మోదుగుపూలు (నవల)
నిజాం పరిపాలనలో తెలంగాణ జీవిత చిత్రాన్ని ప్రతిబింబిస్తూ దాశరథి రంగాచార్య రాసిన నవల ఈ "మోదుగుపూలు"[1]. కథాకాలం 1943 - 1948. 1940లలో భారత దేశంలో స్వాతంత్ర్యోద్యమం ఉధృతమైన నాటి నుండి తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుండి స్వేచ్ఛ లభించేవరకూ వర్ణించబడి ఉంటుంది. ఈ నవల నాటకం గా కూడా ప్రదర్శించబడింది.[2]
మోదుగుపూలు | |
"మోదుగుపూలు" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | దాశరథి రంగాచార్య |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | తెలంగాణ జీవిత చిత్రం |
ప్రచురణ: | విశాలాంధ్ర |
విడుదల: | |
పేజీలు: | 159 |
ముద్రణ: | విశాలాంధ్ర |
పుస్తక గురించి
మార్చుమోదుగుపూలు నవల 1944-51 మధ్య తెలంగాణలో నెలకొన్న ప్రజా పోరాటాన్ని చిత్రించిన నవల. ఈ నేపథ్యంలో జాగీర్దారీ ప్రాంతంలో ఎలాంటి అకృత్యాలు, అరాచకాలు చెలరేగాయో క్రమంగా చైతన్యవంతులైన ప్రజలు అధికార వర్గాలను , వారి పీఠాలనూ ఎలా కదిలించాయో మోదుగుపూలు నవలలో ఉంటుంది. సాంకేతికంగా నవలలో ఉన్నది కోయగూడెమే అయినా తెలంగాణ అంతటి అవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నవలలో కథానాయకుడైన రఘ పాత్రలో ఉన్నది ప్రచ్ఛన్నంగా రంగాచార్య గారే. అందుకే ఇది చారిత్రాత్మక ఆత్మకథాత్మక నవలగా చెప్పవచ్చు. ప్రాధమికంగా నవలలో రఘ, జానకి, వీరయ్య , సింగన్న , భీముడు, రావడు, నాగేష్, రుక్మిణివి చైతన్యవంతమైన పాత్రలుగా కనిపిస్తే తాసిల్దారు, గిర్దావరు, షావుకారు వెంకయ్య, అమీను అహంకారం మూర్తీభవించిన అధికార పీఠాలుగా కనిపిస్తారు.
కొన్ని సన్నివేశాలు
మార్చుపత్రికను తీసుకుని ఊళ్ళో దిగిన రఘను అమీను కొడితే స్పందించిన అతని మామ వీరయ్యకు తిరిగి రఘ జవాబిస్తూ ''వ్యక్తిని అని ఏమీ ప్రయోజనం లేదు. వ్యవస్థ అటువంటిది '' అని ఒకచోట, '' వ్యక్తి మీద నాకు ద్వేషం లేదు. వ్యవస్థ అతన్ని దుష్టుణ్ణి చేస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటి వ్యవస్థలోని ఒక భాగం నన్ను హింసించింది'' అని మరో సందర్భంలో చెప్పిన రఘ మాటలు నిర్మాణాత్మక చైతన్యాన్ని , దార్శనికతను వ్యక్తీకరిస్తాయి.
చివరకు ఒక వారం రోజుల పాటు మంగళి వృత్తి చేసే రావడు, మరొకరు కనిపించకపోతే అధికారులకు మసాజు చేసే వాళ్లు కరువవుతారు. చివరకు గత్యంతరం లేక మంగళ్లకు తాసిల్దారు ఐదు రూపాయలు చెల్లిస్తాడు. శ్రమజీవులు సంఘటితమైతే దోపిడీ వ్యవస్థ ఏ విధంగా తోకముడుస్తుందో ఈ ఉదంతం ద్వారా తెలుసుకోవచ్చు. అదే చైతన్యం గ్రామంలోని మిగతా వర్గాలకు కూడా పాకి క్రమంగా వడ్డెర్లు, హరిజనులు కూలీ రేట్లు సాధించుకున్నారు.
చదువు చైతన్యాన్ని అందిస్తుంది కాబట్టి ''ఆ చదువంటే బెదురు నిజాం నవాబుకు'' అన్నాడు రచయిత నవలలో. హరిజన వాడలో వయోజన విద్యా కేంద్రాన్ని నెలకొల్పడానికి, ఊరంతా పత్రికలు తెప్పించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో జనానికి భయాన్ని పోగొడుతూ ''కుటుంబ మేలు సొంత క్షేమాన్ని వొదులుకోవాలి. గ్రామం కోసం కుటుంబ క్షేమాన్ని, రాష్ట్ర శ్రేయస్సుకోసం గ్రామ శ్రేయస్సునూ, దేశ శ్రేయస్సు కోసం రాష్ట్ర శ్రేయస్సునూ వదులుకోవాలి. మానవత శ్రేయస్సు కోసం దేశాన్ని సహితం వదులు కోవచ్చు" అని చెప్పిన మాటలు సర్వకాలీనమైనవి. సార్వజనీనమైనవి[3].
విప్లవించిన కోయల చైతన్యానికి ప్రతీకాత్మకమైన పేరే మోదుగు పూలు. అందుకే రచయుత '' మోదుగు పూలు గ్రామంలో ఉండవు. అడవుల్లో ఉంటాయి'' అన్నాడు. అందుకే మోదుగుపూలు విప్లవాత్మక నవల.
మూలాలు
మార్చు- ↑ "మోదుగుపూలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-10-25. Retrieved 2020-05-09.[permanent dead link]
- ↑ AuthorSharjeel. "35 debutant theatre artistes to perform Daasarathi's 'Modugu Poolu'". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-09.
- ↑ "విప్లవాత్మక నవల మోదుగుపూలు - Navatelangana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-05-09.[permanent dead link]
బాహ్య లంకెలు
మార్చు- మురళి (జూన్ 11, 2011). "నెమలికన్ను: మోదుగుపూలు". నెమలికన్ను. Archived from the original on 2020-02-25. Retrieved 2020-05-09.