నాలాయిర దివ్య ప్రబంధం
నాలాయిర దివ్య ప్రబంధం 8 వ శతాబ్దానికి ముందు, పండ్రెండు మంది ఆళ్వారులు రచించిన 4000 పాశురాల సమాహారం. తమిళంలో నాలాయిర మనగా నాలుగువేలు. 9 వ శతాబ్దంలో నాథముని వీటిని క్రోడీకరించాడు. నారాయణుని, అతని అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వారులు పెక్కు దేవాలయాల్లో గానం చేశారు. అలా గానం చేయబడిన ప్రాంతాలను దివ్య దేశములు అని అంటారు. దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడులో దివ్య ప్రబంధాన్నివేదాలతో సమంగా పరిగణిస్తారు. అందుకే దీనిని ద్రావిడ వేదం అని అన్నారు. శ్రీరంగం మొదలైన ఎన్నో దేవాలయాలలో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్నిఉచ్చరించడం భగవత్సేవలో ఒక ముఖ్యమైన భాగం. 4000 పాశురాల్లో 1100 పైచిలుకు పాశురాలు తిరుక్కురుగూరుకు చెందిన నమ్మాళ్వారు రచించాడు. వీటినే తిరువాయ్‌మొళి అని కూడా పిలుస్తారు. తిరువాయ్‌మొళి అనగా, పవిత్రమైన నోటి నుండి వెలువడే మాటలు అని అర్థం. ఇందులో నమ్మాళ్వారు తనను తాను, కృష్ణుని ప్రేమకై తపించే ఒక గోపికగా అభివర్ణించుకుంటాడు.
సంకలన నేపథ్యం
మార్చుఎక్కడో పోయినవనుకున్న దివ్య ప్రబంధ పాశురాలను నాథముని సేకరించి, సంకలన పరిచాడు. నాథముని ఇప్పటి కాట్టు మన్నార్ కోయిల్ అయిన వీరనారాయణ పురంలో జన్మించాడు. ఆళ్వారులలో చివరి వాడైన తిరుమంగై ఆళ్వారుకు నాథమునికి మధ్య ఎంతో కాలవ్యత్యాసం ఉంది. ఈ మధ్య కాలంలో ఆ 4000 పాశురాలేమైనవో ఎవరికీ తెలియదు.
ఒకసారి నాథముని కుంభకోణంలో నమ్మాళ్వారు యొక్క ఆరావముదెను ప్రజలు గానం చేస్తుండగా విన్నాడు. అందులోని ఒక పాశురంలో ఆయిరత్తుల్ ఇప్పత్తుల్ ( తమిళం : వేయిలో ఈ పది ) అని ఉంది. అయితే మిగతా 990 పాశురాలు ఏమైనట్టు ? నాథముని ప్రజలను విచారించి నమ్మాళ్వార్ స్వస్థలమైన తిరుక్కురుగూరుకు వెళ్ళాడు. అక్కడి ప్రజలు, నమ్మాళ్వారు శిష్యుడైన మధురకవి ఆళ్వారు రచించిన 11 పాశురాల గురించి చెప్పారు. అలాగే వారు నాథమునిని, నమ్మాళ్వారు స్వస్థలానికి వెళ్ళి ఈ 11 పాశురాలను 12000 సార్లు ఉచ్చరించమని సలహా ఇస్తారు. నాథముని అలాగే చేస్తాడు. అప్పుడు నమ్మాళ్వారు సంతోషించి, తన 1000 పాశురాలనే కాక, మిగతా ఆళ్వారులు రచించిన పాశురాలతో సహా, మొత్తం 4000 పాశురాలను ప్రసాదిస్తాడు.
పాశురాల సంఖ్య
మార్చువివిధ ఆళ్వారుల పాశురాల సంఖ్య క్రింది జాబితాలో ఇవ్వబడింది.[1] పదకొండు మంది ఆళ్వారులు తమ పాశురాలలో శ్రీమన్నారాయణుని దివ్యావతారములను కీర్తించారు. కాని మధురకవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే స్తుతించాడు.
క్ర.సం. | ప్రబంధం పేరు --- | మొదటి పాశురం సంఖ్య | చివరి పాశురం సంఖ్య | మొత్తం పాశురాలు | గానం చేసిన ఆళ్వారు |
---|---|---|---|---|---|
1 | పెరియాళ్వార్ తిరుమొళి | 1 | 473 | 473 | పెరియాళ్వార్/ విష్ణుచిత్తుడు |
2 | తిరుప్పావై | 474 | 503 | 30 | ఆండాళ్ |
3 | నాచియార్ తిరుమొళి | 504 | 646 | 143 | ఆండాళ్ |
4 | పెరుమాళ్ తిరుమొళి | 647 | 751 | 105 | కులశేఖరాళ్వార్ |
5 | తిరుచ్చంద విరుత్తమ్ | 752 | 871 | 120 | తిరుమళిశై ఆళ్వార్ |
6 | తిరుమాలై | 872 | 916 | 45 | తొండరడిప్పొడియాళ్వార్ |
7 | తిరుప్పళ్ళియెడుచ్చి | 917 | 926 | 10 | తొండరడిప్పొడియాళ్వార్ |
8 | అమలనాది పిరాన్ | 927 | 936 | 10 | తిరుప్పానాళ్వార్ |
9 | కణ్ణినున్ శిరుత్తాంబు | 937 | 947 | 11 | మధురకవి ఆళ్వార్ |
10 | పెరియ తిరుమొళి | 948 | 2031 | 1084 | తిరుమంగై ఆళ్వార్ |
11 | కురుంతాండగం | 2032 | 2051 | 20 | తిరుమంగై ఆళ్వార్ |
12 | నెడుంతాండగం | 2052 | 2081 | 30 | తిరుమంగై ఆళ్వార్ |
13 | ముదల్ తిరువందాది | 2082 | 2181 | 100 | పొయ్‌గై ఆళ్వార్ |
14 | ఇరండాం తిరువందాది | 2182 | 2281 | 100 | భూదత్తాళ్వార్ |
15 | మూండ్రాం తిరువందాడి | 2282 | 2381 | 100 | పేయాళ్వార్ |
16 | నాన్ముగన్ తిరువంతాడి | 2382 | 2477 | 96 | తిరుమళిశై ఆళ్వార్ |
17 | తిరువిరుత్తం | 2478 | 2577 | 100 | నమ్మాళ్వార్ |
18 | తిరువాశిరియం | 2578 | 2584 | 7 | నమ్మాళ్వార్ |
19 | పెరియ తిరువందాది | 2585 | 2671 | 87 | నమ్మాళ్వార్ |
20 | తిరువెళుక్కుర్రిరుక్కై | 2672 | 2672 | 1 | తిరుమంగై ఆళ్వార్ |
21 | సిరియ తిరుమడల్ | 2673 | 2712 | 40 | తిరుమంగై ఆళ్వార్ |
22 | పెరియ తిరుమడల్ | 2713 | 2790 | 78 | తిరుమంగై ఆళ్వార్ |
23 | తిరువాయ్మొళి | 2791 | 3892 | 1102 | నమ్మాళ్వార్ |
24 | రామానుజ నూరందాది | 3893 | 4000 | 108 | తిరువరంగతముదనార్ |
మొత్తం పాశురాలు | 4000 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Table showing details of 4000 pasurams". srivaishnavam.com srivaishnavam.com.
బయటి లింకులు
మార్చు- ప్రబంధం - ఉపోద్ఘాతం.
- థూనిళా ముర్రం 40 వ భాగం.
- నాథమునికి నివాళి
- నాలాయిర దివ్య ప్రబంధము - అనువాదం
- ఆళ్వారుల పాశురాలు Archived 2010-12-07 at the Wayback Machine