మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు

మారిషస్ లోమూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 1990 డిసెంబర్ 8వ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మారిషస్ ప్రభుత్వ సహకారంతో అక్కడి తెలుగు కల్చరల్ ట్రస్టు, తెలుగు విశ్వవిద్యాలయం కలిసి, ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంలో వీటిని నిర్వహించారు.[1]

విశేషాలు మార్చు

రెండవ ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానం మేరకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషన్ దేశంలో 1990లో డిశంబర్‌ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మారిషస్‌లోని మోకా ప్రాంతంలో ఉన్న 'మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌' లో నిర్వహించారు. ఈ సభలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ద్వారా ఆ దేశంలోని మారిషస్‌ ఆంధ్ర మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.[2]

ఈ సభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు, ఆ దేశ ప్రధాని అనిరుద్ద్‌ జగన్నాథ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు ఉత్సవాలను ప్రారంభిస్తూ భారతదేశంతో మారిషస్‌ దేశానికి ఉన్న సత్సంబంధాలను వివరించారు. వారు మారిషస్ దేశ ప్రగతికి తెలుగు వారు చేసిన కృషిని ప్రశంసించారు. అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు పద్మభూషణ్‌ డా॥ సి.నారాయణ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విద్యావేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు, చలనచిత్ర నటులు, అధికారులు బృందంగా ఏర్పడి ఈ సభలకు హాజరై వీటిని జయప్రదంగా నిర్వహింపచేసారు.

కార్యక్రమాలు మార్చు

ఈ సభలు నాలుగు రోజుల పాటు జరిగాయి. ఈ సభలలో మాతృభాషగా తెలుగు బోధన, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, వంటి అంశాలపై విద్యావంతుల సమావేశాలు, కవి సమ్మేళనాలు, ప్రతినిధుల సమావేశాలు చైతన్యవంతంగా నిర్వహించబడ్డాయి. సుమారు 200 సంవత్సరాలకు పూర్వం తెలుగునాట తీర ప్రాంతాల నుంచి వెళ్ళిన తెలుగువారు కొన్ని తరాలుగా ఆ దేశంలో స్థిరపడిపోయారు. వారికి ఇక్కడి నుంచి ఎటువంటి రాకపోకలు లేకపోవడం వల్ల ఇన్నాళ్లుగా తెలుగు భాషాసంస్కృతులకు దూరంగా జీవిస్తున్నారు. అయినప్పటికీ వీటిని తమ తాత ముత్తాతల సంపదగా భావించి, ఆరాధిస్తూ దానిని తరువాతి తరాలకు అందిస్తూ తెలుగు ఉనికిని కాపాడుకుంటున్నారు. అటువంటి తెలుగు వారికి ఈ సభలు తెలుగు భాషపై నరనరాలలో ఉన్న మమకారాన్ని వెల్లువెత్తించాయి. ఈ సందర్భంగా ఉత్తమ రచనలతో కూడిన ఒక ప్రత్యేక సంచిక ఆవిష్కృతమయ్యింది.[3]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. మారిషస్ లో తెలుగు వైభవం, ఆంధ్రప్రదేశ్, జనవరి 2012 సంచికలో కిలారు ముద్దుకృష్ణ వ్యాసం ఆధారంగా.
  2. మండలి, బుద్ధ ప్రసాద్ (2000).   మారిషస్‌లో తెలుగు తేజం. వికీసోర్స్. 
  3. మూడవ ప్రపంచ తెలుగు మహాసభల నివేదిక

ఇతర లింకులు మార్చు