వర్ణ
వర్ణ పివిపి సినిమా సంస్థ నిర్మించిన భారీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమా. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్య, అనుష్క శెట్టి ముఖ్యపాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్యసంగీతం అందించారు. 2013 నవంబరు 22న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలయిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన రాబట్టి భారీ పరాజయంగా మిగిలిపోయింది.
వర్ణ | |
---|---|
దర్శకత్వం | సెల్వరాఘవన్ |
నిర్మాత | ప్రసాద్ వర పోట్లూరి |
తారాగణం | ఆర్య, అనుష్క శెట్టి |
సంగీతం | సెల్వరాఘవన్ |
నిర్మాణ సంస్థ | పివిపి సినిమా |
విడుదల తేదీ | నవంబర్ 22, 2013 |
దేశం | భారతదేశం |
భాష | తమిళ |
బడ్జెట్ | 65 కోట్లు |
కథ
మార్చుఈ కథ రెండు ప్రపంచాల మధ్య జరుగుతుంది. ఒకటి మనుషులు నివసించే భూలోకం. మరొకటి మరమనుషుల వంటి వారు నివసించే పరలోకం. ఆ పరలోకంలో ఓ రాజ్యంలో అమ్మ అనే ఓ దైవాంశసంభూతురాలు నివసిస్తూ ఉంటుంది. వాళ్ళ లోకంలో ప్రేమకు స్థానం లేదు. ఎందుకంటే వాళ్ళెవ్వరికీ ప్రేమ అంటే ఏమిటో తెలియదు. ఏనాటికైనా ఎవరో ప్రేమించుకుంటారని, అప్పుడు ఓ రకమైన పూలు పూస్తాయని అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ అది అప్పటివరకూ జరగని పని.
భూలోకంపై ఓ ప్రేమకథ జరుగుతుంటుంది. కొంత భయస్తురాలయిన రమ్య (అనుష్క శెట్టి) అనే వైద్య విద్యార్థిని మధు బాలకృష్ణ (ఆర్య) అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. కానీ మధు ఎప్పుడూ తన ప్రేమని అంగీకరించడు. ఆపై ప్రేమలో పడ్డ మధు రమ్య దగ్గరికి వెళ్ళి తన ప్రేమ విషయం చెప్తే అందుకు రమ్య అప్పటికే తనకి పెళ్ళి కుదిరిందని చెప్పి వెళ్ళిపోతుంది. గోవాకి ఓ యాత్రకి వెళ్ళినప్పుడు రమ్య మనసును తిరిగి మధు గెలుచుకోగా తక్కువ కట్నం కారణంగా చూపిస్తూ మగపెళ్ళివారి కుటుంబం పెళ్ళిని రద్దు చేస్తుంది. కాని దురదృష్టవశాత్తూ రమ్య ఓ ప్రమాదంలో చనిపోతుంది. దీనికితోడు పక్షవాతంతో బాధపడుతున్న మధు తండ్రి కూడా చనిపోతాడు. జరిగిన దారుణాల వల్ల మానసికంగా గాయపడ్డ మధు గోవాలో తిరుగుతూ ఉంటాడు. ఓ యాత్రా స్థలంలో ఓ ఖాళీ కారు ఎక్కి నడుపుకుంటూ అక్కడున్న కొండెక్కుతాడు. గాయపడి మూర్ఛపోయి అక్కడే కారులో పడుంటాడు.
ఈ కథతో సమానంగా మరో కథ నడుస్తుంటుంది. పరలోకంలో అమ్మ నివసించే రాజ్యంలో ఆ రాజ్యం యొక్క సేనాధిపతి కొడుకయిన మహేంద్ర (ఆర్య) అక్కడ పనిచేసుకుంటూ బ్రతికే ఓ అనాథ వర్ణ (అనుష్క శెట్టి) తో ప్రేమలో పడతాడు. ధైర్యవంతుడయినా యుద్ధవిద్యలపై ఆసక్తి చూపని మహేంద్ర ఎప్పుడూ తన స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. ఇందుకు పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తూ యోధురాలిగా బ్రతకాలనుకునే వర్ణ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తుంటుంది. శత్రురాజ్యం నుంచి అమ్మను కాపాడుకోవాలనేది వర్ణ ఆలోచన. సైన్య పరీక్షలకు అనుమతి లేకుండా చొరబడిన వర్ణను ఆడవాళ్ళ ఖైదులో నిర్బంధించిన రాజుతో మహేంద్ర వర్ణను వదిలెయ్యమని బ్రతిమాలతాడు. అందుకు ఆ రాజు మూడు రోజుల్లో సింహాన్నిఒ చంపి దాని చర్మం వలిచి తీసుకురమ్మంటాడు. మహేంద్ర కష్టపడి పోరాడి ఆ సింహాన్ని చంపుతాడు. రాజాజ్ఞ ప్రకారం వర్ణని మహేంద్రకి ఇచ్చి వర్ణ ఇఒష్టానికి విరుద్ధంగా పెళ్ళి చెయ్యాలనుకుంటారు. రాజుపై దాడి చేసే ప్రయత్నం చేసి కుదరక తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అమ్మ తనని కాపాడాక ఆ రాజు వర్ణని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. మహేంద్ర దీనితో తాగుబోతు అయిపోతాడు. తన స్నేహితుల బలవంతం మీద అదే రాజ్యంలో ఉన్న ఓ పవిత్రమయిన కొండ చరియపైకెక్కుతాడు మహేంద్ర.
అమ్మ యొక్క శక్తుల వల్ల గోవాలో మధు పడి ఉన్న కొండకి, మహేంద్ర ఎక్కిన ఆ కొండ చరియకి మధ్య రెండు ప్రపంచాల ద్వారం తెరుచుకుంటుంది. కారులో ఉన్న మధుని కాపాడి మహేంద్ర తనని అమ్మ దగ్గరికి వైద్య కోసం తీసుకెళ్తాడు. పరలోక ప్రజలు మధు ఓ దేవత అనుకుని సంబరాలు చేస్తుంటారు. అక్కడ రమ్యలా ఉన్న వర్ణను చూసి మధు ప్రేమ పెంచుకోడంతో పూలు పూస్తాయి. శత్రురాజ్యం వాళ్ళు అమ్మని అపహరించుకుపోగా వర్ణను కాపాడినందుకు మహేంద్రను రాజ్యం నుంచి గెంటుతాడు. అమ్మను కాపాడే ప్రయత్నంలో మహేంద్ర ఆ శత్రురాజ్యం సైనికులకు దొరికిపోయి ఇరుక్కుపోతాడు. మహేంద్ర, అమ్మలను వెతకడానికి వర్ణ, మధు బయలుదేరతారు. రమ్య గురించి తెలుసుకున్నాక వర్ణ తన భర్త అయిన మహేంద్రతో ప్రేమలో పడ్డానని తెలుసుకుంటుంది. మహేంద్ర శత్రుసైన్యాన్ని చేల్చిచెండాడి అమ్మతో కలిసి ఓ పడవలో పారిపోతాడు. కానీ మధు ఆ గొడవల్లో చనిపోతాడు. అమ్మ వర్ణ, మహేంద్రలను మధుని కాపాడవద్దని చెప్పి ఆపుతుంది. దానితో మధు మరో ప్రపంచానికి వెళ్ళి అక్కడ అచ్చం రమ్యలా ఉన్న ఓ అమ్మాయిని చూసి మీరు ఎవరినయినా ప్రేమించారా అని అడుగుతాడు. ఆమె లేదని చెప్పడంతో మధు ఇదే తను చేరుకోవాల్సిన లక్ష్యమనుకుని సంబరపడతాడు.