మండల ప్రజాపరిషత్

గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్)

మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీ రాజ్) లో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాకు స్థాయి వ్యవస్థ. ప్రభుత్వ ప్రకటన ద్వారా మండల ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు.[1] జిల్లా ప్రజాపరిషత్తో పాటు మండల ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ప్రతి మండలానికి సాధారణంగా ఒక మండల పరిషత్తు వుంటుంది. దీని పరిధిలో 20 నుండి 30 గ్రామ పంచాయతీలు వుంటాయి. వీటి అభివృద్ధికి పనిచేస్తుంది. మండల పరిషత్‌కు పన్నులు విధించే అధికారం లేదు. జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను వినియోగిస్తుంది. అభివృద్ధిలో ఒక యూనిట్‌గా గ్రామాల మధ్య సమన్వయానికి కృషిచేస్తుంది.

మండల పరిషత్ లో రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుండి తహసీల్ దారు, పంచాయితీరాజ్ డిపార్ట్ మెంట్ నుండి ఎంపీడివో, జిల్లా పరిషత్తు సభ్యుడు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ (MPTC)) ఉంటారు. దీనికి అధ్యక్షత మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంపీటీసీ (MPTC) నిర్వహిస్తారు.

మండల పరిషత్ విధులు

మార్చు
 
దేవరపల్లి, పర్చూరు మండలం, ప్రాథమిక పాఠశాల
 1. గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం
 2. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు
 3. పశుసంపదని పెంచడానికి చర్యలు
 4. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి కేంద్రాల ఏర్పాటు
 5. ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ
 6. గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణం, నిర్వహణ
 7. గ్రామ పంచాయతీల బడ్జెటుల ఆమోదం
 8. గణాంక వివరాల సేకరణ

మండల పరిషత్ ఆర్థిక వనరులు

మార్చు

1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టము లోని సెక్షన్ 172 మండల పరిషత్తు ఆదాయ-వ్యయాలను వివరిస్తుంది.[2]

 1. భూమి శిస్తు, రాష్ట్ర పన్నులలో భాగం
 2. గ్రామ పంచాయతీలు, ప్రజలు ఇచ్చే విరాళాలు
 3. ప్రభుత్వ గ్రాంటులు
 4. సంస్థలకు పథకాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు
 5. ప్రభుత్వం ఇచ్చే తలసరి పన్ను.

మండల పరిషత్తు నిర్మాణం

మార్చు

ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకోటానికి మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజిస్తారు. వీరిని ఎంపిటిసి (Mandal Parishad Territorial Constituency : MPTC) సభ్యులంటారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. వీరితో పాటు, మండలానికి ప్రాతినిధ్యం వహించే విధానసభ, లోక్‌సభ సభ్యులు, మండలంలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన సభచే ఆహ్వానించబడిన (కో ఆప్టెడ్) వారు సభ్యులుగా వుంటారు. సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు: జిల్లా కలెక్టర్, మండల పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, మండల పరిధిలో మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు. వీరికి సమావేశాలలో ఓటు హక్కు లేదు.

ఎం.పీ.టీ.సీ - మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం

మార్చు
 • 3000 - 4000 జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాలను కలిపి ఒక ఎంపీటీసీగా ఏర్పాటు చేస్తారు.
 • మండల పరిషత్‌లో కనిష్ఠ ఎంపీటీసీల సంఖ్య 7, గరిష్ఠ ఎంపీటీసీల సంఖ్య 23.
 • ఎంపీటీసీలు పార్టీ ప్రాతిపదికపై ఎన్నికవుతారు.
 • ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను జిల్లాస్థాయిలో జనాభా ప్రాతిపదికపై నిర్ణయిస్తారు.

సమావేశాల నిర్వహణ

మార్చు
 • ప్రతి 30 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. సమావేశాల నిర్వహణకు కోరం సభ్యులు 1/3వ వంతు అవసరం. కోరం సభ్యుల కోరిక మేరకు ప్రత్యేకంగా సమావేశం కావచ్చు.
 • చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు నిరాకరిస్తే జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి ఆదేశానుసారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలి.
 • ఈ సమావేశాల్లో చేసే తీర్మానాలకు చట్టబద్ధత ఉంటుంది. మండల పరిషత్‌కు ఒక మైనార్టీ సభ్యుడిని కో ఆప్ట్ చేసుకునే అధికారముంది.
 • మండల పరిషత్ సమావేశాలకు మండలంలోని సర్పంచ్‌లు, కలెక్టర్ శాశ్వత ఆహ్వానితులుగా హాజరుకావచ్చు.
 • ఎమ్మెల్యే, లోక్‌సభ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చు.
 • ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చు.
 • ఎంపీపీ జిల్లా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు. మండల విద్యా కమిటీకి ఎంపీపీ అధ్యక్షత వహిస్తారు. పరిషత్ సమావేశాల్లో నియమనిబంధనలను ధిక్కరించిన సభ్యులపై ఎంపీపీ చర్య తీసుకోవచ్చు (4 నెలలు సస్పెండ్ చేయవచ్చు).
 • చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. వారి పదవీకాలంలో ఒకసారి మాత్రమే ఈ తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.
 • పార్టీ గుర్తుపై ఎన్నికయినందున ఒక పార్టీ తరఫున గెలుపొందినవారు ఆ పార్టీ జారీచేసే విప్‌నకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు జిల్లా పంచాయతీరాజ్ శాఖాధికారి వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.
 • అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 2/3వ వంతు సభ్యుల సంతకాలతో ఆర్డీవోకు నోటీసును అందజేయాలి.
 • నెలరోజుల్లోగా ఆర్డీవో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది సమావేశానికి హాజరుకావాలి.
 • సాధారణ మెజార్టీతో చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించవచ్చు. వరుసగా 3 సమావేశాలు కోరం లేకుండా వాయిదా వేసినట్లయితే ఆ తీర్మానం వీగిపోయినట్టే.

అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు

మార్చు

ఎంపిటిసి సభ్యుల మొదటి సమావేశంలో, వారిలో ఇద్దరిని అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక బహిరంగ ఓటు విధానం ద్వారా అంటే చేతులెత్తడం ద్వారా జరుగుతుంది. ఎన్నికలో బలాబలాలు సమానమైతే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి

మార్చు

మండలంలో ముఖ్య కార్యనిర్వాహక అధికారిని మండల అభివృద్ధి అధికారి (ఎమ్పిడివో) (Mandal Parishad Development Officer (MPDO)అంటారు. మండల పరిషత్తు నిర్ణయాలను అమలు పరచటం, ఈ అధికారి విధి. మండలంలోని ప్రభుత్వ సిబ్బందికి నాయకత్వం వహిస్తారు. ఆయితే రెవెన్యూ విభాగానికి, మండల రెవెన్యూ అధికారి అధిపతిగా వుంటారు.

మండల స్థాయి సంఘాలు

మార్చు

ప్రతి మండల పరిషత్తులో మూడు స్థాయి సంఘాలు ఏర్పాటుచేయాలి. వీటిలో సహజ వనరులు, మానవ వనరులు, మౌలిక వసతులకు సంబంధించి కమిటీలు ఉంటాయి. సహజ వనరుల కమిటీలో వ్యవసాయం, పశుపోషణ, మత్య్స పరిశ్రమ, రక్షిత మంచినీరు, వాటర్‌షెడ్లు తదితర అంశాలు ఉంటాయి. దీనికి ఎంపీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మౌలిక వసతుల కమిటీలో రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు తదితరమైనవి ఉంటాయి. ఈ కమిటీకి మండల ఉపాధ్యక్షుడు బాధ్యులుగా ఉంటారు. ఇక మానవ వనరుల కమిటీలో విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, శిశు, మహిళ, వికలాంగ, వృద్ధుల సంక్షేమం వగైరా ఉంటాయి. ఈ కమిటీకి మండల ప్రాదేశిక నియోజకవర్గంనుంచి ఎన్నికైన మహిళా సభ్యురాలు ఛైర్‌ పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ మూడు కమిటీలకు ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరించాలి. జిల్లా పరిషత్తు పాలన మాదిరిగానే మండల పరిషత్తుల్లోనూ స్థాయీ సంఘాలను ఏర్పాటు చెయ్యాలన్న ఆలోచనతో ప్రభుత్వం 2008లో 148 జీవో జారీచేసింది. స్థాయి సంఘాల ఏర్పాటు ద్వారా మండలంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి, ఆదాయ మార్గాలను అన్వేషించి, వనరులను సమీకరించుకోవాలన్నది ఉద్దేశం.

స్థాయి సంఘాల ఏర్పాటు జరిగితే జవాబుదారీతనం పెరుగుతుంది. కమిటీలు సమావేశాలు నిర్వహించి, తీర్మానాలు చేయాలి. ఎంపీపీ, ఉపాధ్యక్షులకు పొసగకపోవడం, జడ్పీ మాదిరిగా మండల పరిషత్తు స్థాయి సంఘ సభ్యులకు నిర్ణయాధికారాలు లేకపోవటం లక్ష్యాన్ని నీరుగార్చింది.మండల పరిషత్తు పరిధిలో ఏర్పాటుచేయాల్సిన స్థాయి సంఘ కమిటీలు ప్రతి రెండు నెలలకోసారైనా విధిగా సమావేశం కావాలి. సమావేశానికి ఐదు రోజులకు ముందు సభ్యులకు అజెండా ఇచ్చి సమావేశంలో ఆయా అంశాలపై చర్చించాలి. ఆయా శాఖల అధికారులు విధిగా సమావేశాలకు హాజరుకావాలి. ఎంపీపీలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ అంశంపై ఈ స్థాయిసంఘ కమిటీలు, అధికారుల అభిప్రాయాన్ని సేకరించాలి.

మూలాలు

మార్చు
 1. కె నాగేశ్వరరావు, ed. (2008). ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి. తెలుగు అకాడమీ. pp. 557–559.
 2. The Andhra Pradesh Panchayat Raj Manual, 1994 by Padala Ramireddy, Page No 331

వనరులు

మార్చు