వట్టికూటి ఆదినారాయణరావు

వట్టికూటి ఆదినారాయణరావు ప్రముఖ రంగస్థల నటుడు. ఇతడు 1902లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురంలో బసవమ్మ, వెంకటస్వామి దంపతులకు జన్మించాడు. ఇతడికి చిన్ననాటి నుండే నాటకాలంటే సరదా. తాను కూడా నటుడు కావాలనే కోరికతో ఎన్ని వ్యయప్రయాసలకైనా ఓర్చుకుని ప్రతి నాటకాన్ని చూసి ఆకళింపుచేసుకునేవాడు. 1925లో విజయనగర పతనం నాటకంలో సవరం వీరాస్వామినాయుడు గారి పఠాన్ పాత్రను చూసి ప్రేరేపితుడై అదే నాటకసమాజం లోనే అదే నాటకంలో అదే పాత్రను ధరించడం ద్వారా రంగస్థల ప్రవేశం చేశాడు. ఇతని సహజ నటనను చూసి ప్రేక్షకులు తన్మయత్వంతో లీనమై ఇతడు నటించిన దుష్టపాత్రలను దూషించేవారు. ఇతడు నటించిన వాటిలో కాళిదాసు నాటకంలో కుముదప్రియ, భోజరాజు, ప్రమీలార్జునీయం నాటకంలో మేఘనాథుడు, నరకాసుర నాటకంలో నరకాసురుడు, కనకతార నాటకంలో క్రూరసేనుడు, చింతామణిలో భవానీ శంకరం, పద్మవ్యూహంలో అభిమన్యుడు, హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు, సారంగధరలో రాజరాజు, రంగూన్‌రౌడి నాటకంలో శంకర్రావు, విజయనగర పతనం నాటకంలో పఠాన్ పాత్రలు ఇతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇతడు 1927లో మురళీమోహన నాటకసభ అనే నాటక సమాజాన్ని స్థాపించి సహ నటులకు తర్ఫీదునిస్తూ అనేక నాటకాలను ప్రదర్శించాడు. ఇతడు సహ నటుల కష్టాలను తనవిగా భావించి అనేక నాటకాలను ఉచితంగా ప్రదర్శించి ఆయా నటులకు సహాయపడ్డాడు. బర్మాలోని ప్రవాసాంధ్రుల కోసం ఒక సహాయనిధి ఏర్పాటు చేసి అనేక నాటకాల ద్వారా ధనాన్ని సేకరించి ఆ సొమ్మును అవుటపల్లి నారాయణరావు ద్వారా ప్రవాసాంధ్రులకు పంపి తన జాతీయ భావాన్ని వెల్లడించుకున్నాడు. ఇతడికి ఎన్నో బహుమతులు లభించాయి. 1947లో నర్సాపురంలో ఇతనికి ఘనమైన పౌరసన్మానం జరిగింది. ఆ సభలో ఇతనికి రజత ఖడ్గం బహూకరించారు. ఇతనికి నటవిశారద అనే బిరుదు లభించింది. ఇతడు పక్షవాతానికి గురై 1950లో మరణించాడు.

మూలాలు మార్చు