గుంటూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా

గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. రాష్ట్ర రాజధాని అమరావతి. విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది. పొగాకు, మిరప జిల్లా ప్రధాన వ్యవసాయ ఎగుమతులు. 2022 లో జిల్లాల మార్పులలో భాగంగా, ఈ జిల్లాలోని భూభాగాలను కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లాలలో కలిపారు.Map

గుంటూరు జిల్లా
. ఉండవల్లి గుహలు
Coordinates: 16°18′N 80°27′E / 16.3°N 80.45°E / 16.3; 80.45
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంకోస్తా
ముఖ్యపట్టణంగుంటూరు
Area
 • Total2,443 km2 (943 sq mi)
Population
 (2011)[1]
 • Total20,91,000
 • Density860/km2 (2,200/sq mi)
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
ప్రాంతీయ ఫోన్ కోడ్0863
Websitehttps://www.guntur.ap.gov.in/

2022 లో విభజన పూర్వపు జిల్లా చరిత్ర మార్చు

 
అమరావతి స్థూపం
 
అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం

గుంటూరు ప్రాంతంలో పాతరాతి యుగం నాటినుండి మానవుడు నివసించాడనుటకు ఆధారాలు ఉన్నాయి. రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అమ్మరాజ (922-929) శాసనాలలో గుంటూరును గురించిన ప్రథమ ప్రస్తావన ఉంది. 1147, 1158 రెండు శాసనాలలో గుంటూరు ప్రసక్తి ఉంది.

బౌద్ధం ప్రారంభం నుండి విద్యా సంబంధ విషయాలలో గుంటూరు అగ్రశ్రేణిలో ఉంటూ వచ్చింది. బౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్యకటకం (ధరణికోట) వద్ద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తారనాథుని ప్రకారం గౌతమ బుద్ధుడు మొదటి కాలచక్ర మండలాన్ని ధాన్యకటకంలో ఆవిష్కరించాడు.[2] ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడు. సా.శ..పూ 200 నాటికే ఈ ప్రాంతంలో అభ్రకం (మైకా) ను కనుగొనబడింది.[ఆధారం చూపాలి]

ప్రతీపాలపుర రాజ్యం (సా.శ. పూ 5వ శతాబ్ది) – ఇప్పటి భట్టిప్రోలు – దక్షిణ భారతదేశంలో ప్రథమ రాజ్యంగా గుర్తింపు పొందింది. శాసన ఆధారాలను బట్టి కుబేర రాజు సా.శ.పూ. 230 ప్రాంతంలో భట్టిప్రోలును పరిపాలించాడని, ఆ తరువాత సాల రాజులు పాలించారని తెలుస్తుంది. వివిధ కాలాల్లో గుంటూరును పరిపాలించిన వంశాలలో ప్రముఖమైనవి: శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రీకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు. గుంటూరు ప్రాచీనాంధ్రకాలంనాటి కమ్మనాడు, వెలనాడు, పలనాడులో ఒక ముఖ్యభాగం. కొందరు సామంత రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు, వారసత్వ పోరులు సర్వసాధారణంగా ఉండేవి. అటువంటి వారసత్వపోరే ప్రసిద్ధి గాంచిన పలనాటి యుద్ధం. జిల్లాలోని పలనాడు ప్రాంతంలో 1180 లలో జరిగిన ఈ యుద్ధం "ఆంధ్ర కురుక్షేత్రం"గా చరిత్ర లోను, సాహిత్యంలోను చిరస్థాయిగా నిలిచిపోయింది.

1687లో ఔరంగజేబు కుతుబ్‌ షాహి రాజ్యాన్ని ఆక్రమించినపుడు గుంటూరు కూడా మొగలు సామ్రాజ్యంలో భాగమైంది. సామ్రాజ్యపు రాజప్రతినిధి ఆసఫ్‌ ఝా 1724లో హైదరాబాదుకు నిజాంగా ప్రకటించుకొన్నాడు. ఉత్తర సర్కారులు అని పేరొందిన కోస్తా జిల్లాలను ఫ్రెంచి వారు 1750 లో ఆక్రమించుకొన్నారు. 1788లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలుబడి లోనికి వచ్చి, గుంటూరు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైంది. 1794లో 14 తాలూకాలతో జిల్లా ఆవిర్భవించింది. ఆవి: దాచేపల్లి, ప్రత్తిపాడు, మార్టూరు, ఠుంఠురుకొర, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు, కూరపాడు, కొండవీడు, నరసరావుపేట, వినుకొండ. 1859లో జిల్లాను రాజమండ్రి, మచిలీపట్నం జిల్లాలతో విలీనం చేసి కృష్ణా గోదావరి జిల్లాగా నామకరణం చేసారు. 1904లో తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పలనాడు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలను వేరు చేసి మళ్ళీ జిల్లాను ఏర్పాటు చేసారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామం లోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. మద్రాసు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953లో 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపి ఏర్పాటు చేసారు. దీనితో జిల్లా వైశాల్యం 15032 చ. కి. మీ నుండి 11,347 చ. కి. మీకి తగ్గిపోయింది.[3]

2002 లో కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాల కొరకు, జిల్లాను చీల్చడంతో జిల్లా విస్తీర్ణం 2,443 చ.కి.మీకు తగ్గింది.[1]

భౌగోళిక స్వరూపం మార్చు

తూర్పున ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, దక్షిణాన బాపట్ల జిల్లా, పశ్చిమాన బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఉత్తరాన పల్నాడు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా ఉన్నాయి. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో ఉంది.[4]

నేల మార్చు

నేలతీరులో రకాలు.

  1. నల్లరేగడి నేల: కృష్ణానది వడ్డునగల ప్రదేశాలు, సత్తెనపల్లి, మాచర్లకు ఉత్తరంగా ఉన్నాయి. సున్నపురాయి మెత్తగా మారి ఇవి ఏర్పడుతాయి.
  2. ఇసుక నేల: సముద్రపు వడ్డున గోండ్వానా రాళ్లుగల ప్రదేశాల్లో ఇవి ఉన్నాయి. కొన్ని చోట్ల కంకర (కాల్కేరియస్ నేలలు) ఉన్నాయి.
  3. ఉప్పు నేల: సముద్రపు అలలు తీరంలోకి వచ్చే చోట ఉన్నాయి. రేపల్లె, కొత్తపాలెం, సర్లగొండి, నిజామ్ పట్నంలో ఇవి చూడవచ్చు.

నీటివసతి మార్చు

 
ఉమ్మడి గుంటూరు జిల్లా నదులు, కాలువలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణా నది, చంద్రవంక, తుంగభద్ర, నాగులేరు ప్రధాన నదులు. గుంటూరు ఛానల్, గుంటూరు శాఖా కాలువ, రొంపేరు, భట్టిప్రోలు, రేపల్లె కాలువలు, దుర్గి దగ్గర గుండ్లకమ్మ నది, రెంటచింతల దగ్గర గోలివాగు, గురజాల దగ్గర దండివాగు ఉన్నాయి.

కృష్ణానది మాచర్ల పర్వతశ్రేణిలో గనికొండ దగ్గర, సముద్రమట్టం నుండి 182 మీటర్ల ఎత్తున గుంటూరు జిల్లా లోకి ప్రవేశిస్తుంది. పెద్ద లోయలోకి పారుతూ మాచర్లను తెలంగాణ లోని అచ్చంపేటను వేరుచేస్తుంది. కుడవైపు జర్రివాగు, ఎడమవైపున దిండి వాగుని కలుపుకొని పారుతుంది. చంద్రవంక కృష్ణాకి ఉపనది. తూర్పు నల్లమల కొండలలో పుట్టి ముతుకూరు గ్రామ ప్రక్కగా పారి, దాని ఉపనదియైన ఏడిబోగుల వాగుతో కలసి (ఆత్మకూరు ప్రాజెక్టు దగ్గర) ఈశాన్య దిశగా పయనించి మాచర్లను తాకి ఉత్తరంగా పారుతుంది. తుమృకోట రక్షిత అడవిలోకి పారేముందు, 21మీటర్ల ఎత్తునుండి క్రిందకు పారుతుంది. దీనినే ఎత్తిపోతల జలపాతం అంటారు. ఉత్తరదిశగా కొంత ప్రవహించి కృష్ణాలో కలుస్తుంది. నాగులేరు నది, వినుకొండ శ్రేణిలో నాయకురాలి పాస్ దగ్గర నల్లమల కొండలలో పుట్టి, కారెంపూడి ప్రక్కగా ప్రవహించి ఉత్తరదిశగా మాచర్ల పర్వతశ్రేణులలో 32 కి.మీ. పారి రామపురం దగ్గర కృష్ణాలో కలుస్తుంది. తూర్పు తీరంలో సాధారణంగా వుండే తీరులో కృష్ణా నది చాలా వరకు సమతలప్రాంతంలో ప్రవహించటంతో, వర్షాకాలంలో చాలా మట్టి మేట వేస్తుంది . దిగువ కృష్ణా, కృష్ణా, గుండ్లకమ్మ ఓగేరు, రొంపేరు, కాలువలు నేరుగా సముద్రంలోకలిసే ప్రాంతం జిల్లాలోని నీటిపారుదల విభాగాలు.

ఖనిజసంపద మార్చు

వాతావరణం మార్చు

బంగాళ ఖాతంలో ఏర్పడే తుఫాన్లు, అల్పపీడనాలు, తూర్పుతీరం దాటితే అధిక వర్షం, బలమైన గాలులకు కారణమవుతాయి.

  • డిసెంబరు నుండి ఫిబ్రవరి దాక: పొడి, చల్లని చలి కాలం.
  • మార్చి నుండి మే: ఎండాకాలం
  • జూన్ నుండి సెప్టెంబరు: నైరుతీ రుతుపవనాల వలన వానా కాలం.
  • అక్టోబరు నుండి నవంబరు: తుపాన్ల వలన వానలు.
వర్షపాతం

ఉమ్మడి జిల్లా సగటు వర్షపాతం 830 మిమి. తూర్పు నుండి పడమరకు ఇది తగ్గుతుంది. నైరుతీ రుతుపవనాల వలన అవి తగ్గిపోయేటప్పుడు వర్షపాతం కలుగుతుంది. అక్టోబరులో వర్షాలు ఎక్కువ. సగటున 47 వర్షపు రోజులు. అత్యధికంగా 1879 నవంబరు 9 లో సత్తెనపల్లిలో 386 మిమి వర్షపాతం నమోదైంది.

ఉష్ణోగ్రతలు

ఉమ్మడి జిల్లా వార్షిక అత్యల్ప, అత్యధిక ఉప్ణోగ్రతలు 15 °C, 47 °C గా నమోదయ్యాయి. రెంటచింతల అత్యంత ఉప్ణోగ్రతకలప్రదేశం. 1948 మే 18 లో 49 °C నమోదయ్యింది.

ఆర్ధిక స్థితి గతులు మార్చు

వ్యవసాయం మార్చు

ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంటలు:[5][6]

ఉమ్మడి జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులలో ప్రకాశం బేరేజి ( పాత కృష్ణా ఆయకట్టు) క్రింద 2,02,032 హెక్టేర్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద 2,54,583 హెక్టేర్లు, గుంటూరు బ్రాంచి కాలువ క్రింద 10,823 హెక్టేర్లు సాగవుతుంది.

వ్యవసాయ మార్కెట్ యార్డులు గుంటూరు, తెనాలి, దుగ్గిరాల, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ లలో ఉన్నాయి.

పరిశ్రమలు మార్చు

పారిశ్రామిక వాడలు గుంటూరు, తెనాలి, పేరేచెర్ల, నౌలూరులలో, 4 ఆటోనగర్లు గుంటూరు,తెనాలి లలో, 2 దుకాణ సంకీర్ణాలు గుంటూరు, డోకిపర్రులలో కలవు [5]. ప్రత్తి మిల్లులు,పాల పరిశ్రమలు, నార మిల్లులు, ఇతర చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి.

పరిపాలన విభాగాలు మార్చు

2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత 7 అసెంబ్లీ నియోజక వర్గాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 2 నగరపాలక సంస్థలు, 2 పురపాలక సంస్థలు,, 278 గ్రామపంచాయితీలు ఉన్నాయి;[7] రెవెన్యూ విభాగాలు తెనాలి, గుంటూరు.

మండలాలు మార్చు

గుంటూరు జిల్లా మండలాల పటం (Overpass-turbo)


నగరాలు, పట్టణాలు మార్చు


నియోజకవర్గాలు మార్చు

లోక్‌సభ నియోజకవర్గాలు
గుంటూరు
శాసనసభ నియోజక వర్గాలు (7)

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం లోని విభాగం ఇమడ్చబడింది.

రవాణా వ్వవస్థ మార్చు

గుంటూరు నుండి హైదరాబాదు, చెన్నైకు రహదారి, రైలు మార్గాలు ఉన్నాయి. 72 కిమీ జాతీయ రహదారి, 511 కి.మీ. రాష్ట్ర రహదారులు ఉన్నాయి.

జనాభా లెక్కలు మార్చు

2011 జనగణన ప్రకారం 21.90 లక్షల జనాభా కలిగివుంది

విద్యాసంస్థలు మార్చు

గుంటూరు జిల్లాలో సాధారణ విద్యతో బాటు, వృత్తివిద్యకు సంబంధించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పలు విద్యాసంస్థలున్నాయి.[8]

ఆకర్షణలు మార్చు

 
గుంటూరు జిల్లా పర్యాటక ఆకర్షణలు (పెద్ద బొమ్మలో మౌజ్ ను గుర్తుపై వుంచి వివరాలు చూడండి)

ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను 2019లో 1,05,68,262 పర్యాటకులు దర్శించారు.[9]

  • అనంతపద్మనాభస్వామికి అంకితమివ్వబడిన గుహలు గల ఉండవల్లి గుహలు,
  • పానకాలస్వామి అని పేరుగాంచిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంగల మంగళగిరి

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. E.Henning (2015-10-02). "The history of the Kālacakra tradition in Sambhala and India". Archived from the original on 2018-12-15.
  3. "District Census Handbook – Guntur" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. Retrieved 13 May 2016.
  4. "District Resource Atlas-Guntur District" (PDF). 2018. Archived from the original (PDF) on 2019-07-17. Retrieved 2019-07-17.
  5. 5.0 5.1 "Industrial Profile-Guntur District by AP Industries Dept 2001-02" (PDF). Archived from the original (PDF) on 2012-05-13. Retrieved 2012-05-24.
  6. "Guntur district a role model for development". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 6 June 2017.
  7. "పాలనలో... నవశకం". ఈనాడు. Retrieved 2022-04-16.
  8. Handbook of statistics-2015 Guntut district (PDF). p. 210. Archived from the original (PDF) on 2019-08-12.
  9. "పర్యాటకుల గణాంకాలు". ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ. Archived from the original on 2019-08-06. Retrieved 2019-08-12.

వెలుపలి లంకెలు మార్చు