రాజశేఖర విలాసము
రాజశేఖర విలాసము[1] అనే ఈ కావ్యమును కూచిమంచి తిమ్మకవి సా.శ.1705లో వ్రాశాడు. ఇది ఇతని తొలి కావ్యమని పరిగణింపబడుచున్నది. మూడు ఆశ్వాసాల ఈ చిన్ని కావ్యము పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రి చేత పరిష్కరించబడి వావిళ్ల రామస్వామి&సన్స్ చే వావిళ్ల ప్రెస్, మద్రాసులో 1924లో[2] ప్రచురింపబడింది. దీనిలో మొత్తము 541 పద్యాలున్నాయి.
రాజశేఖర విలాసము | |
రాజశేఖర విలాసము | |
కృతికర్త: | కూచిమంచి తిమ్మకవి |
---|---|
అంకితం: | కుక్కుటేశ్వర స్వామి, పిఠాపురం |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పద్య కావ్యము |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | వావిళ్ల రామస్వామి శాస్త్రులు & సన్స్ |
విడుదల: | 1924 |
అంకితముసవరించు
కూచిమంచి తిమ్మకవి పిఠాపురం సంస్థానములో జమీందారుల ఆశ్రయంలో ఉన్ననూ తాను వ్రాసిన అన్ని కావ్యాలను నరాంకితము చేయక పిఠాపురంలో వెలసిన కుక్కుటేశ్వరునికి అంకితం ఇచ్చాడు. ఈ కావ్యములో అంకిత పద్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
కం||పనిబూని తుచ్చభోగంబునకై కొఱ
గాని జనులఁ బొగడుట యెల్లన్
గనుఁగొన నిహపరదూరం, బని తలఁచి
వినిర్మలాంతాంగుండగుచున్.
చం||విను మఖిలేశ మర్త్యులకు వేడుకఁ గావ్య మొసంగి ధాత్రిపై
నొనరగ సౌఖ్యసంపదల నుద్దతులై సుకవీంద్రులుందు రా
ర్యనికరవంద్య నీ విహపరంబుల సౌఖ్యం మొసంగుసామి వం
చును మది నెంచి నీకు సరసుల్ విని మెచ్చఁ బ్రబంధ మిచ్చెదన్.
ఇతివృత్తముసవరించు
సింధుకటక పురాన్ని ఏలుతున్న భల్లాణుడు అనే ప్రభువు శివపూజా తత్పరునిగను, శరణాగత వత్సలునిగను, సత్యవాక్ప్రియుడిగను పేరుగాంచాడు. అతని భార్యలు చల్లాంబిక, మల్లాంబికలు మహా పతివ్రతలు. తన ఐశ్వర్యానికి కారకుడైన శివుని ఒక వ్రతముచేత మెప్పెంచాలని సంకల్పించి భల్లాణుడు ఒకరోజు గురుదర్శనము చేసి వ్రతదీక్షనిమ్మని కోరాడు.శివభక్తులైన జంగమస్వాములకు కామితార్థములిచ్చి, పరమేశ్వరుని అనుగ్రహము పొందడం ఆ వ్రతముయొక్క ఉద్దేశము. ఆ వ్రతము మిక్కిలి కష్టమైనదని, జంగమస్వాములడిగినచో సతీసుతులనైన, కాయము కోసియైన ఇవ్వవలసి వుంటుందని గురువు భల్లాణుడికి తెలుపుతాడు. ఆ వ్రతమెంత కఠినమైనదైనా చేస్తానని చెప్పి ఆశీర్వదించమని భల్లాణుడు గురువును వేడుకొంటాడు. ఆ గురువు రాజును ఆశీర్వదించి విభూతిని ఇచ్చి పంపుతాడు.
భల్లాణుడు రాజధాని చేరి శివపూజ చేసి శంకరునికి ప్రీతి కలిగేటట్లు జంగమస్వాములు ఏఏ పదార్థములడిగినా లేదనక ఇస్తానని శపథము చేసి దేశదేశలలో చాటింపు వేయిస్తాడు. భల్లాణుని ప్రకటన విని జంగమస్వాములు వచ్చి తమ కామితార్ధములను తీర్చుకొన్నారు. రాజు ధర్మమార్గములో, సత్యవర్తనముతో జంగమారాధన చేస్తుంటాడు. భల్లాణుని వ్రతదీక్షను నారదుని ద్వారా విన్న పార్వతీ పరమేశ్వరులు భల్లాణుని పరీక్షించాలని నిర్ణయించుకుని శివుడు సింధు కటకములోని వేశ్యావాటికకు చేరి అక్కడ ఉన్న వేశ్యలందరికీ కోరిన ధనమిచ్చి విటులను ఏర్పాటు చేస్తాడు. తర్వాత జంగమవేషధారియై శివుడు భల్లాణుని చెంతకు వెళ్లి యథావిధి పూజింపబడి, వేశ్యలేనిదే భుజింపలేనని పట్టుపడతాడు. భల్లాణుడు చేయునది లేక వెలయాలును తెప్పించుటకై ప్రయత్నించగా ఆ రోజు మహేశుని మాయచేత ఒక్క వేశ్యకూడా లభించలేదు. వ్రతభంగమౌతుందనే భయముతో భల్లాణుడు భార్య చల్లాంబికను తరుణోపాయం అడుగుతాడు. ఆమె చిరుతొండనంబి మొదలైన భక్తులను శివుడు పరీక్షించిన విధము జ్ఞప్తికి తెచ్చి పతి ఆనతి శిరోధార్యమని పలుకుతుంది. భల్లాణుడు ఆవేదన పడి చివరకు చల్లాంబికను వెలయాలిగా జంగమవిటుని వద్దకు పొమ్మని కోరుతాడు. చల్లాంబిక పతి ఆజ్ఞను శిరసావహించి జంగమవిటుని సమీపిస్తుంది. చల్లాంబిక అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అతడు స్థాణువులా ఉంటాడు. చల్లాంబ ఆశ్చర్యపడి జంగమ విటుని ఆలింగనం చేసుకోబోగా విటుడు ఆమె చేతులలో నెలరోజుల బాలుడిగా మారిపోతాడు. ఆ బాలుని పరమేశ్వరుడిగా భల్లాణుడు గ్రహిస్తాడు. అంతట శివుడు భల్లాణునకు సాక్షాత్కరించి పార్వతీదేవి అంగీకారముతో చల్లాంబికా, మల్లాంబికా సమేతముగా భల్లాణుని కైలాసానికి తీసుకొని పోయి ప్రమథగణములలో ప్రథమునిగా నిలుపుతాడు.
వర్ణనలు, అలంకారాలుసవరించు
ఈ ప్రబంధములో ఈ క్రింది వర్ణనలున్నాయి.
1) సింధుకటక పురవర్ణన, 2) సాగర వర్ణన, 3) కైలాస పర్వతవర్ణన, 4) చంద్రోదయ వర్ణన, 5) సూర్యోదయ వర్ణన, 6) షడృతు వర్ణనలు, 7) ద్యూత వర్ణన, 8) గజవర్ణన, 9) అశ్వవర్ణన, 10) రాజవర్ణన, 11) రాజ్ఞీ వర్ణన, 12) అరణ్య వర్ణన, 13) కళా చిత్రలేఖన వర్ణన, 14) కాసార వర్ణన, 15) మన్మథవర్ణన, 16) జంగమ వర్ణన, 17) కుహనాజంగమ వర్ణన, 18) జాలరి కాంత వర్ణన, 19) శివపూజావిధాన వర్ణన, 20) సభావర్ణన, 21) వారవనితా వర్ణన, 22) వేశ్యమాతా వర్ణన, 23) రాజనింద వర్ణన, 24) రాణి పతిభక్తి వర్ణన మొదలైనవి. ఈ కావ్యములో ఉత్ప్రేక్షాలంకారము, శ్లేషాలంకారములు ఉన్నాయి.
రసముసవరించు
ఈ కావ్యములో దాన రసము, భక్తి రసము, ధర్మ రసము, వీర రసములు ప్రధాన రసములు. అద్భుత రసము అంగరసము.
కొన్ని పద్యాలుసవరించు
చం|| అరయఁగ నప్పురిం గనకహర్మ్యతలంబులఁ గేళిసల్పు సుం
దరుల యొయూరముల్‌గని ముదంబున నచ్చరలెల్ల మెచ్చి భా
సురగతిఁ గాన్కలంపిన ప్రసూనపు దండలనంగ నెల్లెడల
దఱచుగ రత్నతోరణ కదంబములందముమీఱు నెప్పుడున్ (1వ ఆశ్వాసము -42వ పద్యము)
చం|| మరకత రత్న సంఘటితమానిత కుడ్య కదంబజాలా కాం
తరములనుండి వేవెడలు తద్ఘనదారపు ధూపధూమముల్
పరువడిఁజూచి నీలఘన పంక్తులటంచు నటించు నెంతయున్
గుఱుతుగ మేదినీస్థలిని గోర్కెలచే శిఖినీసమూహముల్ (1ఆ -45ప)
చం|| సకల జగంబులన్మనుచు స్వామికి నీకు విసంబసఁగెనే
ప్రకటిత లీలనుచు నల పాల్కడలిన్నిరశించి లేఁ బురాం
తకునకుఁ గాన్కలియ్యగ ముదంబునఁ బట్టు సుధాసముత్కరం
బొకోయన నొప్పు ఫేనతతి బాగుగ సజ్జలరాశి నెంతయున్ (2ఆ-84ప)
సీ|| కామాంధకారినై కడకతో నీరాకఁ
గాంచుచుండఁగ మూఁడు కన్నులయ్యెఁ
దలయేఱు బరువయ్యెఁ దగమేను
సగమయ్యె గళమూలమునఁ గందు నిలుకడయ్యె
వల నొప్పమును పట్టి వగఁదప్పె
వలపును విరిగెను నడురేయి సరవినయ్యె
నాకేటికీవేశ్య నీకేటి నిజభక్తి
బూటకంబుల చేతఁ బ్రొద్దుగడిపి
గీ|| నాడ వింతియ కాక భూనాథులెచట
వ్రతములెచ్చట ఘనశైవ మతములెచట
నెందుఁగొరగాని పొలతుక నిటులఁదెచ్చి
యందు కొమ్మను వారెందునైన గలరె (3ఆ-155ప)