మర్మయోగి
మర్మయోగి (Marmayogi) 1964లో వెలువడిన ఒక తెలుగు సినిమా.1964 ఫిబ్రవరి 22 న విడుదల. బి. ఎ.సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నందమూరి తారకరామారావు,కృష్ణకుమారి, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
మర్మయోగి (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి లీలావతి |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జూపిటర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 22, 1964 |
భాష | తెలుగు |
వైతాళికులు సంకలన కర్త 'ముద్దుకృష్ణ' ఈ చిత్రానికి రచన చేశాడు. ఆసక్తి కరమైన ప్రారంభం, మధ్య మధ్య ఫ్లాష్ బాక్‌లతో కొనసాగుతూ వైవిధ్య భరితమైన జానపద చిత్రంగా రూపుదిద్దుకుంది. చిత్రంలో మొదటి మూడు పాటలూ ప్రతి నాయిక (వాంపు), మోసపోయే రాజు, ప్రతినాయిక సహచరునిమీద చిత్రింపబడ్డాయి. (బహుళ ప్రజాదరణ పొందిన నవ్వుల నదిలో పువ్వుల పడవా పాటతో సహా). చిత్రం లోకథ ఎక్కువభాగం ప్రతినాయిక, గుమ్మడి వెంకటేశ్వరరావుల చుట్టూనే తిరుగుతుంది. రామారావు సినిమాలో ఎక్కువభాగం శివాజీ (ఛత్రపతి) ని పోలిన మారువేషంలో కనిపించటం ఈ చిత్ర ప్రత్యేకత. కృష్ణకుమారి చిత్రం తొలిభాగంలో ఒక సన్నివేశంలో కన్పించి మళ్ళీ రెండవసగంలోనే కనిపిస్తుంది. చిత్రంలో రామారావు హీరోగా ఉన్నా చిత్రం పేరు గుమ్మడి పాత్ర పరంగా ఉంది. మాయలూ మంత్రాలూ లేకుండా బలమైన కథతో నడిచే ఉత్తమ జానపద చిత్రంగా మర్మయోగిని పేర్కొనవచ్చు.
కథ
మార్చుపూర్వాశ్రమంలో మహేంద్రగిరి రాజ్యానికి సైన్యాధిపతియైన పురుషోత్తమ వర్మ, వసంత అనే మరో వనిత అడవిలోకి ప్రభాకర్ అనే విప్లవ కారుడిని వెతుక్కుంటూ వస్తారు. అక్కడికి ఎందుకు రావలిసి వచ్చిందో పురుషోత్తముడు ఇలా వివరిస్తాడు. మహేంద్రగిరి రాజుకు ఇద్దరు కుమారులు కలిగిన తరువాత ఆయన భార్య పరమపదిస్తుంది. అయినా రాజు మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా కుమారులిద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. తన బావమరిది యైన పురుషోత్తముడిని సైన్యాధిపతిగా నియమించుకుంటాడు.
కొద్ది రోజులకు రాజాస్థానానికి చంచల అనే నర్తకి, ఆమెతో బాటు భుజంగుడు అనే సహాయకుడు వస్తారు. చంచల తన కపట వేషాలతో రాజును వశం చేసుకుని రాణి అవుతుంది. దాన్ని సహించలేని పురుషోత్తముడిని రాజ్య బహిష్కృతుణ్ణి చేస్తుంది. అందుకే పరాక్రమశాలియైన ప్రభాకరుని సహాయం కోరడానికి వస్తాడు. వసంత వృద్ధుడైన తన తండ్రిని చంచల బంధించిందనీ ఆయనను విడిపించడానికి ప్రభాకరుని సాయం కోరి వచ్చానని తెలియజేస్తుంది. ఇద్దరూ ప్రభాకరుని కలుసుకుంటారు. అక్కడ ప్రభాకరుని అనుచరులు వసంత తండ్రిని రాజభటుల చెర విడిపించుకొని వస్తారు. ఆయన చంచల చేసిన అన్యాయాలను ఒక్కొక్కటిగా వివరిస్తాడు. ఆమె నౌకా విహారం పేరుతో రాజును నీళ్ళలో ముంచి చంపివేసిందనీ, ఇద్దరు రాజకుమారులున్న భవనాన్ని అగ్నికి ఆహుతి చేసిందని చెబుతాడు. దానికి తోడు ఆమెకు ఎక్కడినుంచో వచ్చిన ఒక యోగి ఆమె ఆస్థానంలో రాజగురువుగా చేరి సాయం చేస్తున్నాడని తెలుపుతాడు. ఆ రాజగురువు కుమారుడు భాస్కరుడు సేనాధిపతిగా ఉంటాడు. కుమార్తె ప్రభావతి కూడా అక్కడే నివసిస్తుంటుంది. ఇదంతా విన్న ప్రభాకరుడు ఆమె పైన తిరుగుబాటు చేయాలని ప్రతిన బూనుతాడు. బహిరంగంగా ఆమె సభకు వెళ్ళి అక్కడ ఆమె సేనాధిపతి భాస్కరునితో సహా సైనికులనందరినీ పరాభవించి వస్తాడు.
భాస్కరుడు ఆ ఓటమిని భరించలేక బాధపడుతూ ఉంటే ప్రభావతి ప్రభాకరుని స్థావరానికి వెళ్ళి బంధించడానికి సహాయం చేస్తానని చెబుతుంది. సమయానికి చంచల అక్కడికి వచ్చి ఆమె తప్పనిసరిగా వెళ్ళాలని పట్టుబడుతుంది. ప్రభావతి అక్కడికి వెళ్ళి ప్రభాకర్ తో ప్రేమలో పడుతుంది. ఈ లోపల భాస్కరుడు వచ్చి ప్రభావతిని తిరిగి తీసుకుని వెళ్ళిపోతాడు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రభాకర్ ఆమెను తిరిగి తెచ్చుకోవడానికి వెళుతుంటే అతని అనుచరులు అతన్ని అనుమానిస్తారు. కానీ ప్రభాకర్ అక్కడికి వెళ్ళి ఆమెను మళ్ళీ దొంగతనంగా ఎత్తుకుని వస్తాడు. ఈ సమయంలో భాస్కరుడు ప్రభాకరుని సైన్యాన్ని బంధించి చెరసాలలో బంధిస్తాడు. తన సైన్యాన్ని విడిపించడం కోసం ప్రభాకరుడు మారు వేషంలో కోటలోకి ప్రవేశించి వారిని విడిపించే ప్రయత్నంలో తాను కూడా బంధీ అవుతాడు. అదే సమయంలో చనిపోయిన రాజు దెయ్యం లాగా వచ్చి వారందరినీ విడిపించి రాణిని బంధించి తీసుకుని వెళ్ళమంటాడు. వారు ఆమెను బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్ళి రాజును, పిల్లలను ఎవరు బంధించారో చెప్పమంటారు. కానీ ఆమె తనకు తెలియదని బుకాయిస్తుంది. ఇదే సమయంలా భాస్కరుడు సైన్యంతో రాణిని విడిపించుకుని ప్రభాకరుని బంధీగా తీసుకుని వెడతాడు. ప్రభాకరునికి ఉరిశిక్ష విధించబోతుండగా దెయ్యం వచ్చి అడ్డుపడతాడు. చివరికి రాజు మరణించలేదనీ, రాజగురువుగా మారు రూపంలో వచ్చాడనీ, దెయ్యం రూపంలో ఉన్నది కూడా రాజు గురువేనని తెలుస్తుంది. ప్రజలందరికీ ప్రభాకరుడు, భాస్కరుడు రాజకుమారులనీ, ప్రభావతి తన బావమరిది పురుషోత్తముడీ కూతురనీ తెలియజేస్తాడు. అంతా తెలిసిన తర్వాత తనను బ్రతకనివ్వరని తెలుసుకున్న చంచల ఆత్మహత్య చేసుకుని మరణిస్తుంది. ప్రభాకర్ రాజుగా పట్టాభిషిక్తుడు కావడంతో కథ ముగుస్తుంది.
పాటలు
మార్చు- రావాలి రావాలి రమ్మంటె రావాలి రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి - ఘంటసాల, జమునారాణి , రచన: ఆరుద్ర.
- మధువు మనకేల సఖియరో , ఘంటసాల, జమునారాణి ,కోమల , రచన : ఆరుద్ర.
- పాలోయమ్మ పాలో , ఘంటసాల,సుశీల , రచన: ఆరుద్ర .
- నాజూకైన గాడిద , ఘంటసాల , జమునారాణి , రచన: కొసరాజు .
- నవ్వుల నదిలో పువ్వుల పడవ , ఘంటసాల , సుశీల , రచన :ఆరుద్ర .
- కడగంటి చూపుతో కవ్వించి కవ్వించి,(పద్యం) కె. జమునా రాణి,రచన: ఆరుద్ర
- చోద్యం చూసావా ఓ చుక్కల నెలారాజా, పి.సుశీల, రచన: ఆరుద్ర
- తీయనైన హృదయం తేనెలూరు సమయం , పి సుశీల, రచన: ఆరుద్ర.
మూలాలు
మార్చు- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.