లక్ష్మి విశ్వనాథన్

భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు

లక్ష్మి విశ్వనాథన్ తంజావూరు బాణీకి చెందిన భరతనాట్య కళాకారిణి.[1]

లక్ష్మి విశ్వనాథన్
"మై త్యాగరాజ" నృత్యరూపకంలో బెంగళూరు నాగరత్నమ్మగా లక్ష్మి విశ్వనాథన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంలక్ష్మి విశ్వనాథన్
జననం1944
చెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్యం కళాకారిణి

విశేషాలు సవరించు

ఈమె మద్రాసులో 1944లో జన్మించింది. ఈమె భరతనాట్యాన్ని కంజీవరం ఎల్లప్ప పిళ్ళై వద్ద నేర్చుకుంది. కర్ణాటక సంగీతాన్ని తన తల్లి అలమేలు విశ్వనాథన్ వద్ద అభ్యసించింది.[2] ఈమె 10 దేశాలకు పైగా సందర్శించి అనేక ప్రదర్శనలు ఇచ్చింది. భారతదేశంలోని అన్ని ముఖ్యమైన నృత్యోత్సవాలలో పాలుపంచుకుంది. అనేక సెమినార్లలో పత్ర సమర్పణ గావించింది. ఈమె దేవాలయ నాట్యంపై, దేవదాసీ వ్యవస్థపై పరిశోధనలు చేసి వివిధ జర్నల్లలో, న్యూస్‌పేపర్లలో, డాన్స్ పోర్టల్లలో అనేక వ్యాసాలు ప్రకటించింది. "భరతనాట్యం ద తమిళ్ హెరిటేజ్", "కుంజమ్మ ఓడ్ టు ఎ నైటింగేల్" (ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితచరిత్ర), "వుమెన్ ఆఫ్ ప్రైడ్ ద దేవదాసి హెరిటేజ్", "కపిలేశ్వర టెంపుల్" వంటి పుస్తకాలను రచించింది. ప్రస్తుతం ఈమె కళాక్షేత్ర జర్నల్‌కు సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నది.

ఈమె బన్యన్ ట్రీ, చతురంగ, మై త్యాగరాజ మొదలైన నృత్యనాటకాలకు నృత్యదర్శకత్వం చేసింది. ఈమె "ది పొయెట్రీ ఆఫ్ డ్యాన్స్" అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తీసి ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించింది. ఈమె నాట్య గురువుగా అనేక మంది శిష్యులను నాట్యకళాకారులుగా తయారు చేసింది. ఈమె 1991 నుండి "మామల్లపురం నృత్యోత్సవాల"ను నిర్వహిస్తున్నది. ఈమె అనేక కమిటీలలో సభ్యురాలిగా సేవలను అందించింది. మద్రాసు సంగీత అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది.

నృత్య రంగంలో ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో శ్రీకృష్ణ గాన సభ, మద్రాసు వారిచే "నృత్యచూడామణి" బిరుదు, మద్రాసు సంగీత అకాడమీ వారిచే "నృత్య కళానిధి" అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే సంగీత నాటక అకాడమీ అవార్డు, మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే "కాళిదాస్ సమ్మాన్" అవార్డు, తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం వారిచే కళైమామణి పురస్కారం మొదలైనవి ఉన్నాయి.

మరణం సవరించు

లక్ష్మీ విశ్వనాథన్ వృద్ధాప్యం కారణంగా 2023 జనవరి 19న చెన్నైలోని అడయార్‌లోని తన నివాసంలో మరణించారు.[3][4]

మూలాలు సవరించు

  1. web master. "Lakshmi Viswanathan". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.
  2. web master. "Lakshmi Viswanathan". International Institute of South Asian Studies. Retrieved 25 April 2021.
  3. "புகழ்பெற்ற பரதநாட்டிய கலைஞர் லட்சுமி விஸ்வநாதன் சென்னையில் காலமானார்". Hindu Tamil Thisai (in తమిళము). Retrieved 2023-01-21.
  4. கண்ணன், ஸ்வேதா. ""உத்வேகம் அளித்த நடனம்!"- பரதக் கலைஞர் லட்சுமி விஸ்வநாதன் நினைவுகள் பகிரும் சித்ரா விஸ்வேஸ்வரன்". vikatan.com/ (in తమిళము). Retrieved 2023-01-21.