రుక్మాబాయి రావత్

రుక్మాబాయి రావత్ (నవంబర్ 22, 1864 - సెప్టెంబర్ 25, 1955) బ్రిటీష్ ఇండియాలో తొలి మహిళా వైద్యులలో ఒకరు.[1] కాదంబినీ గంగూలీ, ఆనందీబాయి జోషిలు 1886లో వైద్యశాస్త్రంలో డిగ్రీ పొందిన తొలి భారతీయ మహిళలు కాగా కాదంబినీ గంగూలీ మాత్రం ప్రాక్టీసు చేపట్టింది. తద్వారా రుక్మాబాయి వైద్యవృత్తిని అవలంబించిన రెండవ మహిళగా పేరు పొందింది.[2]

రుక్మాబాయి రావత్
జననం(1864-11-22)1864 నవంబరు 22
మరణం1955 సెప్టెంబరు 25(1955-09-25) (వయసు 90)
వృత్తివైద్యురాలు, స్త్రీ జనోద్ధరణ

చారిత్రాత్మకమైన "ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం 1891" ఏర్పడటానికి రుక్మాబాయి ముఖ్య కారణం.

జీవిత విశేషాలు

మార్చు

ఈమె మహారాష్ట్రకు చెందిన ఒక వడ్రంగి కుటుంబంలో జనార్ధన్ పాండురంగ్, జయంతిబాయి దంపతులకు జన్మించింది.రుక్మాబాయికి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి మరణించాడు. జయంతి బాయి తన ఆస్తినంతటిని రుక్మాబాయి పేరుమీదకు బదలాయించింది. ఆమెకు 11 యేళ్ల వయసులో తల్లి ఆమెను 19 యేళ్ల దాదాజి భికాజీకి ఇచ్చి వివాహం జరిపించింది. జయంతిబాయి డా.సఖారాం అర్జున్ అనే అతడిని వివాహం చేసుకుంది. కానీ రుక్మాబాయి వారితోపాటు జీవిస్తూ ఫ్రీ మిషన్ చర్చ్ లైబ్రరీ పుస్తకాలను చదువుతూ విద్యను గడించింది. రుక్మాబాయి, ఆమె తల్లి ప్రార్థనా సమాజం, ఆర్య మహిళా సమాజం సభలకు వారం వారం హాజరయ్యేవారు. [3] దాదాజి తల్లి మరణించిన తర్వాత అతడు తన మేనమామ వద్ద పెరిగాడు. అక్కడ వాతావరణం కారణంగా దాదాజీ సోమరిపోతుగా, దుష్టుడిగా తయారయ్యాడు. రుక్మాబాయి తన 12వ యేట తన భర్త దాదాజీ వద్దకు వెళ్లడానికి తిరస్కరించింది. ఆమె పెంపుడు తండ్రి డా.సఖారాం అర్జున్ ఆమె నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు. దానితో దాదాజీ కోర్టును ఆశ్రయించాడు. పేనీ, గిల్బర్ట్, సయానీ మొదలైన వకీళ్ల ద్వారా రుక్మాబాయి దాదాజీతో కలిసి జీవించక పోవడానికి కల కారణాలను కోర్టుకు తెలిపింది.[4]

కోర్టు కేసులు అనంతర పరిణామాలు

మార్చు

"వివాహ హక్కుల పుర్వస్థితి" ని కోరుతూ కోర్టులో దాదాజీ భికాజీ వేసిన భికాజి వర్సస్ రుక్మాబాయి కేసుపై 1885లో రాబర్ట్ హిల్ పిన్హే అనే న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ వివాహ హకులపై పూర్వపు ఇంగ్లీషు తీర్పులు ఇక్కడ వర్తించవని, ఎందుకంటే అవి పరిణతి చెందిన వయోజనులకు ఉద్దేశించినవని, ప్రస్తుత కేసులో రుక్మాబాయికి నిస్సహాయ స్థితిలో బాల్యంలో వివాహం అయ్యిందనీ, ఇటువంటి కేసులపై ఇంతకు ముందు హిందూ చట్టాలలో తీర్పు వెలువడలేదని పేర్కొంటూ కేసును కొట్టివేశాడు. 1886లో ఈ కేసు పునర్విచారణకు వచ్చినప్పుడు జె.డి.ఇన్వెరారిటి, తెలాంగ్ మొదలైన లాయర్లు రుక్మాబాయి పక్షాన వాదించారు. ఈ కేసుపై సమాజంలో రుక్మాబాయిని సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ అనేక చర్చలు జరిగాయి. కొందరు హిందువులు చట్టం హిందూ ఆచార వ్యవహారాలను గౌరవించడం లేదని ఆందోళనకు దిగారు.[5] పిన్హే తీర్పుపై నేటివ్ ఒపీనియన్, మరాఠా అనే పత్రికలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ దాదాజీ పక్షాన నిలిచాయి. ఈ సమయంలోనే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక భారతీయ మహిళ అనే కలం పేరుతో వరుసగా రుక్మాబాయి వ్రాసిన వ్యాసాలు ప్రజలలో కదలికను తెచ్చింది. ఈ కేసులో 1887, మార్చి 4వ తేదీన జస్టీస్ ఫరాన్ తీర్పు చెబుతూ రుక్మాబాయిని భర్తతో కలిసి ఉండాలని లేదా 6 నెలలు కారాగారంలో ఉండాలని ఆదేశించాడు. రుక్మాబాయి ధైర్యంగా ఈ తీర్పును అంగీకరించేకంటే గరిష్టంగా శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని బదులు ఇచ్చింది.[6] బాలగంగాధర్ తిలక్ తన "కేసరి" పత్రికలో రుక్మాబాయి తిరుగుబాటు ఇంగ్లీషు చదువుల ప్రభావమని పేర్కొన్నాడు. హిందూమతం ప్రమాదంలో పడిపోయిందని వ్యాఖ్యానించాడు. [3] మాక్స్ ముల్లర్ ఈ విషయంలో తన అభిప్రాయం చెప్తూ ఈ సమస్యకు న్యాయపరమైన తీర్పులు సమాధానం కాజాలవని, రుక్మాబాయి విద్యాబుద్ధులే ఆమెను ఆమె కోరిన రీతిలో తీర్పు చెప్పే న్యాయాధికారిగా మారుస్తుందని అభిప్రాయపడ్డాడు.[7]

1888లో దాదాజీతో 2000 రూపాయలు చెల్లించి తెగతెంపులు చేసుకునే విధంగా అంగీకారం కుదిరింది. ఆ తరువాత రుక్మాబాయి ఇంగ్లాండులో చదువుకోవడానికి బయలుదేరింది.[8]

వైద్యవృత్తి

మార్చు

కామా హాస్పెటల్‌కు చెందిన డా.ఎడిత్ పెచె రుక్మాబాయిని చదువుకోవడానికి ప్రోత్సహించాడు. కావలసిన ధనాన్ని సమకూర్చాడు.[9]ఈమె 1889లో ఇంగ్లాండు వెళ్లి అక్కడి "లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ వుమెన్"లో విద్యనభ్యసించింది. అక్కడ ఈమె చదువుకు పలువురు ఆర్థికంగా అండగా నిలిచారు.[10]1918లో ఈమె వుమెన్స్ మెడికల్ సర్వీస్‌లో చేరే అవకాశాన్ని తిరస్కరించి రాజ్‌కోట్ లోని స్టేట్ హాస్పిటల్ ఫర్ వుమెన్‌లో చేరింది. ఈమె ముఖ్య వైద్య అధికారిణిగా 35 సంవత్సరాలు పని చేసి బొంబాయిలో 1930లో పదవీవిరమణ చేసింది.[9]తరువాత కూడా ఈమె సంఘసంస్కరణను కొనసాగించింది. "పరదా, దాని నిషేదానికి ఆవశ్యకత" అనే కరపత్రాన్ని ప్రచురించింది.[11][12]

విశేషాలు

మార్చు
  • 2016లో ఈమె జీవితచరిత్ర ఆధారంగా "రుక్మాబాయి భీమరావ్ రావత్" అనే మరాఠీ సినిమా వెలువడింది. అనంత్ మహదేవన్ ఈ సినిమా దర్శకుడు కాగా తనిషా చటర్జీ ముఖ్యభూమికను నిర్వహించింది.[13][14]
  • 2017 నవంబర్ 22 న గూగుల్ రుక్మాబాయి 153వ జయంతి సందర్భంగా ఆమెను గూగుల్ డూడుల్ ద్వారా స్మరించుకుంది.[15]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Google dedicates doodle to Rukhmabai Raut, India's first female practising doctor". The Economic Times. 2017-11-22. Archived from the original on 2017-12-01. Retrieved 2017-11-22.
  2. Jovita Aranha. "The Phenomenal Story of Kadambini: One of India's First Women Graduates & Doctors". Retrieved November 22, 2017.
  3. Chandra, Sudhir (2008). "Rukhmabai and Her Case". In Chandra, Sudhir (ed.). Enslaved Daughters. Oxford University Press. doi:10.1093/acprof:oso/9780195695731.003.0001.
  4. Lahiri, Shompa (2013-10-18). Indians in Britain: Anglo-Indian Encounters, Race and Identity, 1880-1930. Routledge. pp. 13–. ISBN 9781135264468. Retrieved 4 March 2014.
  5. Chandra, Sudhir (1996). "Rukhmabai: Debate over Woman's Right to Her Person". Economic and Political Weekly. 31 (44): 2937–2947. JSTOR 4404742.
  6. Robb, George; Erber, Nancy (1999). Disorder in the Court: Trials and Sexual Conflict at the Turn of the Century. Springer. pp. 42–44.
  7. Chandra, Sudhir (1992). "Whose laws?: Notes on a legitimising myth of the colonial Indian state". Studies in History. 8 (2): 187. doi:10.1177/025764309200800203.
  8. 9.0 9.1 Jayawardena, Kamari (2014). White Women's Other Burden: Western Women and South Asia during British Rule. Routledge.
  9. "Latest Telegrams". The Express and Telegraph. 21 January 1888. p. 2.
  10. Rappaport, Helen (2001). Encyclopedia of Women Social Reformers. Volume I. ABC-Clio. pp. 598–600.
  11. Sorabji, Richard (2010-06-15). Opening Doors: The Untold Story of Cornelia Sorabji, Reformer, Lawyer and Champion of Women's Rights in India. There's a Hospital in Surat named after her. Penguin Books India. p. 32. ISBN 9781848853751. Retrieved 25 November 2015.
  12. "From a Child Bride to India's First Practising Woman Doctor: The Untold Story of Rukhmabai". The Better India. 22 August 2016. Retrieved 22 November 2017.
  13. Vyavahare, Renuka (28 January 2017). "Tannishtha Chatterjee to play India's first practising lady doctor - Times of India". The Times of India.
  14. Rukhmabai Raut’s 153rd Birthday - Google - 22 November 2017