ఆనందీబాయి జోషి

మొదటి భారతదేశ పాశ్చాత్య వైద్యురాలు

ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి (మార్చి 31, 1865 - ఫిబ్రవరి 26, 1887) పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886 లో ఆనందీబాయి తర్వాత పట్టాపొందారు.) ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే.[2] అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని 2018 లో గూగుల్ తన డూడుల్ ని పెట్టింది [3]

ఆనందీ గోపాల్ జోషి
ఆనందీ బాయి జోషి సంతకం చేసిన ఆమె దస్త్రం
జననం
యమునా జోషీ

(1865-03-31)1865 మార్చి 31
మరణం1887 ఫిబ్రవరి 26(1887-02-26) (వయసు 21)
వృత్తివైద్యురాలు
జీవిత భాగస్వామిగోపాలరావు జోషి
తల్లిదండ్రులుగణపతిరావు అమృతేశ్వర్ జోషీ, గుణాబాయి జోషీ[1]

తొలినాటి జీవితం

మార్చు

ఆనందీబాయి పూణే (మహారాష్ట్ర) లోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమెకు తల్లితండ్రులు యమున అని పేరు పెట్టారు. 9 సంవత్సరాల వయసులో దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషిని వివాహం చేసుకుంది. వివాహం తరువాత, ఆమె భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. గోపాల్ రావు, కళ్యాణ్ లో తపాలా గుమాస్తాగా పనిచేసేవారు. తరువాత, అతను అలీభాగ్, చివరకు కలకత్తా బదిలీ అయ్యారు. గోపాల్ రావు సామాజిక భావాలు కలిగిన వ్యక్తి. అతను మహిళల విద్యకు మద్దతు పలికారు. విద్య అనేది ఆనాటి బ్రహ్మణుల కుటుంబాలలో సర్వసాధారణంగా ఉండేది. లోఖితవాదీ' యొక్క షట్ పత్రేతో ప్రభావితుడై, సంస్కృతం కంటే ఆంగ్ల భాష నేర్చుకోవడం ముఖ్యమని భావించారు. విద్య పట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి, ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారు. 14 సంవత్సరాల వయస్సులో, ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చింది. అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు పది రోజుల్లో చనిపోయాడు. ఈ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపును తీసుకొచ్చింది. తను వైద్యురాలు కావడానికి ప్రేరణనిచ్చింది.[4]

భర్త సహకారంతో వైద్యవృత్తి దిక్కుగా

మార్చు
 
ఆనందీబాయి జోషీ

గోపాలరావు తన భార్య వైద్యశాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించాడు. అనందీబాయి భర్త ఆమెకు అమెరికాలో విశ్వవిద్యాలయం ప్రవేశం కొరకు ప్రయత్నాలు సాగించాడు. 1880 లో, అతను రాయల్ విల్డర్ (ఒక ప్రసిద్ధ అమెరికన్ మిషనరీ) కు వ్రాసిన లేఖలో ఆనందీబాయికి యునైటెడ్ స్టేట్స్‌లో వైద్య అధ్యయనం చేయడానికి గల ఆసక్తిని పేర్కొంటూ, తన కోసం అమెరికాలో సరైన ఉద్యోగానికై విచారించారు. ఇద్దరు ఆలుమగలు క్రైస్తవ మతం స్వీకరిస్తే సహాయం ఇవ్వగలనని విల్డర్ ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదన జోషి జంటకు ఆమోదయోగ్యం కాలేదు. అయితే విల్డర్ ఈ ఉత్తరప్రత్యుత్తరాలను తన సొంత పత్రికైన ప్రిన్స్టన్ మిషనరీ రివ్యూలో ప్రచురించాడు. రొస్సెల్, న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెంటర్ అనే ఆవిడ తన దంత వైద్యుని కోసం ఎదురుచూస్తూ ఆయన కార్యాలయంలో యాధృఛ్ఛికంగా ఈ పత్రికలో ఆనందీబాయి గురించి చదివింది. వైద్యవిద్య చదవాలన్న ఆనందీబాయి తపన, దాన్ని ప్రోత్సహిస్తున్న భర్త యొక్క వృత్తాంతం ఆమెను కదిలించింది. ఆనందీబాయికి ఉత్తరం వ్రాసి తాను ఆనందీబాయి అమెరికాలో ఉండటానికి వసతి సహాయం చేయగలనని ముందుకువచ్చింది. కార్పెంటర్‌కు, ఆనందీబాయికి మధ్య అనేక విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. వారు పరస్పరం సాగించిన ఉత్తరప్రత్యుత్తరాలలో బాల్యవివాహం కారణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఒకటి కావటం విశేషం.

"సెరంపోర్ కాలేజ్" హాలులో ఆనందీబాయి ఉపన్యసించిన సమయంలో తాను వైద్యవిద్యను అభ్యసించడానికి అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటుందో వెల్లడించింది. అనందీబాయి ఆమెభర్త అనుభవించిన హింస గురించి తన ఉపన్యాసంలో వివరించింది. భారతదేశంలో హిందూ మహిళావైద్యురాళ్ల అవసరం గురించి వివరించింది. అలాగే ఆమె భారతదేశంలో మహిళా వైద్య కళాశాల ప్రారంభించడం తన లక్ష్యమని వివరించింది. అయితే తాను క్రైస్తవమతాన్ని స్వీకరించనని మాత్రం వత్తిపలికింది. ఆమె ఉపన్యాసం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. భారతదేశం నలుమూలల నుండి ఆర్థికసహాయం చేస్తామని సందేశాలు అందుకున్నది. ఆమె విద్యకు సహాయంగా అప్పటి భారత వైస్త్రాయి కూడా 200 రూపాయల ఆర్థికసాయం పంపాడు. భర్తకు అమెరికాలో ఉద్యోగం లభించని కారణంగా అనందీబాయి మాత్రం ఒంటరిగా ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళింది. విపరీతమైన వ్యతిరేకతల నడుమ ఆమె 1883 జూన్ మాసంలో వైద్యవిద్యాభ్యాసానికి అమెరికాలో అడుగుపెట్టింది. ప్రజలు ఆమె మీద రాళ్ళు, కాకి పెంట విసరడం వ్యతిరేకతలో పతాకాంశమని చెప్పాచ్చు.

అమెరికాలో

మార్చు

ఆనందీబాయి కలకత్తా నుండి న్యూయార్క్ వరకూ నౌకలో ప్రయాణం చేసారు. ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా ఇద్దరు ఆంగ్ల మహిళలు ఉన్నారు. 1883 జూన్లో న్యూయార్క్‌లో ఈమెను స్వాగతించడానికి కార్పెంటర్ వచ్చింది. అమెరికాలో మిసెస్ కార్పెంటర్ అతిథిగా ఆమె ఇంటికి చేరింది. న్యూయార్క్ లో 1883లో థియోడిసియా కార్పెంటర్ ఆనందీబాయి పోషణ బాధ్యత వహించింది. ఆనందీ, కార్పెంటర్ అత్యంత ఆత్మీయులుగా మారారు. కార్పెంటర్ ఆనందీబాయిని కుమార్తెగా భావించి అభిమానించింది. ఆనందిని చూసి కార్పెంటర్ విస్మయం చెందగా, అమెరికా వైవిధ్యం అనంది గోపాలును విస్మయపరిచాయి.

ఫిలడెల్ఫియా వాసం

మార్చు
 
ఆనందీబాయి జోషి పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల నుండి 1886లో పట్టభద్రురాలయ్యింది. ఈమె సహాధ్యాయినులైన కెయి ఒకామీ (మధ్యన), సబాత్ ఇస్లాంబులీ (కుడివైపు). కెయి ఒకామీ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన తొలి జపాను మహిళ

పెన్సిల్వేనియా మహిళా వైద్యకాలేజీలో వైద్యవిద్యకై ఈమె దరఖాస్తు చేసుకున్నారు[5] మొట్టమొదటి మెడికల్ క్యాంప్ నిర్వహించుచున్న పెన్సిల్వేనియా మెడికల్ కాలేజ్ వారికి ఆమె తనూ పాల్గొనేందుకై ఒక లెటర్ వ్రాసారు. అదే ప్రపంచ మొట్టమొదటి మహిళా మెడికల్ క్యాంప్. (ఇది ప్రపంచంలోనే ఈ తరహా మొదటి కార్యక్రమం). రేచెల్ బాడ్లీ, కాలేజీ డీన్, ఆమెకు ఈ విద్యా కోర్సుకై అర్హతను ఇచ్చారు. ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో ఆమెను వదిలిన కార్పెంటర్ పసిపిల్లలా విలపించడం వారి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. కాలేజీ సెక్రెటరీ, సూపరింటెండెంట్ సుదూరం నుండి విద్యాభ్యాసానికి వచ్చిన ఆనందీ గోపాలును చూసి ప్రభావితమై ఆమెకు అక్కడ ఉన్న 3 సంవత్సరాలు 600 అమెరికన్ డాలర్లను ఉపకారవేతనం ఏర్పాటుచేసింది. 19వ యేట ఆమె తన వైద్య విద్యను ప్రారంభించారు.

అమెరికావాసం ఆరోగ్యసమస్యలు

మార్చు

ఆమె అమెరికాలో ఎదుర్కొన్న ప్రధానసమస్య శీతోష్ణస్థితి. ఆమె 9 గజాల మహారాష్ట్ర సాంప్రదాయ శైలి చీర ధారణ నడుమును, పిక్కలను కప్పలేదు కనుక తీవ్ర అంతర్మథనం తరువాత గుజరాతీ శైలిలో చీరను ధరించాలని నిర్ణయించుకోవటం విశేషమైతే అది ఆమె భర్తకు తెలియజేయకూడదని నిర్ణయించడం మరొక ప్రత్యేకత. అయినా ఆమెకు కాలేజి వారు ఏర్పాటు చేసిన గదిలో సరైన "ఫైర్‌ ప్లేస్" లేనందున ఫైర్‌ ప్లేస్ నుండి అత్యధికంగా పొగరావడం వలన ఆమెకు చలి కాని లేక పొగ కాని భరించవలసిన పరిస్థితి ఎదురైంది. రెండు సంవత్సరాల అమెరికా వాసం తరువాత ఆమెకు అపస్మారకం, తీవ్రజ్వరం అధికమైంది. అప్పుడు మొదలైన దగ్గు ఆమెను చివరి వరకు వదిలిపెట్టలేదు.

వైద్యంలో పట్టబధ్రత

మార్చు

ఆమె తీవ్ర ఆరోగ్యసమస్యలతో మూడు సంవత్సరాల ఉన్నతవిద్యాభ్యాసం పూర్తిచేసి ఫైనల్ ఎగ్జాంస్ వ్రాసింది. 1886 మార్చి 11 న ఆమె వైద్య విద్యలో డాక్టరేట్ సాధించింది. ఆమె పరిశోధనాంశం "ఆర్య హిందువులలో స్త్రీ జననాంగ-శిశు సంబంధిత వైద్యం". స్నాతకురాలయిన సందర్భంలో విక్టోరియా మహారాణి ఆమెకు శుభాకాంక్షలతో ఒక సందేశాన్ని పంపింది. ఆమె పట్టభద్రోత్సవంలో ఆమె భర్త కూడా పాల్గొన్నాడు. ఆ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం ఆమెకు మరపురాని అనుభూతిని కలుగజేసిందని ఆమె తన కథనాలలో పేర్కొన్నది. ఆ ఉత్సవంలో పండిత రమాబాయి పాల్గొనడం మరో ప్రత్యేకత. ఆమె ఆరోగ్యం రోజుకు రోజుకు దిగజారడంతో ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెకు క్షయ వ్యాధిగా నిర్ధారించబడింది. అయినా వ్యాధి ఇంకా ఊపిరితిత్తులని చేరలేదు. వైద్యులు ఆమెను భారతదేశానికి తిరిగివెళ్ళమని సలహా ఇచ్చారు. అందుకు ఆమె అంగీకరించింది. కొల్హాపూరు సంస్థానంలో వైద్యురాలిగా పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని స్వీకరించింది.

తిరిగి భారతదేశానికి

మార్చు

భారతదేశానికి తిరుగుప్రయాణం చేసే సమయంలో ఆనందీబాయి ఆరోగ్యం మరింత దిగజారింది. నౌకలో ప్రయాణం చేసే సమయంలో ఆమెకు చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు. వైద్యులు చికిత్సచేడానికి నిరాకరించడానికి కారణం ఆమె " బ్రౌన్ వుమన్ " (సాధారణంగా భారతీయులను బ్రౌన్ ప్రజలు అంటారు ) కావడమే. 1886 చివరిభాగంలో, ఆనందిబాయి భారతదేశానికి తిరిగివచ్చారు. దేశం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. ఆమెను కొల్హాపూర్ సంస్థానానికి చెందిన వైద్యురాలిగా నియమించింది. అల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారిణిగా బాధ్యతలను అప్పగించింది.

కలకత్తా చేరిన తరువాత ఆనందీభాయి బలహీనత, నిరంతర తలనొప్పి, తరచూ జ్వరం, ఆయాసాలతో బాధపడింది. థియోడిసియా ఆమెకు అమెరికా నుండి ఔషధాలను పంపింది. తరువాత ఆమె ఆయుర్వేద చికిత్స కొరకు కజిన్ ఇంట్లో బసచేసింది. ఆయుర్వేద వైద్యనిపుణుడు ఆమె నౌకాయానం చేసి విదేశాలకు వెళ్ళి సంప్రదాయ సరిహద్దులు దాటినందుకు ఆమెకు చికిత్సచేయడానికి నిరాకరించాడు. భారతదేశానికి తిరిగివచ్చిన ఒక్క సంవత్సరంలోపుగానే ఆమె ఫిబ్రవరి 26, 1887 తేదీన 22 సంవత్సరాల చిరుతప్రాయంలో అకాలమరణం చెందారు. చివరకు ఆమె 1887 ఫిబ్రవరి 26 న ఆనందీభాయి వ్యాధిబాధతో 22 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచింది. ఆనందీబాయి మరణానికి దేశం అంతటా విషాదం ఆవరించింది. ఆనందీబాయి చితాభస్మం థియోడిసియా కార్పెంటర్ కు పంపబడింది. కార్పెంటర్ వాటిని పూకిప్సీ, న్యూయార్క్ లోని తమ కుటుంబ శ్మశానవాటికలో భద్రపరచింది. ఈమె సమాధి శిలాఫలకాన్ని ఈ శ్మశానవాటికలో ఇప్పటికీ చూడవచ్చు.

ఆత్మకథ

మార్చు
  • అమెరికాలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత, సంస్కరణకర్త అయిన కారోలైన్ వెల్స్ హీలీ డాల్ 1888లోనే ఆనందీబాయి ఆత్మకథను వ్రాసింది.[6]
  • దూరదర్శన్ ఆనందీబాయి జీవితమును ఆధారముగా చేసుకొని తీసిన ధారావాహిక "ఆనందీ గోపాల్"ను ప్రసారం చేసింది. ఈ ధారావాహికకు కమలాకర్ సారంగ్ దర్శకత్వం వహించారు.
  • శ్రీకృష్ణ జనార్ధన జోశీ తన మరాఠీ నవల "ఆనందీ గోపాల్"లో ఆనందీబాయి జీవితంలోని కొన్ని ఘటనలను పొందుపరిచారు (ఈ నవల ఆషా దామ్లే ద్వారా ఆంగ్లంలోకి అనువాదమయి సంక్షేప రూపం పొందింది). అదే పేరుతో రాం జీ జోగ్లేకర్ ఒక నాటకాన్ని రూపొందించారు.

స్త్రీవాదం

మార్చు

ఆనందీభాయికి తన 15వ సంవత్సరంలో ఇలాంటి అభ్యుదయభావాలు ఎలా అలవడినాయి అన్న విషయం ఆమె మిసెస్ కార్పెంటరుకు వ్రాసిన ఉత్తరాలు వెలువరించాయి. ఆ రోజులలో ఆమె వెలువరచిన అభిప్రాయాలు ఇప్పటికీ స్త్రీవాదులచేత పరిశీలించబడుతున్నాయి. స్త్రీవాద రచయితలైన తారాబాయి వ్రాసిన " స్త్రీ పురుష తులన ", పండిత రమాబాయి వ్రాసిన " స్త్రీ ధర్మ నీతి", రఖ్మబాయి వ్రాసిన " ది హిందూ లేడీ " వంటి పుస్తకాలలో ఆనందీబాయి వృత్తాంతం ప్రస్తావించబడింది. ఆనందీబాయి 15 సంవత్సరాల ప్రాయంలో ఆమెకు ఆలోచనా సరళిలో ఇలాంటి మార్పులు రావడం పలువురిని విస్మయపరచింది. ఆనందీబాయి ప్రయత్నాలు నిష్ఫలం కాలేదు. ప్రస్తుతం ఆధునిక స్త్రీ అభ్యుదయ ప్రయాణంలో ఆనందీబాయి భావాలు ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎవరి స్వప్నాలు సాధించలేనివి కాకూడదు. ప్రతి ఒక్కరు వారి కలలను నిజంచేసుకునే శక్తివంతులు కావాలి అన్న ఆనందీబాయి ఆశయాలు ఇప్పటికీ గౌరవించబడుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం స్త్రీ ఆరోగ్యసంరక్షణ కొరకు పాటుపడిన యువతులకు " ఫెలో షిప్పులు " అందిస్తుంది.

వారసత్వం

మార్చు

లక్నో లోని ఒక ప్రభుత్వేతర సంస్థ " ఇన్స్టిట్యూట్ పరిశోధన , సాంఘికశాస్త్రంలో డాక్యుమెంటేషన్ (IRDS), కోసం, నుండి భారతదేశంలో మెడికల్ సైన్సెస్ కారణం వైద్యరంగంలో ఆమె ప్రారంభ రచనలకు గౌరవం ఇస్తూ " ఆనందీభాయి జోషి అవార్డు " ప్రదానం చేసింది.

మూలాలు

మార్చు
  1. The Life of Dr. Anandabai Joshee - Caroline Healey Dall
  2. Eron, Carol (1979). "Women in Medicine and Health Care". In O'Neill, Lois Decker (ed.). The Women's Book of World Records and Achievements. Anchor Press. p. 204. ISBN 0-385-12733-2. First Hindu Woman Doctor
  3. "Historical Photos Depict Women Medical Pioneers". Public Radio International. 2013-07-12. Retrieved 2013-10-29.
  4. లీలావతి కూతుళ్లు శృంఖలలో అనందీబాయిపై పూజా ఠక్కర్ వ్రాసిన వ్యాసం
  5. యొక్క స్కాను Archived 2016-03-04 at the Wayback Machine ఆల్ఫ్రెడ్ జోన్స్ కు ఆనందీబాయి లేఖ, జూన్ 28, 1883; DUCOM Archives
  6. The Life of Dr. Anandabai Joshee: A kinswoman of The Pandita Ramabai- Caroline Healey Dall రాబర్ట్స్ బ్రదర్స్, బోస్టన్ ద్వారా ప్రచురితం

బయటి లంకెలు

మార్చు