ఆచార్య రుక్నుద్దిన్ తెలుగు కవి, రచయిత, ఉద్యమకారుడు, పరిశోధకుడు. అతను 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ విప్లవ ఢంకా మోగించిన వ్యక్తి. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించాడు. కవిగా అక్షరాలను సంధించడమే గాకుండా, మహబూబ్‌నగర్‌ జిల్లా అంతటా తిరిగి తన మాటాలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసాడు.

రుక్నుద్దిన్

జీవిత విశేషాలు

మార్చు

అతను 1947లో కల్వకుర్తి తాలూకా రాచూరులో చాంద్‌బీ, జహంగీర్‌ దంపతులకు జన్మించాడు. రుక్నుద్దిన్‌ విద్యార్థి దశలో అత్యంత పేదరికం అనుభవించాడు. ఆకలి, కసి, తెలంగాణపై సీమాంధ్రుల ఆధిపత్యం ఆయన్ని పోరాట కవిగా తర్చిదిద్దింది. విద్యార్థిగా ఉన్నప్పుడే గుళ్ళు, చెరువు గట్లమీద శాసనాలను సేకరించి పరిశోధన చేసేవాడు. అలాగే 1984లో తెలుగులో జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన చేసాడు. తండ్రి, అన్న కమ్మరి పనిచేసి రుక్నుద్దిన్‌ని చదివించారు. దానికి తగ్గట్టుగానే చదువులో పాలెం కళాశాల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి స్థానాల్లో నిలిచాడు. మొదట తెలుగు పండితుడిగా టీచర్‌ ఉద్యోగంలో చేరిన రుక్నుద్దిన్‌ పోల్కంపల్లి, మాసపేట తదితర గ్రామాల్లో పనిచేశాడు. అనంతరం 1976లో జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికై జడ్చర్ల, మఖ్తల్‌, కల్వకుర్తి, భువనగిరి తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. సంస్కృతంలో కూడా ఎం. ఎ చేసిన రుక్నుద్దిన్‌ 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అసిస్టెంట్‌ రీడర్‌గా జాయినై ఎందరో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచాడు. తాను జూనియర్‌ కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకు తలలో నాలుకలా ఉండడమే గాకుండా వారికి అన్నివిధాల సహాయ సహకారాలందించే వారు. అతనికి అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌లు ఆయన కార్యక్షేత్రాలుగా ఉండేవి. పాలెం ఓరియంటల్‌ కళాశాలలో బిఓఎల్‌ చదువుతూ గురువు శ్రీరంగాచార్య ప్రోత్సాహంతో ఉద్యమ కవిత్వాన్ని, కరపత్రాల్ని రాసాడు. మిత్రుడు, క్లాస్‌మేట్‌, రూమ్‌మేట్‌ కూడా అయిన జి.యాదగిరితో కలిసి కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొచ్చిండు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్న దశలోనే అప్పుచేసి ‘విప్లవ ఢంకా' పేరుతో కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొచాడు.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

రుక్నుద్దిన్‌కు ఇద్దరు కుమారులు, ఒక్క కూతురు. కొడుకు మతాంతర వివాహాన్ని కూడా ఆయన ఆహ్వానించాడు. రుక్నుద్దిన్ గుజరాత్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు గాలిబ్‌ వద్ద 2013 మే 27న కన్నుమూశాడు.

మూలాలు

మార్చు
  1. "తెలంగాణ పోరాట కవి రుక్నుద్దిన్‌".