రేఖాచిత్రం
రేఖాచిత్రం (ఆంగ్లం:Drawing) అనునది వివిధ రకాల చిత్రకళకి సంబంధించిన పరికరాలని ఉపయోగించి ద్విపరిమాణపు మాధ్యమం (two dimensional medium) పై చిత్రాన్ని ఏర్పరచే ఒక దృశ్య కళ. గ్రాఫైట్ పెన్సిళ్ళు, కలం, సిరా, కుంచెలు, మైనపు పెన్సిళ్ళు, రంగు పెన్సిళ్ళు, కాల్చిన బొగ్గు, ఇరేజర్లు, మార్కర్లు, స్టైలస్ లు, సిల్వర్ పాయింట్ వంటి ప్రత్యేక లోహాలు వంటి పరికరాలని రేఖాచిత్రాలకి ఉపయోగించటం జరుగుతుంది. రేఖాచిత్రాలని చిత్రీకరించే కళాకారులని ఆంగ్లంలో డ్రాఫ్ట్స్ మెన్ (Draftsman) గా వ్యవహరిస్తారు.
ఒక ఉపరితలం పై కావలసినంత పదార్థాన్ని విడుదల చేయటం వలన ఆ ఉపరితలంపై కంటికి కనబడేలా గుర్తు ఏర్పడుతుంది. ఉపరితలాలుగా అట్ట, ప్లాస్టిక్, తోలు, వస్త్రం, రాత బల్లలు చిత్రలేఖనానికి విరివిగా ఉపయోగించిననూ, కాగితమే చిత్రలేఖనానికి ప్రధానాధారంగా వ్యవహరించింది. మొత్తం మానవ చరిత్రలో రేఖాచిత్ర మాధ్యమం ప్రముఖ, ప్రాథమిక ప్రజాభిప్రాయాన్ని వెలిబుచ్చటానికి ఉపయోగపడినది. ఆలోచనలను, ఉద్దేశ్యాలను, భావాలను వ్యక్తీకరించటానికి రేఖాచిత్రం అత్యంత సరళమైన, సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడినది. కావలసిన పరికరాలు విరివిగా లభ్యమవటంతో రేఖాచిత్రకళ అతి సాధారణ కళల్లో ఒకటిగా అవతరించింది.
అవలోకనం
మార్చురేఖాచిత్రకళ, దృశ్యకళలలో అతి ప్రాముఖ్యత పొందిన వ్యక్తీకరణ రూపం. అనేక గీతలతో బాటుగా వివిధ తీవ్రతలు గల ఛాయలతో కంటికి కనబడే ప్రపంచాన్ని ఒక ఉపరితలంపై ప్రతిబింబజేస్తుంది. సాంప్రదాయిక రేఖాచిత్రకళ ఏకవర్ణంలో గానీ, లేదా చాలా తక్కువగా బహువర్ణాలలో గానీ ఉండగా, ఆధునిక రేఖాచిత్రకళ చిత్రకళకి దీటుగానో లేక రెంటికీ ఉన్న సరిహద్దులని చెరిపేసే విధంగానో ఉంది. పాశ్చాత్య పరిభాషలో రేఖాచిత్రకళకీ, చిత్రకళకీ దాదాపు ఒకే రకమైన పరికరాలు వినియోగించిననూ ఈ పదాల వాడుకలో తేడాలు ఉన్నాయి. పాశ్చాత్య పరిభాష ప్రకారం, రంగులని అద్దకుండా కేవలం గీతలతో వేయబడే చిత్రాలని రేఖాచిత్రంగానూ, రేఖాచిత్రాలకి రంగులని అద్దటం చిత్రకళ గానూ వ్యవహరిస్తారు.
రేఖాచిత్రకళ అన్వేషణాత్మక, పరిశీలనాత్మక, సమస్యాపూరణం చేసే, కూర్పు గల ఒక కళ. రేఖాచిత్రాలు తరచుగా అస్పష్టంగా, చాలా అయోమయంగా ఉంటాయి. వీటిని కళాభ్యాసానికి వినియోగిస్తారు.
రేఖాచిత్రకళలో అనేక వర్గాలు ఉన్నాయి. ఫిగర్ డ్రాయింగ్, కార్టూనింగ్, డూడ్లింగ్, షేడింగ్. రేఖాచిత్రకళలో లైన్ డ్రాయింగ్, స్టిప్లింగ్, షేడింగ్, ట్రేసింగ్ వంటి అనేక పద్ధతులు కూడా ఉన్నాయి.
త్వరగా వేయబడిన, పూర్తి చేయబడని రేఖాచిత్రాన్ని స్కెచ్ (చిత్తు నమూనా) అని వ్యవహరిస్తారు.
కట్టడాలని నిర్మించే ముందు వాటి ప్రణాళికల సాంకేతిక రేఖాచిత్రాల ద్వారా చిత్రీకరిస్తారు.
చరిత్ర
మార్చుభావవ్యక్తీకరణ రూపాలుగా రేఖాచిత్రాలు లిఖితపూర్వక భావ వ్యక్తీకరణకంటే మునుపే రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ ఉంది. కావున భావ వ్యక్తీకరణలో రేఖాచిత్రాలే ప్రాచీనమైనవి. మానవజాతికి వ్రాత తెలియక ముందు రేఖాచిత్రాల ద్వారా భావ వ్యక్తీకరణ ప్రత్యేకమైనదిగా గుర్తించబడింది. 30,000 సంవత్సరాల క్రితమే మానవుడు గుహలలోను, రాతి పై రేఖాచిత్రాలని సృష్టించాడు. పిక్టోగ్రామ్స్ అనబడు ఈ రేఖాచిత్రాలు పలు వస్తువులను, నైరూప్య భావాలను ప్రతిబింబింపజేశాయి. చరిత్రపూర్వ సమయానికి చెందిన ఈ చిత్తునమూనాలు, చిత్రకళని శైలీకృతం, సరళతరం చేయబడటంతోనే ఈ నాటి లిఖితపూర్వక భాషలు అవతరించాయి.
కళలలో రేఖాచిత్రాలు రేఖాచిత్రాలు సృజనాత్మకతకి అద్దం పడటం వలన కళాప్రపంచంలో ఇవి ప్రాముఖ్యతని సంతరించుకొన్నవి. చరిత్రలో అధికభాగం రేఖాచిత్రాలు కళాత్మక ఆచరణకి పునాదులుగా నిలిచాయి. కలపతో చేయబడ్డ పలకలను రేఖాచిత్రకారులు మొదట్లో వాడేవారు. 14వ శతాబ్దంలో కాగితం విరివిగా లభించటంతో దాని వాడకం పెరిగింది. ఈ కాలంలో రేఖాచిత్రాలు ఆలోచనలకి, దర్యాప్తులకి, నటనలో ఉపయోగించేవారు. రేఖాచిత్రాలు కళాత్మకంగా వర్థిల్లుతున్న కాలంలో జ్యామితి, తత్త్వం యొక్క ప్రభావం అధికంగా కలిగిన, వాస్తవిక ప్రాతినిధ్యపు లక్షణాలని ప్రదర్శించే రినైసెన్స్ కళా ఉద్యమం ఉద్భవించింది.
ఫోటోగ్రఫి వినియోగం విస్తారం అవటంతో రేఖాచిత్రాల వాడుకలో మార్పు వచ్చింది.
కళల వెలుపల రేఖాచిత్రాలు రేఖాచిత్రాలు కళామాధ్యమంగా విస్తారంగా వాడబడిననూ, ఇవి కళలకి మాత్రమే పరిమితం కాలేదు. కాగితం విరివిగా లభ్యం కాని కాలమైన 12వ శతాబ్దంలో సాధువులు ఐరోపా ఖండంలో అతి క్లిష్టమైన రేఖాచిత్రాలు జంతువుల చర్మం నుండి తయారు చేయబడే తోలు పై చిత్రీకరించేవారు. విఙాన శాస్త్రంలో, వైఙానిక ఆవిష్కరణలకి, పలు విషయాలని అర్థమయ్యేలా వివరించటానికి ఉపయోగిస్తారు. 1616 లో ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియో గెలీలీ చంద్రుని యొక్క పరిమాణ క్రమాన్ని అర్థమయ్యేలా వివరించేందుకు రేఖాచిత్రాలనే వాడాడు. ఖండాల రూపాలని వివరించేందుకు భూగోళ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజెనర్ 1924 లో రేఖాచిత్రాలని వాడాడు.
ప్రముఖ రేఖాచిత్రకారులు
మార్చు- లియొనార్డో డావిన్సి
- ఆల్బ్రెచ్ట్ డ్యూరర్
- మైఖెలేంజిలో
- రఫాయిల్
- క్లౌడె లోరియన్
- నికోలాస్ పౌసిన్
- రెంబ్రాండ్ట్ హార్మెన్స్జూన్ వాన్ రిజ్న్
- గ్యువర్సినో
- పీటర్ పాల్ రూబెన్స్
- జీన్-హోనోరె ఫ్రాగొనార్డ్
- గియోవాన్ని బాట్టిస్టా టీపోలో
- ఆంటోయ్నే వాట్టెయు
- కేథె కోల్విట్జ్
- మ్యాక్స్ బెక్మన్
- జీన్ డుబుఫె
- జార్జ్ గ్రోస్జ్
- ఎగాన్ షీలే
- ఆర్షీలే గోర్కే
- పాల్ క్లీ
- ఆస్కార్ కోకోష్కా
- ఆల్ఫోన్సె మూచా
- ఎం సీ ఎషర్
- ఆండ్రీ మ్యాసన్
- జూలిస్ పాసిన్
- ప్యాబ్లో పికాసో
తైలవర్ణ చిత్రలేఖనానికి మునుపు రేఖాచిత్రాలే పరిపూర్ణ చిత్రలేఖనంగా ఉండేది. గుహలలో ఉన్న రేఖాచిత్రాలు, ఆ తర్వాతి గ్రంథాలలో ఈ విషయం తెలుపబడింది. అటు తర్వాత గానీ రేఖాచిత్రం చిత్రలేఖనం లో ప్రధాన భాగం కాలేదు. [1]
పరికరాలు
మార్చుసిరా, వర్ణ పదార్థాలను మాధ్యమంగా ఉపరితలం పై రేఖాచిత్రాన్ని గీస్తారు. చాలా మటుకు రేఖాచిత్ర పరికరాలు పొడి పదార్థాలు (గ్రాఫైట్, చార్కోల్, పేస్టెల్స్, కాంటీ, సిల్వర్ పాయింట్) గా ఉంటాయి. మార్కర్, కలంలో ద్రవపదార్థాలు కూడా పరికరాలు ఉపయోగించబడతాయి. పొడిగా ఉండే రంగు పెన్సిళ్ళతో ముందుగా రేఖాచిత్రాన్ని పూర్తి చేసి తర్వాత కుంచెతో తడిని అద్దటంతో చిత్రంలో కొన్ని కళాత్మక ప్రభావాలని తీసుకురావచ్చును. బహు అరుదుగా కంటికి కనబడని సిరాతో కూడా చిత్రకారులు రేఖాచిత్రాలని గీసారు. వెండి, సీసంతో చేసిన ఫలకాల పై కొన్ని రేఖాచిత్రాలు ఉన్ననూ, వీటి కంటే అరుదుగా స్వర్ణం, రాగి, కాంస్యం, కంచు, తగరపు ఫలకాల పై కూడా అతి అరుదైన రేఖాచిత్రాలు ఉన్నాయి.
కాగితం వివిధ పరిమాణాలలో, నాణ్యతలలో లభిస్తుంది. తయారీ విధానం, రంగు, ఆమ్ల గుణం, తడి తగిలినా పటుత్వం కోల్పోకుండా ఉండే గుణంలో వీటిలో భేదాలు ఉంటాయి. నునుపైన కాగితం సూక్ష్మ వివరాలను చిత్రీకరించటానికి ఉపయోగపడగా, కరకుగా ఉండే కాగితం చిత్రీకరణకి ఉపయోగించే పదార్థాలని ఒడిసి పట్టుకొంటుంది. అందుకే వర్ణవైరుధ్యంలో స్పష్టతని తీసుకురావటానికి ముతక కాగితాన్నే వినియోగిస్తారు.
వార్తాపత్రికలు, టైపింగు కాగితం వంటి దళసరి కాగితాలు నమూనా చిత్రపటాలని చిత్రీకరించటానికి, అసలైన చిత్రపటాలని ఎలా గీయాలో అధ్యయనం చేయటానికి ఉపయోగిస్తారు. పాక్షిక పారదర్శకంగా ఉండే ట్రేస్ పేపర్ (Trace Paper) ని ఉపయోగించి, ఒక చిత్రపటంలోని చిత్రాన్ని మరొక చిత్రపటం లోనికి తీసుకెళ్ళటానికి వినియోగిస్తారు. కార్ట్రిడ్జ్ పేపర్ (రెండు అట్టల మధ్య బైండింగ్ చేయబడిన చార్ట్ పేపర్లు) ని రేఖాచిత్రాలకి విరివిగా వినియోగిస్తారు. బ్రిస్టల్ బోర్డ్ లు, ఇంకనూ ఎక్కువ ఆమ్లరహిత బోర్డులు నునుపైన ఫినిషింగ్ తో సూక్ష్మ వివరాలని చిత్రీకరించటానికి, తడి మాధ్యమాలు (సిరా, వాటర్ కలర్, తైల వర్ణాలు) తగిలిననూ చెక్కు చెదరకుండా ఉంటాయి. జంతు చర్మాలు అత్యంత నునుపుగా ఉండి అతి సూక్ష్మ వివరాలని చిత్రీకరించటానికి అనుకూలిస్తుంది. సిరాతో చిత్రపటాలని చిత్రీకరించటానికి ప్రత్యేకమైన వాటర్ కలర్ పేపర్ కూడా లభ్యం.
కలప యొక్క గుజ్జుతో తయారు చేయబడే వార్తాపత్రికల నాణ్యత గల కాగితం త్వరితంగా పచ్చబడటం, పెళుసు బారటం అవుతుంది. ఆమ్లరహిత కాగితాలు దీర్ఘ కాలిక మన్నిక కలిగి ఉండి, వాటి రంగు, నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటాయి.
రేఖాచిత్రానికి కావలసిన ప్రాథమిక పరికరాలు డ్రాయింగ్ బోర్డు లేదా టేబుల్, పెన్సిల్ షార్పెనర్, ఎరేజర్, బ్లాటింగ్ పేపర్. వృత్త లేఖిని (సర్కిల్ కంపాస్), రూలర్, సెట్ స్క్వేర్ లు ఇతర పరికరాలు. పెన్సిళ్ళ వలన కానీ రంగు పెన్సిళ్ళ వలన కానీ ఏర్పడే అవాంఛిత మరకలు/మచ్చలను కనబడకుండా చేయటానికి ఫిక్సేటివ్ ని వాడుతారు. కాగితాన్ని పట్టి ఉంచటానికి, స్ప్రేలు, వాష్ లు చేసే సమయంలో మరకలు పడకుండా ఉండటానికి డ్రాఫ్టింగ్ టేప్ ని వాడతారు. చిత్రాలని గీసేందుకు అనువుగా ఉండటానికి ఈజెల్ ని కానీ, స్లాంటెడ్ టేబుల్ ని కానీ వాడుతారు.
సాంకేతిక అంశాలు
మార్చుదాదాపు చిత్రకారులందరూ చేతులని వ్రేళ్ళని ఉపయోగించి రేఖాచిత్రాలని గీస్తూ ఉంటారు. వికలాంగులైన వారు మాత్రం నోటితో లేదా కాళ్ళతో రేఖాచిత్రాలని గీస్తారు.
ఒక చిత్రపటాన్ని గీసే ముందు వివిధ మాధ్యమాలు ఎలా పని చేస్తాయో, కళాకారుడు ఒక అంచనాకి వస్తాడు. చిత్రీకరణలోని వివిధ విధానాలని వేర్వేరు రకాల కాగితాలపై అభ్యసించి, కాగితం యొక్క విలువ, తయారీని బట్టి వివిధ ప్రభావాలని ఎలా తీసుకు రావాలో నిర్ణయించుకొంటారు.
ఘతాలు చిత్రపటం యొక్క రూపాన్ని నిర్దేశిస్తాయి. కలం, సిరాతో వేసే రేఖాచిత్రాలలో ఒకే దిశలో సమాంతరంగా గీయబడే ఘతాలు (hatching) ని వాడుతారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ దిశలలో వేసే ఘతాల (Cross-hatching) వలన షేడ్ లో తీవ్రత పెరుగుతుంది. రేఖలని మధ్య మధ్యలో ఆపి ఆపి వేయటం వలన (Broken hatching) షేడ్ ల తీవ్రతలని తగ్గించవచ్చును. చుక్కలతో తేబడే షేడ్ ని స్టిప్లింగ్ (Stipling) అని అంటారు. వివిధ రకాలైన షేడ్ లు వివిధ పద్ధతులని అవలంబించటం వలన వస్తాయి.
పొడి మాధ్యమంలో రేఖాచిత్రాలు ఇటువంటి మెళకువలనే అవలంబించి, పెన్సిళ్ళతోనూ, డ్రాయింగ్ స్టిక్స్ తోనూ వివిధ రకాల టోన్ లని తీసుకురావచ్చును. ఎరేజర్లు అవాంఛిత రేఖలని, మరకలని తుడిచివేయటానికే కాకుండా టోన్ లని తేలిక చేయటానికి కూడా వినియోగిస్తారు.
స్కెచ్, ఔట్ లైన్ డ్రాయింగ్ లలో గీయబడే గీతలు ఆకృతి యొక్క రేఖలని బట్టి ఉంటాయి. చిత్రకారుడు చూస్తూ ఉన్న చోటు నుండి వెలుగునీడలు ఎలా అగుపడతాయో అలా చిత్రీకరించటంతో చిత్రాలలో ఎత్తుపల్లాలు ఏర్పడినట్లు అగుపడతాయి.
లక్షణము
మార్చుటోనల్ వ్యాల్యూ (Tonal Value) లలో భేదాలతో కాగితం పై చిత్రీకరించటంతో వెలుగునీడలని ప్రతిబింబింపజేయటమే షేడింగ్. పరావర్తనం చెందిన కాంతి, నీడలు, హైలైట్ లని ఎంత జాగ్రత్తగా చిత్రీకరిస్తే చిత్రపటంలో అంత వాస్తవికత జొప్పింపబడుతుంది.
ఘతాలని విస్తరించటానికి, లేదా వాటిలో మృదుత్వం పాళ్ళు పెంచటానికి బ్లెండింగ్ ఉపయోగపడుతుంది. బ్లెండింగ్ కి గ్రాఫైట్, సుద్ద, చార్కోల్ ని ఉపయోగిస్తారు. సిరా వలన మరకలు ఏర్పడిననూ, కొన్ని ప్రభావాలకి దీనిని కూడా ఉపయోగిస్తారు. షేడింగ్, బ్లెండింగ్ కు చిత్రకారులు బ్లెండింగ్ స్టంప్ ని, టిష్యూని, నీడెడ్ ఎరేజర్ ని లేదా వేలు చివరలని గానీ ఉపయోగిస్తారు. అడవి పొట్టేలు చర్మంతో చేయబడే షామి లెదర్ ని టోన్ లని తేలిక పరచటానికి ఉపయోగిస్తారు.
రూపం, సమతౌల్యం
మార్చువాస్తవిక కూర్పుకి సబ్జెక్టు యొక్క పరిమాణాలని కొలవటం చిత్రీకరణలో చాలా ప్రాముఖ్యత కలది. వృత్తలేఖిని, స్కేలు, సెట్-స్క్వేర్ వంటివి ఉపయోగించి కోణాలు, దూరాలు చిత్రంలో కూరుస్తారు.
మానవ శరీరం వంటి క్లిష్టమైన ఆకృతులని చిత్రీకరించవలసి వచ్చినపుడు మొదట ప్రాథమిక ఆకారాలని చిత్రీకరించటం బాగా ఉపయోగగపడుతుంది. ఏ ఆకారమైననూ క్యూబ్, స్ఫియర్ (గోళం), సిలిండర్, కోన్ ఆకారాలతో లేదా వీటి కలయికలతోనో ప్రతిబింబించవచ్చును. వీటన్నిటినీ సరైన విధానంలో అమర్చినట్లు చిత్రీకరించి, ఆ పై వాటికి మరిన్ని మెరుగులు దిద్ది వాటిని చక్కని చిత్రపటాలుగా మలచవచ్చును. అంతర్లీన నిర్మాణాన్ని యథాతథంగా చిత్రీకరించగలగటం చక్కని చిత్రపటం యొక్క ప్రాథమిక లక్షణం కావటం మూలాన, దీని సద్వినియోగం సూక్ష్మ వివరాలలో పలు అనిశ్చితులని తొలగించి స్థిరమైన చిత్రాలకి తుది రూపాన్ని ఇవ్వటంలో దోహదపడటం వలన, ఈ విద్య పలు పుస్తకాలలో, విద్యాలయాలలో విరివిగా నేర్పించబడుతుంది.
అనాటమీ (మానవ శరీర నిర్మాణ శాస్త్రం) పై పట్టు చక్కని పోర్ట్రెయిట్లని చిత్రీకరించటానికి ఉపయోగపడుతుంది. సుశిక్షితుడైన ఒక కళాకారుడు అస్థిపంజర నిర్మాణం, కీళ్ళు, కండరాలు, స్నాయిబంధనములు, శరీర కదలికలలో వీటన్నిటి అరమరికల పై మంచి పట్టు కలిగి ఉంటాడు. వివిధ భంగిమలలో సహజత్త్వాన్ని ఉట్టిపడేలా చేయటానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ఆకృతులు ఎలా మారతాయి అన్న అంశంపై కూడా కళాకారుడికి అవగాహన ఉండాలి.
పర్స్పెక్టివ్
మార్చులీనియర్ పర్స్పెక్టివ్ అన్నది ఒక చదునైన ఉపరితలంపై దూరం పెరిగే కొద్దీ పరిమాణం తగ్గే విధంగా చిత్రీకరించటం. సమాంతరంగా సరళ రేఖల వలె ఉన్న ఏ ఆబ్జెక్టు (భవంతి, టేబుల్ లాంటివి) అయినా వ్యానిషింగ్ పాయింట్ (vanishing point) వద్ద కలిసిపోయే దిశగా అమరినట్లు అగుపిస్తాయి. సాధారణంగా ఈ వ్యానిషింగ్ పాయింట్ హొరైజన్ (horizon) వద్ద ఉంటుంది. పలు భవంతుల సముదాయం ఒక దాని ప్రక్క మరొకటి అమర్చి చూచినచో, వాస్తవానికి సమాంతరంగా ఉండే ఆ భవంతుల ఉపరితలాలు, వాటి దిగువ భాగాలు వ్యానిషింగ్ పాయింట్ వద్ద కలుస్తున్నట్లుగా అనిపిస్తాయి.
లోతుని లీనియర్ పర్స్పెక్టివ్ తోనే కాకుండా ఇతర సాంకేతిక అంశాలతో కూడా చిత్రీకరించవచ్చును. ఒకే పరిమాణం గల వివిధ వస్తువులు వీక్షకుని వద్ద నుండి దూరం పెరిగే కొద్దీ వాటి పరిమాణం తగ్గినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఒక బండి యొక్క ముందు చక్రం కొద్దిగా పెద్దదిగానూ, వెనుక చక్రం కొద్దిగా చిన్నదిగానూ కనబడుతుంది. దూరం పెరిగే కొద్దీ వస్తువు యొక్క వెలుగునీడలలో తేడా కనబడుతుంది. వాటి రంగు మసకబారుతుంది. చలి ప్రదేశాలలో దూరం పెరగటం వలన మంచు పొరలు అడ్డు వస్తాయి. అప్పుడు మానవనేత్రం దగ్గరగా ఉన్న వస్తువు పై స్పష్టమైన దృష్టినీ, దూరంగా ఉన్న వస్తువు పై అస్పష్టమైన దృష్టినీ సారిస్తుంది.
కళాత్మకత
మార్చుఆసక్తికరమైన, కళాత్మక విలువలు కలిగిన రేఖాచిత్రాన్ని చిత్రీకరించాలంటే, చిత్రం యొక్క కూర్పు చాలా ముఖ్యమైనది. చిత్రకారుడు చిత్రంలోని కళాత్మక అంశాలని ప్రణాళికాబద్ధంగా పేర్చటం ద్వారా తన ఉద్దేశ్యాలని, భావనలని వీక్షకునికి వ్యక్తీకరించగలగాలి. కూర్పు కళాత్మక దృష్టిని కేంద్రీకరించవలసిన చోటుని నిర్ధారించి, అందంగా, ఆకర్షణీయంగా, ఆలోచనలని ఉత్తేజపరిచే శ్రావ్యమైన ఒక పరిపూర్ణ రేఖాచిత్రాన్ని రూపొందించటంలో సహాయపడుతుంది.
సబ్జెక్టు పై ప్రసరించే వెలుతురుని చిత్రీకరించగలగటం ఒక కళాఖండాన్ని సృష్టించటంలో కీలక పాత్ర వహిస్తుంది. వెలుగు, నీడల ఈ దోబూచులాటని కళాకారుడు చిత్రీకరించగలగే విధానం ప్రాముఖ్యతని సంతరించుకొన్నది. కాంతి మూలాల అమరిక కూడా రేఖాచిత్రం పంపే సందేశంలో గణనీయమైన భేదాలని తీసుకువస్తుంది. కాంతి మూలాల సంఖ్య పెరిగే కొద్దీ ఒక మనిషి ముఖం పైనున్న ముడతలు తగ్గినట్లు కనబడి అతని వయసు తక్కువగా కనబడుతుంది. దీనికి భిన్నంగా, ఒకే కాంతి మూలం ఉన్నపుడు (ఆరుబయట సూర్యకాంతి) ఇతర ఆసక్తికరమైన సహజలక్షణాలని ఎత్తి చూపటానికి ఉపయోగపడతాయి.
ఒక వస్తువుని లేక ఒక మనిషిని చిత్రీకరించే సమయంలో నిపుణుడైన ఒక కళాకారుడు మనిషి ఆకారానికి లోపలి చిత్రీకరణకి ఎంత ప్రాముఖ్యతని ఇస్తాడో, వెలుపలి చిత్రీకరణకి కూడా అంతే ప్రాముఖ్యతని ఇస్తాడు. మనిషి ఆకారానికి వెలుపల ఉన్న, మనిషితో బాటు సమ ప్రాముఖ్యతగల ఈ ప్రదేశాన్ని నజర్దక ప్రదేశం (Negative Space) అని అంటారు. నేపథ్యంలో ఉన్న వస్తువులు ఎలా ఉన్నవో, అలాగే రేఖాచిత్రంలో కూడా అమరిఫోవాలి.
తుది రేఖాచిత్రం ఖరారు అయ్యే ముందు ప్రణాళికాబద్ధంగా చిత్రీకరించే చిత్రాన్ని అధ్యయనం అని అంటారు. అధ్యయనాలు చిత్రంలో ప్రత్యేకించి కొన్ని భాగాలు తుది దశలో ఎలా కనబడాలో, చిత్రం అనుకొన్న విధంగా కనబడటానికి అత్యుత్తమ విధానం ఏదో నిర్ధారిస్తుంది. అతి జాగ్రత్తగా చిత్రీకరించబడే అధ్యయనాలే తుది రేఖాచిత్రాల అంత చక్కగా రావటం, గంటలకి గంటలు అధ్యయనాలకే సరిపోవటం ఒక్కోమారు జరుగుతుంటాయి.
ప్రక్రియ
మార్చురేఖాచిత్రాలు దృశ్యపరంగా కచ్చితంగా గీయగల సమర్థత ఒక్కొక్క చిత్రకారుడికి మారుతుంది.
మిగతా వారితో పోలిస్తే కొందరు చక్కని చిత్రపటాలు ఎలా గీయగలరన్న దాని పై పరిశోధనాత్మక అధ్యయనాలు జరిపారు. గీయబడే వస్తువుల పై అవగాహన, ప్రాతినిధ్యపు నిర్ణయాలను తీసుకొనగలిగే సామర్థ్యం, గీయబడే చిత్రపటం పై అవగాహన వంటివి ఈ భేదానికి కారణాలు అని తేలాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్స్ లో స్కెచింగ్ బేసిక్స్ పుస్తకం పేజీ 8,9". Introduction. Mud Puddle Books.
- http://dictionary.reference.com/browse/draftsman
- http://www.saylor.org/site/wp-content/uploads/2011/12/Module-6.pdf
- https://web.archive.org/web/20160303223647/http://www.ucl.ac.uk/medical-education/publications/Reprints2010/2010-PACA-ArtStudentsWhoCannotDraw.pdf
- https://web.archive.org/web/20140317224618/http://ttd2011.pressible.org/files/2012/05/Thinking-through-Drawing_Practice-into-Knowledge.pdf