వలస దేవర, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి రచించిన నవల.[1][2] ఇది జానపద కథన గ్రామాయణం.

రచనకు బహుమతులు మార్చు

విజ్ఞాన కళాపీఠం వారిచే ప్రథమ బహుమతి పొందిన నవల. ఇది [2] (1998)- 'ఆటా' తొలి నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన.[3]

ఆట నవల-నాటకం మార్చు

ఎటు పోయింది మనిషితనం అనే అలజడి నిండిన తాత్విక ప్రశ్న వేసే నవల వలస దేవర. మారుతున్న జీవన సరళితో పాటు మారగలిగిన వాడే జీవితంలో గెలుపు చూడగలుగుతాడనే తీర్పునిచ్చే నవల కావడి.

ప్రముఖుల అభిప్రాయాలు మార్చు

వల్లంపాటి వెంకట సుబ్బయ్య మార్చు

చినూవా అచీబీ, బెన్ ఓ, ఓలే సోయింకా మొదలైన ఆఫ్రికన్ రచయితలని చదువుతున్నప్పడు "పురాణగాధలతో ( మిత్స్ ) కలగాపులగంగా ఉన్న భారతీయ గ్రామీణ సంస్కృతి గురించి ఎవరైనా రాస్తే ఎంత బాగుంటుంది" అనిపించేది. కానీ అలా రాయడం ఎంత కత్తిమీద సామో జ్ఞాపకం వచ్చి నిరాశ కలిగేది. ఈ పద్ధతి కథనంలో ఉన్న రెండు ప్రమాదాలు మనసులో మెదిలేవి. వాటిలో మొదటిది: రచయిత కాస్త అజాగ్రత్తగా ఉన్నా, కథనం కాస్త వశం తప్పినా అది అర్థం లేని లక్ష్యం లేని వాగుడుగా దిగజారిపోతుంది. రెండవ ప్రమాదం: పురాణగాథలను (మిత్స్) అర్థం చేసుకోవడంలో ఎదురయ్యే గందరగోళం. మన సమాజంలో అత్యాధునిక శాస్త్ర విజ్ఞానమూ, అర్థం లేని అంధ విశ్వాసమూ సహజీవనం చేస్తున్నాయి. విశ్వాసానికీ జీవిత విధానానికీ మధ్య ఉండవలసిన వంతెనలు కూలిపోతున్నాయి. ఇలాంటి సంకర సంస్కృతిలో పురాణగాథల మూలాలలోకి వెళ్ళి, వాటిని సమకాలీన జీవితంతో సమన్వయం చేయటం చాలా శ్రమతో కూడిన పని.

 పురాణగాథలంటే పురాణ గ్రంథాలలోని దేవతల కథలు మాత్రమే కావు. కల్పిత జానపద గాథలూ, దివ్యత్వాన్ని సంతరించుకున్న ఆధునిక మానవుల గాథలూ కూడా కావచ్చు. కాలక్రమాన ఈ గాథల పుట్టుకా అర్థమూ మరుగున పడిపోయినా అవి ఆచారాల రూపంలోనూ కర్మకాండ (రిచువల్స్) రూపంలోనూ మన సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. గతాన్నీ మతాన్నీ ఇతర దేశాలకంటే చాలా ఎక్కువగా మిగుల్చుకున్న భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ నగరాల్లోనూ కూడా ఈనాటికీ వలసదేవరూ, గంగమ్మ జాతరలూ, జంతుబలులూ జరుగుతూనే ఉన్నాయి. ఒకనాడు ఇవి గ్రామాల సంఘజీవనానికి పట్టుకొమ్మలుగా ఉన్నా ఈ నాడు అధికార రాజకీయాలూ, మతతత్వమూ-కులతత్వమూ, ఫాక్షన్ హింసాకాండా వాటి స్వభావాన్నే మార్చి వేశాయి.

అలాంటి ఒక పురాణగాథను కేంద్రంగా స్వీకరించి, దానిమీద ఆధారపడ్డ ఒక ఉత్సవాన్ని ప్రతీకగా రూపొందించి, గత యాభై ఏళ్ళలో చిత్తూరు జిల్లా వాయలపాడు తాలూకాలోని ఒక గ్రామంలో దాదాపు అన్ని రంగాల్లోనూ వచ్చిన మార్పుల్ని చిత్రించడానికి ప్రయత్నించిన నవల వలసదేవర. రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. ఈ నవలలో గత యాభై ఏళ్ళ పరిణామాలకు సాక్షి గ్రామదేవత ముష్టూరమ్మ. ఆమె సుఖదుఃఖాలకూ ప్రతిస్పందనలకూ వ్యాఖ్యాత పుంగనూరు జవాను. ఈ నవలలో అతడే కథకుడు కూడా. "పుంగనూరు జవాన్" అన్నది చిత్తూరు జిల్లాలో ఒక జాతీయం. పుంగనూరు జవాను మంచితనానికి మారుపేరు. అతడు తనకు మించిన లౌక్యుడు లేడనుకునే అమాయకుడు కూడా. ఈ నవలలోని పుంగనూరు జవాను తనకు పిచ్చి ఉందో లేదో తనకే తెలియని సందిగ్ధ సంధ్యలో ఉన్నవాడు. ఈ నవలలో యాభై ఏళ్ళ గ్రామ చరిత్ర ముష్టూరమ్మ సాక్షిగా, పుంగనూరు జవాను అమాయక మానవత్వంలో పరావర్తనం చెంది పాఠకునికి అందుతుంది. రచయిత మాటల్లోనే చెప్పాలంటే "ఇది అభివృద్ధేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే అవునన్నవాడు ఆలోచనాపరుడు, కాదన్నవాడు వెర్రిమాలోకం... అందుకే కాబోలు ఈ వలసదేవర ఒక పిచ్చి వాని ఆత్మకథగా రూపొందింది. అతని ఆత్మపేరు ముష్టూరు. అది పెద్దప్పగారిపల్లెగా పరిణమించే క్రమంలో ఖర్చయిపోయిన మానవతా విలువల్ని ప్రత్యక్షీకరించడమే ఈ నవల లక్ష్యం."

     ఈ నవల స్వాతంత్ర్యం రావడానికి కాస్త ముందుగా ప్రారంభమై ఈ దశకం ఆరంభం వరకూ సాగుతుంది. ఈ మధ్యకాలంలో మూడు తరాలు మారుతాయి. మొదటిది పెద్దప్పతరం. ఎర్రమరెడ్డి తరం రెండవది. వీరమరెడ్డిది మూడవతరం. ఈ మూడు తరాలూ గ్రామచరిత్రలో మూడు దశలు. స్థలకాలాల చైతన్యం కలిగిన ఈ నవల స్థలం ( స్పేస్ ) స్థాయిలో ముష్టూరు పెద్దప్పగారిపల్లెగా మారటమూ, కాలాన్ని (టైమ్) ఒక కుటుంబానికి చెందిన మూడుతరాల ఆధారంగా గణించవలసి రావటమూ పతనానికి ప్రారంభమని సూచిస్తుంది. తరం తరువాత తరంగా ఆ గ్రామంలో అన్ని రంగాల్లోనూ విలువలు పతనం కావడంతో చావలేక బతుకుతున్న కథకుడు పుంగనూరు జవానుకు తనది బతుకా చావా అన్న సందేహం రావడంతో నవల ముగుస్తుంది.

     పెద్దప్ప రాయలసీమలో ఇంతకు పూర్వం అక్కడక్కడా అరుదుగా కనిపించి ఈనాడు అదృశ్యమైపోయిన "బెనొవలెంట్ ఫ్యూడలిజం"ను కొద్దిగా తనలో మిగుల్చుకున్న పెద్ద రైతు. అతడు పెద్ద భూస్వామే అయినా ప్రజాకంటకుడు కాడు. అతనిలో రాజకీయద్వేషం, కులతత్వం లేవు. అతనికి ఊరన్నా ఊరికి తల్లయిన ముష్టూరమ్మ అన్నా అపారమైన ప్రేమ. పుంగనూరు జవానుకూ పెద్దప్పకూ మధ్య కూడా అనిర్వచనీయమైన ప్రేమాభిమానాలున్నాయి. ముష్టూరమ్మ, పెద్దప్ప, పుంగనూరు జవాను - వీరిమధ్య ఆత్మీయతాబంధం కొనసాగినంతకాలమూ గ్రామంలో శాంతీ, సమతుల్యతా ఉండేవి.

     పెద్దప్ప ముసలితనంలో ఆ గ్రామంలోకి రాజకీయాలు ప్రవేశించాయి. అధికారం అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కానీ అతడు అధికారం వెంట పరుగెత్తలేదు. తనను వెతుక్కుంటూ వచ్చిన రాజకీయాధికారాన్ని అతడు ముష్టూరు మంచికోసమే ఉపయోగించాడు. అతడు చనిపోవటం నవలలో ఒక ముఖ్యమైన మలుపు. గ్రామస్వభావం మారటానికీ, మనుషుల మధ్య ఆత్మీయతాబంధాలు తగ్గిపోయి ఆర్థిక సంబంధాలు పెరగటానికీ ప్రారంభం. పెద్దప్ప కొడుకు ఎర్రమరెడ్డి తరంలో మానవ సంబంధాల పతనం వేగవంతమౌతుంది. రాజకీయాలకు అధికారదాహంతోపాటు నేర ప్రవృత్తి అంటటం ప్రారంభమౌతుంది. గంధపు చెక్కల ఎగుమతీ, కాపుసారా వ్యాపారమూ ఊరి పెద్దలకు ప్రధాన వృత్తులయ్యాయి. వారు,"మడి సేద్యాలు చేయటం మాని దుడ్డు సేద్యాలు చేయటం" ప్రారంభించారు. అంతవరకూ అన్నదమ్ముల్లా మెలిగిన హిందూ ముస్లిములు బద్ధశత్రువులుగా మారిపోయారు. ఎర్రమరెడ్డి రాజకీయాలు క్రమక్రమంగా అధికార రాజకీయాలుగా, పదవీ రాజకీయాలుగా మారిపోయాయి. అతడు పల్లెను వదిలి రాజధాని చేరిపోయాడు. అధికార పీఠం ఎక్కిన తరువాత ఎర్రమరెడ్డి తన గ్రామానికి రాలేదు. అతడి శవమే వచ్చింది. ముష్టూరమ్మను మరచిపోయిన పెద్దప్పగారి పల్లెకు ఎర్రమరెడ్డి శవయాత్రే వలసదేవరైంది.

మూడవతరం వాడైన వీరమరెడ్డి కాలంలో అన్ని మంచి విలువలూ ధ్వంసమైపోయాయి. వాటి స్థానంలో డబ్బు ఒక్కటే అసలైన విలువగా నిలిచింది. ముష్టూరు పెద్దప్పగారి పల్లెగానూ పెద్దప్పగారి పల్లె పేటగానూ మారింది. కానీ లోలోపల పూర్తిగా నుసిపట్టిపోయింది. ఊరి పెద్దల పార్టీ మారిందికానీ, వారి నీతి మరింతగా దిగజారిపోయింది. నీతిలేని రాజకీయనాయకులూ, వైద్యం రాని వైద్యులూ, చదువురాని అయ్యవార్లూ ఊరిని దోచుకోవడం ప్రారంభించారు. ఊరికీ పుంగనూరు జవానుకూ ఎంతోకాలం కొనసాగిన ఆత్మీయబంధం తెగిపోయింది. ఒకనాడు అతనికి కడుపునిండా అన్నం పెట్టడమే ధన్యతగా భావించిన ఊళ్ళో అతను బిచ్చమెత్తినా అన్నం పుట్టని పరిస్థితి ఏర్పడింది. చిట్ట చివరికి అతని గుడిసెకూడా లంపెన్ రాజకీయ నాయకుల భూదాహానికి కూలిపోతుంది. ఊరితో సంబంధం తెగిపోయిన పుంగనూరు జవాను తన చివరి రోజుల్ని ముష్టూరమ్మ గుడిలో గడపాలని నిశ్చయించుకుంటాడు.

కొంతకాలంగా నెలకోసారి తనవద్దకొచ్చి రెండు బీడీకట్టలిచ్చి, తన వేలిముద్రలు వేయించుకు వెళ్తున్న జంపు జీతగాణ్ణి (ఎత్తుగా ఉన్న ఉద్యోగి) కలుసుకుని తాను ముష్టూరమ్మ గుడికి మారానని చెప్పిరావడానికి బయలుదేరతాడు పుంగనూరు జవాను. అక్కడ ఆరా తీస్తే జంపు జీతగాడు తనపేర వృద్ధాప్య పింఛన్ తీసుకునేవాడనీ, అందుకే నెలకోసారి తనవద్దకు వచ్చి వేలుముద్రలు వేయించుకువెళ్ళేవాడనీ, అతడు బదిలీ అయిపోతూ తాను చనిపోయినట్టుగా లెక్కల్లో రాసి వెళ్ళాడనీ అతని స్థానంలో వచ్చిన కర్రిజీతగాడిద్వారా తెలుస్తుంది. పుంగనూరు జవానుకు ఇది పెద్దప్పగారి పల్లె పతనానికి పరాకాష్ఠగా కనిపిస్తుంది. మానసికంగా క్రమక్రమంగా చచ్చిపోతున్న పుంగనూరు జవానుకు భౌతికమైన చావు జ్ఞాపకం వస్తుంది. గుడికి చేరుకున్న తరువాత ముష్టూరమ్మ "నువ్వు బతికే ఉన్నావా జవానా? అని పలకరిస్తుంది. దాంతో తనది చావో బతుకో అర్థం కాకుండా నిలబడిపోయిన జవానుమీద మన దృష్టిని కేంద్రీకరింపజేసి నవలను ముగిస్తాడు రచయిత. క్రమక్రమంగా రూపొందుతూ వచ్చిన ప్రశాంత విషాదం పాఠకుడిని కమ్ముకుంటుంది.

వలసదేవరలో చక్కని నిర్మాణం ఉన్న కథలేదు. ఈ నవలలోని కథావస్తువు సరాసరి జీవితంలోనుంచి కాకుండా జీవితాన్ని చూస్తు    న్న పుంగనూరు జవాను వ్యాఖ్యానంలోనుంచీ రూపొందుతుంది. కథకు ప్రాధాన్యత లేదు కాబట్టీ ఈ నవలలో పాత్రలక్కూడా ప్రాధాన్యం లేదు. కొన్ని పాత్రలు మొదటినుంచీ చివరివరకూ కొనసాగినా కథావస్తువుకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటాయి. రాజకీయాల్లో వచ్చిన పతనానికి మూడు తరాల పెద్దప్ప కుటుంబమూ, రాజకీయ నేర ప్రవృత్తికి ప్రసాదూ, రాజకీయ అవకాశవాదానికి ఎర్రమరెడ్డీ నారప్పనాయుడూ, కృతజ్ఞతను మరచిపోయిన ధనాశకు ఊశన్నా, మమకారానికి సిద్ధమ్మొదినా.., ఇలా అనేక పాత్రలు ప్రతీకల్లా అప్పుడప్పుడూ కనిపించి కథావస్తు వికసనానికి దోహదం చేసి అదృశ్యమైపోతూ ఉంటారు. పూసల్లాంతి ఈ పాత్రల్ని ఏకం చేసే సూత్రం పుంగనూరు జవాను. అతడు కథావస్తువుకు ద్రష్ట, వ్యాఖ్యాత. మనస్తాత్వికమైన లోతు తక్కువగా ఉన్నా పాఠకుడి మనసులో శాశ్వతంగా నిలచిపోయే పాత్ర ఇతనిదే. మానవత్వం కనిపించినప్పుడు ఇతను అనుభవించే సంతోషం, అది లోపించినప్పుడు అతడు పడే విషాదం పాఠకుడి హృదయంలో ప్రతిధ్వనిస్తాయి. పెద్దప్ప వారసుడు ఎర్రమరెడ్డి కావలి కొట్టంలో జెండా ఎగరేస్తున్నప్పుడు అతనిలో కలిగిన జుగుప్సా, పీరూ సాహెబును సిద్ధమ్మొదిన దేవర్ ప్రీతి చేస్తే ఆ నింద ముష్టూరమ్మ మీద పడినప్పుడు అతనిలో కలిగిన వేదనా, నిన్నమొన్నటిదాకా అన్నదమ్ముల్లా బతికిన హిందువులూ ముస్లిములూ హింసాకాండకు దిగితే అతనికి కలిగిన ఆశ్చర్యం, అయ్యవారి కూతురు సురేఖమ్మ ఆసాది సూరిగాణ్ణి పెళ్ళి చేసుకొస్తే వాళ్ళకి తన గుడిసెలో చోటిచ్చిన అతని సాహసం, కుటుంబానికి లక్షలు సంపాదించి పెట్టిన మస్తానీకి భయంకరమైన రోగం వచ్చి అన్నదమ్ములు ఆవిడను తిరస్కరించినప్పుడు ఆవిడకు ప్రియంగా సేవలు చేసిన అతని కారుణ్యం, తనకే అర్థం కాని తన పిచ్చిని గురించి ఆలోచించుకుంటూ దుర్మార్గానికి పొలిగావు అయిపోయి దేవతగా మారిపోయిన తన అక్కకూతురు గంగను తలుచుకుంటూ అతడు పడ్డ బాధ హృదయం ఉన్నవాళ్ళకు మరపురావు.

వలసదేవరలో మనల్ని ఆశ్చర్యపరిచే శిల్పాంశం కథన చాతుర్యం. కథాకథనంగా కాక అనుభూతి కథనంగా సాగిన ఈ నవలలో విసుగుకూ విరామానికీ ఆస్కారం లేదు. సూచన విలువనూ వర్ణన అవసరాన్నీ తెలుసుకున్న ఈ కథనంలో ఈ రెండూ హద్దులు దాటలేదు. ముష్టూరి ప్రజలు వలసదేవర చేయటాన్ని డాక్యుమెంటరీ పద్ధతిలో వర్ణించిన విధానంలోనూ గ్రామంలో లైంగిక నీతి పతనం కావడాన్ని సూచించిన విధానంలోనూ రచయిత కథన చాతుర్యం బయటపడుతుంది.

జానపద జీవితాన్ని చిత్రించడానికి జానపద కథనం బాగా నప్పుతుంది. అది పటిష్ఠంగా కుదరాలనుకుంటే జానపద కథకుడు ఉండటం మంచిది. అంటే ఉత్తమ పురుషలో కథ చెప్పాలన్నమాట. కానీ కథకుడు జీవిత వాస్తవికతలోనివాడు కాకపోతే, కథకూ కథనానికీ మధ్య దూరాన్ని భాషలో వ్యక్తం చెయ్యటం తేలిక. అలా కాకుండా కథకుడు జీవిత వాస్తవికతలో (కథలో) భాగమైనప్పుడు, భాష గొప్ప సమస్యగా రూపొందుతుంది. కథా, కథనమూ ఒకే ప్రాంతీయభాషలో ఉండటం చేత, పఠనీయత తగ్గుతుంది. కథకూ కథనానికీ మధ్య భాష మారితే అసహజంగా ఉంటుంది. ఇలాంటి భాషాకృత్రిమత్వం ఈ నవల్లో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కథకుడైన పుంగనూరు జవాను యథేచ్ఛగా మాండలికాల మిశ్రమం చేస్తూంటాడు. ఏ మాండలికమూ కాని సంకర భాషను కూడా ఉపయోగిస్తూంటాడు. అతని కథనంలో భాషాసమత్వం లేకపోవడం ఈ నవలలోని ప్రధానలోపం. ఈ నవలను మళ్ళీ పత్రికల్లో ప్రచురించే ముందుగానీ పుస్తకరూపంలో ప్రచురించే ముందుగానీ భాషను ఈ దృష్టితో బాగా సవరించాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను.

ధనం, మతం, కులం మానవ సంబంధాలను తారుమారు చేసిన పద్ధతినీ, ప్రభావితం చేసిన రంగాలనూ రచయిత పొరపాటు లేకుండా గుర్తించి చిత్రించాడు. కానీ, గత యాభై సంవత్సరాల రాజకీయ జీవిత చిత్రణే కాస్త అసమగ్రంగా ఉంది. అధికార రాజకీయాలను చిత్రించాలని ప్రయత్నించినప్పుడు.., రాజ్యం, రాజ్య స్వభావం, భావజాలధోరణులూ కథనంలోకి రావలసి ఉంటుంది. ఈ ప్రయత్నం ఈ నవలలో సంతృప్తికరంగా జరగలేదు. రచయిత చిత్రించిన ప్రాంతంలో ఉన్నవి కాంగ్రెస్, తెలుగుదేశం రాజకీయాలు మాత్రమే కాదు. ఇతర రాజకీయ భావజాలాలు కూడా ఆ ప్రాంతం మీద ముద్రను వేశాయి. అవి కూడా కథనంలోకి రాలేదు.

ఈలోగా వచ్చిన నవలల్లో ఇంత జీవిత విస్తృతీ, కథన చాతుర్యమూ ఉన్న నవల రాలేదు. ఇంత జీవితం తెలిసిన రచయిత, తన జీవిత దృక్పథమేమిటో తెలుసుకోవలసి ఉంది. ఈ రెండూ కుదిరిననాడు రామచంద్రమూర్తి తెలుగు నవలా సాహిత్యాన్ని పరిపుష్టం చేయగల సామర్థ్యం ఉన్న రచయిత అనటానికి సందేహం లేదు. [4]

మూలాలు మార్చు

  1. "'ఆటా' తొలి నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన".[permanent dead link]
  2. 2.0 2.1 "రెండు నవలల ఆవిష్కరణ". Archived from the original on 2017-04-15. Retrieved 2018-12-31.
  3. "తెలుగు బుక్స్ డాట్ ఇన్ లో పుస్తక పరిచయం".[permanent dead link]
  4. జానపద కథన గ్రామాయణం : వలసదేవర. ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక,. 5 అక్టోబరు 1998.{{cite book}}: CS1 maint: extra punctuation (link)

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=వలస_దేవర&oldid=3889680" నుండి వెలికితీశారు