మురారి (కవి)
మురారి రామయణంపై ప్రముఖ నాటకమైన అనర్ఘ రాఘవం రాసిన ప్రాచీన కవి. కొంతమంది చరిత్రకారులు ఆయనది సా.శ. 750-850 మధ్య కాలానికి చెందినవారిగా నిర్ణయించారు. కొంతమంది మురారిని ఆంధ్రుడు అని అభిప్రాయపడగా, మరికొందరు బెంగాల్ కు చెందిన బ్రాహ్మణునిగా భావిస్తారు. దక్షిణంలో ముఖ్యంగా ఆంధ్రులకు మురారి అభిమానకవిగా కనిపిస్తూ ఉంటారు. ఆయన రాసిన రచనలు ఆంధ్రాలో చాలా ప్రసిద్ధమైనవి. అనర్ఘ రాఘవం నాటకానికి కూడా తెలుగు అనువాదాలు ఉన్నాయి. ఈ నాటకంలోని సప్తమాంకంలో నర్మదానదీ తీరాన ఉన్న మాహిష్మతి నగరాన్ని కలచురి రాజుల రాజధాని అంటూ విశేషంగా ప్రస్తావించడంతో మాషిష్మతి నగరవాసి, ఆంధ్రుడు అని భావిస్తున్నారు.[1]
జీవిత సంగ్రహం
మార్చుమురారి తండ్రి శ్రీవర్ధ్మానకుడు, తల్లి తంతుమతి. ఆయన రాసిన అనర్ఘ రాఘవం నాటకంలో తనది మౌద్గల్య గోత్రమని ప్రస్తావించుకున్నారు. కాశ్మీరరాజు అవంతివర్మ ఆస్థానకవి అయిన ఆనందవర్ధనునికి సమకాలీకుడైన రత్నాకరుడు తన హరవిజయంలో మురారిని ప్రశంసించారు. రత్నాకరుడు సా.శ. 9వశతాబ్దానికి చెందినవారు కావడంతో మురారి సా.శ. 750-850 కాలానికి చెందినవారిగా పలువురు చరిత్రకారులు నిర్ధారించారు. అలాగే భవభూతి రాసిన ఉత్తరరామ చరిత్రలోని శ్లోకాల అనుకరణలు మురారి అనర్ఘ రాఘవంలో కనిపించడం ఈ వాదనకు బలమిస్తోంది.
అనర్ఘ రాఘవం నాటకం
మార్చుఈ నటకానికి ఏడు అంకాలు. ప్రథమాంకం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ రక్షణార్ధం తన వెంట తీసుకువెళ్ళడంతో ముగుస్తుంది. రెండో అకంలో రావణాదుల పరిచయం, తాటక వధ, మిథిలా ప్రయాణం వర్ణించారు మురారి. రావణుడు సీతను వివాహామాడ దలచుకోవడంతో మొదలయ్యే మూడో అంకం రాముడు హరివిల్లు విరవడం, రావణుని పురోహితుడు శేషల్కుడు దీనికి ప్రతీకారం తప్పదని రాముని బెదిరంచడంతో పూర్తవుతుంది. ఇక నాలుగో అంకంలో రావణుని మంత్రి మాల్యవంతుడు సీతా రాములకు వియోగం కలగాలనీ, కైకేయి ద్వారా రామునికి వనవాసమయ్యేట్లు చేయమని శూర్పణకను ప్రేరేపిస్తాడు. రామ పరశురాముల సంభాషణ, రామునికి రాజ్యాభిషేకం చేస్తానని దశరథుడు ప్రకటించడం, కైకేయి వరాలను తెలుపుతూ మంథర ప్రవేశించడం, అవి విని దశరథుడూ మూర్చిల్లడంతో నాలుగో అంకం పూర్తవుతుంది. రాముడు వనవాసంలో ఎందరో రాక్షసుల్ని సంహరించినట్టు జాంబవంత, శ్రమణుల సంభాషణ ద్వారా చెప్తూ పంచమాంకం మొదలవుతుంది, సీతాపహరణం, జటాయు మరణం, వాలి సంహారం, సుగ్రీవ పట్టాభిషేకం ఉంటాయి ఈ అంకంలో. ఆరవ అంకంలో రావణుని గూఢచారులు శుక, సారణులు రాముడు సేతుబంధనం చేశాడని మాల్యవంతునికి వివరిస్తారు. కుంభ, ఇంద్రజిత్తులతో రామ యుద్ధం, రావణ వధతో ఈ అంకం పూర్తవుతుంది. ఆఖరిది అయిన సప్తమాంకంలో సీతారాములు, లక్ష్మణ, హనుమంతాదులు పుష్పకవిమానంపై అయోధ్య పయనం, సుమేరు, చంద్ర లోకాలు, నదులు, ఉపనదుల వర్ణనలు ఉంటాయి. రాముని రాజ్యాభిషేకంతో నాటకం ముగుస్తుంది.[1]
కవిత్వ విశేషాలు
మార్చుభవభూతి పదవిన్యాసాన్ని, మాఘుని పదలాలిత్యాన్ని అనుకరించడానికి ప్రయత్నించారనేది పండితుల పరిశీలన. మురారి చాలా చోట్ల అప్రసిద్ధమైన పదాలను వాడారు. ప్రాచీన లాక్షణికులు ఆయనను ప్రౌఢశైలిని ప్రశంసించారు. నాటకీకరణ కోసం రామయణ కథను కొంచెం మార్చారు మురారు. ఈ నటకంలో వర్ణనలు ఎక్కువ కావడం వల్ల కొంత కావ్య స్వరూపం వచ్చిందంటారు పండితులు.
పాండిత్యం
మార్చుమీమాంస దర్శనంలో రెండు భిన్న మతాలుంటాయి. కుమారిల భట్టు మతం మొదటిది కాగా, ప్రభాకరుని మతం రెండోది. అయితే కొంతమంది పండితులు మురారి మతాన్ని మూడోదానిగా ప్రస్తావిస్తారు. దీనిబట్టీ మురారి ప్రసిద్ధ మీమాంసకుడని వివరిస్తారు.