జెండామాన్ ఇస్మాయిల్ మార్చు

 
జెండామన్ ఇస్మాయిల్ (ఆధునిక తెలుగు కవి)

విడువబోరు ఘనులు విద్యుక్త ధర్మంబు

నింగినున్న తాను నేలనున్న

రమణికాలినున్న రవళింపదా మువ్వ

అఖిలలోక మిత్ర ! ఆంధ్రపుత్ర ......

                                            జెండామాన్ ఇస్మాయిల్ గారి కలం నుండి జాలువారిన ఒక పద్య (ఆ. వె. ) రత్నం.

జెండామాన్ ఇస్మాయిల్ గారు 1956 వ సంవత్సరంలో  కర్నూలు జిల్లాలోని పత్తికొండ గ్రామంలో ‘ఖాసీం, హుశేన్ బీ’ నిరుపేద దంపతులకు జన్మించారు. కడు పేదరికంలో జన్మించిన ఇస్మాయిల్ బాల్యం ఎక్కువగా పచ్చటి పొలాలలో మొగ్గ విప్పింది. ప్రకృతిలో మమేకమై రైతులు పొలంలో సరదాగా పాడుకునే గ్రామీణ పాటలకు, కవిత్వాలకు ఆకర్షితుడై, వారితోపాటే గళం కలుపుతూ తనలోని కళకు బీజం వేశారు.

              అదే సమయంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాస  కొనసాగించారు. తెలుగు ఉపాధ్యాయుడు అయిన ‘జె. యస్. ఆర్. కె. శర్మ’ గారి  పద్యపఠనానికి, బోధనకు ఆకర్షితుడై తెలుగు పద్యాలు, కవితలపై మెల్లమెల్లగా పట్టుసాధించారు. కలం పట్టి తనలోని సాహిత్య నైపుణ్యానికి పదునుపెట్టారు. రామచంద్రాపురం (కొట్టాల) మాలపట్టు వెంకట్రామయ్య గారి శిష్యరికంలో మహాభారతం,రామాయణం వంటి మహా గ్రంథాలను అవపోషణ పట్టారు. అందులో గల సంఘటనలు, వృత్తాంతాలు తనలో చెరగని ముద్రలు వేశాయి.

              ఇస్మాయిల్ గారు ముస్లిం(మహమ్మదీయుడు), మాతృభాష ఉర్దూ అయినప్పటికీ  హిందూ మహాకావ్యం అయిన మహాభారత పద్యాలను కంఠోపాఠం చేసి తనతోటి స్నేహితులకు వినిపిస్తూ ఉండేవారు. తాను ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలి అని సంకల్పించి 1979 లో ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలలో కొలువు సాధించారు.  వృత్తి పట్ల అంకితభావం, తెలుగుపట్ల ఎనలేని మక్కువ కవిగా అడుగులు సాగించాయి. ఒకవైపు బోధన సాగిస్తూనే  మరొకవైపు పద్య రచన సాగించేవారు. నీతిపద్యాలను రాస్తూ వాటిని రాగయుక్తంగా తన విద్యార్థులకు వినిపిస్తూ వారిలో తెలుగుభాషపట్ల ఆసక్తిని పెంపొందించేవారు.

              తాను  రచించిన పద్యాలను అఖిలలోక మిత్ర! ఆంధ్ర పుత్ర! అనే మకుటంతో ‘సూక్తి సుధా లహరి’ అనే శతకాన్ని రచించి 2001 వ సంవత్సరంలో ముద్రించారు.  అంతేకాకుండా ‘మహతీ సాహితీ సమితి’ అనే సాహిత్య సంస్థ ను స్థాపించి కార్యదర్శిగా  రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారు.  తాను చేస్తున్న సాహిత్య కృషికి మరియు ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకితభావం గుర్తించిన రాష్ట్రప్రభుత్వం 2002వ సంవత్సరంలో ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు’ గాను,  2003వ సంవత్సరంలో ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు’గా పురష్కారాన్ని అందించి  సత్కరించడం మే కాకుండా 2006వ సంవత్సరం రాష్ట్రం నుండి  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ప్రతిపాదనలు పంపింది. 

జెండామాన్ ఇస్మాయిల్ గారి విద్య బోధన పట్ల అంకితభావం, రచనల ద్వారా సాహిత్య అభివృద్ధికి తాను చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2006వ సంవత్సరం అప్పటి  భారత రాష్ట్రపతి శ్రీ జే.పీ.జే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి’గా పురస్కారం అందుకున్నారు.

       తను నిరంతర రచనా పాటవాన్ని సాగిస్తూ లలిత కల్పవల్లి! తెలుగు తల్లి!,  ఆంగ్ల పదం (వినోదం – విజ్ఞానం), శ్రీ షిరిడి సాయినాథ గిరి అనే పుస్తకాలు రచించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలలో భాగంగా నిరక్షరాస్యత నిర్మూలన, బాల్యవివాహాల నిర్మూలనలపై  సామాజిక స్పృహ కలిగిన రచనలను ప్రజలలోకి తీసుకెళ్లారు.

     కడు పేదరికంలో జన్మించి ఎన్నో కష్టాలకోర్చి తాను బాల్యంలో పడ్డ కష్టాలు గుర్తుకుతెచ్చుకుంటూ బాలలు పొలాల్లో, కార్ఖానాలో బాల్యాన్ని వృధా చేయడం తగదంటూ కవిత్వం ద్వారా తన నిరసన తెలిపేవారు అందులో చిన్న ఉదాహరణ....

కప్పులు కడిగే కూనలారా!

బుట్టలు మోసే బుడతల్లారా !

బాధలు బండలు భుజాన మోసి...

బతుకులు మోసే బుడత లారా..!

                             పొగలు సెగల ఖర్ఖానాలు, చీకటి గనుల గయ్యారాలు..

                             బస్సు షెల్టర్లు, ప్లాట్ పారాలు.. వీటికా మీరు వారసులు .. అంటూ బాలకార్మికులను బడికి స్వాగతించారు.

మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగుభాషపై మామకారంతో తెలుగు నూడికారాన్ని చిన్నప్పటినుంచి తనలో ఇముడ్చుకున్నారు. అందుకే తెలుగుతల్లిని తన శతక పద్యాలతో అభిషేకం చేశారు. ‘హైకులు, నానీలు వంటి సాహిత్య ప్రక్రియలలో పొట్టి పొట్టి పదాలతో గట్టి భావాలను స్పృశించి సాహితీ అభిమానులను అలరించారు... తెలుగుతల్లి సేవలో తరించారు. తన జీవిత కాలంలో అనేక ప్రపంచ తెలుగు మహాసభలు, అష్టావధానాలలో పాల్గొని అనేకమంది ప్రముఖులు, ఆధునిక కవులు, రచయితల చేత మెప్పు పొందారు.  నిరంతరం ప్రముఖ పత్రికలలో కవితలు, బాల వినోద పద్యాలు, పొడుపు కథలు రచించేవారు. సంప్రదాయ సాహిత్య రచనకు, కవిత్వానికి కులమతాలు అడ్డుకాదని తెలిపి తెలుగు సాహితీ ఔత్సాహికులందరికీ ఆదర్శవంతులైనారు.

మహా వ్యక్తి జెండామాన్ ఇస్మాయిల్ గారు 2013 వ  సంవత్సరంలో ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసినప్పటికీ తన శేష జీవితంలో అనేక రచనలు సాగించేవారు.  ఆధునిక కవులలో ఒకరైన జెండామాన్ ఇస్మాయిల్ గారు 2020వ సంవత్సరం ఆగస్టు మాసంలో  స్వర్గస్తులు అయ్యారు.