మానవ వనరుల నిర్వహణ

మానవ వనరుల నిర్వహణ (ఆంగ్లం: Human resource management) అనునది నిర్వహణలో మానవ వనరుల నిర్వహణ యొక్క విభాగం. యాజమాన్యపు వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగి పనితనాన్ని పెంపొందించే క్రియ. మానవ వనరుల యొక్క నిర్వహణలో విధివిధానాల పైన, వ్యవస్థల పైన దృష్టి కేంద్రీకరిస్తుంది. మానవ వనరుల నిర్వహణ లోని ఉపవిభాగాలు ఉద్యోగుల జీతభత్యాలు, వారి నియామకం, శిక్షణ, అభివృద్ధి, పనితీరు ముదింపు వంటి అనేకానేక విధులను నిర్వహిస్తుంది. పారిశ్రామిక సంబంధాలు, సంస్థాగత మార్పు వంటివి కూడా మానవ వనరుల నిర్వహణ పరిధిలోకే వస్తాయి. R Buettner ప్రకారం మానవ వనరుల నిర్వహణలో ఈ క్రిందివి ప్రాధానాంశాలుగా కలిగి ఉంటాయి

ఆరంభకాలంలో మానవ వనరుల నిర్వహణ అనగా కేవలం జీతభత్యాలను అందజేసే విభాగంగా పరిగణించేవారు. కానీ గ్లోబలీకరణ, సంస్థాగత స్థిరీకరణ, సాంకేతిక ప్రగతి, అభివృద్ధి చెందిన పరిశోధన వలన 2015 సంవత్సరానికి విలీనాలు, స్వాధీనాలు, ప్రతిభా నిర్వహణ, ప్రత్యాన్మాయ ప్రణాళిక, శ్రామిక/పారిశ్రామిక సంబంధాలు వైవిధ్యత, చేరికలు ప్రధానాంశాలుగా మారాయి.

మానవ వనరులు ఉద్యోగి ఉత్పాదకతను గరిష్ఠస్థాయికి పెంపొందించే వ్యాపార రంగం. మానవ వనరుల నిర్వాహకులు సంస్థలోని ఉద్యోగులను నిర్వహించటంతో బాటు విధివిధానాలను, పద్ధతులను రూపొందిస్తారు. ఈ నిర్వాహకులు నియామకం, శిక్షణ, ఉద్యోగ సంబంధాలు, జీతభత్యాలలో నిపుణులై ఉంటారు. సంస్థకు కావలసిన ప్రతిభాపాటవాలను గుర్తించి వాటిని కలిగి ఉన్న ఉద్యోగులను వెదికి పట్టటం నియామక నిపుణుల బాధ్యత. ఏ ప్రతిభాపాటవాలు ఉద్యోగులలో లేవో, వాటి పై శిక్షణను అందించటం శిక్షణ నిపుణుల బాధ్యత. శిక్షణా కార్యక్రమాలను నిర్వహించటం, పనితీరు ముదింపు చేయటం వంటి కార్యక్రమాలను నిర్వహించటం ద్వారా నిత్యం ఉద్యోగుల నైపుణ్యతను అభివృద్ధి చేస్తూ ఉంటారు. విధివిధానాల అతిక్రమణకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవటం ఉద్యోగ సంబంధాల నిర్వాహకుల బాధ్యత (ఉదా:వివక్ష, వేధింపులు). వివిధ స్థాయిలలో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఎంత ఉండాలి? సెలవులు, సంస్థ యొక్క ఉత్పాదన/సేవల పై ఉద్యోగులకు ధరలలో తగ్గింపులు, వారికి ఇతర ప్రయోజనాలను నిర్ధారించటం జీతభత్యాల నిర్వాహకుల బాధ్యత. హ్యూమన్ రిసోర్స్ జనరలిస్టులు/వ్యాపార భాగస్వాములు కార్మిక సంబంధాలు, కార్మిక సంఘాలతో చర్చలు వంటి వాటిని నిర్వహిస్తారు.