇద్దరే కూర్చోగలరు. కాని ముగ్గురు నిలుచుండవచ్చును' అని మూడవ భగవద్దాసుని ఆహ్వానించారు.

ఆ రాత్రిపూట - కన్ను పొడుచుకున్నా కానరాని ఆ కటిక చీకటిలో - ఈ ముగ్గురూ భగవద్గుణానుభవామృతపానమత్తచిత్తులై మైమరచి యున్నారు. వారి భక్తి ప్రకర్షకు పరరవశించి శ్రీ హరి ఉన్నట్లుండి అదృశ్యరూపంలో వచ్చి వారినడుమ నిలిచి చిందులు వేయసాగాడు. తమ మధ్య మరొకరు ఉన్నారని ఆళ్వారులు గ్రహించారు.

అపుడు పొయ్‌గయాళ్వారు ఆ మహామూర్తిని గుర్తించటానికి ఒక దివ్యదీపం వెలిగించాడు. భూమిని ప్రమిదగా చేసి, దానిలో సముద్రజలం అనే నెయ్యిపోసి, ఉష్ణకిరణాలతో వెలిగే సూర్యుణ్ణి వత్తిగా వేసిన దీపంతో సుదర్శన చక్రధారియైన స్వామని అర్చిస్తానన్నాడీ కవి.

వైయం కకళియా వార్ కడలే నెయ్యాక
వెయ్యకతిరోన్ విళక్కాక - శెయ్య
శుడరాళియా నిడిక్కే శూట్టినేన్ శొన్మాలై
ఇడలాళి నీంగుక వే యెంగు

తాళ్ళపాక తిరువేంగళనాధుడు రచించిన పరమయోగి విలాసములో ఈ పాశురమునకు తెలుగు సేత ఇలా ఉంది.

ధరణి పంతియ సముద్రంబులు నేల
యరుణు దీపము జేసి యరుణాంశ తతుల
గారాబు చక్రంబు కైబూన్చినట్టి
నీరజాక్షునకిత్తు నీరాజనంబు

ఆ తరువాత పూదత్తాళ్వారులు తమ హృదయంలోనే ప్రజ్వలిస్తూ ఉన్న ఙ్ఞానదీపంతో ఆ శ్రీపతి కిట్లా నివాళి పట్టాడు:-

అన్బే తకళియా ఆర్వమే నెయ్యాక
ఇన్బురుకుశిందై ఇడుతిరియా - నన్బురుకి
జానచ్చుడర్విళ క్కేత్తినేన్ నారణ్ర్కు
జానత్తమిళ్ పునిందనాన్

భక్తిని ప్రమిదగా చేసి, ఆర్తిని నెయ్యిగా దానిలో పోసి, భగవత్సందర్శన జనితానందం అందులో వత్తిగావేసి, అఙ్ఞానాంధకారం దూరం అయ్యేటట్లుగా పరభక్తి అనే ఉజ్జ్వల దీపాన్ని నిండుమనస్సుతో అర్పించి ఆ శ్రీ హరిని అర్చిస్తున్నాను అని దీని అర్థం.

తాళ్ళపాక తిరువేంగళనాధుడు రచించిన పరమయోగి విలాసములో ఈ విషయాన్ని ఇలా వర్ఞించాడు.

.... ... ... ప్రేమ
పంతియ మితి లేని భక్తియే చమురు
నానంద భరిత హృదబ్జంబె వత్తి
గానొనరించి వికాసమై యాత్మన్
తిరమొందు జ్ఞానంబు దీపంబు జేసి
పెరియ నారాయణార్పితము గావించె

ఈ ఇద్దరు భక్తులూ వెలిగించిన ఙ్ఞానదీపం ఆధారంగా పేయాళ్వారులు ఆ భగవానుని దివ్యమంగళ విగ్రహ సౌందర్యం కన్నుల కరువు తీరా సందర్శించాడు. ఆ శుభక్షణంలో అయత్నంగా వెలువడిన సుమథుర వాణియే ఇది:-

తిరుక్కండెన్ పొన్మేనికండేన్ తికళుమ్
అరక్కన్ అణినిరముంకండెన్
పొన్నాళికండేన్ పురిశంగం కైక్కండేన్
ఎన్నాళి వణ్ణన్ పొల్ ఇంగు

అహో! శ్రీమహాలక్ష్మితోపాటు శ్రీహరి సువర్ణ శరీరసౌందర్యం ప్రత్యక్షమైంది నాకిప్పుడు. పాపాత్ముల్ని చేదిన్చే సుదర్శనాయుధం కూడా స్వామి చేతిలో ఉంది. అంతేకాదు - ప్రళయకాలాభీల వర్జవ్యగర్జ ననుకరించే పాంచజన్యాన్ని సైతం కాంచగల్గిన సుకృతిని పొందాను. ఇట్టి నాకింకేమి కావాలి!

తాళ్ళపాక తిరువేంగళనాధుడు రచించిన పరమయోగి విలాసములో ఈ విషయాన్ని ఇలా వర్ఞించాడు.

సిరి గంటి చెన్ను మించిన మేను గంటి
కరమొప్పు వదన వికాసంబు గంటి
సల్లలితావనీస్తన కుంభశుంభ
పల్లవంబులబోలు పాదముల్గంటి
సరసీజ హల శంఖ చక్రాంకుశాంక
చరణముల్ జగదేక శరణముల్ గంటి
ధరణీ బింబము చాయ దరళించు కనక
సురుచిరాంశుకము నంశుకము గన్గొంటి
శ్రీ మించు కటితట శ్రీ సతీవరణ
దామముల్ మేఖలా దామముల్గంటి
వాత్సల్య జలధి కైవడి నొప్పుచున్న
వత్సంబు గంటి శ్రీవత్సంబు గంటి
చుట్టు కైదువు వలచుట్టు శంఖంబు
పట్టి చూపట్టిన బాహువుల్గంటి
శీతాంశు మండల శతకోటి కోటి
రీతి జూపట్టు కిరీటంబు గంటి
మలగులై తెల్ల దామరల దామరలన్
గలహించు నిడువాలు గన్నుల గంటి
మకర కుండల బాల మార్తాండ రుచుల
వికసించు వవదనార విందంబు గంటి

ఇలా ఆ మహనీయుల భగవద్దర్శన కాంక్ష ఒకేమారు నెరవేరింది - అని శ్రీవైష్ణవ సంప్రదాయ గాథలలో చెబుతారు.

వనరులు

మార్చు