మునిపల్లె శేషాద్రి సుబ్రహ్మణ్య కవి

మునిపల్లె శేషాద్రి సుబ్రహ్మణ్య కవి తెలుగు కవి, సంగీత విద్వాంసుడు, వ్యాకరణ ప్రవీడుడు. అతను వ్యాసప్రోక్తమైన సంస్కృత భాష లోని అధ్యాత్మ రామాయణము ను తెలుగులోకి అనువదించాడు. అతనితో పాటు ఇంకా పలువురు కవులు కూడా దీనిని తెలుగులోకి అనువదించారు. కాని ఈకవి తప్ప ఇతరులెవ్వరూ కీర్తనల రూపంలో అనువదించలేదు. సుబ్రహ్మణ్య కవి విరచిత ఈ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ఈ అనువాదాలన్నింటొలో మకుటాయమానమై బహుళ ప్రజాదరణ పొందినది.

మునిపల్లె శేషాద్రి సుబ్రహ్మణ్య కవి
జననం15-16 వ శతాబ్దం.
మునిపల్లె, గుంటూరు జిల్లా, నర్సారావు పేట.
ప్రసిద్ధిఆధ్యాత్మిక రామాయణము
మతంహిందూ

జీవిత విశేషాలు

మార్చు

అతను గుంటూరు జిల్లా, నర్సరావుపేటకు 4 మైళ్ళ దూరంలో ఈ మునిపల్లె గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కానీ శ్రీకాళహస్తి లో తన పాండిత్య ప్రదర్శన వలన అచ్చట సంస్థానధీశుని మెప్పించి వారివద్ద గురుస్థానాన్ని పొందగలిగాడు.

రచనలు

మార్చు

సుబ్రహ్మణ్య కవి ఆధ్యాత్మిక రామాయణమును కీర్తనల రూపంలో రచించాడు. నేడు ఎక్కువగా ప్రచారంలేని రాగాలు అయిన ఘంటా, రేగుప్తి, హిందూ ఘంటా, మంగళకౌశిక, మారువ, గుమ్మకాంభోజి రాగాలను ఈ కవి తన గ్రంధంలోవాడాడు. వీటికితోడు అన్నమాచార్యులు వాడిన కర్ణాటక సారంగ, గౌరీ లాంటి రాగాలు కూడా ఉన్నాయి. ఈకాలంలో సంగీత విద్వాంసులకు అనుభవంలోకి రాని ద్విజావంతి లలిత పంచమి అను అపురూప రాగాలను కూడా వాడాడు. ఈ రాగాలన్నీ అన్నమాచార్యుల కీర్తనలతో పాటు ప్రాచీన యక్షగానాలలో ఎక్కువగా వాడుకలో ఉండేవి. ఈ కవి సంగీత విద్వాంసుడే కాక, వ్యాకరణ ప్రవీణుడు కూడా అగుటచేత తన కాలంలో వాడుకలో ఉన్న సంగీత వ్యాకరణ ప్రయోగాలతో రచన కొనసాగించాడు. ఇందులో 104 కీర్తనలు 58 వివిధ రాగాలలో రచించబడ్డాయి. ఈ కీర్తనలు 1920 లో కర్రా అచ్చయ్య అండ్ సన్స్, రాజమండ్రి వారు శ్రీ అధ్యాత్మ రామాయణ కీర్తనలు గా ప్రకటించారు.

మునిపల్లె గ్రామ చరిత్ర

మార్చు

ప్రాచీన కాలంలో ఇంటిపేర్లు గ్రామాలపేర్లు గా గాని లేక గ్రామాలపేర్లు ఇంటిపేర్లుగా గాని వ్యవహిరించబడేవి.చరిత్ర పరిశోధకులు పురాణకాలంలోనూ, శాతవాహన రాజ్య పాలనకు పూర్వకాలంలోనూ, దండకారణ్యము దక్షిణ ప్రాంతమంతా వ్యాపించి ఉండేదని నిర్ణయించారు. నేటి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు మూడున్నూ కలసి ఒకే జిల్లా కృష్ణా జిల్లాగా బ్రిటీషు పాలన దినములలో కూడా వ్యవహరించబడేది. పౌరాణిక కాలంలో ఈ కృష్ణా జిల్లా అరణ్యప్రాంతమగుటయే కాక కృష్ణా నదీ, కృష్ణా-సాగర ప్రాంతము అగుటచే పలువురు ఋషులకు ఆశ్రయమిచ్చింది. హంస దీవిలో పరమహంసలు వెలుగొందగా, నేటి రేపల్లి లోని మొరతోట ఆనాడు మునులతోటగా ప్రశిద్ధి గాంచింది. శ్రీకాకుళంలో అత్రి, చ్యపలూరులో చ్యపనుడు, అవనిగడ్డలో వశిష్టుడు, పెదముత్తేవిలో వ్యాసుడు, విజయవాడలో విజయుడు తమతమ ఆశ్రమాలను నిర్మించుకొని ఈసీమను దివిసీమగా పేరొందించారు. అందులోని భాగమే నేటి దివితాలూకా. సుబ్రహ్మణ్యకవి జన్మించిన మునిపల్లె ఈ ప్రాంతానికి చెందినదే. ఇచ్చట ఈ మునుల కోవకు చెందిన ప్రముఖ ముని ఇక్కడ నివసించినందున మునిపల్లె అని ఈ గ్రామమునకు పేరు వచ్చినది.

మూలాలు

మార్చు
  • 1977 భారతి మాస పత్రిక. వ్యాసము:ఆధ్యాత్మ రామాయణ కీర్తనల కర్త సుబ్రహ్మణ్యకవి జీవిత విశేషాలు. వ్యాసకర్త: శ్రీ ముక్తేవి శ్రీరంగాచార్యులు.