మౌలానా హబీబ్ ఉర్ రెహ్మాన్ లుధియాన్వి

(మౌలానా హబీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ లుధియాన్వి నుండి దారిమార్పు చెందింది)


మౌలానా హబీబ్‌-ఉర్‌-రెహ్మాన్‌ లుధియాన్వి (1892 జూలై 3 - 1956 సెప్టెంబరు 2) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మజ్లిస్-ఇ-అహ్రార్-ఇ-ఇస్లాం వ్యవస్థాపకులలో ఒకడు. అతను 1857లో భారత తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి వంశస్థుడు. అతను ‘విభజించు పాలించు’ సూత్రం అమలులో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలు తాగేనీటిని సైతం మతానికి ముడిపెట్టి హిందూ ముస్లింలను విడగొట్టే ప్రయత్నం చేసిన సమయంలో మొదటగా వ్యతిరేకగళం వినిపించిన ఉద్యమ నాయకుడు.[1][2][3][4]

మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి
పుట్టిన తేదీ, స్థలంహబీబ్ ఉర్ రెహ్మాన్
3 జూలై 1892
లుధియానా, పంజాబ్, ఇండియా
మరణం1956 సెప్టెంబరు 2(1956-09-02) (వయసు 64)
వృత్తిదేశభక్తుడు
జాతీయతబ్రిటిష్ ఇండియన్ / ఇండియన్

ఉద్యమం

మార్చు

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జైళ్లలో.. ఇలా అన్నీ చోట్లా మతాలవారీగా విడివిడిగా హిందూ నీళ్లు, ముస్లిం నీళ్లు అని ఏర్పాటుచేసి ఎవరికి కేటాయించిన వాటిని వారే తాగాలని బ్రిటీష్ ప్రభుత్వం భారతీయులను హెచ్చరించింది. అలా నీటివద్ద కూడా హిందూ ముస్లింలను వేరు చేసి పాలించారు తెల్లవారు. ఇలాంటి సమయంలో ప్రజలందరినీ సమీకరించి, ఈ వేర్వేరు నీళ్ల పద్ధతిని ఎత్తేసేదాకా పోరాడి బ్రిటిష్‌వారిపై విజయం సాధించారు.

నీళ్లకు మతమేంటంటూ లుధియానాలోని ఘాస్‌మండీ చౌక్‌ వద్ద 1929లో నిరసన దీక్ష చేపట్టారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న పట్టణ ప్రజలంతా మతాలకు అతీతంగా ఆయనను అనుసరించారు. హిందూ పానీ, ముస్లిం పానీ వద్దు... సబ్‌కా పానీ ఏక్‌ హై.. అంటూ నినదిస్తూ ఉద్యమబాట పట్టడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం దిగివచ్చింది. కేవలం లుధియానాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ముస్లింపానీ, హిందూ పానీ పద్ధతిని రద్దు చేసింది.[5]

మౌలానా హబీబ్‌-ఉర్‌-రెహ్మాన్‌ లుధియాన్వి మంచి వక్త. ఆయన మాట నిప్పుకణిక. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని సుమారు 14 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. దేశ విభజనను, ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్థాన్‌ ఏర్పాటును కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రావి నది ఒడ్డున త్రివర్ణపతాకం ఎగరేసి వచ్చారు. కానీ తన ఆకాంక్షలకు విరుద్ధంగా దేశ విభజన జరగటంతో కుంగిపోయారు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ విభజన, భారత స్వాతంత్య్రం తర్వాత, అనేకమంది నిరాశ్రయులకు మతాలకు అతీతంగా ఆశ్రయం కల్పించారు.

కుటుంబ చరిత్ర

మార్చు

మౌలానా హబీబ్ ఉర్ రెహ్మాన్ లుథియాన్వి బ్రిటిష్ ఇండియాలోని లూథియానాలో 1892 జూలై 3 న జన్మించాడు. అతను అబ్దుల్ అజీజ్ కుమార్తె బీబీ షఫతున్నీసాను వివాహం చేసుకున్నాడు. అతని తాత షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి 1857 లో భారత తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. పంజాబ్ నుండి తిరుగుబాటు చేసిన వారిలో అతనే మొదటి వ్యక్తి. అతను లూథియానా నుండి మాత్రమే కాకుండా పానిపట్ నుండి కూడా బ్రిటిష్ వారిని తరిమికొట్టిన గొప్ప పోరాట వీరుడు. ఈ పోరాట దళంలో మతాలకతీతంగా ముస్లింలు, హిందువులు, సిక్కులు.. ఇలా అందరూ ఉన్నారు. అతను మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌కు మద్దతుగా ఢిల్లీ వెళ్లాడు. అతను 1857లో ఢిల్లీలోని చాందినీచౌక్‌లో వేలాది మందితో కలిసి తన పోరాటం సాగించాడు.

మూలాలు

మార్చు
  1. An Arain freedom fighter (Habib-ur-Rehman Ludhianvi) Archived 2020-06-26 at the Wayback Machine The News International (newspaper), Published 15 December 2007, Retrieved 6 November 2018
  2. Ishtiaq Ahmed (15 December 2007). "Profile of Habib-ur-Rehman Ludhianvi". Academy of the Punjab in North America website. Retrieved 6 November 2018.
  3. Profile of Habib-ur-Rehman Ludhianvi Heritage Times (newspaper), Published 17 November 2017, Retrieved 6 November 2018
  4. Profile of Maulana Habib-ur-Rehman Ludhianvi on indianmuslimlegends.com website Retrieved 8 November 2018
  5. "Azadi Ka Amrit Mahotsav: హిందూ పానీ... ముస్లిం పానీ". EENADU. Retrieved 2021-10-20.