మర్డర్ (2020 సినిమా)

మర్డర్ 2020లో విడుదలైన తెలుగు సినిమా. అనురాగ్ కంచర్ల బ్యాన‌ర్‌పై అనురాగ్ కంచర్ల & రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో ఆనంద్ చంద్ర‌ దర్శకత్వం వహించాడు.[1]

మర్డర్
దర్శకత్వంఆనంద్ చంద్ర‌
రచనఆనంద్ చంద్ర‌
నిర్మాతఅనురాగ్ కంచర్ల
తారాగణంశ్రీకాంత్ అయ్యంగర్‌‌, సాహితి
ఛాయాగ్రహణంజగదీశ్ చీకటి
కూర్పుశ్రీకాంత్ ప‌ట్నాయ‌క్‌
సంగీతండి.ఎస్‌.ఆర్‌
నిర్మాణ
సంస్థ
అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్
విడుదల తేదీ
24 డిసెంబరు 2020 (2020-12-24)
సినిమా నిడివి
113 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్) ఎంతో క‌ష్ట‌ప‌డి కిందస్థాయి నుంచి కోటీశ్వ‌రుడిగా ఎదిగిన వ్యక్తి .ఆయనకు ఏకైక కూతురు నమ్రత (సాహితి) అంటే పంచ ప్రాణాలు, ఆమెను అల్లారుముద్దుగా పెంచుతాడు. తన వ్యాపారాలన్నింటినీ ఆమె పేరు మీదే నడిపిస్తుంటాడు. కూతురు పెళ్లిని కళ్లు చెదిరే రీతిలో అంగ‌రంగ వైభ‌వంగా చేసి.. ఆమెపై త‌న ప్రేమను, తన స్థాయిని ఊరి వాళ్లకి తెలియజేయాలనే లక్ష్యంతో జీవిస్తుంటాడు. కానీ, అప్పటికే నమ్రత వేరే కులానికి చెందిన తన క్లాస్ మేట్ ప్రవీణ్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని తండ్రీతో చెప్పి, అత‌న్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న‌ట్లు మనసులో మాట బ‌య‌ట‌పెడుతుంది. మాధవరావుకు ప్రవీణ్ ఏ కోశానా నచ్చడు. అతను డబ్బు కోసమే తన కూతుర్ని వలలో వేసుకున్నాడనుకుంటాడు. కానీ నమ్రతకు ఎంతగా నచ్చజెప్పినా వినదు, నమ్ర‌త తండ్రికి ఎదురు తిరిగి ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రవీణ్ ను పెళ్లి చేసుకుంటుంది. న‌మ్ర‌త‌ని తిరిగి త‌న ద‌గ్గ‌ర‌కి ర‌ప్పించుకోవడం కోసం మాధవరావు ఏం చేశాడు.. తర్వాతి పరిణామాలేంటి అనేదే మిగతా కథ.[2]

వివాదాలు

మార్చు

తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. మర్డర్ చిత్రాన్ని ఆపాలంటూ హత్యకు గురైన బాధితుడి భార్య, అతని తండ్రి 2020 జూలై 29న నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్‌న్ దాఖలు చేశారు.[3] హత్యకేసు విచారణ దశలో ఉందని, సినిమా విడుదలయితే సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడుతుందని, అందుకోసం సినిమా విడుదలను ఆపాలని వారు కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన న్యాయమూర్తి మర్డర్ సినిమా దర్శక, నిర్మాతలు రామ్ గోపాల్ వర్మ, నట్టి కరుణలకు ఈ మెయిల్, వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు. ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.[4]

నల్లగొండ జిల్లా కోర్టు ఉత్తర్వులను స‌వాలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఈ పిటిషన్‌ని విచారించి, తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది.[5]

నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు

మార్చు
  • శ్రీకాంత్‌ అయ్యంగర్‌ - మాధ‌వ‌రావు
  • సాహితి - న‌మ్ర‌త, మాధ‌వ‌రావు కూతురు
  • గణేష్ నాయుడు - ప్రవీణ్
  • గిరిధ‌ర్ - మాధ‌వ‌రావు త‌మ్ముడు
  • గాయ‌త్రి భార్గ‌వి - వనజ, మాధ‌వ‌రావు భార్య
  • సుమిత్ కేశరి - ప్రవీణ్ మిత్రుడు

సాంకేతిక వర్గం

మార్చు
  • ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ చంద్ర‌
  • నిర్మాత‌లు: న‌ట్టి క‌రుణ‌, న‌ట్టి క్రాంతి
  • బ్యాన‌ర్‌: న‌ట్టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, క్విటీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
  • సంగీతం: డి.ఎస్‌.ఆర్‌
  • సినిమాటోగ్రఫీ: జ‌గ‌దీష్ చీక‌టి
  • ఎడిట‌ర్‌: శ్రీకాంత్ ప‌ట్నాయ‌క్‌

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (23 December 2020). "ఆర్జీవీ మర్డర్ మూవీ రివ్యూ". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  2. Sakshi (25 December 2020). "ఇది... జరిగిన 'మర్డర్'‌ కథే!". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  3. Eenadu. "'మర్డర్‌' చిత్రం.. ఆర్జీవీపై కేసు నమోదు". www.eenadu.net. Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  4. Sakshi (25 August 2020). "వ‌ర్మ‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు: హైకోర్టు". Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
  5. Sakshi (8 November 2020). "ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం లేదు: ఆర్జీవీ". Archived from the original on 26 డిసెంబరు 2020. Retrieved 5 May 2021.

బయటి లంకెలు

మార్చు