ములుగు పాపయారాధ్యులు

తెలుగు రచయిత

ములుగు పాపయారాధ్యులు (1770-1850) ప్రముఖ ప్రాచీనాంధ్ర కవి. వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఆస్థానంలో కవిగా ఉన్నాడు. దేవీభాగవతాన్ని మొట్టమొదటగా తెలుగులోకి అనువాదం చేశాడు.

బాల్యం మార్చు

ఆయన కౌండిన్యస గోత్రుడు. ఆయన తల్లిదండ్రులు భ్రమరాంబ, వీరేశ్వరుడు. ఆయన భార్య పేరు లింగాంబ. లక్ష్మీపురం (ప్రస్తుతం గుంటూరు జిల్లా చింతపల్లి) అనే ఊర్లో ఆయన నివాసం.

రచనా ప్రస్థానం మార్చు

పాపయారాధ్యులు అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించిన వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జమీందారు గారి సమకాలికులనీ, ఆయన ఆస్థానంలోని కవి రత్నాలలో ఒకరని దేవీ భాగవతంలోని పీఠికా పద్యాలవలన తెలుస్తున్నది. వేంకటాద్రి నాయుడు కాలంలోనే కాకుండా ఆయన దత్తపుత్రుడు జగన్నాథరావు కాలంలో కూడా రచనలు చేశాడు. జగన్నాథరావు అనుమతి మీదనే దేవీభాగవతాన్ని మొట్టమొదటగా తెలుగులోకి అనువాదం చేశాడు. 1942లో ఇది మొట్టమొదటి సారిగా ప్రచురితమైంది. అప్పటి వరకూ ఈయన పేరు మరుగున పడిపోయి ఉంది. ఈయన తరువాత త్రిపురాన తమ్మన దొర, తిరుపతి వేంకట కవులు, దాసు శ్రీరామకవి మొదలగు వారు దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.

విమర్శలు మార్చు

పాపయారాధ్యుల గురించి కందుకూరి వీరేశలింగం పంతులు తన కవుల చరిత్రములో రాస్తూ ఈయన సలక్షణ కవి కాడని పేర్కొన్నాడు. అందుకు కారణం ఆయనకు పాపయ రచనలు సరిగా లభ్యం కాకుండట, లభ్యమైననూ తప్పుడు వ్రాతలతో ఉండుట కారణం కావచ్చని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి భావన. ఇందుకు జవాబుగా తాడేపల్లి వెంకటప్పయ్య సర్వమధుర గ్రంథ పీఠిక యందు పాపయ సలక్షణ కవియేనని వాదము చేశాడు.

చాటువులు మార్చు

పాపయారాధ్యులు తన భార్య లింగైక్యము చెందినపుడు ముక్తి ద్వారముతల్పు తీయగదె చాముండీ, జగజ్జీవనీ అనే మకుటంతో 24 పద్యాలు రచన చేశాడని ప్రతీతి. అందులో ఉదాహరణకు ఒక పద్యం.

శా. సక్తంబయ్యె మదీయ చిత్తము బృహత్సంసార పంకాబ్ధి న
వ్యక్తాతీత భవత్కటాక్షలహరీ వాక్పూర సంస్ఫీతిచే
సిక్తంబౌనటు లార్చి కింకరతచే శిక్షా విధిం గూర్చి నీ
ముక్తి ద్వారము తల్పు తీయ గదె చాముండీ! జగజ్జీవనీ!

రచనల జాబితా మార్చు

 • శ్రీ దేవీ భాగవతము
 • అనుపలబ్ధములు
 • వేమనారాధ్య చరిత్రము
 • అహల్యాసంక్రందన విలాసము
 • సరసహృదయానురంజనము
 • శంతను చరిత్ర
 • ఘూర్జను చరిత్ర
 • ఇంద్రాత్మజా పరిణయము
 • కల్యాణ చంపువు
 • ఏకాదశీవ్రత చంపువు
 • ఆర్యాశతీ శివస్త్రోత్రము

మూలాలు మార్చు