మన ఊరు - మన చరిత్ర

మన ఊరు - మన చరిత్ర అనేది తెలంగాణ సాహిత్య అకాడమి రూపొందించిన కార్యక్రమం.[1] తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థి ఒక చరిత్రకారుడు కావాలని, వారు పుట్టి, పెరిగిన ఊరికి సంబంధించిన ప్రతీ అంశాన్ని సున్నితంగా పరిశీలించి రాబోయే తరాల వారికి తమ గ్రామచరిత్రను పుస్తకం రూపంలో అందించాలన్న ఉద్దేశ్యంతో మన చరిత్ర మనమే రాసుకుందాం అనే నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపొందించబడింది.[2] 2022 మార్చి 29న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.

మన ఊరు - మన చరిత్ర
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని పాఠశాల విద్యార్థులు
స్థాపన2022 మార్చి 29న
నిర్వాహకులుతెలంగాణ సాహిత్య అకాడమి

ప్రణాళికసవరించు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ చరిత్ర, సంస్కృతి గురించి అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అనేక కార్యక్రమాలను, సదస్సులను, పరిశోధలను నిర్వహించింది. ప్రాథమిక స్థాయినుండే విద్యార్థులు తమ ఊరు గురించి భౌగోళిక విశిష్టతలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాలను తెలుసుకుంటే బాగుంటుందన్న ఆలోచన చేసింది. అందుకు విద్యార్థులే పరిశోధకులుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

ఊరు ఎప్పుడు పుట్టింది, ఎలాంటి రూపం తీసుకుందో పరిశోధనాత్మకంగా ప్రతీ ఒక్క విద్యార్థి విశ్లేషించడంతోపాటు, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల గురించి ఇప్పటి వరకు చరిత్రకు దొరకని అంశాలను వీరతెలంగాణ సాయుధపోరాట అంశాలతో వచ్చిన చరిత్రను ఆధారంగా చేసుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ నుండి పుస్తకాలు ప్రచురిస్తారు.[3]

గ్రామ చరిత్ర, దేవాలయాలు-వాటి ప్రాచీనత, శాసనాలు, పాత నిర్మాణ అవశేషాలు, రాష్ట్ర అవతరణ తర్వాత వేగవంతంగా జరిగిన పనులు, వ్యవసాయ పంటలు, పరిశ్రమలు, చేతివృత్తులు, రవాణా సౌకర్యాలు, రహదార్లు-రోడ్లు, వ్యాపారాలు, వాహనాలు, కులాలు, మతాలు, పండుగలు, ఆటపాటలు, గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారి చరిత్ర, తెలంగాణ పోరాటయోధులు మొదలైన అంశాలు నిక్షిప్తం చేస్తారు.[4]

ప్రారంభంసవరించు

తెలంగాణ గత చరిత్రను, సంస్కృతి, సంప్రదాయాలను, జీవన విధానాన్ని తెలిపే ఆధారాలు, శిలాశాసనాలు ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఏదో ఒకచోట లభిస్తూనే ఉన్నాయి. అంతటి చరిత్ర గలిగిన నల్గొండ జిల్లా విద్యార్ధులు చరిత్ర రచనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు స్ఫూర్తిగా నిలువాలన్న ఉద్దేశ్యంతో 2022 మార్చి 29న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో మన ఊరు - మన చరిత్ర కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌, రచయిత, కవి, విమర్శకుడు జూలూరు గౌరిశంకర్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్‌ కొల్లోజు చంద్రశేఖర్‌, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, సినారె అవార్డు గ్రహీత మునాస వెంకట్‌, ఎలికట్టె శంకర్‌రావు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.[5] జిల్లాలోని 860 గ్రామాల చరిత్రను ఆ గ్రామాలకు చెందిన యువకులే రచించేందుకు ముందుకు వచ్చారు.

తరువాత 2022 మే 12న తెలంగాణ సాహిత్య అకాడమీ- ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల తెలుగు, చరిత్ర, ఇంటర్నల్ క్వాలిటీ అసురెన్స్ సెల్ (ఐక్యుఏసీ) ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్ధులకు సృజనాత్మక కార్యక్రమంలో భాగంగా మన ఊరు- మన చరిత్ర అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జూలూరు గౌరిశంకర్, కలెక్టర్ విపి గౌతమ్, కాకతీయ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు తాటికొండ రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా పాల్గొన్నారు.[6]

మూలాలుసవరించు

  1. telugu, NT News (2022-05-29). "మన ఊరు- మన చరిత్ర". Namasthe Telangana. Archived from the original on 2022-05-29. Retrieved 2022-05-29.
  2. "ప్రతీ విద్యార్థి ఓ చరిత్రకారుడవ్వాలి". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-05-12. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
  3. "విద్యార్థులు చరిత్ర రచయితలు కావాలి: జూలూరు". EENADU. 2022-05-13. Archived from the original on 2022-05-13. Retrieved 2022-05-18.
  4. "మన గ్రామ చరిత్ర మనమే రాద్దాం". Sakshi. 2022-04-07. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
  5. telugu, NT News (2022-03-30). "మన ఊరి చరిత్రను మనమేరాసుకుందాం". Namasthe Telangana. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
  6. "మీరే చరిత్ర రచయితలు". www.navatelangana.com. 2022-05-13. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.