బాబిట్ పురుగు
బాబిట్ పురుగు (Bobbit worm) లేదా ఇసుక స్ట్రైకర్ (sand striker) అనేది సముద్రపు నీటిలో నివసించే ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన పురుగు (marine worm). సుమారు ఒక మీటరు పైగా పొడుగుండే ఈ పురుగు యొక్క దేహం అనేక ఖండాల సమూహంగా వుండి, చూడడానికి ఒక పొడుగాటి శతపాదు (centipede) వలె కనిపిస్తుంది. సాధారణంగా ఇది సముద్ర భూతలంపైన వున్న బొరియలలో జీవిస్తుంది. ఆహారం కోసం ఇది చేపలను, ఆక్టోపస్ తదితర సముద్ర జీవజాలాన్ని మాటు వేసి భయంకరంగా వేటాడుతూ జీవిస్తుంది (మెరైన్ ప్రెడేటర్). ఒక్కోసారి ఇది చేసే మెరుపు దాడిలో పదునైన దీని దంతాల కారణంగా దాడికి గురైన ఎర రెండు ముక్కలై తెగిపడటం కూడా జరుగుతుంది. [1][2] దీని శాస్త్రీయ నామం యునిస్ అఫ్రోడిటిస్ (Eunice Aphroditois). ఇండో-పసిఫిక్ సముద్రాలలో ప్రత్యేకంగా కనిపించే ఈ సముద్రజీవి అనెలిడా (annelid) వర్గంలోని పాలికీటా (Polychaeta) తరగతికి చెందినది.
బాబిట్ పురుగు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | పాలికీటా
|
Order: | యూనిసిడా
|
Family: | యూనిసిడే
|
Genus: | యూనిస్
|
Species: | E. అఫ్రోడిటిస్
|
Binomial name | |
యునిస్ అఫ్రోడిటిస్ Pallas, 1788
|
ఆవాసం-వ్యాప్తి
మార్చుబాబిట్ పురుగులు, సముద్ర ఉపరితలం నుండి 10 నుంచి 40 మీటర్ల లోతులో సముద్ర భూతలంపై నివసిస్తాయి. సాధారణంగా ఇసుక, కంకర, బురద లేదా పగడపు శిధిలాలతో కూడిన సముద్ర నేలలోని బొరియలలో జీవిస్తాయి. ఈ పురుగులను మొదటిసారిగా 1788 లో శ్రీలంక చుట్టూ వున్న ఇండో-పసిఫిక్ కు చెందిన ఉష్ణ మండల సముద్రజలాలలో గమనించారు. యునిసిడె కుటుంబానికి చెందిన జీవుల ఉనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాలలోను కనిపిస్తున్నప్పటికీ, అదే కుటుంబానికి చెందిన బాబిట్ పురుగులు మాత్రం ఇండో-పసిఫిక్ సముద్రాలలో విశిష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా శ్రీలంక జలాలలో, ఇండోనేషియాలోని బాలి వద్ద సీక్రెట్ అఖాతం (Secret Bay)లో, ఉత్తర సుళవేసి లోని లెంబె జలసంధి (Lembeh strait) ప్రాంతంలోను, ఫిలిపైన్స్ సముద్రంలో బలయాన్ అఖాతం (Balayan Bay) ప్రాంతాలలో విస్తృతంగా బాబిట్ పురుగులను గుర్తించారు. సమశీతోష్ట మండల సముద్రజలాలకు సంబంధించినంత వరకు ఇవి అట్లాంటిక్ మహా సముద్ర జలాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా హోక్కైడో ప్రాంతం (జపాన్), నార్త్ అడ్రియాటిక్ సముద్రం, కరేబియన్ సముద్ర జలాలలో ఇవి వ్యాప్తి చెందివున్నాయి.
లక్షణాలు
మార్చుఅనెలిడా వర్గంలోని పాలికీటా తరగతికి చెందిన ఈ సముద్రపు పురుగులు యూనిసిడే కుటుంబంలోని యూనిస్ ప్రజాతికి చెందినవి. ఈ పురుగులు సగటున సుమారు 2.5 సెంటీ మీటర్ల వెడల్పుతో, ఒక మీటరు పొడవుంటాయి. అయితే ఒక్కోసారి ఇవి అరుదుగా పది అడుగుల (3 మీటర్లు) మించి కూడా పెరుగుతాయి. అనెలిడా వర్గానికి చెందిన అతి పొడవైన జీవులలో ఇవి కూడా ఒకటి. వీటి దేహం ఉంగరాల వంటి ఖండితాలతో ఉంటుంది. అనేక ఖండిత భాగాల సమూహంగా వున్న దీని దేహాన్ని చూస్తే పొడుగాటి శతపాదు (centipede) గుర్తుకు వస్తుంది. ఇవి రాత్రి పూట చాలా చురుకుగా ఉంటాయి. చర్మం ద్వారా గాలిని పీల్చుకొంటాయి. తల స్పష్టంగా ఉంటుంది. తలపై రెండు కళ్ళు, దీని నోటి చుట్టూ ఐదు టెంటకిల్స్ వుంటాయి. ఐదు టెంటకిల్స్ కలిగి వుండటమనేది ఈ జాతుల ప్రత్యేక లక్షణం. తనకు సామీప్యంలో ఎర (ఆహారం) వచ్చిందన్న విషయాన్ని గ్రహించడానికి ఈ టెంటకిల్స్, యాంటెన్నాలుగా ఉపయోగపడతాయి.దీని నోటిలో ఒక జత దవడలు, నాలుగు నుండి ఆరు జతల మాక్సిల్లా (Maxillae) ఉంటాయి. దీని పదునైన దంతాలు ఆహారపు వేటలో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా టెంటకిల్స్ లతోను, పదునైన దవడల తోను వున్న దీని తల భాగం లేదా నోరు చూడడానికి భయంకరంగా ఉంటుంది. అయితే ఇవి బాగా పిరికివి కూడాను. శత్రువులను చూడగానే బొరియలలో, రాళ్ళ మాటున దాక్కుంటాయి. ఇవి ముదురు గోధుమ రంగులలోను లేదా బంగారపు ఎరుపు (golden red) రంగులలో ఉంటాయి. మరికొన్ని ప్రత్యేకమైన ముదురు ఊదా రంగు (dark purple brown) లో ఉంటాయి. దీని శరీర ఉపరితలానికి గల ప్రత్యేక నిర్మాణం వల్ల, దీని దేహంపై పడిన కాంతి, ఇది వున్న స్థానాన్ని బట్టి ఇంద్రధనస్సులోని రంగుల్లా మారిపోతుంది. తల నుండి క్రిందిగా చూసినపుడు వీటి నాలుగవ ఖండిత దేహ భాగం చుట్టూ ఒక తెల్లటి రింగు విశిష్టంగా కనిపిస్తుంది. ఇది ఈ జీవుల మరొక లక్షణం. ఇది సుమారు 8 నుండి 12 సంవత్సరాల వరకు జీవిస్తాయని ఒక అంచనా.
ఆహారం
మార్చుఈ కుటుంబం లోని ఇతర జీవులన్నీ దాదాపుగా మాంసాహారులుగా ఉన్నప్పటికీ, బాబిట్ పురుగు మాత్రం సర్వ భక్షక జీవిగా (Omnivorous) ఉంటుంది. ఇది తనకు ఆహారంగా చిన్న చేపలు, ఆక్టోపస్, స్క్విడ్స్, క్రస్టేషియన్లు (Crustaceans) లాంటి జీవులతో పాటు సముద్రపు కలుపుమొక్కలను, ఇతర సముద్రపు మొక్కలను కూడా స్వీకరిస్తుంది. ఆహారకొరత ఎక్కువగా వున్న సమయంలో దాని బొరియ ఉపరితలం చుట్టూ వున్న చిన్న చిన్న ఆహార తునకలను సైతం స్వీకరించి పరిసరాలను శుభ్రం చేస్తుంది. చేపలతో కటిల్ ఫిష్, లయన్ ఫిష్, స్టోన్ ఫిష్ మొదలగు జాతులను వేటాడి తింటుంది.
ఆహారపు వేట
మార్చుబాబిట్ పురుగు తన ఆహారం కోసం, పరిమాణంలో తనకన్నా పెద్దవైన జీవులను సైతం విలక్షణంగా వేటాడుతుంది. ఇసుకనేలలో పొంచివుండి హఠాత్తుగా దాడి చేస్తుంది కనుక దీనిని సాండ్ స్ట్రైకర్ (sand striker) అని కూడా పిలుస్తారు. ఇది తన ఎర కోసం చాలా నేర్పుగా మాటు వేసి, సహనంగా వేచి చూస్తూ అదను రాగానే ఎరపై ఆకస్మీకంగా దాడి చేస్తుంది. ఈ ఆకస్మిక దాడికి, దీని శక్తివంతమైన దంతాల తాకిడి కూడా తోడవడం వల్ల, వేట క్రూరంగా ముగుస్తుంది.
వేటకు ముందుగా బాబిట్ పురుగు తన పొడగాటి శరీరాన్ని దాదాపుగా సముద్రపు భూతలం లోపల బొరియలో దాచిపెట్టి, కేవలం తన తలలోని అతి కొద్ది భాగాన్ని మాత్రమే సముద్రపు భూతలం పైకి కనిపించేటట్లు చేస్తుంది. ఎర కోసం సహనంగా వేచి చూస్తూ ఉంటుంది. ఏదైనా ఎర (చేప గాని ఆక్టోపస్ లాంటివి) దీని సమీపంలోకి వఛ్చినపుడు దీని తలలోని ఏంటెన్నాలు ఒక్కసారిగా ఉద్దీపనమవుతాయి. ఎర సమీపించినదని గ్రహించిన వెంటనే, ఇది బొరియ నుండి ఒక్కసారిగా ముందుకు పొడుచుకొని వచ్చి మెరుపువేగంతో చలించి తన పదునైన దంతాల సాయంతో ఒక్క అదాటున ఆ ఎరపై క్రూరంగా దాడి చేస్తుంది. ఒకొక్కసారి ఈ మెరుపు దాడిలో దీని పదునైన దంతాలు ఎరను రెండు ముక్కలుగా కత్తిరించివేయడం కూడా జరగవచ్చు. ఆహారం దొరకపుచ్చుకొన్న బాబిట్ పురుగు, దానిని ఆరగించడానికి అంతే వేగంతో క్షణాలలో తిరిగి తన బొరియ లోనికి వెళ్ళిపోతుంది. తన శరీరకుహరం లోకి ప్రవేశించిన ఎరలోనికి ఇది విషాన్ని (Toxic) చొప్పించడంవల్ల, ఆ ఎర వెంటనే అచేతనం కావడం కానీ, చనిపోవడం గాని సంభవిస్తుంది. ఈ విధంగా తన సైజు కన్నా పెద్దవైన జీవులను సైతం సులభంగా తిని జీర్ణం చేసుకోగలుగుతుంది.
ప్రిడేటర్స్
మార్చుబాబిట్ పురుగు స్వయంగా చేపలను వేటాడే జీవి (marine predator) అయినప్పటికి, దీనిని సైతం వేటాడే ప్రిడేటర్స్ ప్రకృతిలో వున్నాయి. ముఖ్యంగా సొర చేపలు, సముద్రపాములు, పెలికాన్ లవంటి సముద్ర పక్షులు తమకు ఆహారంగా బాబిట్ పురుగును వేటాడతాయి. వాటి నుండి తప్పించుకోవడానికి బాబిట్ పురుగు సముద్రపు భూతలం లోని ఇసుక బొరియలలో దాక్కొనడానికి ప్రయత్నిస్తుంటుంది.
ప్రత్యుత్పత్తి
మార్చుబాబిట్ పురుగుల పునరుత్పత్తి గురించిన సమాచారం మనకు అంతగా తెలియదు. కానీ పరిశోధకులు దీని లైంగిక పునరుత్పత్తి, దీని జీవిత తొలిదశలోనే ప్రారంభం అవుతుందని విశ్వసి స్తున్నారు. బహుశా ఈ పురుగులు కేవలం 10 సెంటీమీటర్ల పొడవున్నపుడే పునరుత్పత్తి జరుపుతాయి. ఇవి ఏకలింగ జీవులు. ఆడ మగ పురుగులు వేర్వేరుగా ఉంటాయి. ఈ ఆడ, మగ పురుగులు తమ సంయోగ బీజాలను సముద్రజలాల లోనికి విడుదల చేసినపుడు, అవి ఆ నీటిలోనే ఫలదీకరణం చెంది అభివృద్ధి చెందుతాయి.
అక్వేరియంలలో బాబిట్ పురుగులు
మార్చుప్రకృతిలో సహజ సిద్ధంగా జీవించే బాబిట్ పురుగులు కృత్రిమ పర్యావరణంలో యాదృఛ్చికంగా ప్రవేశించి వుండవచ్చు.[3] 2009 మార్చిలో, ఇంగ్లాండ్ లోని న్యూక్వే (Newquay) పట్టణంలోని బ్లూ రీఫ్ అక్వేరియం లో గల ఒకానొక తొట్టెలో ఈ బాబిట్ పురుగును యాదృఛ్చికంగా కనుగొన్నారు. ఆ అక్వేరియం ట్యాంక్ లోని చేపలు వున్నట్లుండి కనుమరుగు కావడం, మరి కొన్ని టాంగ్ చేపలకు గాయాలు కావడం, ట్యాంక్ లోని పగడపు దిబ్బలు (coral reefs) నాశనమవ్వడం, కొన్ని సందర్భాలలో కోరల్స్ రెండుగా నరికి వేయబడటం మొదలగు సంఘటనలు జరుగుతుండడంతో, దానికి కారణం అంతుపట్టక అక్కడి వర్కర్లు ఆ అక్వేరియం పై అనేక నెలల పాటు నిఘా ఉంచారు. చివరకు ఆ నష్టం, ఆ తొట్టిలో అనుకోకుండా ప్రవేశించిన ఒకానొక బాబిట్ పురుగు వల్ల సంభవించిందని గ్రహించారు. ఆ విధంగా పట్టుబడిన బాబిట్ పురుగును బారి (barry) పేరుతొ వ్యవహరించి[4], చివరకు దానిని ఒక ప్రత్యేకమైన ట్యాంక్ లోనికి మార్చడం జరిగింది.
రిఫరెన్సులు
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Crew, Becky (October 22, 2012). "Eunice aphroditois is rainbow, terrifying". Scientific American. Retrieved 2013-03-13.
- ↑ [1]
- ↑ Schulze, Anja (December 2011). "The Bobbit Worm Dilemma: A Case for DNA". Revista de Biología Tropical. 59 (4): 1463–1474. doi:10.15517/rbt.v59i4.3412. Retrieved 7 September 2013.
- ↑ "Barry the giant sea worm discovered by aquarium staff after mysterious attacks on coral reef". Daily Mail. London. 2009-03-31.