మణిమేల శివశంకర్

ముఠా కూలీ వృత్తిలో ఉంటూ చరిత్ర పరిశోధన చేసిన వ్యక్తి

మణిమేల శివశంకర్ ముఠా కూలీ, చారిత్రిక పరిశోధకుడు. గుంటూరు జిల్లాలోని 500 అదృశ్య గ్రామాల చరిత్రను వెలికితీసి గ్రంధం ప్రచురించాడు.

జీవిత విశేషాలు

మార్చు

అతను గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లి లో జన్మించాడు. ఐదో తరగతి వరకు చదివాడు. అతనికి శాసనాల పట్ల ఆశక్తి ఎక్కువ. అతను అనేక శాసనాలను పరిశీలించి, అందులోని విషయాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు. కాలగర్భంలో కలిసిపోయిన 500 గ్రామాల చరిత్రను వెలికితీశాడు. ఎలాంటి డిగ్రీలు లేకపోయినా పరిశోధకుల కన్నా మిన్నగా శ్రమించి అదృశ్య గ్రామాల చరిత్రకు అక్షరరూపం ఇచ్చి ఓ పుస్తకంగా మార్చారు.[1]

జీవనోపాథి కోసం ముఠా కార్మికునిగా గుంటూరులో స్థిరపడ్డాడు. దైవ దర్శనాల సమయంలో ఆలయ చరిత్రలను తెలుసుకుంటూ అక్కడ ఉన్న శాసనాలను పరిశీలిస్తూ పరిశోధనలు సాగించాడు. తన పని అయిపోయిన తర్వాత శాసనాల అన్వేషణ కోసం తిరిగేవాడు. ఆర్కియాలజీ విభాగం అందుబాటులోకి తెచ్చిన శాసనాలను చదవడం, కొత్త శాసనాలను సేకరించడం చేస్తుండేవాడు. కొన్నాళ్ళకు తెలుగు శాసనాలను చదవడం పై పట్టు సాధించాడు. సంస్కృత శాసనాలపై ఇతరులపై ఆధారపడేవాడు. [2]

గుంటూరు గ్రామాల పరిశోధన

మార్చు

అతను గుంటూరు జిల్లాలోని అనేక అదృశ్యమైన గ్రామాలకు కాలినడకన వెళ్ళేవాడు. అందుబాటులో ఉన్న రికార్డుల్ని తిరగేసి, గ్రామంలో పెద్దలను కలసి వివిధ అదృశ్యమైన గ్రామాల జాడను తెలుసుకున్నాడు. ఆ గ్రామాల పుట్టూపూర్వోత్తరాలు, చరిత్ర, సంస్కృతిని సేకరించగలిగాడు. ఈ వివరాలతో అతను "గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామం "పింగళి" గురించి అతను ఇచ్చిన వివరణ చరిత్రకారులను ఆకట్టుకుంది.

రెంటాల బ్రహ్మీ శాసనంలో ప్రస్తావించిన "నిడిగల్లు" సా.శ 2వ శతాబ్దం నాటి ఇక్ష్వాకు రాజధానిగా నాగార్జునుని కోట విజయపురిలో ఉన్నదనే ఆధారాన్నిచ్చాడు. దుర్గి మండలంలోని అదృశ్య గ్రామం "దద్దనాలపాడు" ఒకప్పుడు రాజ స్త్రీల సతీగమనం చేసిన ప్రదేశమని వివరించాడు. తెనాలి రామలింగని స్వగ్రామం గార్లపాడు తెనాలి మండలం గ్రామం కొలకలూరు సమీపంలోని అదృశ్య గ్రామమని తెలిపాడు.

పురస్కారాలు

మార్చు

అదృశ్య గ్రామ చరిత్రలను అందించిన అతనికి "అయ్యంకి-వెలగా పురస్కారం" లభించింది.

మూలాలు

మార్చు
  1. "ముఠా కూలీ నుంచి... పుస్తకాలు రచయితగా.. ఓ చరిత్రకారుడి ప్రస్థానం". ETV Bharat News. Retrieved 2023-08-28.
  2. "ఏపీ: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి." Sakshi. 2023-01-09. Retrieved 2023-08-28.