రేడియో టెలిఫోను

ముఖాముఖీ మాట్లాడేటప్పుడు సందర్భశుద్ధి ఎక్కువగా ఉంటుంది. మాటలతో పాటు ఎదుట ఉన్న వారి కళవళికలు, హావ భావాలు ఆ మాటలని అర్థం చేసుకోటానికి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. టెలిఫోనులో మాట్లాడేటప్పుడు ఒక్క శబ్దమే ఆధారం. ఆ శబ్దం కాస్తా ఏ కారణాలవల్లనైనా మనకి సరిగ్గా వినబడక పోయినా, సరిగ్గా అర్థం కాకపోయినా వార్త సరిగ్గా అందదు. ఇలా వినపడక పోవటానికీ, అర్థం కాకపోవటానికీ కొన్ని సాంకేతికమైన కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి మాట్లాడేవారు పరాయి దేశస్తులైతే వారి మాట లోని యాస మనకి అర్థం కాకపోవచ్చు. లేదా, వాకేతం (‘సిగ్నల్’) ప్రసరించే మాధ్యమం (‘మీడియం’) లో ఏవైనా లొసుగులుంటే వార్త సరిగ్గా అందక పోవచ్చు. ఇవే కాకుండా ఇంకా లోతైన సాంకేతిక కారణాలు ఉన్నాయి.

మనం మాట్లాడేటప్పుడు మన నోటి ఎదట ఉన్న గాలి ప్రకంపనాలకి లోనౌతుంది. మనం టెలిఫోను మూతిగొట్టంలోకి మాట్లాడినప్పుడు ఈ ప్రకంపనాలు విద్యుత్ తరంగాలుగా మారతాయి. ఈ తరంగాలు అవతలి దరికి చేరుకున్న తర్వాత అక్కడ ఈ విద్యుత్ తరంగాలు మళ్ళా శబ్ద తరంగాలుగా మారతాయి. తరంగాలు అంటే కెరటాలు. ఇవి పైకి లేచి కిందకి పడుతూ ఉంటాయి. కొన్ని పైకీ, కిందికీ జోరుగానూ, మరికొన్ని నెమ్మదిగానూ రెపరెపలాడతాయి. ఈ రెపరెపలు జోరుగా జరిగితే జోరు రెపరెపలు (‘హై ఫ్రీక్వెన్సీ’) అంటాం. మనం మాట్లాడే మాటలలో కొన్ని ఉచ్చరించినప్పుడు ఈ రెపరెపల జోరు ఎక్కువగా ఉంటుంది, కొన్ని సమయాలలో జోరు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకిఉ ఇంగ్లీషులో F కాని S కాని ఉచ్చరించినప్పుడు పుట్టే తరంగాల యొక్క రెపరెపల జోరు ఎక్కువ. మనిషి గొంతుకని బట్టి (కీచు, బొంగురు, మొదలైన తేడాలు), మనిషికి పడిశం పట్టిందా లేదా అన్న తేడాల వరకు లెక్కలోకి తీసుకుంటే ఈ F, S తరంగాల రెపరెపలు సెకండుకి 3000 నుండి 6000 వరకు ఉండొచ్చు.

మన టెలిఫోను వ్యవస్థ 200 నుండి 4000 రెపరెపల వరకు బాగానే పని చేస్తుంది. అంతకంటె ఎక్కువ రెపరెపలు ఉంటే వాటిని నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పారేస్తుంది. ఇలా హెచ్చు స్థాయి స్వరాలు పోయి, మంద్ర స్వరాలు మాత్రమే మిగిలితే మనం అన్న అక్షరం లక్షణం కొంత పోగొట్టుకుని మనకి మరొక అక్షరంలా వినిపిస్తుంది. ఇలా ఇబ్బంది పెట్టే జంటలలో F, S ప్రథములు. తర్వాత జంట M, N. వరుస క్రమంలో తర్వాత వచ్చేవి P, T. ఆ తర్వాత B, D. ఆఖరున G, T.

మన టెలిఫోను వ్యవస్థ నిర్మాణం జరిగిన కొత్త రోజులలో ఈ సమస్య ని పరిష్కరించటం ఎలాగో తెలియక మనం మాట్లాడే పద్ధతి మార్చమని సలహా ఇచ్చేరు పెద్దలు. ఈ సలహా ప్రకారం ప్రతీ ఇంగ్లీషు అక్షరానికి ఒక మాటని జత చేర్చి, ఆ అక్షరం పలకవలసినప్పుడల్లా ఆ మాటని అనమన్నారు. ఇవే Alpha, Bravo, Charlie, Delta, Echo… మొదలైనవి. ఇలా అక్షరాలకి బదులు మాటల వాడటాన్ని ‘ఫోనెటిక్ ఆల్ఫబెట్' అంటారు. పద్ధతి బాగానే ఉంది కానీ, ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం ఎలా? అందుకని సామాన్యులు వేళకి మనస్సులో ఏది తటితే అది అనెస్తారు. ఉదాహరణకి: A as in Apple, B as in Boy, C as in Cat… అలా.

ఒక సారి మా నత్తి చలపతి టెలిఫోనులో పేరు చెప్పవలసి వచ్చింది. అసలే నత్తి. పైపెచ్చు అమెరికా వాళ్ళకి అలవాటు లేని పేరు. దానికి తోడు ఇండియా యాస. దాని మీద జోరుగా మాట. వీటితో అవతలి మనిషికి ఇతని పేరు అర్థం కాకపోతే ఇతను ఇలా ‘స్పెల్లింగు’ చెప్పటం మొదలు పెట్టేడు: “C as in చ, చ, చ, చ….. చలపేటీ.” హతోస్మి అనుకున్నాను.