శ్రీ మద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం)

(మద్ది క్షేత్రం నుండి దారిమార్పు చెందింది)

హనుమంతుడు మద్ది క్షేత్రం లో తెల్ల మద్ది వృక్షపు తొర్రలో వెలిసిన దైవం. ఈ దేవాలయం బయనేరు నదీ తీరంలో ఎర్రకాలువ డాం కు సమీపంలో ఉంది. [1]మద్దిచెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.[2]

శ్రీ మద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం)
మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం
పేరు
స్థానిక పేరు:మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం
స్థానం
ప్రదేశం:గురవాయి గూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:ఆంజనేయస్వామి

స్థల పురాణం

మార్చు

సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్నీ, బుద్ధి బలాన్నీ ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రు పక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేనకు ఎదురెళళ్లి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడనీ అతడిని అనుగ్రహించేందుకే మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి. ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్దిచెట్టు తొర్రలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో చెట్టు దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయస్వామి రాతి విగ్రహం కనిపించిందట. అలా సా.శ. 1166వ సంవత్సరంలో ఆ వూరివారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు.

నిత్య పూజలు, ఉత్సవాలు

మార్చు

మద్ది క్షేత్రంలో హనుమజ్జయంతి వేడుకలను అయిదు రోజులపాటు నిర్వహిస్తారు. ఆది, సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమద్‌ కళ్యాణాలూ, లక్ష్మీ కుంకుమార్చనలూ జరుపుతారు. కార్తిక మాసం నెల రోజులూ ఈ క్షేత్రం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే వేంకటేశ్వరస్వామి కూడా కొలువై ఉన్నాడు. ఆంజనేయుడిని పూజించిన భక్తులు శ్రీనివాసుడినీ దర్శింస్తారు. ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్రకాలువ జలాశయం ఉంది. ఇందులోని బోటు షికారు పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ. మద్ది క్షేత్రానికి 4 కి.మీ. దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకుని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది. పారిజాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వేంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

వైష్ణవ సంప్రదాయంలో మద్ది ఆంజనేయస్వామికి నిత్యపూజలూ, అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం శాస్త్రòక్తంగా జరుపుతారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయస్వామి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

ఆలయ సమయం, రవాణా సౌకర్యాలు

మార్చు

ఏలూరు నుంచి 50 కిలోమీటర్లూ, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి ప్రతి గంటకూ బస్సు ఉంటుంది. జంగారెడ్డిగుడెం 3 కిలోమీటర్ల దూరం ఆటొలో సులభంగా చేరుకోవచు.

ప్రత్యేకతలు, విశేషాలు

మార్చు

తీరని కోర్కెలు ఉన్నవారూ పలు సమస్యలతో సతమతమవుతున్నవారూ ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోర్కెలు తీరాలని మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు.

దీనితోపాటు శని దోషాలూ, రాహు కేతు దోషాలూ, నవగ్రహ దోషాలూ ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

దూరాభారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపం, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది.

మూలాలు

మార్చు
  1. "కుడి చేతిలో గద, ఎడమ చేతిలో 'అరటిపండు'." Sakshi. 2021-11-05. Retrieved 2022-03-21.
  2. "మహిమాన్వితం... మద్ది క్షేత్రం..!". web.archive.org. 2017-09-10. Archived from the original on 2017-09-10. Retrieved 2022-07-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)