గోవర్ధన్ ముక్కు
జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహస్థితిలో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.హస్తసాముద్రికము, గోచారము, నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది.