మల్లియ రేచన తెలుగులో మొదటి లక్షణ గ్రంథంమైన "కవిజనాశ్రయము"ను రచించిన కవి.[1] అతను నవల్లభుని కాలం వాడైన తొలి ఛందః కర్త. మల్లియ రేచన కంద పద్యాలతోనే కవిజనాశ్రయం మొత్తం రాశాడు. ఇతడు కలమే కాదు, కత్తి పట్టిన వాడు. ఇతని బిరుదులను బట్టి ఏదైనా సైన్యాధ్యక్ష పదవిని అలంకరించిన వాడు కావచ్చు.[2]

జీవిత విశేషాలు మార్చు

అతను వణిగ్వంశం (వైశ్య కులం) లో జన్మించాడు. జైన మతం స్వీకరించాడు.[3] ఇతని జీవిత కాలం సా.శ. 940 గా చరిత్రకారులు నిర్ణయించారు. అతనికి కవిజనాశ్రయుడు, శ్రావకాభరణాంకుడు అని బిరుదులు ఉన్నాయి. వాదీంద్ర చూడామణి ఇతనికి గురువు. కాగా కవిజనాశ్రయము ఇతని రచనా, కాదా అన్నది నేటికీ వివాదాస్పదమే.[4]

మల్లియ రేచన రాసిన ‘కవిజనాశ్రయము’ అనే ఛందోగ్రంథం సుప్రసిద్ధం. అతను నన్నయ కన్నా దాదాపు ఓ శతాబ్దం ముందటివాడని, కచ్చితంగా చెప్పుకుంటే, సా.శ.940 నాటివాడని, తెలుగు సాహిత్య చరిత్రకారులు లెక్క తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని మొట్టమొదట చెప్పిన గౌరవం వేటూరి ప్రభాకరశాస్త్రికి దక్కుతుంది. ‘కవిజనాశ్రయం’లో పూర్వకవుల ప్రస్తావన కూడా ఉండడం విశేషం. జయదేవాదులు చెప్పిన ఛందో రీతులను తాను ‘సంక్షేప రూపున’ చెప్పానని రేచన స్వయంగా పేర్కొన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడ రేచన స్వస్థలం. ఈ కారణం చేతనేనేమో, ‘కవిజనాశ్రయం’ వేములవాడ భీమకవి రచిందిందని ఓ వర్గం చిరకాలం వాదిస్తూ వచ్చింది. ఇది జైన సాంప్రదాయికము. దీనిని వేములవాడ భీమకవి కృతిగా నాంధ్ర సాహిత్య పరిషత్ పక్షమున జయంతి రామయ్య పంతులు 1917లో ప్రకటించారు.[5] క్రీ. శ. 990 ప్రాంతములో నుండిన కన్నడ కవి నాగవర్మ రచించిన "ఛందోంబుధి" గ్రంథమునకు, కవిజనాశ్రయమునకు అనేక పోలికలు ఉన్నాయి. కావున 'ఛందోంబుధి' ననుసరించి కవిజనాశ్రయము రచింపఁబడిన దనవచ్చును. ఇందలి పద్య మొకటి మడికి సింగన కూర్చిన 'సకల నీతి సమ్మతము' లో నుదాహరింపఁబడింది. సింగన క్రీ. శ. 1400 ప్రాంతపువాడయినందున అంతకు పూర్వమే కవిజనాశ్రయ రచన జరిగిందనడంలో సందేహమే లేదు. 'యాప్పిరుంగ లమ్ కారికై' గ్రంథములో నిది పేర్కొనఁబడుట బట్టి కవిజనాశ్రయము క్రీ. శ. 1100 ప్రాంతమందలిదని నిర్ణయింపవచ్చును.[6]

అయితే, ఆ వాదన క్రమంగా పూర్వపక్షమవుతూ వచ్చింది. ఇంతవరకూ దొరికిన ఆధారాల మేరకి, మల్లియ రేచనే మనకు ఆదికవి అని తెలుస్తుంది.[7]

మూలాలు మార్చు

  1. Fdaytalk. Telangana History Ancient to Modern Period (Updated 2020): Chapter Wise Most Common MCQ Questions (in ఇంగ్లీష్). Fdaytalk. Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-22.
  2. "తెలంగాణా సాహితీ తేజోమూర్తులు | Telangana Magazine". magazine.telangana.gov.in. Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-22.
  3. నన్నయకు ముందే కవిజనాశ్రయం అనే ఛందోగ్రంథం వచ్చింది. దీన్ని సా.శ. 940 ప్రాంతంలో మల్లియ రేచన రాశాడు. ఈ కవి వైశ్యుడు. జైెనమతస్థుడు.[permanent dead link]
  4. "భీమనచందము అని పిలువబడే కవిజనాశ్రయాన్ని భీమన వ్రాసెనో లేక రేచన వ్రాసెనో మనకు నిక్కచ్చిగా తెలియదు". Archived from the original on 2012-05-11. Retrieved 2012-08-23.
  5. మల్లియ రేచన (1950). కవిజనాశ్రయము.
  6. "పుట:Aandhrakavula-charitramu.pdf/117 - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-22.
  7. "మల్లియ రేచన - నన్నయ్యకే అన్నయ్య! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2020-06-22. Retrieved 2020-06-22.