మన్నెంకొండ హనుమద్దాసు

మన్నెంకొండ హనుమద్దాసు 19వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు. మహబూబ్ నగర్ ప్రాంతంలో పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీనరసింహస్వామిని తన కీర్తనల ద్వారా ప్రశక్తిలోకి తెచ్చాడు.[1]

హనుమద్దాసు అలహరి వంశానికి చెందినవాడు. వీరి పూర్వీకులు తమిళ ప్రాంతంలోని శ్రీరంగం వద్ద ఉన్న అలహరి గ్రామానికి చెందినవారు. ఈ వంశంలో కేశవయ్య అనే వ్యక్తికి వేంకటేశ్వరస్వామి కలలోకి వచ్చి మన్నెంకొండకు వెళ్ళమని చెప్పగా, అక్కడకి వెళ్ళి లక్ష్మీనరసింహస్వామిని సేవిస్తూ స్థిరపడిపోయాడు.[2][3] ఈ వంశంలోనే కేశవయ్య ముని మనవడు, హనుమద్దాసు తండ్రి, వేదాంతి అయిన వెంకయ్య జన్మించాడు. కేశవయ్య కాలం నాటి నుండి అలహరి వంశం వారు మన్నెంకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, ధర్మకర్తలుగా ఉంటూ వచ్చారు. నేటికీ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోటకదిరలోని అలహరి వారి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాతనే మన్యంకొండ తీసుకువచ్చి ఉత్సవాలు ప్రారంభిస్తారు.[4]

హనుమద్దాసు మన్యంకొండ సమీపంలోని కోటకదిర గ్రామంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసం, కృష్ణాష్టమి రోజు (1814) జన్మించాడు.[5] హనుమద్దాసు, మన్నెంకొండ వెంకయ్య, కృష్ణాంబ దంపతులకు జన్మించాడు. ఎనిమిది సంతానంలో చివరివాడు హనుమద్దాసు. నిత్యం హరినామ సంకీర్తన చేస్తూ పెరిగిన హనుమద్దాసుకు చదువు అంతగా అబ్బలేదు. కొంతకాలం తర్వాత తత్త్వదర్శనం మీద కోరిక కలిగి కోటకదిర గ్రామంలో నివసిస్తుండే యోగిని మైసూరు లక్ష్మాంబను ఆశ్రయించి తత్త్వార్ధ రహస్యాలను తెలుసుకున్నాడు. నిత్యరామనామజపంతో భజనలోనే గడుపుతుండేవాడు. హనుమద్దాసు ఎక్కడికి వెళ్ళినా ఈయన వెంట ఎల్లప్పుడూ సోదరుడు పాపయ్య ఉండేవాడు.[2] హనుమద్దాసు 1874లో మరణించాడు.[6]

మూలాలు మార్చు