రెవెన్యూ గ్రామం

భారత దేశంలో మండలం/తాలూకా/బ్లాకు/సబ్‌డిస్ట్రిక్టు కింద ఉన్న పరిపాలనా ప్రాంతం

రెవెన్యూ గ్రామం, అన్నది భారత పరిపాలన వ్యవస్థలో జనగణన, రెవెన్యూ వంటి రంగాల్లో అతిచిన్న పరిపాలిత విభాగం. బ్రిటీష్ పరిపాలనా కాలంలో రెవెన్యూ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతిచిన్న పరిపాలిత విభాగాలుగా వీటిని రూపకల్పన చేశారు. 2011 నాటికి కూడా జనగణన, రెవెన్యూ వంటి వ్యవస్థలు రెవెన్యూ గ్రామాన్నే మౌలిక యూనిట్‌గా తీసుకున్నారు. ఈ రెవెన్యూ గ్రామాలలో శివారు గ్రామాల పేరుతో పలు ఇతర తరహా గ్రామాలు ఉంటాయి. ఆయా శివారు గ్రామాల్లో పంచాయితీ హోదా ఉన్నవి, లేనివి (తండాలు, చిన్న పల్లెలు) కూడా ఉండవచ్చు. ఒక్కో సందర్భంలో పదుల ఏళ్ళ నాటి రెవెన్యూ గ్రామంలో జనం పలు కారణాలతో చుట్టూ ఉన్న గ్రామాలకు తరలి వెళ్ళిపోగా, అంతర్గతంగా శివారు గ్రామాలు కూడా లేకపోగా, అది నిర్జన గ్రామంగా మిగిలిపోనూ వచ్చు.

చరిత్ర

మార్చు
 
భూవిభజన రేఖలు (సర్వే సంఖ్యలు) తెలిపే కేడెస్ట్రల్ పటం, నర్సాయపాలెం, బాపట్ల మండలం

భారతదేశంలో జనావాసాల శీర్షికలు లేదా పదాలకు నిర్వచనం లేదా నిర్వచనాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా పేర్కొన్నవి.రెవెన్యూ గ్రామం అన్న భావన (కాన్సెప్టు) బ్రిటీష్ పరిపాలన కాలంలో వలస పాలన అధికారులు రూపకల్పన చేశారు. రెవెన్యూ గ్రామం అన్నదాన్ని రూపకల్పన చేసేప్పుడు నివాస ప్రాంతాల శ్రేణిలో అతిచిన్న విభాగంగా చేశారు. అయితే బ్రిటీష్ ప్రభుత్వం రెవెన్యూ గ్రామాన్ని పన్ను వసూళ్ళ అసవరాలకు తగ్గ విధంగా రూపొందించిందే తప్ప ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి వంటి అంశాలకు వీలుగా రూపొందించలేదు.[1] తొలిసారిగా సర్వేజరిపినపుడు, ఒక ప్రాంతంలో వున్న కొన్ని సర్వే సంఖ్యలు కలిసితే ఏర్పడింది రెవెన్యూ గ్రామం. దీని ఉపయోగం భూమి యాజమాన్య నిర్వహణ, శిస్తు వసూలు చేయుటకు. ఆంధ్రప్రదేశ్ లో శిస్తు రద్దుచేయబడిన తరువాత భూమి యాజమాన్య నిర్వహణకు, గ్రామస్థాయినుండి భూమి సంబంధిత గణాంకాలకు ప్రాథమికంగా ఉపయోగపడుతుంది. దీనిలో నివాస సముదాయాలు ఒకటి అంతకన్న ఎక్కువ వుండవచ్చు. స్థానిక పరిపాలన అవసరాలకు జనాభాని బట్టి వీటిని పంచాయితీలుగా విభజించారు.తక్కువ జనాభా కల నివాస సముదాయాలు దగ్గరిలోని పంచాయితీలో కలపబడుతాయి. మండల స్థాయిలో పంచాయితీలు ఏర్పరుచుతారు.

అంతర్గత విభాగాలు

మార్చు
 
ఒక మండలంలోని గ్రామపంచాయితీలు రూపురేఖలు మాదిరి పటం

రెవెన్యూ గ్రామాలు అతిచిన్న విభాగాలని జనగణన పేర్కొంటున్నా, వీటిలో శివారు గ్రామాలు (హామ్లెట్) ఉంటాయి. జనగణనలో శివారు గ్రామాలుగా ప్రస్తావనకు కూడా నోచుకోని ఈ గ్రామాల్లో పంచాయితీ హోదా కలిగిన గ్రామాలు, అవి లేని అచ్చమైన శివారు పల్లెలు, తండాలు కూడా ఉన్నాయి. పంచాయితీ గ్రామాలు మరో వైపు పంచాయితీ వ్యవస్థలోనూ, గ్రామాభివృద్ధి వ్యవస్థలోనూ మౌలిక స్థాయి యూనిట్‌గా ఉంటున్నాయి. జనగణన సమాచారం కోసం రెవెన్యూ గ్రామాలను స్వీకరించడం వల్ల ఈ అంతర్గత వైరుధ్యాలన్నీ జనగణనలో సరిగా ప్రతిబింబించడం లేదన్న విమర్శ ఉంది.[1]

నిర్జన గ్రామాలు

మార్చు

రెవెన్యూ వ్యవస్థను నిర్ణయం చేసిన నాడు ఏర్పడ్డ రెవెన్యూ గ్రామాలు క్రమేపీ దశాబ్దాలు గడిచి వివిధ కారణాల వల్ల ప్రజలు వలసపోవడం వల్ల కొన్నిమార్లు లేకుండా పోవచ్చు.అయితే రెవెన్యూ పరిధికి అవసరమైన పంట పొలాలు, ఇతర ఆదాయ వనరులు అక్కడే ఉండడంతో, రెవెన్యూ వ్యవస్థకు వచ్చిన లోపం లేకపోవడంతో ఆయా గ్రామాలకు రెవెన్యూ గ్రామాల హోదా తీసివేయకుండా ఉంచేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి రెవెన్యూ గ్రామాల్లో జనగణన చేసినప్పుడు జనం లేక నిర్జన గ్రామాలుగా కనిపిస్తున్నాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Ramachandraiah, C. (1995). "Revenue Village vs Real Village: Under-Enumeration and Non-Enumeration under Srisailam Project". Economic and Political Weekly. 30 (37): 2301–2302. Retrieved 24 July 2018.

వెలుపలి లంకెలు

మార్చు