రాజా రామేశ్వర్ రావు 1

రాజా రామేశ్వర్ రావు 1 ( -1866) సంస్థానాధీశుడు, పరిపాలనదక్షుడు, సంస్కర్త. ఆయన వనపర్తి సంస్థానాధీశునిగా పలు సంస్కరణలకు నాంది పలికారు. నిజాం సైన్యంలో కూడా ఆయన ప్రధానమైన పదవులు స్వీకరించారు.

కుటుంబ నేపథ్యం మార్చు

18వ శతాబ్ది అంతంలో వనపర్తి సంస్థానాధీశుడైన రాజా రామకృష్ణరావుకు రామేశ్వర్ రావు దత్తుడు.

పరిపాలన మార్చు

దత్తత స్వీకరించిన తండ్రి రామకృష్ణరావు 1823లో మరణించగా రామేశ్వర్ రావు సంస్థానాధీశునిగా పరిపాలన వహించారు. ఆయన పరిపాలన కాలంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కందనూరు నవాబు పాలనలో ఉన్న ఆయన దక్షిణ సరిహద్దు 1830లో నవాబు కుట్ర భగ్నమై కంపెనీ పాలన క్రిందకు వచ్చింది. 1857లో ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా విఖ్యాతి చెందిన సిపాయిల తిరుగుబాటు కారణంగా బ్రిటీష్ ఈస్టిండియా పరిపాలన నుంచి భారతదేశ పాలన నేరుగా బ్రిటీష్ రాణి క్రిందికి వచ్చింది. రామేశ్వర్ రావు సంస్థానం బ్రిటీష్ ఇండియా సరిహద్దుల్లో ఉండడం వల్ల బ్రిటీష్ ఇండియాలో జరుగుతున్న మార్పులను అర్థంచేసుకునే వీలు ఆయనకు దొరికింది. ఈ ప్రభావం పడిన రామేశ్వర్ రావు బ్రిటీష్ ఇండియాలోని పాలనాపద్ధతులను తనకు తోచిన విధంగా అవలంబించారు. బ్రిటీష్ ఇండియాలో అదే సమయంలో బెంగాల్ పునరుజ్జీవనోద్యమ ప్రభావంతో సాగుతున్న ఆలోచనలు కూడా వీరిపై ప్రభావం చూపడంతో వాటిలో కొన్నిటిని తన సంస్థానంలో ప్రవేశపెట్టారు.[1]

సైన్యశక్తి మార్చు

రాజా రామేశ్వర్ రావు 1 సైన్యాన్ని అభివృద్ధి చేయడం, దానిని నడపడంలో చాకచక్యాన్ని కనబరిచారు. నిజాము తన సైన్యానికి రాజా రామేశ్వర రావును ఇన్స్పెక్టర్‌గా నియమించాడు. రాజా రామేశ్వర రావు I, హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించాడు. 1866లో ఆయన మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి ఆ సైన్యానికి కేంద్రబిందువు అయ్యింది. రామేశ్వర్ రావు కాలంలో ఈ సంస్థానంలోని గ్రామాలను పరిపాలనకేంద్రమైన వనపర్తిని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతపు రాజకీయ ఆర్థిక వ్యవహారాల గురించి ప్రస్తావించారు. ఆయన హైదరాబాద్ రాజ్యంలో అనేకమైన జమీందార్లున్నారని, వనపర్తి వంటి ముఖ్యమైన ప్రాంతాల జమీందారులు క్లుప్తమైన రూకలు కట్టి సకల రాజతంత్రములున్ను తమ తమ జమీందారిలో స్వతంత్రముగా జరిపించు చున్నారని వ్రాశారు. సేనాసహాయ సంపద కలిగిన జమీన్‌దారులు ఆ కొద్ది డబ్బు కూడా జమకట్టకపోతూంటే, హైదరాబాదు నవాబు ససైన్యంగా వారిని గెలిచి డబ్బు స్వీకరిస్తున్నాడన్నారు. 1830లో ఆయన వనపర్తిని సందర్శించే సమయానికి వనపర్తి సంస్థానానికి, కొల్లాపూర్ సంస్థానానికి నడుమ వివాదం సాగుతోందని వ్రాశారు. జమీందార్లకు సరిపడనప్పుడు ఒకరికొకరు సైన్యసహితంగా హాని కలిగించుకోవడమే కాక, ఒకరి గ్రామాలను మరొకరు కొల్లగొట్టి, గ్రామస్తులను హింసించి, గ్రామాలను పాడుచేయడమూ కలదని వ్రాశారు.[2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. K, Sukhender Reddy; Bh, Sivasankaranarayana. Andhra Pradesh District Gazetteers (12 ed.). p. 40. Retrieved 28 November 2014.
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.