రైతులపై జాతీయ సంఘం
రైతుల ఆర్థిక సుస్థిరత చేకూర్చే దిశగా, వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు గాను వ్యవసాయ రంగానికి సంబంధించి భారత దేశంలో నెలకొని ఉన్న వివిధ ఆర్థిక, సాంఘిక పరిస్థితులను పరిశీలించి అవసరమైన సూచనలను చేసేందుకు ఏర్పరచిన సంఘమే, రైతులపై జాతీయ సంఘం (National Commission on Farmers). ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్.స్వామినాథన్ ఈ సంఘానికి నేతృత్వం వహిస్తుండడం వలన దీనికి స్వామినాథన్ కమిషన్ (Swaminathan Commission) అని కూడా పేరు వచ్చింది.
సంఘ చరిత్ర
మార్చురైతులపై జాతీయ సంఘంను 2004 ఫిబ్రవరి 10 నే అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయం పరిస్థితిని సమీక్షించడం, వివిధ ప్రాంతాల్లోని వివిధ వర్గాల రైతుల స్థితిని అంచనా వేయడం అనే లక్ష్యాలతో, రెండేళ్ళ కాలపరిమితితో, మాజీ వ్యవసాయ మంత్రి, ప్రణాళికా సంఘ సభ్యుడు, సోమ్పాల్ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఆనాటి ఎన్.డి.ఏ ప్రభుత్వం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసింది. అసమానతలకు కారణాలను వెలికితీసి, సమగ్ర వ్యవసాయాభివృద్ధికై సంఘం సూచనలు చేస్తుంది. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ధరలు, మార్కెటింగు విధానాలను, రైతుల ఆదాయం, సంక్షేమాలను మెరుగుపరచేందుకు చట్టపరమైన అంశాలను పరిశీలించడం, చిన్న కమతాల మనుగడపై అంతర్జాతీయ వాణిజ్యం యొక్క ప్రభావాన్ని అంచనా వెయ్యడం కూడా సంఘ లక్ష్యాలుగా నిర్దేశించింది.
అప్పటి సంఘంలో సభ్యులు
మార్చుఅధ్యక్షుడు:
- సోమ్పాల్
పూర్తికాల సభ్యులు:
- రామ బదన్ సింగ్
- వై.సి.నందా
పాక్షిక కాల సభ్యులు:
- ఆర్.ఎల్.పితలే
- చిలకం రామచంద్రారెడ్డి
- కున్వర్జీ భాయి జాదవ్
కార్యదర్శి:
- ఆర్.సి.ఏ.జైన్
సంఘంలో జరిగిన మార్పులు
మార్చుతదనంతర కాలంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో యు.పి.ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత, సంఘాన్ని పునర్వ్యవస్థీకరించింది. సంఘ లక్ష్యాలను కూడా విస్తరించింది. 2004 మేలో సంఘ అధ్యక్షుడిగా ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, ఎమ్.ఎస్.స్వామినాథన్ ను నియమించింది. ఆ తరువాత ఈ సంఘానికి స్వామినాథన్ కమిషను (Swaminathan Commission) అని కూడా పేరు వచ్చింది.
పునర్వ్యవస్థీకృత సంఘ సభ్యులు
మార్చు- ఎమ్.ఎస్.స్వామినాథన్ - అధ్యక్షుడు
- రామ్ బదన్ సింగ్ - సభ్యుడు
- వై.సి.నందా - సభ్యుడు
- అతుల్ సిన్హా - సభ్య కార్యదర్శి
- అతుల్ కుమార్ అంజాన్ - సభ్యుడు (పాక్షిక కాల)
- జగదీష్ ప్రధాన్ - సభ్యుడు (పాక్షిక కాల)
- డా.ఆర్.ఎల్.పితలే - సభ్యుడు (పాక్షిక కాల)
- చందా నీంబ్కర్ - సభ్యురాలు (పాక్షిక కాల)
పునర్వ్యవస్థీకృత సంఘ లక్ష్యాలు
మార్చు- దీర్ఘ కాలంలో సార్వత్రిక ఆహార భద్రత దిశగా చేసే ప్రయాణంలో భాగంగా ఆహార, పౌష్టికతల భద్రతకై మధ్యావధి వ్యూహాన్ని రచించడం.
- వ్యవసాయ-ఆర్థిక, వ్యవసాయ-శీతోష్ణస్థితులపై ఆధారపడి ప్రధాన వ్యవసాయ పద్ధతుల ఉత్పాదకత, లాభదాయకత, సుస్థిరత, మనుగడలను మెరుగుపరచడం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం.
- సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా విధానాల మధ్య అన్యోన్యతను సాధించడం. వైవిధ్యీకరణ, ఐటీ వంటి అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, మార్కెట్లు, వాతావరణం, ఋణాల అందుబాటు, ఈ-కామర్సు, శిక్షణ, మార్కెట్ల సరళీకరణ వంటి విషయాలపై సమాచారం అందే ఏర్పాటు చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, ఉపాధి అవకాశాలను పెంపొందించే సూచనలను చెయ్యడం.
- చదువుకున్న యువతను వ్యవసాయం వైపుకు ఆకర్షించే పద్ధతులను సూచించడం. దీనికోసం, పంట పోషణ, ఉద్యానవన పెంపకం, చేపలపెంపకం (భూభాగంలోను, సముద్రంలోను), వ్యావసాయిక అడవులు, వ్యావసాయాధారిత పరిశ్రమలు, సంబంధిత మార్కెటింగు వసతులకు సంబంధించిన సాంకేతిక పద్ధతులను మెరుగుదలకు సూచనలు చెయ్యడం.
- గ్రామీణ కుటుంబాలలో ఆరోగ్యకరమైన జీవనావకాశాల పెంపు దిశగా వ్యవసాయ పరిశోధనలపై పెట్టుబడులను పెంచడం, చిన్నకారు, సన్నకారు రైతులతో సహా రైతులకు ఋణసౌకర్యం పెంచడం, వ్యవసాయాభివృద్ధి చోదిత ఆర్థికాభివృద్ధి కోసం కృషి చెయ్యడం వంటి లక్ష్యాలతో సమగ్ర విధాన పునర్వ్యవస్థీకరణను సూచించడం.
- వర్షాభావ ప్రాంతాలు, స్వల్ప వర్షపాతం గల ప్రాంతాల్లో మెట్టసేద్యం చేసే రైతులు, తీరప్రాంత, పర్వతప్రాంత రైతుల జీవికల భద్రత ఆయా ప్రాంతాల పర్యావరణ భద్రతతో ముడిపడి ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం. ఈ సందర్భంలో అపరాలు, నూనె గింజలు, మొక్కజొన్న, పత్తి, వాటర్షెడ్ వంటి టెక్నాలజీ మిషన్లను సమీక్షించి, సమాంతరంగా నిర్మించిన వివిధ కార్యక్రమాలను అనుసంధానించేందుకు సూచనలు చెయ్యడం. వనరుల లేమితో బాధపడే వ్యవసాయ కుటుంబాలను భరించరాని ఋణభారం నుండి కాపాడేందుకు ఋణంతో కలగలిపిన ఇన్స్యూరెన్సు పథకాలను సూచించడం. నేషనల్ హార్టికల్చర్ బోర్డును బలోపేతం చేసి, వ్యవస్థీకృతం చేసే పద్ధతులను సూచించడం.
- ఆధునిక శాస్త్రీయ పద్ధతులను వాడడం, అవసరమైన సౌకర్యాలను కలిగించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను, ధరల పోటీని తట్టుకొనే గుణాన్ని పెంచి, వాటిని ప్రపంచం స్థాయిలో పోటీ పడేలా తయారు చేసేందుకు సూచనలు చెయ్యడం. కోడెక్స్ అలిమెంటారియస్ ప్రమాణాల గురించి, ఆరోగ్యం, పంటల ఆరోగ్యం గురించి బోధించడం. అంతర్జాతీయంగా ధరలు పడిపోయినపుడు, రైతులు తమను కాపాడుకునే పద్ధతులను సూచించడం.
- వ్యవసాయంలో స్త్రీల పాత్ర పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఋణవసతి, పరిజ్ఞానం, నేర్పు, సాంకేతిక, మార్కెటింగు రంగాల్లో స్త్రీలను బలోపేతం చేసేందుకు సూచనలు చెయ్యడం.
- వ్యవసాయ సుస్థిరత కోసం భూమి, నీరు, వ్యవసాయ జీవ వైవిధ్యం, వాతావరణం వంటి పర్యావరణ పునాదులను పరిరక్షించేం విషయంలో - సాగునీటికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ - స్థానిక ప్రజాప్రతినిధులకు విజ్ఞానాన్ని నేర్పించేందుకు తగు సూచనలు చెయ్యడం.
- పై అంశాలకు సంబంధించిన ఏ ఇతర అంశాలనైనా, లేదా ప్రభుత్వం సూచించే ఏ ఇతర అంశాలనైనా పరిశీలించడం.
సంఘ నివేదికలు
మార్చుసంఘం మొత్తం ఐదు నివేదికలు సమర్పించింది. ఆ వివరాలు:
సం. | నివేదిక | పేరు | సమర్పించిన తేదీ |
---|---|---|---|
1 | మొదటి నివేదిక | రైతులకు సేవ చెయ్యడం, వ్యసాయాన్ని కాపాడడం | 2004, డిసెంబర్ 29 |
2 | రెండవ నివేదిక | రైతులకు సేవ చెయ్యడం, వ్యసాయాన్ని కాపాడడం - విపత్తు నుండి విశ్వాసానికి | 2005, ఆగష్టు 11 |
3 | మూడవ నివేదిక | రైతులకు సేవ చెయ్యడం, వ్యసాయాన్ని కాపాడడం 2006: వ్యవసాయ నవ నిర్మాణం | 2005, డిసెంబర్ 29 |
4 | నాలుగవ నివేదిక | రైతులకు సేవ చెయ్యడం, వ్యసాయాన్ని కాపాడడం జై కిసాన్: రైతుల కొరకు జాతీయ విధానం చిత్తుప్రతి | 2006, ఏప్రిల్ 13 |
5 | ఐదవ నివేదిక | రైతులకు సేవ చెయ్యడం, వ్యసాయాన్ని కాపాడడం - మరింత వేగవంతమైన, పరిపూర్ణమైన రైతుల సంక్షేమ పురోగతి దిశగా | 2006, అక్టోబర్ 4 |
మూలాలు, వనరులు
మార్చు- ↑ http://cari.res.in/farmers.htm Archived 2009-01-08 at the Wayback Machine పేజీలోనున్న సంఘ నివేదికల ఆధారంగా