మూత్రపిండము

(మూత్రపిండాలు నుండి దారిమార్పు చెందింది)
మూత్రపిండాలు
Kidney section.jpg
వెనుకనుండి చూచినపుడు మానవ మూత్రపిండాలు (అడ్డంగా ఉండే వెన్నెముక ఈ బొమ్మలో చూపలేదు)
లాటిన్ ren
గ్రే'స్ subject #253 1215
ధమని వృక్క ధమని
సిర వృక్క సిర
నాడి renal plexus
Dorlands/Elsevier k_03/12470097

మూత్రపిండాలు (Kidneys) చాల ముఖ్యమైన అవయవాలు. జీవి మనుగడకి మెదడు (brain), గుండె (heart), మూత్రపిండాలు మూలాధారాలు. జీవి చేసే కార్యకలాపాలన్నిటిని నియంత్రించేది మెదడు. శరీరం నాలుగు మూలలకీ రక్తాన్ని ప్రసరింపచెయ్యటానికి పంపు వంటి సాధనం గుండె. రక్తంలో చేరుతూన్న కల్మషాన్ని గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. ఇవి ఒంట్లో నీరు-లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. రక్తపు పోటు (blood pressure) ని నియంత్రించటంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి.

మూత్రపిండాల స్థావరంసవరించు

ఒకొక్క మూత్రపిండం చిక్కుడు గింజ ఆకారంలో, పిడికిలి ప్రమాణంలో ఉంటుంది. ఈ రెండూ వీపుకి మధ్య భాగంలో, కడుపుకి వెనక, పక్క ఎముకలకి దిగువగా, వెన్నుకి ఇటూ అటూ ఉంటాయి. తరచుగా ఎడమ వైపు ఉండే మూత్ర పిండం కుడి పిండానికి ఎదురుగా కాకుండా రెండు సెంటీమీటర్లు ప్రాప్తికి ఎగువకి ఉంటుంది. ప్రతి పిండం దరిదాపు 10 సెంటీమీటర్లు పొడవు, 5 సెంటీమీటర్లు మందం ఉండి, దరిదాపు 150 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పిండాలలోనికి రక్తం వృక్క ధమని (renal artery) ద్వారా వెళ్ళి, శుభ్రపడి వృక్క సిర (renal vein) ద్వారా బయటకి వస్తుంది. (ఇంగ్లీషులో 'రీనల్‌' అనే విశేషణం 'మూత్రపిండాలకి సంబంధించిన' అనే అర్ధాన్ని ఇస్తుంది. సంస్కృతంలో ఇదే అర్ధం వచ్చే ధాతువు 'వృక్క'.) చిక్కటి రక్తనాళాల వలయంతో నిండి ఉంటాయి కనుక మూత్రపిండాలు చూడటానికి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.

మూత్రపిండాలు చేసే పనిసవరించు

మన మూత్రపిండాలు ప్రతి రోజూ దరిదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకట్టి అందులోంచి రథరిదాపు 2 లీటర్ల కల్మషాలనీ, అధికంగా ఉన్న నీటినీ తోడెస్తాయి. ఇలా తోడెయ్యబడ్డ నీరే మూత్రం లేదా ఉచ్చ. ఈ మూత్రం, ప్రతి రోజూ, ఇరవైనాలుగు గంటలు, అహర్నిశలూ అలా బొట్లు బొట్లుగా మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఇలా తయారయున బొట్లు యూరెటర్‌ (ureter) అనే పేరు గల రెండు గొట్టాల ద్వారా మూత్రాశం ల (bladder) లో చేరతాయి. ఈ సంచీ నిండగానే ఉచ్చ పోసుకోవాలనే కోరిక మెదడులో కలుగుతుంది. ఈ యూరెటర్లు సుమారు 0.6 సెంటీమీటర్లు వ్యాసం గల గొట్టాలు. ఈ గొట్టాల గోడలలో ఉన్న కండరాలు తరంగాల మాదిరి ముకుళించుకుని వికసిస్తూ ఉంటే వీటిలో ఉన్న మూత్రపు బొట్లు మూత్రాశయం వైపు తొయ్యబడతాయి. మూత్రాశయంలోకి చేరుకున్న మూత్రం మళ్ళా వెనక్కి వెళ్ళకుండా ఈ కండరాలే అడ్డుకుంటాయి. కనుక మూత్రాశయంలో పెరుగుతూన్న మూత్రానికి ఒకటే దారి - బయటకి. మూత్రాశయం నుండి బయటకి వెళ్ళే గొట్టం పేరు యూరెత్రా (urethra). ఇది పురుషాంగం మధ్య నుండి కాని, యోని ద్వారం దగ్గరకి కాని బయటకి వస్తుంది. ఇలా బయటకి వెళ్ళే మార్గాన్ని మూత్రమార్గం (urinary tract) అని కూడా అంటారు.

గలన యంత్రాంగంసవరించు

చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న మూత్రపిండాలు ఒక పక్క కుంభాకారంగానూ, మరొక పక్క పుటాకారం (concave) గానూ ఉంటాయి. ఈ పుటాకారపు ఒంపు ద్వారా వృక్క ధమని (renal artery), వృక్క సిర (renal vein), యూరెటర్‌ గొట్టం (ureter tube), వార్తలను మోసే నరాల జడకట్ట (neural plexus) లోపలికి వెళతాయి. ప్రతి మూత్రపిండం లోపల దరిదాపు మిలియన్‌ (1,000, 000) ప్రత్యేకమయిన గలన కణాలు (nephrons) ఉంటాయి. మూత్రపిండాలకి ఈ గలన కణాలు ఆయువు పట్టు. ఒకసారి పాడయితే వీటిని మరమ్మత్తు చెయ్యలేము. పేరుకి గలన కణాలని అన్నా ఇవి ఉత్త గలన ప్రక్రియ (లేదా వడపోత) ఒక్కటీ చేసి ఊరుకోవు. రక్తంలోని మలినాలని వడపొయ్యటం, తరువాత ఆరోగ్యంగా ఉండే రక్తానికి ఉండవలసిన లక్షణాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూడటం - ఇవి ఈ గలన కణాల ముఖ్య బాధ్యతలు. ఈ గురుతర బాధ్యతలు నెరవేర్చటానికి ప్రతీ గలన కణం లోపల రెండు కర్మాగారాలలాంటి ఉపభాగాలు ఉంటాయి. వీటిలో ఒక భాగం పేరు గ్లోమెరూల్సు (glomerulus). రెండవదాని పేరు చిట్టిగొట్టం (tubule). ఇది సన్నటి చుట్టబెట్టిన చిన్న గొట్టం మాదిరి ఉంటుంది. ఈ సంక్లిష్ట వాతావరణంలో కేశనాళికలలో (capillaries) రక్తం ఒక పక్క ప్రవహిస్తూ ఉంటే - రకరకాల రసాయన ప్రక్రియల ప్రభావం వల్ల - రక్తం నుండి మూత్రం వేరవుతుంది. అంతే కాకుండా రక్తంలో రసాయన తుల్యతలు అన్నీ ఉండవలసిన విధంగా అమర్చబడతాయి.

రక్తం లోకి మలినాలు ఎక్కడ నుండి వస్తాయి?సవరించు

మనం తినే ఆహారం జీర్ణం అయి రక్త ప్రవాహంలో కలసినప్పుడు అనవసరమైన పదార్ధాలు కొన్ని రక్తంలో చేరతాయి. కట్టెలు కాలినప్పుడు మసి మిగిలినట్లు శరీరం తన పనులు తాను చేసుకుంటూ పోయే సందర్భంలో కొన్ని మలిన పదార్ధాలు జీవకణాలలో తయారవుతాయి. ఇలా రక్తంలో చేరిన మలినాలని మూత్రపిండాలు సత్వరం శరీరం నుండి బహిష్కరించపోతే రక్తం విషపూరితం అవుతుంది. రక్తం చిట్టిగొట్టాలగుండా ప్రవహించేటప్పుడు శరీరానికి ఇంకా పనికి వచ్చేవీ, ఇహపనికి రానివీ రెండూ కలిసే ఉంటాయి. అప్పుడు ఆ ప్రవాహంలో ఉన్న సోడియం, పొటాసియం, భాస్వరం మొదలైన ద్రవ్యాలని తూకం వేసి, శరీరం అవసరాలకి సరిపడా రక్తంలో ఉండనిచ్చి, మిగిలిన వాటిని బయటకి తోడుతాయి మూత్రపిండాలలో ఉన్న గ్లోమెరూల్సు, చిట్టిగొట్టాలూ. ఈ పదార్ధాలు ఎక్కవైనా చిక్కే, తక్కువైనా చిక్కే.

వృక్క ధర్మంసవరించు

మూత్రపిండాలు చేసే పనిని వృక్క ధర్మం (renal function) అంటారు. రెండు ఆరోగ్యమైన మూత్రపిండాలు ఉంటే వృక్క ధర్మం నూటికి నూరు పాళ్ళూ జరుగుతోందని అంటారు. సర్వ సాధారణంగా ప్రతివారికీ కావలసిన దానికంటె ఎక్కువగానే ఉంటుంది ఈ ధర్మం. కొందరు ఒకే మూత్రపిండంతో పుడతారు. అయినా సరే వారు మామూలుగానే బతుకుతారు కదా. కొందరు ఒక మూత్రపిండాన్ని విరాళంగా ఇచ్చేస్తారు. అయినా సరే ఆ రెండో మూత్రపిండం జరగవలసిన పనిని జరిపించెయ్యగలదు.

మూత్రపిండాలలో ఇంత అదనపు స్తోమత ఉన్నా కొందరికి జబ్బు వల్ల మూత్రపిండాలు పాడయి తమ ధర్మాన్ని నిర్వర్తించలేవు. అప్పుడు ప్రాణాపాయ స్థితి అన్న మాట.

మూత్రపిండాలు చేసే పనిని ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చు.

  • రక్తంలో ఉన్న మలినాలని బయటకి తోడటం.
  • రక్తంలో ఉన్న విద్యుత్‌, రసాయన తుల్యతలని కాపాడటం (maintain electrolyte balance).
  • రక్తంలో ఉన్న విషతుల్య పదార్ధాలని నాశనం చేసి విసర్జించటం.
  • రక్తం లోకి హార్మోనుల్ని స్రవించి, తద్వారా శరీరం లోని ఖటికం (calcium) మట్టాన్ని నిర్ధిష్ట స్థాయిలో ఉంచటం. (తద్వారా ఎముకలని పటిష్ఠంగా ఉంచటం.)
  • శరీరానికి కావలసిన ఎర్ర కణాల ఉత్పత్తికి సహాయం చేసి రక్తహీనత (anemia) రాకుండా కాపాడటం.
  • రక్తంలో ఉన్న నీటి మట్టాన్ని నియంత్రించి తద్వారా రక్తపు పోటు (blood pressure) ని నియంత్రించటం.
  • మూత్ర పిండము అనేది చాల విలువైన organ.

క్రిటినియా అంటే ఏమిటి మూత్రపిండాలకి హాని జరిగే పరిస్థితులుసవరించు

దెబ్బలు తగలటం వినా, మూత్రపిండాల ఆరోగ్య భంగానికి ముఖ్య కారకులు మితిమీరిన రక్తపు పోటు (high blood pressure), అదుపు తప్పిన రక్తపు చక్కెర మట్టం (high blood sugar level), కొన్ని రోగాలను నయం చేసె క్రమంలో వాడె మందుల వల్ల. కనుక మూత్రపిండాల ఆరోగ్యం పరిరక్షించుకోవాలంటే ముందు రక్తపు పోటుని అదుపులో పెట్టాలి. ఆ తరువాత డయబెటీస్‌ (diabetes) రాకుండా జాగ్రత్త పడాలి. వీటి అవతరణకి వంశానుగత కారణాలు కొంతవరకు ప్రేరకాలు అయినా, మంచి అలవాట్లతో వీటిని నియంత్రించవచ్చు. ఈ మంచి అలవాట్లలో ముఖ్యమైనవి: ప్రతి దినం చలాకీ జీవితం గడపటం, శరీరం బరువుని అదుపులో పెట్టుకోవటం, పొగతాగుడు మానటం, ఆరోగ్యకరమైన తిండి తినటం.

మూత్రపిండాల్లో రాళ్ళుసవరించు

ఘట్‌కేసర్‌లో అవుశాపూర్‌ గ్రామానికి చెందిన హన్మంతు (49) మూత్రాశయం నుంచి 250 గ్రాముల రాయిని తీశారు.చిన్న చిన్న మోతాదులలో మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటం సర్వ సాధారణం. ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నీటిని తాగితే అది ఒక పొరగా ఏర్పడి క్రమేణ రాయిగా మారుతుంది.రోజుకు ఐదు నుంచి ఏడు లీటర్ల నీటిని తాగితే రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు.ఒక వేళ ఇది వరకే చిన్నచిన్న రాళ్లు[1] ఏర్పడి ఉంటే మూత్రంతో పాటే బయటికి వచ్చే అవకాశం ఉంది. (సూర్య12.9.2009)

అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవంసవరించు

అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం (ఆంగ్లం: World Kidney Day) ఏటా మార్చి 2వ గురువారం జరుపుకుంటారు. [2] ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ప్రాముఖ్యతను, అలాగే మూత్రపిండ సంబంధిత ఆరోగ్య సమస్యలఫై  ప్రజల్లో అవగాహణ కలిపించేందుకు కిడ్నీ దినోత్సవాన్ని 2006లో ప్రారంభించారు. దీన్ని అంతర్జాతీయ మూత్ర పిండాల సొసైటీ (ఐఎస్ఎన్), అంతర్జాతీయ ఫెడరేషన్ మూత్రపిండ ఫౌండేషన్స్ (ఐఎఫ్కెఎఫ్) సంయుక్తంగా నిర్వహిస్తారు.[3]

 మూలాలుసవరించు

  1. మూత్రపిండాలలొ రాళ్ల నుంచి విముక్తి పొందె మార్గాలు ఈ సంచికలొ
  2. "World Kidney Day". www.nature.com. 16 February 2022. Retrieved 2022-03-04.
  3. "కిడ్నీలకు.. కష్టం". EENADU. Retrieved 2022-03-11.

వనరులుసవరించు

1. Pamplets from National Kidney Foundation, 30 East 33rd Street, New York, NY 10016