అనంత విశ్వ సత్యం, లోకం తీరు, మీ శక్తిని సాధించండి.

                         - బాబా సర్వకేంద్ర

1. స్నేహ దీపము అతి గొప్పది. ఒక మంచి మిత్రుడుండిన ప్రపంచాన్ని సాధించవచ్చునన్నాడు హిట్లర్. ఎదుటివారి ఆంతర్యం ఎరింగి స్నేహం చేయాలి. వ్యక్తి పురోభివృద్ధికి స్నేహమువలె శతృత్వము కూడ అవసరమే. నెలలో ఒక పున్నమి, ఒక అమవాస్య వస్తుంది కదా! అటులే ప్రతిపక్షమున్నప్పుడే స్వపక్షము సరిగా పనిచేస్తుంది. “నన్ను ప్రేమించి, స్థుతించువారంటే నాకెంత ఇష్టమో, నన్ను ద్వేషించి, తిరస్కరించి, తూలనాడువారంటే కూడా నాకంతే ఇష్టమని నేతి హరి కాళీ బాబా గారి స్వాత్మ నిశ్చయం”. మనలను విమర్శించి తిట్టే ఒక శతృవు కూడా ఉండాలి. ఆత్మ పరిశీలన గావించుకొని, విమర్శ సరియైన సవరించుకోవాలి. లేదా లెస్సగ నవ్వి ఊరుకోవాలి.

2. ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని మనలను గూర్చి విమర్శించేవారి విషయంలో అసూయపడరాదు వారి విషయంలో ప్రేమతో వ్యవహరించవలయును. ఒక విమర్శకుని కొనవలయును. ఏ విమర్శను ఐనా అడ్డుగా, అవమానంగా భావించరాదు. ముందుగ వినాలి. పనికివచ్చు భాగమును మాత్రమే తీసుకోవాలి.

3. నిజము చెప్పాలనిన మానవ పురోభివృద్ధికి విమర్శలు పూల పొదరిండ్లవలె చాలా అవసరము. సలహాలు, విమర్శలు వినకుండా కోపము, అసహ్య భావము వృద్ధిచేసికొనిన మనకు చక్కని సలహాలు బయటనుంచి రావు. ఎవరి తప్పులు వారికి తెలియవు.

4. కొందరు చెప్పవలసిన దానికన్న ఎక్కువగా చెబితే గొప్పయని భావించి, వేళాకోలముగా తమ అభిప్రాయమునంతా ఒక్కసారి ఎదుటివారిపై రుద్ది, ఉక్కిరి బిక్కిరి చేయచూసెదరు. అట్టివారిని మూర్ఖ శిఖామణులనవచ్చు.

5. కొండ అద్దమందువలె పరిస్థితులనుబట్టి సమయోచితముగా మెలగాలి. క్రమశిక్షణకు భంగం వాటిల్లరాదు. విమర్శలకు రెచ్చిపోరాదు. ఎవరి దృక్పథంలో వారి విమర్శలు సబబు కాగలవు.

6. ఒక్కొక్కసారి వ్యతిరేక వాదనను సైతము ఒప్పుకొని, సమయానుకూలముగ సత్యపరిధిలో ప్రతిఘటించాలి. ఇదియే నా అభిమతము. ఏ సమయంలోగాని ఇతరులకు భీతిల్లి నిరాశ చెందరాదు. హృదయాంతర్ ప్రబోధకుని అనుసరించవలయును. లోకమంతా ఏకమై విమర్శించినను అంతర్వాణి సత్య సూచనలో ఉన్నప్పుడు బాధలేదు. లోకమంతా పొగిడినను అంతర్ స్థితిలో లోపముండిన తాను పాపియే. ఇదియే సర్వలయ సర్వేశ్వర చట్టము.

7. తిట్లు, విమర్శలు మనలను బాగుచేస్తాయేగాని చెడగొట్టవు. పౌరుషం, రోషం ఉండట మంచిదేగాని వాటి ఫలితాలు అసహ్యంగా ఉంటాయి. గొప్ప, తక్కువయనే తారతమ్యాలు వదలినపుడే లోకంలో నిలబడగలవు. 8. “ఎంత గొప్పవాడైనా విమర్శకు అతీతుడు కాడు” అన్నాడు నెహ్రూ. “మెచ్చుకునేవాడిని అభినందించకు, విమర్శించేవాడికి నమస్కరించు” అన్నాడు ప్లాటో. “గెలుపు సాధించడానికి తగిన పట్టుదల, ఓపికగల వ్యక్తికి విజయం, అపజయం కాలయాపనగా తాత్కాలిక అవరోధమే” అన్నాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. “నేను చేసిన మంచి


- 2 - పనిని గురించి ఎవరూ చెప్పనక్కర్లేదు. చెడ్డపని గురించి మీరందరూ చెప్పాలి” అని ఐనిస్టయిన్ తన స్నేహితుల్ని అడిగేవారు. అందులకే మన పనిని గూర్చి ఇతరుల అభిప్రాయం అడిగి తెలుసుకోవాలి. చులకన అనుకోరాదు. కలసి ఉంటే కలదు సుఖము.

9. విమర్శలు సహజంగా వస్తాయి. వాటిని గూర్చి బాధపడనవసరం లేదు. లోటుపాటులుండిన సర్దుకోవడానికి విమర్శ పనికివస్తుంది. విమర్శకుని తనకు శతృవుగా, అపకారిగా భావించరాదు. తప్పు తెలిసినపుడు ఒప్పుకోవాలి. ఒక తప్పును కప్పిపుచ్చాలనిన వంద అబద్దాలు ఆడవలసి వస్తుంది. గ్రహించిన తప్పును, పొరపాటును మరల రాకుండ చూసుకోవలయును. అన్ని వైపులనుంచి మనపై విమర్శలు వచ్చాయనిన మనం అద్భుతమైన కృషి చేసియుండాలి, లేదా సర్వనాశనమైనా చేసియుండాలి.

10. సర్వ సమర్థునికూడ లోకము అసూయతో చూస్తుంది. గోరంతలు కొండంతలుచేసి, లేనిపోని అబద్దాలను సృష్టిoచి, విమర్శించేవారు లేకపోలేదు. అది వారికి వేడుక. ఇట్టి విమర్శలకు ధీరుడైన ప్రాజ్ఞుడు చింతించడు, భయపడడు. ఏ బాధ్యతలేని దద్దమ్మలే ఇతరులను తేలికగా న్యాయం, ధర్మం అంటూ బాధపెట్టగలరు, విమర్శించగలరు. అట్టి చొప్పదంటు విమర్శలను విజ్ఞులు లక్ష్యపెట్టరాదు. మనసులో ఉంచుకొనక ఆనందముగ స్వప్రయత్నములో సాగిపోవాలి.

11. కొందరు బయటికి చూడ మెచ్చుకున్నట్లు ఉండియే లోన ఈర్ష్యను ప్రకటిస్తారు. అందులకే ఇతరుల మెప్పు అనవసరం. మెప్పులు మాసిపోగలవు.

12. ఏ వ్యక్తినైనా ఆ వ్యక్తిగా గాంచిన అతనిలో మహోజ్వల భవిష్యత్తు ఉంటుంది. అలాగాక అతడు ఇలాంటివాడు, అలాంటివాడని ప్రతి విషయానికి తప్పులుబట్టి, చులకనచేసిన అలాంటివాడుగానే మారగలడు. మనము అనుకున్నదానిని బట్టియే మనపనులు సాగిపోగలవు. మనం అనుకున్నదానికంటే బాగా చేయగలం అన్న ధీమాతో నిలవాలి.

13. నిజముగా ఎవరి సలహా అక్కర్లేదు. మనపట్ల అభిమానంగలవారి సూచనలు, సలహాలు మనకు మంచి మార్గాన్ని చూపిస్తాయి. పెద్దలు చూపిన మార్గం సరియైనదేకాదు సురక్షితం అనుకోవాలి. ఎవరికైనా అన్నము పెట్టిన ఆ పూటవరకు ఆకలి తీరుతుంది. కాని భవిష్యత్ ఎలా తీర్చిదిద్దుకోవాలో అని సూచన యిస్తే అది జీవితాంతం పనికివస్తుంది. “పంచభక్ష్య పరమాన్నాలకన్న ఒక చక్కని సలహా మిన్న.” అందులకే వారి మాటలు వినాలి.

14. ఆవేశంలో వివేకం మరుగుపడుతుంది. ఆ సమయంలో మాట్లాడినను, తప్పుగా వ్యవహరించినను చిత్తనిలుకడగలిగిన పిదప అయ్యో! తొందరపడితినేయనే సంక్షోభం హృదయంలో చెలరేగుతుంది.

15. బాధకలిగినపుడు ఒక్క క్షణం ఆగి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అందరికీ అన్ని పనులు తప్పులేకుండా చేయాలని వుంటుంది. కాని తప్పులు అనుకోకుండా దొర్లుతాయి. మనిషికి తప్పు కనపడటం సహజం. అందుచేత తప్పును చూసి భయపడరాదు. ఆందోళన అవసరంలేదు. ఎవరిని వారు అర్థం చేసుకోకుండా ఏ పనికి పనికిరారు. తెలుసుకున్న తప్పులు జరుగకుండ చూసుకోవటమే మహనీయ లక్షణం. - 3 - 16. లోకం విమర్శనాలయం. దేనిని స్వేచ్చగా తీసివేయలేము. ప్రతి మాట, ప్రతి తిట్టు, ప్రతి విమర్శ, ప్రతి అనుభవం అంతరంగంలో అలంకారమై పనిచేస్తుంది. ఇది నిజం.

17. ఎంత తీపిగల పరమాన్నమైతేనేమి అతివేడిగ యుండిన ఎవరు స్వీకరించలేరు. అటులే ఎంత మంచి మాటయైనను, సలహాయైనను ప్రేమ పూర్వకంగా ఉండవలయునేగాని కఠువుగా ఉండరాదు. అందులకే దేనినైనా విమర్శించే బదులు, సున్నితంగా హృదయమునకు గాయం తగులకుండ సలహా యివ్వాలి, సంస్కరించాలి. నిర్మూలన కాదు, నిర్మాణము ముఖ్యము.

18. ఓ వివేకీ! నీవు నిజముగా నీ అంతరేక్షణ ప్రకారము సత్యపరిధిలో ఉన్నప్పుడు నీవు ఏ విషయంలోగాని ఎవరెన్ని వంకలుబెట్టి ఎక్కిరించి, ఎగతాళిచేసి, విమర్శించినను ఏమాత్రం లెక్కచేయక నీ పని పూర్తయ్యే పర్యంతం మౌనశీలివై మారు పలుకవద్దు. అంతే. ఆఖరికి మొదట ఆంతర్యం ఎరుంగక వాగిన, మొరిగిన కుక్కలన్ని సిగ్గుపడి క్షమాపణ వేడుకోగలవు. ఇది పరమ సత్యము. మంచివారికి అష్టకష్టములు ఎదురైనా తేలిపోగలవు. ఇది సనాతన ప్రకృతి ధర్మము. ఎన్ని కష్టాలు ఎదురైన అంత గొప్పవారు కావచ్చు.

19. ఎదుటివారి మాట విని, వినకముందే ఎగిరిపడి సమాధానము ఇచ్చుటకు పూనుకోరాదు. నీవు చెప్పటంలోగాదు, వినటంలో ఏకాగ్రత ఉంచాలి. అపుడే విషయం గ్రాహ్యం కాగలదు. చెబుతున్న వ్యక్తిని చూస్తూ అతడు చెప్పే విషయం మరువరాదు. వక్త ఏమి చెప్పునో అది ముఖ్యం. ఎదుటివారిని చెప్పనీయక మాటలకోసం తడబడరాదు. ఎటువంటి వాదననైనా సమగ్రంగా వినిన ఒప్పించడానికి అవకాశం ఉంటుంది. సమస్యను వినటంలో సగం పరిష్కారము కాగలదు.

20. కాలము అతి విలువైనది. గడచిన కాలమును తిరిగి సంపాదించలేము. కాలాన్ని వృధాచేస్తే జీవితం వృధా అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. మనలోని మంచిని, స్నేహభావాన్ని గుర్తించే లోకం కాదిది. లోకదృష్టి అపసవ్యంగా ఉంటుంది. అనుకోకుండా ఇతరులవల్లగాని, పరిస్థితులవల్లగాని కొంత ఇబ్బంది, కాలం వృధా అవుతుంది. దానిని గురించి తీవ్రంగా ఆలోచించి బాధపడవద్దు. జయం తథ్యం.

21. పురోభివృద్ధిని పొందగోరువారు పూర్వ వృత్తాంతమును మరువరాదు. చేయవలసిన పనులు చేసినా పనుల ఫలితాలు స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తడుముకోరాదు. తొందర కార్య సాధనకారి కాదు. శ్రమలో స్వర్గమును సృష్టించుకో! ఫలితమే పరమార్థము. శ్రమకు గుర్తింపు ఉండదు. ఫలితాలకే ప్రాధాన్యము. అందులకే ఎంత కష్టపడ్డామన్నది ప్రశ్నకాదు, ఎంత పట్టుదల, కార్యదీక్షతో పనిని సాధించాం అన్నదే ముఖ్య విషయం.

22. చేసే పనులు సాధించగలనన్న దృఢ విశ్వాసంతోపాటు, ఎన్ని కష్టాలు ఎదురైనను ఎదుర్కొనే పట్టుదల కూడా ఉండాలి. లక్ష్యంలేని నిష్ఠ, దారంలేని గాలిపటము వంటిది. గమ్యస్థానమును నిర్ణయించుకొనిన ఏ పనిని వదలరాదు. లే! సాహసివై నిలువు. పనులు వాటంతటవియే పూర్తికాగలవు. ధైర్యం వీడరాదు. పట్టుదల సడలరాదు.


- 4 - 23. ప్రతి ప్రయత్నం విజయం సాధిస్తే గర్వం, అహంభావం పెరిగి భవిష్యత్తుకు ఆటంకం కలుగవచ్చు. అందులకే కొన్ని సందర్భాలలో అపజయంకూడ మనకు సహాయం చేస్తుంది. ఆ సమయంలో మన గొప్పతనము పదును పెట్టబడుతుంది. అపుడు అంతర్ శక్తియుక్తులు ప్రకటించి, భవిష్యత్తును క్రమంగా రూపొందించుకోవచ్చు. అందులకే అపజయమును కూడా వరంగా స్వీకరించి సుఖనిద్ర పోవాలి.

24. థామస్ అల్వా ఎడిసన్ వేయిసార్లు ప్రయత్నించి ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టినాడు. నేడు ఆ వెలుగులో లోకం మెరుస్తుంది. అందులకే విసుగు పనికిరాదు. ప్రయత్నము మొదటిది. రెండవది అవకాశం. ప్రయత్న లోపమున్నచో ఫలితం ప్రశ్నార్థకమే! మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. అటులే ఎదుటివారిని నమ్మించి, మెప్పించాలనిన ముందుగ మనని మనం నమ్మాలి. మనశక్తిని మనం విశ్వసించాలి. మనని మనం మెచ్చుకోవాలి. సాధించగలం అన్న దృఢ దీక్ష ఉన్నప్పుడు నిరాటంకంగా పనులు సాగిపోగలవు. దోమల గుంపులు రైలుబండిని ఆపలేవు. ఆత్మలక్షణ కార్యము అట్టిది. లోక విఘ్నములకు అది వెనుదీయదు.

25. మన సేవకు, మంచికి గుర్తింపు లేనపుడు తీవ్ర మనస్తాపము కలిగి, దానికి సంకుచితుల విమర్శలు తోడైనపుడు కంటనీరు వస్తుంది. అసమర్థునిగ, పిరికివానిగ నిన్ను చిత్రీకరించినను బాధపడకు. సుఖముగా ఉండి, అవకాశాన్నిబట్టి ఎదురుదెబ్బ తీయవచ్చు. ఉభయుల మధ్య తగాదా సమస్యకు పరిష్కారంగా ఉండాలిగాని వేరుచేయునదిగా ఉండరాదు. ఏ సమస్యకైనా పరిష్కారం సిద్ధపరుచబడి యుండదు. ప్రతీదీ అమర్చబడినట్లు లభ్యంకాదు. ఒక సమస్య తెలియగానే ఎలా అని ఆందోళన చెందవలసిన పనిలేదు. సమస్య స్వరూపమును అర్థంచేసికొని, ఒక్కసారి నవ్వి, నేత్రములు మూసికొని ప్రశాంతంగా ఆలోచించిన సమస్య సంఘటనగా మిగులును.

26. చూస్తుండగా మన ఎదుట ఎన్నో మోసములు, అన్యాయములు జరుగుతుంటాయి. వాటిని గురించి తీవ్రంగా ఆలోచించేబదులు మరిచిపోవటం మంచిది. మనం ముందుకు పోవటానికి ప్రయత్నిస్తున్నంతకాలం ఇతరులగూర్చి, వారల ఫలితములను గూర్చి అసూయపడక మన ప్రయత్నాలకు అన్యాయం, విఘాతం కలిగినను సహించటం నేర్చుకోవాలి. ఏ నది చక్కగా సముద్రమున కలువదు. అనేక మెలికలు తిరిగి సముద్రము చేరుకుంటుంది. అలాగే ప్రతివారు గమ్యం చేరాలి. అనేక చిరాకులు, ఇష్టంలేని పనులు, ప్రతికూల వాతావరణం మన చుట్టూ వ్యాపించియున్నవి. అన్నింటిని సహించాలి. జీవితాంతం ఏకదీక్షతో పాటుపడాలి. అపజయము మీద అపజయముతో పోరాడి విజయం సాధించాలి. ఒక్కసారి విఫలమైన పట్టుదల వదలరాదు. ప్రయత్నం విఫలమైనదన్న ఆలోచన వదలి పట్టుదలకలిగి నిలువాలి. పట్టుదలలేని వ్యక్తిని ఎవరూ మార్చలేరు. అఖండ విశ్వాసం, దృఢ దీక్ష, వజ్ర సంకల్పం, తరుగని పట్టుదల కలిగి ఉండాలి. ఏ పనియైనా ఒకేసారి అద్భుత ఫలితాన్ని సాధించలేదు, ఓపిక ముఖ్యం.


27. ప్రతీకార వాంచ బలహీన లక్షణము. ఏ విషయంలోగాని పగ సాధింపు ధోరణి తెచ్చుకోరాదు. ఎందులకనగా కోపంతో తీసుకున్న నిర్ణయం, చర్య కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. సమస్యలకు భయపడి కృంగిపోరాదు. కానున్నది కాకమానదు. ధైర్యముగా నిలిచి వ్యతిరేక దృక్పథాన్ని అతిక్రమించాలి.

- 5 - 28. ఒక సమస్య ఎదురైనపుడు దానినుండి తప్పుకునే ప్రయత్నం చేసిన సమస్యలు ఎక్కువగును. సమస్య స్వరూపమును గ్రహించి పరిష్కారమునకు పూనుకోవాలి. సరియైన ఆలోచనలతో, శాంతియుత వాతావరణంలో ఆలోచించాలి. పరిష్కారం తెలియనపుడు ఫలితం అనుభవించుటకు సిద్ధపడాలి. ప్రశాంతంగా కూర్చుండి ఆలోచించిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందనుటలో సందేహంలేదు. చిన్న చిన్న సమస్యలే సర్దుబాటులేనపుడు గాలివానగా మారును. జాగ్రత్తగా పరిష్కరించిన అన్నింటిని సర్దుకోవచ్చు.

29. పైకి కనపడు విషయాలనుబట్టి కాకుండా మనిషి అంతరంగం పరిశీలించి స్నేహం పెంపొందించుకోవాలి. తెలియక స్నేహంచేసి ఆపై అసహ్యపడరాదు. తెలుసుకోకుండా స్నేహం చేయటం తప్పు. స్నేహంచేసి వదలిపెట్టటం మరీ తప్పు. స్నేహం అనిన అన్ని విషయాలలో ఏకాభిప్రాయమని అర్థం. దుష్టుడు, దుర్మార్గుడు అనే ప్రచారం అనవసరం. సరియైన మార్గంలో నడిపించి రక్షించటమే మంచి మిత్రుని ధర్మం.

30. అంతరాత్మ ప్రసంగమే పరిష్కారమార్గం. నిత్య జీవితంలో అనేక విషయాలు తటస్తపడును. కాని మాటలు, అనవసరమైన వగ్వివాదములు రావచ్చు. మనమీద ఎవరైనా అక్రమ నిందారోపణలు చేసినను, తిట్టినా, దూషించినా లెక్కచేయనక్కరలేదు. ప్రతి చిన్న విషయానికి బుర్ర పాడుచేసుకోరాదు. ఇతరులతో మాట్లాడటం అందరికి తెలుసు. మనసుతో మనం మాట్లాడటం నేర్వాలి. అపుడే మనోబలం, విశ్వాసం పెరుగుతుంది. జయాపజయాలను లక్ష్యపెట్టకుండా సాహసకార్యములను తెలపెట్టాలి. అప్రయోజక జీవితం వ్యర్థం. కమ్మగా కడుపునిండా తిని, హాయిగా కంటినిండా నిద్రపోతే లాభంలేదు. లే! సాహసం చేయి.

31. మేము దుర్బలులం, హీనులం, పనికిమాలిన చవటలం అని ఎవరిని వారు తీసివేసుకోరాదు. ముందుగ ఎవరిపై వారికి సానుభూతి ముఖ్యంగా ఉండాలి. లేనిచో బలహీనత, లోపం కనిపెట్టి లోకులు మీ చేష్టలకు అపార్థములు కల్పించి, హేళనచేసి, పదిమందిలో మిమ్ముల చులకన చేయడానికి, అధ:పాతాళమున పడదోయడానికి ఐనవారు, కానివారనక అందరు అసూయతో ప్రవర్తిస్తారు. అందులకే లోకాతీత మార్గం చేపట్టాలి. మండించిన వాయువే మంటను ఆర్పివేగలదు.

32. జరిగిన దానికోసం, నష్టపోయిన దానికొరకు విచారపడి కాలాన్ని వృధాచేయరాదు. అటులే అపనిందలు, చేయని తప్పుల గూర్చి ఆలోచించరాదు. అది నీకు అనవసరం. నీవు నీవై నిలువు.

33. పొరపాట్లు సర్దుకున్నపుడు అలవాట్లు మంచివే కాగలవు. నిరర్థక కబుర్లకు చెవియొగ్గి బుర్రను పాడుచేసుకోరాదు. ఇతరుల కాలాన్ని వృధాచేసే సంభాషణలు, పనులు చేయరాదు. అటులే మన సంగతి. అధిక సంభాషణ అపశ్రుతులకే దారితీస్తుంది.

33. సర్దుబాటు చేసుకోవటం, ఏమోపోనీ అనుకోవటం మంచిదికాదు. అనుకన్నది సాధించాలి. పట్టుదల వదలరాదు. లోక విమర్శలను లక్ష్యపెట్టరాదు. విసుగును విడిచి, సంతోషంతో, సంతృప్తితో విజయం సాధించగలనన్న ధీమాతో, ఆశతో, విశ్వాసంతో చేయాలి. అంతే! ఎలాంటి విమర్శలకు తలవంచరాదు.


- 6 - 34. నిర్ణయాలు తీసుకోవడానికి జంకటము, పదిమందిలో ఉద్రేకము, భయము చూపటం, చేతులు ముడుచుకొని కూర్చోవటం, ఆ పిదప అయ్యో అని విలపించటం తప్పు. ఇలాంటి చవట లక్షణాలకు స్వస్తిచెప్పాలి.

35. ప్రపంచంలో దురదృష్టవశాత్తు నిరాశ, నిస్పృహ, ప్రబలి ఉంది. కాలకూట విషం తర్వాత అమృతాన్ని సాధించారు దేవదానవులు. ఎంతమంది వ్యతిరేకించినను ఆత్మ విశ్వాసం, మానసిక శక్తి, లౌక్యం, సర్దుబాటుగల దేవతలకే అమృతం లభించింది. ప్రాప్తమును ఎవరూ తప్పించలేరు.

36. తనను తాను చులకనగా అంచనావేసికొని, భయాంధోళనలతో, ఉద్రేకముతో అందరిని అవమానించి, ద్వేషించి, మానసిక వ్యధకు గురియై ఆరోగ్యానికి, అభిమానానికి దూరమై, చేసిన ప్రతి ప్రయత్నం ఎదురుదెబ్బగా, శతృవులను సృష్టించేదిగా, జీవితమును నాశనం చేస్తుందని ప్రతి ఒక్కరు మరువరాదు.

37. మొరిగే కుక్కకు మౌనమే శాస్తి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు మూర్ఖత్వమును ఖండించాలి, భయపడరాదు. దుర్జనుడు దారుణ పన్నగము. వాని విషకోరలు పెరికివేయాలి. ఇంగిత జ్ఞానం తెలియజేయాలి. చాటున మొరిగే కుక్కల విషయం అనవసరం. ఎదురుగా వచ్చిన మాత్రం వదలరాదు.

38. కుటుంబంలోగాని, సంస్థలోగాని ఏదైనా మాట వచ్చినచో అనుకొని మరల సర్దుకొని కలసిపోవాలి. లేనిచో అరిష్టములు తప్పవు. ప్రేమచే వైరమును జయించాలి. పరస్పర అవగాహన, సద్భావంతో ఏ సమస్యనైనా క్షుణ్ణంగా .ఆలోచించవచ్చు. సర్దుబాటులేని శ్రమ బుద్ధి వికాసమునకు దోహదకారి కాదు. పరిస్థితులు, అనుభవంతో సర్దుకొని ముoదుకు సాగాలి. రకరకాల మనుష్యులతో ఆయా సందర్భములనుబట్టి ఎలా మెలగవలయునో, ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. పిడికిలి బిగించి వజ్ర సంకల్పంతో నిలువాలి.

39. తప్పు ఒప్పులను తేలికగా తీసుకోవాలి. ఒక్కరోజులో శక్తినంతా సాధించలేరు. క్రమేణ సాధించి, మనోబలాన్ని పొందాలి. అపుడే ఒడుదుడుకులలో నిలబడే శక్తి వస్తుంది. అబ్రహం లింకన్ అనేక సార్లు ఓడిపోయి ఆఖరికి అమెరికా అధ్యక్ష పదవిని పొందగలిగాడు.

40. లోకం విమర్శనాలయం. దానితీరుగ నడవాలనిన జీవితం గడవదు. ఒకడు గాడిదను ఎక్కమంటాడు. మరొకడు దానిది మాత్రం ప్రాణం కాదా అంటాడు. ఎంత మంచిగా మెలగాలని చూచినను లోకంలో విమర్శలు తప్పవు.

41. పరుగులు మానాలి. గొంతు చించుకొని కేకలు వేయటం, కంగారు పడటం మానాలి. నెమ్మదిని అలవరచుకొని ఇష్టమైన పనిలో నిమగ్నం కావాలి. ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తూ పరిశీలించాలి. ఎందుకు విఫలమౌతున్నామో కూడా పరీక్షించుకోవాలి. అట్టి మూలకారణమును తెలుసుకొని సవరించుకోవాలి. ఎవరిని వారే విమర్శించుకోవాలి.

42. సన్మార్గంలో ఒక్క అడుగు నీవు ముందుకు వేస్తే అనుసరించేవారు లేకపోలేదు. సత్ సంకల్ప బీజములు సమసిపోవు. అది దివ్యపంట. మంచిని సహించే లోకం కాదిది. డాంబీకము, దగాకోరుతనము, వంచనలు మించిపోతున్నాయి. సత్యంపేరిట నిలిచిన వ్యక్తి ఏనాటికైనా ఉన్నత స్థానమే చేరును. - 7 - 43. కాలుజారిన పిదప కర్మ అన్నా లాభంలేదు. గ్రహచారం అన్నా ఫలితంలేదు. నిజంగా కర్మ అనుకోవటం కూడా ఒకవిధమైన జాఢ్యమే అనిపిస్తుంది. అన్ని గీతలు హస్త రేఖలోనే కలవు. చేతలనుబట్టియే కర్మ. విధిని దాటి వర్తించ విధాతకైనను శక్యంగాదని మరువరాదు. ఎవరి విధికి వారే బాధ్యులు, కర్తలు, నిర్మాతలు, ప్రభువులు.

44. ఇనుముయందలి త్రుప్పు దానిని తినివేయునట్లు, ఎవరి దుష్కర్మ వారినే అంతమొందించును. పాము కోరలయందలి విషము దానికి చెరపు చేయక కరచిన వారికి హాని చేయునట్లు, అప్రయోజకులైన కొందరు సర్వదా ఇతరులకు ప్రమాదకారిగా ఉంటారు. అట్టివారిని జనాభా లెక్కలలో కూడా చేర్చుకోవటం సబబు కాదేమో అనిపిస్తుంది.

45. దెబ్బకు దెబ్బ కొట్టేవారున్నారు, కొట్టనివారున్నారు. శ్రీగంధపు వృక్షము తనను నరికిన గొడ్డలిని కూడా సుగంధ పరచునట్లు, తమకు నిండా హాని తలపెట్టిన దుర్మతులను కూడా హృదయస్ఫూర్తిగ క్షమించి, ఆశీర్వదించే ఆత్మజ్ఞులు లేకపోలేదులేదు. ఇట్టివారి సంఖ్య విశ్వంలో రుదు.

46. ఎవరికి యోగ్యమైనది వారే ఎన్నుకోవాలి. లౌకిక దృష్టి కెమెరా వంటిది. అందులకే బాహ్యమే వారికి తెలుసు. ఆంతర్యం తెలియదు. సుజ్ఞాన దృష్టి ఎక్స్ రే వంటిది. అపార్థములకే లోకంలో ఎక్కువ స్థానం కలదు. తాటిచెట్టు క్రింద కూర్చున్నా చాలు త్రాగుబోతు ఐనాడు అంటుందీ లోకం. అందులకే నిద్రలో ఊడిపోయిన వెంట్రుకవలె లోకాన్ని విస్మరించాలి. అపుడు లోక సంబంధము నిన్ను పీడించదు.

47. ఎన్ని నిష్టూరములకు ఓర్చియైనా సరే నిజస్థితిని కాపాడుకొనవలయును. విశ్వ కారణ జన్ములు తాము ఎందులకు అవతరించినారో తేటగ వారికి తెలియును కావున అంతర్ లక్ష్యంలో విహరిస్తారు. ఈ జాడ యోగీంద్రులకే తెలుసు. ఇతరులు తలకాయ పగులగొట్టుకున్నను తెలియదు.

48. ఈ లోకంలో కపట నాటకమే జాస్తిగా కలదు. అట్టివారలు పుచ్చకాయలావు విషపు ఉండను పుక్కిటిలో పెట్టుకొని, కడుపులో కత్తెర్లు, నోటిలో తేనె తుట్టెలు అన్నట్లు తియ్యగా మాట్లాడతారు. మనతో మాట్లాడే ప్రతివారు మన మిత్రులే అనుకోరాదు. అట్లని శత్రువులని కూడా అనుకోరాదు. నిమిత్తముగ నిలవాలి.

49. ఎంత ప్రయత్నించినను ఇత్తడికి పుత్తడి విలువరాదు. నోట అన్నంత మాత్రంచే ఇత్తడి పుత్తడి కాదు. పుత్తడి ఇత్తడి కాదు. అటులే మంచి చెడులగూర్చి అపసవ్యముగ చిత్రీకరించినంత మాత్రంచే విలువ మారదు. సత్యానికి సంకెళ్ళువేసి మంచిని సమాధి చేస్తున్నారు. ఐనా పరమ సత్యం మరుగుపడదు. అది ఉండి ఉండి మహా పిడుగు ధ్వని మించి ప్రేలుతుంది. ఆ సమయంలో దుర్మత స్వభావములన్నియు దగ్ధంకాక తప్పదు.

50. తనపై లోకమంతటికి నమ్మకముండినను, తనపై తనకే నమ్మకములేనిచో మాత్రం వ్యర్థం. లోకమంతయు తనపై నమ్మకము కోల్పోయినను, తనపై తనకు విశ్వాసం మాత్రం కోల్పోరాదు. నీ ప్రయత్నంలో ఎలాంటి లోపము లేనపుడు ఫలితం సాధించబడినను, సాధించబడక పోయినను బెంగలేదు. ఆత్మ విశ్వాసంతో కృషిచేయాలి. - 8 - 51. సమస్య నిప్పులాంటిది. దానిని చల్లార్చుకోవటానికి ప్రయత్నించాలి. ఒక చిన్న సమస్యవలన ఒక గొప్ప ప్రయత్నమును మానుకోరాదు. చిన్న నట్టు ఊడిపోయినదని పెద్ద యంత్రమును సముద్రమున ఎవరు పారవేయరుగద!

52. అసమర్థుని బలహీన లక్షణమైన ఎదురుచూచే అలవాటును మాని, ఎప్పటికప్పుడు క్షణ క్షణం తెలివితేటలు కలిగి మెలగాలి. నేటి కర్తవ్యం విస్మరించి రేపటి విషయం ఆలోచించరాదు. చేయదలచిన మంచి పనిని ఇపుడే, ఇక్కడే అనే అలవాటు ముఖ్యం. రేపు అనే మాట నీ లిస్టులో ఉండరాదు.

53. సఫల, విఫల, ఏ పరిస్థితిలోనైనా సంతోషించటం నేర్వాలి. సాధించిన మంచి పనిని, కృషిని తలచుకొని సంతోషించాలి. ఎవరో చేయమన్నట్లు విధిలేక చేయరాదు. ఇష్టమైన పనులు చేయుటకు ఏమాత్రం వెనుకాడరాదు.

54. సంతోషం ఇంద్రజాలంతో సాధించ వీలులేదు. సంతోషమన్నది హృదయస్థ భావం. మనసును బాధించే దృక్పథమును మనం తప్పించవచ్చు. ఇతరులు ఎవరో మనకు బాధ కలిగిస్తున్నారని నిందించటంకంటే ఎవరి దృక్పథములో వారు మార్పు తెచ్చుకొని, లోపాన్ని అర్థం చేసుకొని, సవ్యమార్గంలో నడవవచ్చు. చాలామంది మనసులోని భావాలను మలచుకోవడానికి బదులు వాటికి దాసులై, పరాధీనులై పరితపిస్తారు. పదే పదే చీకాకుపడతారు.

55. బాధలో ఉన్నప్పుడే వ్యక్తి తనను తాను ఎక్కువగా ఆలోచించాలి. తనకు తాను సానుభూతి చూపించుకోవాలి. అనగా మనల మనమే ప్రేమించుకోవాలి. ఇతరుల సానుభూతికోసం ఎదురుచూడరాదు. ఎందులకనగా కొందరు బయటికి మెచ్చుకున్నట్లుండియే లోలోన ఈర్ష్యను ప్రకటిస్తారు. అందులకే ఇతరుల మెప్పు అనవసరం. ముందుగ నిన్ను నీవు గౌరవించుకో.

56. మనిషిలో మానసిక వికాసము జరిగినపుడు సర్వతోముఖ ప్రగతి సాధ్యము కాగలదు. స్వశక్తియే కార్యసాదనకారి. ఎవరికి వారే ఆనందమును, శక్తిని ఇచ్చుకోవాలి. ఇంకెవరో తయారుచేసి ఇవ్వరు. ఆనందంగా జీవించటం అందరి జన్మ హక్కు. అది మహా కళ. ప్రతివారిని ఏదియో ఒక అసంతృప్తి, ఆవేదన పీడిస్తుంది. ఈ లోపమును కనిపెట్టి సవరించుకోవాలి.

57. శక్తిని కూడగట్టుకొని పనిచేసిన విజయం తథ్యం. ఎవరి అండదండలు అవసరంలేదు. ఎవరికివారే ఆనందాన్ని, శక్తిని ఇచ్చుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మన మంచిని మనమే చూసుకోవాలి. అపజయానికైనా, విజయానికైనా ఎవరికి వారే బాధ్యులు. అందుచేత మన జీవితాన్ని మనమే విజయవంతంగా సాగించటానికి ప్రయత్నించాలి. ఇతరులపై అధారపడటం చాలా పొరపాటు. మన భవిష్యత్తుకు మనమే సహకరించాలి. ఆనందంగా ఉండదలచుకుంటే ఇష్టంగాని పనులు మానాలి. బాధకలిగించేవి మానాలి.

58. ఏవో బాధలు మనసులో పెట్టుకొని వాతావరణాన్ని కాలుష్యం చేసికోరాదు. ఎవరో చెప్పింది వినరాదు. మన మంచి చెడులు, మన లోటుపాట్లు మనమే గ్రహించాలి. బాధ, అసంతృప్తి మాని మనకోసం మనం చేయగలిగింది ఏమిటో ప్రయత్నించాలి. బాధ్యతను మరొకరిపై నెట్టరాదు. - 9 - 59. తెలివితేటలతోపాటు తప్పొప్పులను గమనించగలగాలి. తాము చేసినది అంతా సవ్యంగా ఉందని, ఇతరుల వలన చెడిపోయిందని అనుకోవటంకూడా సరియైన దృక్పథము కాదు. ఏది చేయకూడదో, ఏది చేసిన మంచిదో ఆలోచించాలి. అసలు సాధించునది ఏమిటో ముందుగ తెలుసుకోవాలి. ఆ ఆనందాన్ని అనుభవించాలి. మనలను మనం మెచ్చుకోవటం నేర్చుకోవాలి. అపుడే మరికొన్ని మంచి పనులు సాధించవచ్చు. బాగా జరిగినంతకాలం ఎవరిని గురించి వారు సమీక్షించుకోరు. కష్టం, ఆపద వచ్చినపుడే అన్ని విషయాలు తీవ్రంగా ఆలోచించగలరు. ఈ పద్ధతి మంచిదికాదు. ప్రతి క్షణం మనల్ని మనం సమీక్షించుకోవాలి. ఇతరులతో అనవసరం. ఎవరి శక్తిని వారు గ్రహించాలి. మనము చేసిన పని మంచిదనే ధీమా ఉండాలి. ఇతరులు చెప్పేదాన్ని పట్టించుకోరాదు. ఇతరుల పొగడ్తలు వినటానికి సంతోషంగానే ఉంటాయి. కాని అవి త్వరగా మాసిపోతాయి. ఇతరుల పొగడ్తలకొరకు ఎదురుచూడరాదు. ఎవరి శక్తిని వారు మెచ్చుకోవాలి. ఎవరిని వారు హీనపరచుకోరాదు. లోకమంతా ఏకమై నిన్ను నిందించి, విమర్శించినను ఎంతమాత్రం లెక్కచేయరాదు. నిన్ను నీవు సమీక్షించుకో! నీ దృక్పథములో సంతోషమును స్థిరపరచుకో.

60. మన మనిషి, శ్రేయోభిలాషియని అవతలి మనిషిని గుర్తించనంతకాలం మనకు మేలు కలుగదు. ఇతరులను గూర్చి చెడుగా ఆలోచించే ముందు మనలో ఏదో లోపముందని గ్రహించాలి. మీరు మంచివారయినపుడు అవతలి వ్యక్తి మంచివాడే కాగలడు. ఒకవేళ మంచివాడు కానిపక్షంలో మనం అతన్ని తప్పించవచ్చు. వానికి మనం దూరంగా ఉండవచ్చు. ఇష్ఠంగాని మనుష్యులతో ఆలోచించే బదులు వారలను మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. లేదా మన పరిచయం నుండి తప్పించవచ్చు. అది మనచేతిలోనే గలదు. ఏమంటారు? నీకు మంచి ఏదో నీవు తెలుసుకోగలిగినపుడే నీ జీవితానికి మంచి చేయగలవు.

61. ఎన్ని భావాలు బాధపెట్టినను భయపడరాదు. అవిశ్వాసంతో బెంబెర్లెత్తటం, బెదిరిపోవటం మరీ ప్రమాదకరమైన దృక్పథం. నిరాశకు తావివ్వక, మనస్సును పాడుచేసి, జీవితాన్ని దెబ్బతీసే కోపం, కసి, అసహ్యం, అసూయ, నీచం, పగ, సోమరితనం ఇటువంటి అవలక్షణాలనుండి విముక్తి చెoదాలి. 62. సంతోషంగా ఉండటం, సరదాగా మాట్లాడటం, ఆలోచించి పనిచేయటం అలవర్చుకోవాలి. గమ్యస్థానము ముందుగ ఆలోచించి దానివైపు సాగిపోవాలి. ఎన్ని విఘ్నములు వచ్చినను లక్ష్యపెట్టరాదు. మనస్సులో భయాందోళనలు దాచుకోరాదు. ఏదైనా ముందుగనే చెప్పాలి. మభ్యపెట్టి మాట్లాడరాదు. ఆత్మ నిశ్చయంతో మెలగాలి. తాను ఆఖరికి ఏమి కాదలచుకున్నది, తాను ఏమి చేయదలచుకున్నది వ్రాసిపెట్టుకోవాలి. అందు నిమిత్తం అహర్నిశలు ఏకధీక్షతో పాటుపడవలయును. దీనికి మించి నేనిక ఏమి చెప్పదలచుకోలేదు.

63. జయాపజయములను, దూషణ భూషణలను సమానంగా తీసికోగలిగిన మానసిక స్థైర్యాన్ని అలవాటు చేసికోవాలి. ఏదియో ఐపోయిందని అనుకోరాదు. అపజయాన్ని కూడా సరిగా ఆలోచించాలి. అనుభవమే విలువైన మిత్రము.

64. ఇబ్బందుల్లో చిక్కినపుడు కంగారుపడరాదు. ఆ సమయంలోనే ఆత్మనిగ్రహం అవసరం. భయం, తగాదాల్లాoటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించవలయునన్నది స్వానుభవమునుబట్టి విశ్వ మనస్సు ద్వారా సెకండ్లలో బోఢపడుతుంది. స్థిర విశ్వాసం, అంతరేక్షణ అవసరం.

- 10 - 65. కోపముతో ఉన్నప్పుడు ఆడ్రనాల్ గ్రంథులు ఎక్కువగా పనిచేసి జీర్ణశక్తిని నిరోధించి, రక్తపు పోటుకు కారణమవుతుంది. అందులకే కోపంలో ఏ నిర్ణయమునకు రావలదు. శక్తిని సాధించాలనిన తగుమాత్రం కోపం చాలు. మెదడును ఆందోళన లేకుండా ఉంచితే చక్కని ఆలోచనలు వస్తాయి. చల్లని ప్రశాంత వాతావరణం మరీ అనుకూలము. అందులకే ఆశ్రమములు అరణ్యాలలో ఉండటము.

66. మెదడుకు మేతవేయాలి. మనస్సులో తర్జనబర్జన చేయాలి. అపుడే ఆలోచనాశక్తి పెరుగుతుంది. పరిశ్రమిస్తేనే మెదడు శక్తివంతము కాగలదు. జిజ్ఞాస, ఆసక్తి కూడ అవసరమే. బుర్రను చైతన్యవంతము చేయాలి. మెదడు మధ్యభాగంలో పినెల్ గ్రంధి బటాణి గింజంత పరిమాణంలో ఉంటుంది. భారతీయుల వేదాంత సిద్ధాంతము ప్రకారము అదియే మూడవ కన్ను, జ్ఞాన నేత్రము. మానసిక శక్తికి ఇదియే మూలము. మెదడులో ఉన్న అన్ని భాగాలలోని అన్ని ఆలోచనలను సమన్వయంచేసి శక్తివంతం చేస్తుంది. ఇయ్యది అపురూప దివ్యశక్తి. దీనిని మేల్కొల్పిన కుండలినీశక్తి పనిచేస్తుంది. ఆహా! అదియే పరమ వైభవం. నమ్మకముతో ప్రయత్నించిన అపురూప శక్తిని సాధించవచ్చు. మానవుడే మహిమాన్విత శక్తి సంపన్నుడు. అనేక దివ్యశక్తులు అతనిలో దాగిఉన్నాయి. వాటిని జాగృతం చేయాలి. దానికి సాధన అవసరం.

67. మహిమాన్విత అపూర్వ దివ్యశక్తులు మనయందేగలవని నమ్మాలి. ద్రాక్షపండంత మెదడులో విశ్వనాటకము అణగియున్నది. సరిగా అవగాహన చేసికోవాలి. మేధస్సు అత్యంత శక్తివంతమైనది. దీనిని ఆత్మజ్యోతిగ వెలిగించాలి. శక్తికిమించిన ఆలోచనలు, పగటి కలలు, ఉత్త ఆలోచనలతో లాభంలేదు. మంచి ఆలోచన ఉల్లాసమును, శక్తినిస్తుంది. ఆలోచనలను రూపకల్పన చేసుకోవడానికి ప్రయత్నిస్తే కొన్ని విజయాలను సాధించవచ్చు.

68. మీలోని దివ్యశక్తిని రగిల్చి చూచినచో సంభాషణలోగాని, ముఖ వర్చస్సులోగాని మీకు మిత్రులెవరో, శతృవులెవరో గ్రహించవచ్చు. నిజముగా ఎవరి భవిష్యత్తు వారి చేతిలోనే గలదు. పురుష ప్రయత్నంతో మహోజ్వల భవిష్యత్తును సాధించవచ్చు. ఎవరిపై ఆధారపడవలసిన పనిలేదు. స్వాత్మశక్తిని గుర్తించాలి. అదియే గొప్ప ఆధారము. ధైర్యంతో, నిర్ణయంతో వేసిన ప్రతి అడుగు విజయానికి పునాది. ఎంత దూరమైనా ఫర్వాలేదు సాహసముతో అడుగు ముందుకు వేయాలి. వ్యక్తిగత భావాలను అతిక్రమించి విశ్వాత్మభావనలో విహరించునపుడు ఈ ప్రపంచములో దేనినైనా చెప్పుచేతులలో ఉంచుకోవచ్చు. మనం బాధ్యతతో, ఉత్సాహముతో నిర్ణయాలను తీసుకోవటమే కాకుండా తత్ఫలితాలను కూడా స్వీకరించటానికి సిద్ధపడాలి. ఏదైనా తనకు తానే బాధ్యుడు. ఇంకెవరో కాదు.

69. బీజములేని చెట్టు ఉండదు. అలాగే ఆలోచనలేని మనిషికి క్రమపద్ధతి ఉండదు. బయటి వాతావరణము, ఆంతరంగిక అభిప్రాయము మేళవించి నిర్ణయముంటుంది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే స్వభావమును అలవర్చుకోవాలి. అనవసర ప్రయత్నమును మాని లక్ష్యపూర్తి నిమిత్తం సందిగ్ధము లేకుండా, త్రికరణ శుద్ధిగా విజయము తథ్యమని నిలువాలి.


- 11 - 70. జీవిత సాఫల్యమునకు ముఖ్యావసర వస్తువులు. 1. ఏకాంతము 2. ప్రశాంతత 3. తృప్తి. నిశ్శబ్ధ స్థితిలో ఏకాంతం చేయాలి. ఏకాంతం ఏకాగ్రతకు, దృఢ విశ్వాసానికి అవకాశమిస్తుంది. అందులకే ప్రపంచపు హోరునుండి తప్పుకుని ఆలోచించే అలవాటు చేసికోవాలి. ఎన్నియున్నను ప్రశాంతతలేని జీవితం వ్యర్థం. కోటీశ్వరులు కూడా ఆత్మశాంతికి దూరులై విలపిస్తున్నారు. కోరికల ఘర్షణలను ఆపి తృప్తిపడవలయును. తృప్తికి మించిన ముక్తిలేదు.

71. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అవసరం. కోపము, చికాకు, విచారం, భయం, తొందరపాటు మాని, ధీమాతో హుందాగా ఆలోచించటం అలవాటు చేసుకోవాలి. వేనిని లక్ష్యపెట్టక గంభీరంగా సాగిపోయే గుణము అలవడిన ఎలాంటి పనియైనా సాధించవచ్చు. ఒక ఆటంకమో, అపజయమో రావటంతో బాధపడి, భయపడి కర్తవ్యం మానివేసి జీవితమును ఆందోళనపూరితం చేసికోరాదు. మనస్సులో చెలరేగు తుఫానులను మ్రింగివేయాలి. ఉద్రేక వాతావరణమునుండి బయటపడి ప్రశాంతంగా నిలవాలి. ఇది దైవపదవి. బ్రతుకులో ధ్యేయం, నడతలో న్యాయం కావాలి.

72. నీ అంతర్వాణిని అనుసరించి నడుచుచున్నప్పుడు లోకంతో నీకనవసరం. ఇతరులు ఏమనుకుంటారో అన్నదానిమీద శ్రద్ధకంటే మన మనస్సు తృప్తి గురించి ఆలోచించటం ముఖ్యం. అసలైన రక్షణ ఆత్మలోనే గలదు. అందని దానికోసం తాపత్రయం చెందరాదు.

73. నిగ్రహమే ఘన కవచము. తెల్లని దుస్తులపై సిరా మరకపడిన ఎలా ఉంటుందో చేసిన ప్రయత్నము విఫలమైన అంతే కాగలదు. ఇటువంటి సమయంలోనే నిరాశకు స్వస్తిచెప్పి సంతోషం, విచారం రెండింటిని ఏకంచేసి నిగ్రహశక్తితో వెలిగించాలి. ఇదియే స్థితప్రజ్ఞ దీపము.

74. చాలామంది మంచిని మరచి చెడును జ్ఞప్తియందు ఉంచుకుంటారు. అలాగాక చెడును మరచి మంచిని మదిలో నిలుపుకోవాలి. గడచిన రోజులు మంచివని, పాత పద్ధతులు మంచివని అనుకుంటూ కాలం వృధాచేయరాదు. నిన్నటిది కాలగర్భంలో కలసినట్లు అనుకోవాలి. నిన్నటి దినం తిరిగిరాదు. ప్రతిదినము నిన్నటిదినమే మేలనిపిస్తుంది. జరిగినదానికి విచారించవలదు. భవిష్యత్తును గురించి భయపడరాదు. వర్తమానాన్ని సుఖమయం చేసికోవాలి. గతాన్ని తలచుకుంటూ బాధపడేదానికన్న ఉత్సాహంగా పనిచేయటం మంచిది. ]] 75. మనకు ఆ రాతలేదు, ఆ గీతలేదు, ఆ యోగంలేదు అని సరిపెట్టుకోవలదు. అనుభవమును దృష్టిలో ఉంచుకుని ప్రయత్నించాలి. తప్పు తెలుసుకున్న పిదప విజయం సాధించటం సులువు. అపజయాల అనుభవం విజయానికి స్థిరత్వమును, పటిష్టతను కలిగిస్తుంది. జయాపజయాలు దైవాధీనమని తలంచే దీన స్వభావాన్ని విడనాడాలి. అన్నిటికన్న ధైర్యం గొప్పది. పశుబలంకాదు ఆత్మ స్థైర్యం ముఖ్యం. ధైర్యము, స్వయం నిర్ణయం విజయానికి పునాదిరాళ్ళు. విఘ్నములు, ఆటంకములు మనోకల్పనలు. దీర్ఘకాలంలో అవి నిలువలేవు.

76. చిరునవ్వు వెలయెంత? మరుమల్లె పువ్వంత అన్నట్లు చిరునవ్వుతో ఉన్న వదనము మనోఫలకముపై చెరగని ముద్రవేస్తుంది. అందులకే ఎటువంటి క్లిష్టపరిస్థితిలోనైనా నవ్వనేర్వాలి. ఇది ఎదుటివారిని ఆకర్షించే - 12 - మంత్రము. కురూపియైనా నవ్వునపుడు అందముగానే కనబడును. తాను నవ్వుచు ఎదుటివారల నవ్వించగలగాలి. నవ్వుచే వ్యాధులు దూరం కాగలవు. మనలను నవ్వించువారే మనకు ఆత్మీయులు అనుకోవాలి. మనస్సు నిర్మలం కావటానికి, విషయాలు బయటికి ఉప్పొంగటానికి సంతోషము, నవ్వు ముఖ్యం. అందులకే నీతిబోధలలో కూడా హాస్యమును మేళవిస్తారు. హరికథల మధ్యలో హరిదాసులు చిత్రకథలు చెప్పి శ్రోతలను నవ్విస్తారు. ఎల్లప్పుడూ నవ్వుచుండేవాళ్ళకు విచారం, దిగులు లేదనుకోరాదు. లెక్కింపరు కార్యసాధకులు దు:ఖ్ఖంబున్, సుఖంబున్ మదిన్ అన్నట్లు కార్యశూరులు సమస్త విచారములను దిగమ్రింగి ఉంటారు.

77. నిర్ణయంలేని అడుగు నాశనకారి కాగలదు. సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు కోపము, ఉద్రేకము, తొట్రుపాటు, విసుగు, వ్యతిరేకత వస్తుంది. అప్పుడు శక్తి నాశనమైపోతుంది. నిజంగా బయటి సహాయంకాదు, ఎవరి సహాయం వారియందే కలదు. బయటివాళ్ళు ఏదోచెబితేనే తప్ప ఏమీ చేయలేము అనే పరిస్థితికి మనిషి కలలోనైనా రావద్దు. ఎవరి పాత్రను వారు చక్కగా పోషించాలి. ఈ ప్రపంచంలో ఎంత సిరిసంపదలున్నా, ఎంత మంచి సజ్జనులున్నాఎవ్వరూ ఏమీ ఇవ్వరు. మనకు మనమే శ్రమించి సాధించాలి. హృదయస్ఫూర్థిగా ఎవరికి వారే ముందుగ సహకరించుకోవాలి.

78. గొప్పవారికే ఆటంకములు ఎక్కువగా రాగలవు. సాన పట్టినపుడే వజ్రము తేజస్కాంతము కాగలదు. అటులే కష్టములు వ్యక్తి విలువను పెంచగలవు. అన్నియును నా ప్రేమ మయమునుండియే జనించుచున్నవని భావించవలయును. ఎవరి విధికి వారే బాధ్యులు, నిర్మాతలు. ఇంకొకరిని తిట్టటం అనవసరం.

79. సత్ ప్రవర్తన, సదాదర్శముకలిగి మీ వ్యక్తిత్వమును బహిరంగపరచండి. మిమ్ములను మీరు చాటుచేసికొని దాచుకోరాదు. రండి బట్టబయలుకు రండి. ఎవరిని వారు ఆత్మపరిశీలన గావించుకోవాలి. అపుడు అనేక కొత్త విషయాలు, రహస్యములు తెలియగలవు. నీవు అపరాధివైనచో భయం, తప్పు చేశానన్న భావన ఏ కోశంలోనైనా ఉంటుంది. నీవు నిరపరాధివైన నిస్సంకోచంగా వ్యవహరించవచ్చు. దొంగకే చాటుమూటు భయభీతి. యధార్థవర్తనుడు నిర్భయుడై సంచరించును. నిర్దోషం హి సమం బ్రహ్మ.

80. తానేదో గొప్పవాడుగా లోకం గుర్తించవలయుననే తహ తహ అక్కరలేదు. నిన్ను నీవు ఘనపరచుకో! ఎంతటివారిని అంతటివారే తెలుసుకోగలరు. దేవుని సంగతి దేవునికే నిండా తెలియగలదు. తెలివితేటలు గలవారిగ నటించరాదు. మన ప్రవర్తన ఖచ్చితంగానూ, ఇతరులు ఆమోదించేదిగానూ ఉండాలి. అట్లని లోక మెప్పునుకోరి ఇతరులకు భీతిల్లి లక్ష్యాదర్శములను విస్మరించరాదు. ఒక చిన్న లోపము తత్త్వాన్ని వెల్లడించగలదు.

81. జీవితమంటేనే కష్టసుఖముల పెనుగులాట. వీనిని సహజముగా తీసికోవాలిగాని భయపడరాదు. ఆత్మ విశ్వాసంతో నిర్ణయించుకున్నది తప్పక సాధ్యమే, తప్పక చేయగలము, సాధిస్తాం అనే ధోరణి ముఖ్యం. నేను ఈ పనిని చేయలేను అనే దృక్పథముతో ఆ పని పూర్తికాదు. ఓడిపోతాననుకున్నవాడు ఓడిపోగలడు. విజయము నాదనే ధీమాతో హాయిగా ఉండాలి.

- 13 - 82. మనస్సునుబట్టి చెప్పేది ముఖ్యంగాని వయస్సునుబట్టి కాదు. ముసలితనం వచ్చిందని, ఇక ఏ పనికి అక్కరకు రానని అనుకోవటం పొరపాటు. విజయానికి వయస్సు అడ్డుకాదు. చాలామంది వయస్సుమీరిన తర్వాతనే విజయం సాధించారు. ఉత్సాహం, పట్టుదల ఉండిన చాలు, వయస్సుతో సంబంధంలేదు. ప్రతి వ్యక్తి యవ్వనదశలో వృద్దాప్యంలోని వైరాగ్యం కలిగి, వృద్దాప్యంలో యవ్వనదశలోని ఉత్సాహం కలిగి ఉండాలి.

83. తగులబడనీ, వ్రేలు తెగనీ ప్రతిదీ మన మంచికే అని భావించాలి, బోధించాలి. రేపు అనే వాయిదాలు వేసుకోకుండా నూతన ఉత్సాహంతో ఏరోజు చేయగలిగినంత పనిని ఆ రోజు చేయాలి. తప్పులు, చిరాకులు, ఆటంకములు ఎప్పటికప్పుడు మరచిపోవాలి. తొందరపాటుతో ఏపని పాడుచేసుకోరాదు. తప్పును ఒప్పుకోగల ధైర్యం, అటులే దానిని సర్దుబాటు చేసికోగల ధైర్యం సత్పురుషులకే ఉంటుంది. నిజం.

84. మనకు ఇష్టంగాని పనిని ఇతరులు చేసిన లక్ష్యపెట్టరాదు. అటువంటివారు మనతో మాట్లాడు సమయంలో అభిప్రాయబేధములున్నను మానసికముగా బాధపడరాదు. ఎదుటివారి దృక్పథము గ్రహించిన మనకు ఉపశమనము తథ్యం. అభిప్రాయబేధములున్న సంఘంలో నవ్వుతూ మెలగగల వైఖరిని అలవరచుకోవాలి. విభిన్న దృక్పథ భావాలున్న వ్యక్తుల మధ్యన అందరిలో ఒకడిగా భావించటం కష్టమే. ఐనను అందులోనే సుఖముంటుంది. గొప్ప బలము వస్తుంది. సమిష్టి బలం అజేయం.

85. కోపము శారీరకముగా, మానసికముగా కృంగదీస్తుంది. అది సరియైన ఆలోచనను మరిపించి చిందరవందర చేస్తుంది. అందులకే దానిని దిగమ్రింగిన అంతయు సవ్యంగానే జరిగిపోతుంది. పరిస్థితి చక్కబడి శాంతి చేకూరుతుంది. కోపమును మనసులో నిలుపుకొనిన అది కసిగా మారుతుంది. అది ఉన్నంతకాలం మానసిక భారం తప్పదు. ఎవరిపై కోపముగలదో వారలు కలసినగాని, వారలను క్లసిగాని మాట్లాడిన కోపము పోతుంది. మాట్లాడాలేని పక్షంలో సన్నిహితులతో చెప్పిన తగ్గుతుంది. నిన్న తప్పుచేసినవాడిని నేడు చిరునవ్వుతో పలుకరించాలి. ఇష్టంలేని వారలతో కూడా అదేవిధముగా మాట్లాడే అభ్యాసం చేయాలి. కోపము శరీరంలో వ్రణములాంటిది. అది స్మృతి శక్తిని, బుద్ధిని నాశనం చేస్తుంది. కోపమును సాధించేవరకు నిలుపుకొనిన ప్రశాంతత భగ్నంకాగలదు. 86. పనికి మించిన ప్రార్థన, కృషికి మించిన వ్రతములేదు. సమర్థునికే కృషిలోని ఆనందము తెలుసు. కష్టపడి పనిచేయటం అనిన తప్పులు లేకుండా, తెలివిగా, సకాలంలో, చురుకుగా చేయటం అని అర్థం. ఉద్రేకముతో ఏ పని చేయరాదు. విజయానికి సాధన అవసరం. కష్టపడి పనిచేస్తూ ఉంటే ఉత్సాహం, అనుభవం, విశ్వాసం వస్తుంది. మానస్క పరిశ్రమచే ఇవన్నీ బయటకు ప్రతిబింబించును.

87. పనిలేని చిత్తం దయ్యాల కొంప. పని లేనివాడు దౌర్భాగ్యుడు. ఏదియో ఒక పనిని చేయటం మనిషి అదృష్టం. అది మహా యజ్ఞం. చైతన్యవంతమైన ప్రగతిని సాధించగల మానసిక శక్తిని మనం చేసే ప్రతి పని కలిగిస్తుంది.

88. తమ అభిప్రాయములు బయటికి చెప్పకుండ అవతలివారికి మన అభిప్రాయములు నచ్చునట్లు తయారుచేయాలి. ఇది కార్యదక్షతకు నిదర్శనము. తాను ఒకరికి ఉపకరించాలి. తనకు ఇతరులు ఉపకరించునట్లు చూసుకోవాలి. విధి నిర్వహణమే దేవుని మెప్పించే దివ్య మార్గమని మరువరాదు. - 14 - 89. మంచి కారణాలు, అవసరౌలు గుర్తించి పరిస్థితుల్నిబట్టి మార్పుకు సిద్ధపడాలి. ప్రగల్భాలు తగ్గించాలి. నిగ్రహశక్తిని కలిగియుండాలి. అవసరమైనచోట లౌక్యం అవసరం. పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవటాం గొప్పతనమేకాని, తలతో పర్వతమును ఢీకొనటo అవివేకం.

90. ఎవరికి వీలున్నంతలో వారలు పైకిరావాలి. చేతులు ముడుచుకొని కూర్చుండిన అవకాశాలు రావు. కృషి చేస్తున్నప్పుడే క్రమేణ లక్ష్యానికి చేరువ కాగలము అని భావించవలయును. ఎన్ని అవకాశములు తటస్థపడినను వినియోగపరచుకోలేని వారికి వ్యర్థము. ఎదురుచూడటం తెలివితక్కువ తనము.

91. గొప్ప పనికి భుజబలము కాదు, బుద్ధి బలము, పట్టుదల ముఖ్యము. ఎట్టి పరిస్థితిలోను పట్టుదల వీడరాదు. సమర్థవంతంగా పనిచేయగలగాలి. కృషితో గొప్పవారు కార్యాలను సాధిస్తారు. బలహీన దృక్పథము కృంగదీస్తుంది. జీవితమును పాడుచేస్తుంది. అందులకే నేను అసమర్థుడను, నానుంచి ఏపని కాదనే తలంపును రానివ్వరాదు. కష్టాలు ఎదురైనప్పుడు తప్పించుకొనుటకు ప్రయత్నించరాదు. ధైర్యంగా నిలచి పోరాడవలయును. సంకుచితత్వం విడనాడి గట్టి ప్రయత్నం చేసిన ఫలితములు సాధించవచ్చును.

92. పట్టుదల, కృషి, సంకల్ప బలం ఉండిన సాధ్యముకానిది ఎదియును లేదు. ఏదీనా పని చేయాలనుకున్నప్పుడు భావాలు, ఉద్రేకములు, తెలివి, సంకల్ప బలము, వ్యక్తిత్వం ఇలా మనలో దాగియున్న శక్తులన్ని వినియోగించాలి. ఏ విషయంలోనైనను వ్యతిరేక దృక్పథమును అలవర్చుకొని ఆందోళన చెందరాదు. మనో భ్రమలు వీడాలి. అనగా నిజాన్ని నిజంగా గాంచలేక, విచిత్రమైన పద్ధతిలో చూడరాదు.

93. సగం పనిచేసి నిద్రపుచ్చరాదు. ఎన్ని జన్మలైనా పట్టనీగాక లక్ష్యం మరువరాదు. నిన్ను నీవు నిర్లక్ష్యం చేస్తే ప్రపంచమంతయు తీసివేస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అర్థంచేసికోవాలి. అది తెలిసినపుడు పని తేలిక. ఇతరులను మెప్పించి బ్రతుకుటకు అలవాటుపడరాదు. పౌరుషవంతులు పట్టెడన్నము కొరకు ఆత్మాభిమానమును చంపుకొని పరుల పంచన జీవించరు.

94. “మనిషి స్వేచ్చగా పుట్టినను అతని అనుబంధాల సంకెళ్ళు అతనిని బంధిస్తాయి. మనిషి భావ దాస్యంతో పుడతాడు. దానినుండి వెలువడే శక్తికోసం స్వతంత్రమున్నా ప్రయత్నించడు. బంధ విముక్తి ఐన తర్వాత కూడా బంధాలను వదలి వెళ్ళలేడనే” ఫ్రెంచ్ వేదాంతి రౌస్ మాట నిజము.

95. ప్రతిక్షణము ఎవరో వచ్చి సలహానివ్వ పనిలేదు. నీలో ఉన్నవాడిని అడిగి తెలుసుకో. అంతర్వాణి ననుసరించి మెలగాలి. అపుడు లోకమంతయు నీకు ప్రతికూలించినను భయపడ పనిలేదు. మన అంతరాత్మననుసరించి మెలగిన లోకం మనల్ని ఎలా చూస్తుందో అనే భయం వద్దు. లోకముతో పనిలేదు. ఎవరి బ్రతుకును వారు నడుపుకోవాలి. స్వశక్తిని, పరిస్థితులను గమనించి ముందునకు సాగిపోవాలి. భయపడినంతకాలం బ్రతుకులో శాంతి శూన్యం. శక్తి నశించి జ్ఞానము లోపిస్తుంది. అందులకే ప్రతి చిన్న విషయానికి ఇతరులను సలహా అడుగుట మంచిదికాదు. నీకు నీవే తోడు, రక్ష, బలం.

96. విజయం సాధించిన వారిని చూసి ఈర్ష్యపడుటకన్న వారల ఉత్సాహాన్ని, కృషినీ ప్రోత్సహించాలి. ఓడిపోవటము పరిస్థితుల ప్రభావమేగాని అసమర్థ తకు చిహ్నం కాదు. చేసిన పొరపాటు మరల చేయకుండ - 15 - చూసుకొనిన చాలు. ఏ పని చేయటానికైనా సరియైన నిర్ణయం, సాధించగలనన్న విశ్వాసం ఉండాలి. వయసుతోపాటుగ, ధైర్య సాహసములు పెరగాలి. చేసిన ప్రతి పని విజయవంతంకాదు. ప్రతి అపజయము భవిష్యత్తులో విజయానికి పునాది కాగలదు.

97. మనం చేసేపని విఫలమైనప్పుడు విమర్శించుకొని, బెదరగొట్టుకోరాదు. జాగ్రత్తగా ఆత్మావలోకనం గావించుకోవాలి. ఉన్న వ్యతిరేకతను గుర్తించవలయును. తన్ను తానే ప్రశ్నించుకొని సమాధానములు వ్రాసుకోవాలి. ఈ గ్రంథమంతయు నా అంతర్వాణి సుప్రబోధమే. దీనికి తిరుగులేదు. ఇది సమస్త యుగముల దివ్య పంట. స్వపరంజ్యోతి, సర్వుల అంతరంగపు దివిటి.

98. మనలో మనం చదువుకోవాలి. ఆత్మవంచన వలదు. తీవ్రంగా ఆలోచించిన మార్పులు వస్తాయి. లోకం విచిత్రం. ముళ్ళబాట ఐనాసరే ముందుకు నడవాలి. మార్పును సాధించాలి. వ్యతిరేక భావం మనస్సులో ఉన్నప్పుడు ఆ పని మాత్రం మానుకోవాలి. లోకమంతా మనకెన్నడు వైరుధ్యము కాదని నమ్మాలి. ముందుగ కష్టమనిపించినదే చివరకు సులువు కాగలదు. మన శక్తిని మనం నమ్ముకున్నంతకాలం అపజయము రాదు. వచ్చినను నిలువదు. మన భవిష్యత్ స్వేచ్చ అంతయును మన ఆలోచన ప్రతిఫలమే. ఏ పనినైనను సమర్థవంతంగా చేయాలనిన దానిపట్ల ఆసక్తి, గౌరవ భావం ఉండాలి. మానవ శరీరమే మహోన్నత యంత్రము. మీ శక్తి, మీరు ఏకం. అవసరానికి రెట్టింపు శక్తి శరీరంలో జనిస్తుంది. అదియే అంతర్నిహిత దివ్య సత్తా. ఈ రహస్యము చాలామందికి తెలియదు.

99. ప్రతి సమస్య జీవితమునకు చక్కని మార్గమునిస్తుంది. ఏదీ తప్పించుకోలేము. అందులకే ప్రతి కష్టము, బాధ, నష్టమును భరించే అలవాటును నేర్చుకోవాలి. ఎవరికి వారే ప్రాణ మిత్రుడు. ఎవరికి యోగ్యమైనది వారు సాధించవలయును. సమస్యలకు సతమతము కావలదు. ప్రతి సమస్య ఒక మెట్టు. మెట్లపైగల మేడయే అసలైన ఆత్మ. అదియే సుఖ సిద్ధి మహల్, దివ్య మందిరం. ఈ పరమ రహస్యమును నమ్మి జీవితమును సుఖమయం చేసికోండి. శుభం. సర్వ సౌభాగ్య సిద్ధిరస్తు!

100. మానవ శరీరం అద్భుతమైనది. ప్రతి అరగంటకు మానవ శరీరంలో తయారైన వేడితో ఒక గ్యాలన్ నీటిని మరుగబెట్టవచ్చునని శాస్త్ర నిశ్చయం. అటులే శరీరంలో ఉన్న కరెంటుతో 30 వాట్ల బల్బు వెలిగించవచ్చు. 150 పౌన్లుగల మనిషిలో 7 బారు సబ్బులు చేయగల కొవ్వు ఉంటుంది. 3000 అగ్గిపుల్లలు చేయగల ఫాస్పరస్ ఉంటుంది. 8000 పెన్సిళ్ళు చేయగల కర్బనము, 3 అనుగుళముల మేకు, 1 బకెట్ సున్నము, పావు పౌను గంధకము, నిమ్మకాయంత మెగ్నీషియం ఉంటుంది. 25 కోట్ల ఎర్రకణాలు రక్తంలో ఉంటాయి.

101. జ్ఞాపకశక్తిని వృద్ధిచేసుకోవాలి. కలలను నిర్లక్ష్యం చేయరాదు. ప్రతి కలకు ఏదియో ఒక అర్థం ఉంటుంది. అంతరాత్మ భవిష్యత్తును ఊహించుకోటమే కాదు, నిర్ణయించటానికి సైతము సహకరిస్తుంది. సమయానికి రావటం, అత్యవసరానికి ఆదుకోవటం అంతరాత్మ శక్తివలననే జరుగుతుంది.

102. మనస్సు మమకారముల గూడుగ సాలీడువలె అల్లుకొనిన భ్రాంతి బాధించును. మమకారముకంటె ప్రేమ గొప్పది. స్వార్థము లేనిది ప్రేమ. అoదులకే మమకార శృంఖలాలు త్రెంచుకోవాలి. వీరసింగము వలె వన విహారము సలుపాలి. ఆత్మ స్వాతంత్ర్యముతో నిలువాలి. - 16 - 103. ఇతరులను అదుపులో పెట్టదలంచిన వ్యక్తి ముందుగ తనను తాను అదుపులో పెట్టుకోగలగాలి. అపుడే అతని మాటకు విలువ ఉంటుంది. ఒకరి గొప్పతనమును అంగీకరించినచో మనకు వచ్చిన నష్టము ఏమిలేదు. కాగా వారల ప్రేమను చూరగొనవచ్చును. మనలను బట్టియే ఎదుటివారలు వ్యవహరిస్తారు. విశ్వవిశాల హృదయులు ధన్యులు.

104. పిల్లలను మెచ్చుకొని ప్రోత్సహించిన వారిలో బుద్ధివికాసము కలుగుతుంది. మెద్దులు, చవటలు, దద్దమ్మలు, ఎందుకు పనికిరావు అని తిట్టి, చులకన చేసిన అలాగే తయారుకాగలరు. వారిలో నిరాశ, నిస్పృహ, దెవేషం రగులుతుంది. ప్రేమ పూర్వకముగా మందలించిన వారిలో నెమ్మదిగానైనా మార్పు రాగలదు.

105. అప్రయోజకులతో చెలిమి అన్నివిధముల చేటే. అపరాధులతో విరోధముగాని, వినోదముగాని తగదు. పాము కాటుకైనను విరుగుడు కలదుగాని మూఢుని కాటుకు విరుగుడు లేదు. దుష్టుడనే మహా విష సర్పము కాలకూట విషమును కక్కగలడు. చీ! చీ! వానిని తలచినను పాపమే. దయ్యపు గుణములు కలవాడు దైవ గుణములను పొందలేడు. మంచిని తిరస్కరించిన మూఢమతి తనకు తానే సర్వనాశనం కాగలడు. దుర్మార్గం ఉద్ధరించబడదు. అగ్ని పొదలో ఉన్న పామును రక్షించు నిమిత్తము ఒక దయగల బాటసారి నైపుణ్యముగ తన చేతికర్ర సంచి సహాయమున బయటికి తీయగా ఆ పాము వెంటనే బాటసారిని కరవ చూచెను. అతడు భీతిల్లి పారిపోవు సమయంలో మార్గమధ్యమున నక్క తటస్థపడి దానిని నైపుణ్యముతో యధావిధి పామును ఆ బాటసారితో ఆ పొదలో పడవేయించి చంపించెను. చూచితిరా కృతఘ్న లక్షణము, దాని ప్రతీకారము.

106. రంగుటద్దములెంతో మానసిక భావములంతే. ఏ రంగు అద్దముగుండా చూచిన బయట అంతయు అ రంగుతోనే కనిపించునట్లుగ, ఎవరి భావన ఎట్లుండునో బయట అటులే గోచరిస్తుంది.

107. వింతల బొంత ఈ లోకము. ఓ వివేకీ! నీవరకు నీవు మంచియే చేస్తున్నాను అనుకోవచ్చు కాని లోకం ఓర్వదు. అంతమాత్రంచే లోకము ఏమనుకుంటుందోనని పవిత్ర ఆశయమునుండి దూరం కావద్దు. లోకం, దాని ఆరాట ప్రసక్తి మిధ్య. స్థితికుదిరినవారు లోకమును పట్టించుకోరు.

108. ఆత్మోపదేశికుల జన్మలో మరువరాదు. అట్టి మహనీయాత్ములు చెప్పినట్లు నడవాలి. కాని వారు చేయునట్లు శిష్య భక్తులు చేయరాదు. ఎందులకనగా స్వామి వివేకానంద వచనానుసారము “మహాత్ములు నిగ్రహానుగ్రహ శక్తి సంపన్నులు. వారిని విమర్శించే వీలులేదు. అందులకే నా గురుడు కల్లుపాకకు పోనీగాక నాకవసరంలేదు. ఆతని బోధయే నాకు జీవం”. అందులకే సంకుచిత పరిధిలో చిక్కి, మనవలెనే కావచ్చునని సర్వాత్మ జ్ఞానదేవులను కలలోనైనను శంకించి పతనపడరాదు. గరుడ పక్షి విష సర్పమును తింటుందని ఇతరులు అనుకరించిన ప్రాణహాని తథ్యం. ఎవరి శక్తి వారికే తెలుసు. చిన్మయ దైవత్వమును మించిన సత్తాలేదు.

109. ఈ లోకంలో ఎవరు నీవారు? ఏది నీ సొంతం? నాది, నా వారు అనే ఆత్మీయతలు భ్రమ, ఉత్త భూటకములు. విత్తమార్జన కాలములోనే అందరు నీ చుట్టు మూగెదరు, డబ్బుకు లోకం దాసోహం. నీవద్ద డబ్బుననంత కాలమే ని నిన్నందరు నావాడని స్వార్థముగ వాడుకోగలరు. హృదయపరీక్షలో నెగ్గాలి. పడి పడి సేవలు చేసినవారంతా

- 17 - నీవు అనారోగ్య గ్రస్థమై, ఆర్థికముగ దిగజారిన సమయంలో ముఖమైనా చూడరు. కనీసం గ్లాసుడు మంచినీరైనా అందివ్వరు. ఇది పరమ సత్యం. పవిత్ర హృదయ సంబంధము ముఖ్యము. అసలైన ఆత్మీయతగల చోట అనైక్య భావం నిలువదు. బేధాభిప్రాయమున్నంత కాలము సామరస్యత చిక్కదు. ఒక్కొక్కసారి మనము ఎంతగానో నమ్మిన విశ్వాసులు కూడ కపట దూర్తమతులై, కృతఘ్నులై చేయి ఇస్తారు. మోసం చేస్తారు. లోకంలో ఇది ఒక దర్జాయని నేనెరిగితిని. అట్టి కపట నాటకులు, మూర్ఖులు చివరికైనను భ్రష్టులై సర్వ విధముల పతనపడగలరు ఇది ప్రకృతి ప్రతీకారము. అవసర పూర్తివరకే నటించు కపటులు హృదయ పరీక్షలో నెగ్గలేరు. అందులకే లోకం కపట మోసాలయం. వంచకులు, నమ్మకద్రోహులు సర్వవిధముల దుర్గతిపాలు కాగలరు. తప్పించలేని మహామాయ సూ త్రమిది.

110. లోకములో మరియొక రకస్తులుంటారు. ఈ రకము మనుష్యులు మనతో వారల అవసరం తీరేవరకు టక్కరి వినయ విధేయతలు ప్రదర్శిస్తూ, ఆజ్ఞకు బద్ధులై ఉన్నట్లు నటిస్తూ, దాసోహం అని తిరుగుచు, అవసరం తీరి గడ్డ ఎక్కగానే దెశపో అంటారు. ఇట్టి ధూర్తులకది వేడుక.

111. కొందరు వ్యక్తులు ఇతరులను విమర్శించుటలోనే కాలక్షేపము చేయగలరు. కాని తమ వి షయంలో మాత్రం ఎవరు ఏమనుకోరాదని వారి భావము. కుక్క దొంతులను పడవేయగలదేగాని సక్రమముగా పేర్చలేదన్నట్లు కొందరు విచక్షణ లేకుండా విమర్శించగలరేగాని, సవరించి ప్రోత్సహించలేరు. నిజముగా ఇతరులను విమర్శించి తప్పులు పట్టటం అతి తేలిక. కాని ఎవరిని వారలు విమర్శించుకోవటం అతి గొప్ప సంగతి. ఇది విబుధ లక్షణము. చెట్టుపైనున్న వానికన్న, చెట్టుక్రింద ఉన్న వానికి ఉపాయములెక్కువ.


112. అవిధేయత గర్వమునకు మూలమగుతుంది. అటులే వినయము ప్రేమకు వారది యగుతుంది. ప్రశాంత చిత్తము రక్షిస్తుంది. రాగ హృదయము చంపుక తింటుంది. దూర్త బుద్ధి సత్యమునకు విరోధముగ నిలిచి భగ్నమగుతుంది, భంగమగుతుంది, భస్మమగుతుంది. కృతజ్ఞులు అసత్యమును త్యజించి అర్హులై నిలిచెదరు. ఎవరి చెడు వారినే కృంగదీసి అణగద్రొక్కుతుంది. ఎవరి మంచి వారినే ఆదుకుంటుంది. ఎవరి ఈర్ష్య వారినే పతనపరుస్తుంది. ఎవరి ప్రేమ వారినే ఉద్ధరిస్తుంది. ఎవరి దుడుకు వారినే దీనుల చేస్తుంది. ఎవరి తాల్మి వారినే తృప్తి పరుస్తుంది.


113. కొందరు గోముఖ వ్యాఘ్ర వర్తనులై తేనెబూసిన కత్తులవలె ఉంటారు. అట్టివారల ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలి. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు ఈ లోకంలో ఒక్కొక్కసారి ఎత్తుకు పైఎత్తు లేనిదే వ్యవహారము రక్తికట్టదు. ముల్లును ముల్లుతోనే తీసి ఆ రెండింటిని పారవేయునట్లు, మోసమును మోసముతోనే జయించి రెంటిని మరవాలి. తమను విశ్వసించిన వారిని మోసము చేయువారు చివరకు సాలీడువలె తాము పన్నిన మోసపు వలలో చిక్కి తమ్ము తామే నిందించుకొని ఒకానొక సమయములో ప్రాణహత్య చేసికోగలరు.

114. ఈ లోకమున ఎలా మెలగబోయినను కష్టమే. మంచికి పోయిన చెడు అడ్డువస్తుంది. పాపమనిన లోకము శాపనాలు కురిపిస్తుంది. చేతిలోని పిట్టను విడిచి గూటిలోని పిట్టను పట్టబోయిన రెండు చేతికి అందనట్లుగ, సమయానికి చేయవలసిన పనిని చేయనిచో ఉన్నదికాస్త చేయిజారి పోగలదు. అందులకే సమయోచిత ప్రజ్ఞ ప్రతివారికి అత్యవసరము. అందుకే తరిని పైరు పెట్టు - తగని చోటు విడువు అనటం.

- 18 - 115. మూఢుడు తన అక్కర తీరు పర్యంతం వినయ విధేయతలు కలిగి నా సర్వం నీవే అంటాడు. పని పూర్తయిన పిదప తలచనైనా తలచడు. ప్రియాత్మ స్వరూపులారా! ఒక పాములవాడు విష సర్పమును పట్టి, కోరలు తీసి, బుట్టలో బంధించి దానిని ప్రజల మధ్యన ఆడించి బ్రతుకవచ్చుగాని, మూర్ఖుని సన్నిధిలో క్షేమo శూన్యం. మూఢునికి మించిన ప్రత్యక్ష రాక్షసుడు లేడు. చీ! వాని దర్శనమే మహా పాతకము. వానిని చూచిన స్నానము చేయాలి. వాని పంక్తిలో భోజనము చేయుట మంచిది కాదు. వాడు చేసినట్లు చూసిన మూర్ఖునికి సంతోషము, తగదనిన పట్టరాని కోపము.

116. జంతువులకైనను కొన్ని సైగలునేర్పి వాటిని నమ్మవచ్చును. దుష్టుని కలలోనైనా నమ్మరాదు. ఖలునకునిలువెల్ల విషము. వేపచెట్టుకు పాలుపోసి పెంచినను చేదుపోదు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినను తెలుపుకాదు. జీడి కస్తూరి కాదు. ఇత్తడి పుత్తడి కాదు. అటులే దుష్టునకు ఎన్ని హితోపదేశములు చేసినను అంతే కాగలదు. పాముకు పాలుపోసి పెంచినను దాని విషము మారనట్లుగ, మూర్ఖునికి ఎన్ని హితోపదేశములు చేసినను వాని సహజ స్వభావమును మార్చుకొనలేడు. పైగా మేలు చేసిన వారికే కీడు తలపెట్టగలడు. అందులకే వానంతట వాడు రావలసినదేగాని అలాకాకుండ దుర్మతిని మార్చెదనని వానితో జోక్యం చేసికొనిన చివరకు మిగిలేది విషాదము, అపకీర్తి మాత్రమే. అందులకై విభుదులు మూర్ఖులతో చెలిమి ఎట్టి పరిస్థితిలోను చేయరాదు. దుర్మతి పతనపడవలసినదే. అప్రయోజకుడైన మూఢుడు సర్వనాశనం కావలసినదే. అపుడే వానికి కనువిప్పు జరుగును. ఆ దశ మారుటకు సమయము పడుతుంది.

117. మూఢుడు అన్నము పెట్టిన చేతిని కరువగలడు. తల్లిపాలు త్రాగి ఆమె రొమ్ము కోయుటకు వెనుదీయడు. ఇక వానిని ఎలా నమ్మేది? దుష్టుడు అర్హతను కాపాడుకోలేడు. శుభముకోరి శునకమును గంగా స్నానమునకు తీసుకుపోయినను గతుకుడు మానదు. తుంగను గంగలో ముంచినను తులసికాదు. అటులే దొంగ, మూఢమతిని ఎంత ఉద్ధరించ చూచినను అంతే. అటులైన వేమన యోగి కాలేదా యనిన అలా నేటికి ఎందరు వేమన యోగులైనారు. వేమన స్వకీయానుభవముపై తనకు తానే మారాడు. అలా మారే మూఢమతి చెడి బ్రతికి న వేమన యోగివలె కోటికి ఒక్కడు కాలేడు.

118. పాము నోటినుండి విషకోరలు తీసినను మరల కొంతకాలానికి పెరుగునట్లు, అటులే అవసరపూర్తి నిమిత్తము తాత్కాలిక మంచివానిగ మారినను మూఢమతి మరల పాతపాట పాడుట నిక్కము. కుక్క తోకను గొట్టములో పెట్టినంతసేపే చక్కన. అటులే మూఢుని చిత్తము ఉంగరాల జుట్టువంటిది. అది చక్కబడదు. అందులకే మూఢులతో చెలిమి చేయరాదు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి వేదమంత్రములు వల్లింపజేసినను దాని గుణము మారదు.

119. మూఢమతి మార్పు శాశ్వతమైనది కాదు. సదాభ్యాసి దురభ్యాసి కావటం అతి సులువు. దురభ్యాసి సదాభ్యాసి కావటం దుస్తరం. మూఢమతి ఘోరమైన స్వభావము కలవాడు కావున వానిని నమ్ముటకన్న సద్భావంతో పులిని నమ్ముట మేలు. విష సర్పముకన్న హానికరమైన వాడు మూర్ఖుడు. వాని గర్వం వాని పతనమునకే దారితీస్తుంది. ప్రాయచిత్తం తప్పదు. మూర్ఖుని నటనలు నమ్మరాదు. వాని క్రియలు వంచనలు, తేనెబూసిన ఖడ్గములు, గోముఖ వ్యాఘ్రములు, పచ్చి మోసములు. - 19 - 120. ధూర్తబుద్ధులకు శీఘ్రమే పశ్చాత్తాపము కలుగునట్లు చేయాలి. ఎంత అభివృద్ధి చేయబోయినను కుక్క సింగము కాదు, తాబేలు ఏనుగు కాదు. మూఢమతులు నైసర్గిక స్వభావమును శాశ్వతకాలము మరుగుపరచలేరు. ఎంతటివారిని అంతటుంచుటే మంచిది. ధూర్తుల చేరదీయుట కుక్కకు పెత్తనము ఇచ్చుటవంటిది. మూఢమతి నిజానిజములను గుర్తించకనే గాలికి వాగగలడు. వ్యర్థవాగుడు అపవిత్రతనే సూచించును.

121. జీవితంలో ఏదియో ఒక తప్పటడుగువేసి దాని ఫలితంగా సంక్రమించిన బాధల్ని భరించలేక కంటికి కనపడని విధిపై తప్పును రుద్ది దూషించటం, నా రాత, కర్మయనటం సరియైనది కాదు. మానవ సంకల్పము, విధి మిళితమైనపుడు కర్తవ్యం బయల్పడును.

122. సత్పురుషుల చిత్తశుద్ధిని శంకించువారె ఘోరపాపులు. ఓ సత్పురుషులారా! మీరు మీ ఆత్మ సాక్ష్యముపై నిలువండి. మీ స్థితినుండి భ్రష్టపరచు నిమిత్తము యుగమంతయు ఏకమై మంచివారని పొగిడినను, చెడ్డవారని ప్రకటించినను ఏమాత్రం చలించక, దిగులుపడక, మిన్నువిరిగి మీదపడినను చలించని స్థితప్రజ్ఞతతో కేవలం మీ మనస్సాక్షి దర్పణానుసారం నిలవండి. నిజానిజములు నిలకడపై తెలియగలవు. నిజానిజములను గుర్తించకనే వేయు నిష్కారణ నిందలు బొందిలోని ఖడ్గములు.

123. చేతులుకాలిన పిదప ఆకులుపట్టిన లాభంలేదు. అటులే చివరకు ఆలోచించిన లాభంలేదు. ముందు జాగ్రత్త మంచిది. కాలుజారినా ఫర్వాలేదుగాని నోరు జారరాదు. యుక్తాయుక్తముల యోచించకుండ ఘన కృత్యములను చేయుటకు సాహసించిన, వారు లోకనిందల పాలగుటయేకాక, దు;ఖ విముక్తి చెందరు.

124. అరచేతిలోని తేనెను వదలి, మోచేతి చుక్కలను ముందుగ త్రాగదలంచుట ఎట్టిదో, చేతిలోని పిట్టను విడిచి, గూటిలోని రెంటి నిమిత్తం పాటుపడుట అంతేకాగలదు. అనగా దొరికినదానితో తృప్తిచెందక, దానిని విస్మరించి అధిక లాభమునకు అర్రులు చాచిన ఏదియును లభించదు.

125. అనంతకాలములో ప్రతిక్షణము మంచిదే. దుర్ముహూర్తము అనుట ఘోర మూర్ఖత్వము. ఒక మతస్తులకు చెడుగాయున్న రోజు మరియొక మతస్తులకు మంచిది. ఇలాంటి కట్టుబాట్లన్నియు మధ్య నిర్మితములు. మానవత్వమే సరియైన మతము. మూఢులకే మూఢములు. మంచి చెడులకు మనస్సే మూలం. దేవుడిచ్చిన అన్ని దినములు మంచివేనని మంచివారి తలంపు.

126. ఒకే పదార్థము ఒక వ్యక్తికి అన్ని సమయాలలో ఆనందమును ఇవ్వలేదు. కపటవృత్తి కలకాలం కలసిరాదు. మోసము సదా మరుగుపడి ఉండలేదు. వంచన అకస్మాత్తుగ బయటపడుతుంది. ఒక చాకలి తన గాడిదపై పులిచర్మము కప్పి నిండు చేలను మేపెడివాడు ఆఖరికి ఆ గుట్టు తెలిసినది. గాడిద చచ్చింది. శక్తికిమించిన వేషము, స్థితికుదురని అనుకరణ లెక్కకురాదు.

127. వ్యక్తిని బయటికి చూచి నమ్మరాదు. కొందరు బయటికి చూడ మితృత్వం వహించినట్లే కనబడుచు, అంతర్గత ద్వేషపూరితులై లేనిపోని కొండెములు చెప్పుచు ఈర్ష్యను రగిల్చెదరు. కావున గుర్తించి స్నేహము చేయనేర్వండి. కొండెగాండ్లను అండ చేరనీయరాదు.

- 20 - 128. పూర్తిగా మెలకువ కలిగియున్నవానితో ముచ్చట చెప్పవచ్చు. నిద్రలోయున్న వానిని లేపి మాట్లాడవచ్చు. కాని మెలకువ కలిగియుండియే నిద్రించినట్లుగ నక్క బిగబట్టియున్న మూఢునికి మాత్రము ఎవరు చెప్పలేరు. మూఢమతి తన చేతల మూలమున, నోటి మూలమున విరోధము తెచ్చిపెట్టుకొనును. గడ్డి తిని ఆవు పాలను ఇవ్వగలదు. కృతజ్ఞతలేని మూఢమతి పాలను త్రాగి విషమును క్రక్కగలడు.

129. వ్యక్తి ఉన్నత స్థానము చేరుకోవటం కష్టము. చేరి నిలుపుకోవటం మరీ కష్టము. ఆ స్థానమునుండి దిగజారటం అతి తేలిక. నిజముగా ఉన్నత స్థితిలోనుండి పతనమైన పరమ దుర్మార్గుల పరిహాసములకులోనై వ్యధనొందుట తథ్యం. అందులకే ప్రతిష్ట, ప్రాభవ బలము ఉడిగినచో చులకన కాగలరని లోకసామెత కలదు. అందులకే అంతస్థును కాపాడుకోవటం అతి గొప్ప విషయము.

130. గతం తలచుకొని, నిజం తెలుసుకొని నెమ్మది పొందుము. దూరపుకొండలు నునుపు. వాటి నిజస్వరూపము చెంతకు వెళ్ళి చూచిన బయటపడుతుంది. కనులయెదుట ఎంత గొప్పది ఉన్నను, పెరటిచెట్టు మందుకు పనికిరాదన్నట్లు ఉంటుంది. సత్పురుషులు గుమ్మడిపాదు వంటివారు. గుమ్మడితీగ దూరము సాగి కాయ కాస్తుంది. అటులే సత్పురుషులు స్వస్థలమున రాణించలేరు.

131. ఈ లోకములో కొందరు తమకు వచ్చిన ఆపదలేగాని, దురదృష్తము, విఘ్నములేగాని ఇతరులకు రావలదని కోరుకొందురు. మరికొందరు తాము క్షేమముగా ఉండియు, ఇతరులకు కీడు కోరగలరు. ఇక మరికొందరు తాచెడ్డ కోతి వనమెల్ల చెరచునన్నట్లు, తమతోపాటు ఇతరులు భ్రష్టులు, బదనాము కావలయునని చూచెదరు.

132. సన్మార్గమున నిలిచినప్పుడు ఎట్టి దుష్ట ప్రచారములకైనను భయపడరాదు. ఆత్మవిశ్వాసులు అపరాధులకు భీతిల్లరాదు. దుర్మార్గులు సజ్జనుల వేటాడి అభాండములు, నేరారోపణలు చేస్తారు. చివరకు వారలే చీవాట్లు తింటారు. ఇది లోకసహజము. చీడపురుగులు లేనిచోటు, దుష్టులులేని ఊరు ఉండదు.

133. మనకు జరుగబోయే విషయములు ముందుగనే స్వప్నాల ద్వారాగాని, మరియొక రూపముగానైనను సూచనప్రాయంగా తెలుస్తాయి. శ్రద్ధగా వాటిని పట్టించుకోనపుడే అవి ప్రమాదమునకు కారణభూతములగును. ఎవ్వరు చెప్పపనిలేదు. ప్రతి సమస్యకు అంతరాత్మే సరియైన సలహాదారుడు, పరిష్కార కర్త. ఎవరెంత వెదకి కనుగొన్నా తనలో లేనిది విశ్వంలో ఎందులేదు. తానే సర్వశక్తిమయం. ఇది నిజం. అందులకే మీ శక్తిని సాధించండి, బోధించండి.

134. మాటిమాటికి తలచుకొని తనలోతానే మహదానంద భరితులై మెలగాలి. ఆత్మశక్తి సిద్ధించిన సర్వశక్తులు సాధ్యమే. దీనికి తిరుగులేదు. లక్ష్యం భావగర్భితమై ఉంటుంది. అందులకే భావసిద్ధియే లక్ష్య సిద్ధియగును. పూర్తి విశ్వాసము, పట్టుదల అవసరం. మంచిని స్మరించటమే ముఖ్య జపమంత్రము కావాలి. ఏదైనా ఔనంటే జరుగుతుంది. కాదంటే కాదు. జరితీరుననే దీక్ష ముఖ్యం. వీటన్నింటికి ఏకాగ్రతయే మూలం. శ్రద్ధయే బీజము. కొందరు దీర్ఘకాలములో సాధించుదానిని మరికొందరు స్వల్పకాలమున సాధించగలరు. ఈ వ్యత్యాసమునకు కారణము సాధన తీవ్రతయే యగును.


-  21  -

135. ఓ మానవా! నీయందే అద్భుత దివ్యశక్తులు దాగియున్నవి. తగిన కృషిచేసిన దాగియున్న దివ్యశక్తులు బయటికి ప్రకాశిస్తాయి. నిజం. శరీరాకారం, తియ్యని మాటలు, వేషభాషలే ఇతరులను ఆకర్శించలేవు. సద్గుణ సౌశీల్యములు, తెలివితేటలు, మానవత్వం, వీటన్నింటిని మించి విశ్వ మనోలయ దివ్యజీవ శక్తియే ఇతరులను ఆకర్శిస్తుంది. మానసిక మార్గాలద్వారా చూడాలి.

136. వ్యక్తి మనస్సునకు విశ్వ మనస్సునకు సంబంధముగలదు. దివ్యశక్తులన్నీ మానవుని మనస్సులోనె గలవు. అవి శాస్త్ర నియమానుసారము తెలుసుకొని ఆచరించటాం ద్వారా పొందవచ్చును. అంతర్ యోగాభ్యాస నిష్ఠచే కొన్నివేల మైళ్ళ దూరము సునాయాసముగ భావప్రసారం చేయవచ్చుననుటలో సందేహంలేదు. శక్తిని పేంచుకోవటం అనేది ఒక మొలకను మహా వృక్షముగా పోషించి, పెంచటం వంటిదని సాధకులు మరువరాదు.

137. మానసిక సాధనచే ఎదుటివారి ఆలోచనలు గ్రాహ్యంకాగలవు. కన్నులు మూసుకొని అంతరేక్షణ దృష్టితో ఒకచోట ఉండి, మరియొక స్థల విషయములను చూడవచ్చు, తెలుపవచ్చు. సంజయుడు ఈ దృష్టితోనే గీతను ధృతరాష్ట్రునకు ఉపదేశించనైనది. మనస్సుకు ఒకవిధమైన రంగు, తేజస్సు ఉంటుంది. అది దివ్య ధ్వనిని ప్రసారంచేయగల అమోఘ సాధనం. సరియైన వారిద్వారా సక్రమ అభ్యాస శిక్షణతో ఈ స్థితిని అందరు పొందవచ్చును. సమస్త అద్భుతములకు స్వాత్మే కేంద్రము. మానవాభ్యున్నతికి, విశ్వశ్రేయస్సు నిమిత్తము తోడ్పడు పరిశొధనలు ఏవియైనను యోగ్యములే కాగలవు.

138. మీరు ఎలా కావటానికైనను మీకు మీరే ఆధారం. మీ ఉద్ధారకుడు బయటలేడు. మీలోనే అంతర్నిహితుడై అపరోక్షానుభూతికి అవగతుడై ఉన్నాడు. దీనికి తిరుగులేదు. ప్రయత్నము సరిగాలేనప్పుడు ఎన్ని మార్గాలు తెలుసుకున్నను నిరర్ధకము కాగలదు. అందులకే దృఢ నిశ్చయము, గొప్ప పట్టుదల ముఖ్యము. అపుడే మానసిక శక్తులు బయటికి రాగలవు.

139. ముందుగ మనస్సు స్థిమితం కావాలి. అపుడే ఏ సాధనయైనను ఫలిస్తుంది. నిర్జన ప్రదేశంలో నిశ్శబ్ధంగా కూర్చుండి ప్రశాంతంగా ఆలోచించాలి. ధైర్యంగా, నమ్మకంతో దీక్షలో మునగాలి. అపుడే ఆత్మశక్తి పనిచేస్తుంది. మనో ఏకాగ్రశక్తియే విజయ ద్వారము. ఏదైనా ఒక అద్భుత విషయాన్ని విని తెలుసుకొన్నంతలోనే సరిపోదు. అలా మసలుకొని, అందు కలసిపోవాలి. అపుడే తత్సంబంధ శక్తి జనిస్తుంది.

140. శరీర దారుఢ్యముకన్న మనోదారుఢ్యము గొప్పది. మానసిక శక్తియనిన అది ఒక పర్వతమంత స్థూలరూపం కాదు. భావనకు, ఊహకు అందని సూక్ష్మ శక్తి సామర్థ్యంతో దీనిని కార్యసాధనకు వినియోగించాలి. ఈ విశ్వమంతయు ఒక అపురూప దివ్యశక్తితో నిండియున్నది. వారి వారి మానసిక శక్త్యానుసారము ఇట్టి దివ్యశక్తిని స్వాధీనo చేసికోగలుగుచున్నారు. సర్వాంతరాత్మే అత్యద్భుత మహిమాన్విత దివ్యశక్తులకు ఆలవాలము. అందులకై స్వతంత్రమైన ఆత్మను సర్వస్వతంత్రమైన సర్వాత్మలో లయపరచి, బీజరూపములో దాగియున్న శక్తులను వికసింపజేయాలి. ఇదియే సర్వలయ స్థితి లక్ష్యము.

- 22 - 141. మీరు తెలుసుకున్నను, తెలుసుకోకపోయినను, దేనితో నిమిత్తములేకుండా ప్రతివారిలో ఒక సహజ దివ్యశక్తి దానంతట అదియే పనిచేస్తుంది. దీనిని ఎరుంగుటయే అసలైన అభివృద్ధి. ఈ రహస్యమెరింగి క్షణ క్షణము సర్వవిధముల అభివృద్ధిచెందాలి. ఆవు పొదుగునుండి పాలను పిండిన వెంటనే ఆ పొదుగు చిక్కిపోవునట్లు, పరమార్థ దివ్యశక్తిని అనుచిత విషయాలపై ప్రయోగించుట అంతేనని మరువరాదు.

142. ధ్వని, పలుకు నాధ బ్రహ్మ స్వరూపము. అందులకే మనం మాట్లాడే ప్రతి పలుకులోను శక్తిని జనింపజేయు గుణము గలదు. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క విధమైన శబ్ధ తరంగాలు సాగరోపరితల అలలవలె బయలుదేరును. అవి అతిసూక్ష్మ వాతావరణంలో అనంతాకాశ పరిధిలోకి పలుమారులు ఉచ్చరించటంచేత గట్టిపడి వాటి తరంగాలు శక్తివంతము ఔతాయి. మంత్రపఠనశీలురీ విషయమును మదిలో నిలుపుకొందురుగాక!

143. ఇదిగో! ఎవ్వరును విలపించవలసిన పనిలేదు. ఎవరికి వారే వికసించు సమయమిటు రండి. సూర్యరశ్మి సోకగానే జలమందలి కమలములు వికసించునట్లుగ మీరీ వాక్యములకు చెవియొగ్గినచో, స్వాత్మ వికాసము, విజయము తథ్యం అని నిశ్చయించి చెప్పుచున్నాను. 144. అంతరాత్మ తత్త్వం అంతరేక్షణకే తెలుసు. సరిగా పరిశీలించి చూడండి. మీ బాహ్యశక్తి సామర్థ్యాలను మించి పనిచేయగల గొప్పశక్తి మీలో అణగియున్నట్లు తెలుస్తుంది. దీనినే అంతరాత్మయని అంటారు. విశ్వశక్తులకు, అంతరాత్మకు సంబంధము గలదు. విశ్వశక్తులన్నియు బీజరూపములో అంతరాత్మయందే దాగియున్నవి. అందులకే ముందుగ అంతరాత్మను స్వాధీనం చేసుకొనడి. అపుడు విశ్వశక్తులందు అభివృద్ధిని పొంది సత్ఫలితముల నొసంగును.

145. ప్రకృతికి, అంతరాత్మకు సంబంధముగలదు. అలాగే మన అంతరాత్మకు, ఇతరుల అంతరాత్మకు దగ్గర సంబంధంగలదు. అందులకే ఆత్మశక్తి ఇతరులపైకూడ ప్రభావం చూపుతుంది. ఆకర్షణశక్తి, ఆత్మశక్తి, యోగశక్తి, దివ్యదృష్టి, దివ్య శ్రవణము ఇలాంటి మహత్తర శక్తులు ప్రతివారిలో మరుగుపడియున్నవి. ఓపికతో, దీక్షతో వాటి సిద్ధికి సాధన రహస్యాలు ఆరితేరిన నిపుణులద్వారా గ్రహించి, అట్టి శక్తులను అభివృద్ధి చేసుకోవచ్చును. మానవుడు విశ్వశక్తులకు అభిన్నుడు. అందులకే వివిధ మార్గాలద్వారా ఆత్మశక్తులను అభివృద్ధిచేసికోవచ్చును.

146. విశ్వమంతా అఖండ చైతన్య శక్తిమయం. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర సమూహములంతా విశ్వంలోనివే. అఖిలాండకోటి బ్రహ్మాండములు అనంతాకాశ వీధిలో ఏ ఆధారములు లేకుండా నిలువగలిగాయనిన అయ్యది సర్వాకర్షణ చిన్మయ సర్వశక్తి ప్రభావమని మరువరదు.

147. ఏ అభ్యాసమునకైనను నమ్మకము ప్రధానము. గట్టి నమ్మకబలముతో రోగాన్ని నివారణ చేయవచ్చును. అలాగే ఎక్కువ చేయవచ్చును. అందులకే వ్యతిరేక విషయాలను మాత్రం నమ్మి అనుమానాలకు ఆహుతికారాదు. ఏమి యదార్థం లేకపోయినప్పటికి పొరపాటున అనుమానంతో వ్యతిరేక విషయాన్ని నమ్ముటచే తత్సంబంధ భావనలే రజ్జుసర్ప భ్రాంతిగ పీడించును. అoదులకే ఎల్లప్పుడు నిజస్థితిలో నిలుకడపొందాలి.

- 23 -

148. ఎవరి విశ్వాసము వారిని ఉద్ధరిస్తుంది. విశ్వాసమునకు, మానసిక శక్తులకు దగ్గరి సంబంధం గలదు. అనుమానాలతోకూడిన భయ వాతావరణంలో నిత్యశంకిత చిత్తులై మెలగటం మరీ ప్రమాదకరము, విషాదకరము. ఒకడు నడుముకుగల వెండి మొలత్రాడు తెగి కాళ్ళపై పడగా పామని భ్రమసి అప్పటికప్పుడే నురుగులు కక్కి చచ్చాడు. ఇలా చాలా ప్రత్యక్ష నిదర్శనాలు కలవు. సత్యపరిధిలో బలీయమగు మానసమే అతి ముఖ్యము.

149. ఆత్మవిశ్వాసమే అఖండ మంత్రము. దీనిముందు పామర పిచ్చి ఊహలు ఊయలలూగవు. మానవుని ప్రతి ఊహ, ప్రతి సంకల్పము మహా మంత్రముగా పనిచేస్తుంది. సత్సంకల్పముతో శ్రద్ధగా మంచినే తలవాలి. ఇదియే బాగుపడు భాగవత లక్షణము. మనోదృష్టి అమోఘమైనది.

150. మానసిక శక్తులను అభివృద్ధి చేసుకోవాలనే ప్రతివారు ఇవి జ్ఞప్తిలో ఉంచుకోవాలి. 1. ఆరోగ్యము, ఆహ్లాదము. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలితప్ప కృంగదీసే బాధలు, శోకాలు, విచారకరమైన ఆలోచనలు మనో వికాసమునకు తీరని ప్రతిబంధకములు. నమ్మకమనేది ప్రాణం తీస్తుంది, కాపాడుతుంది. ఆవుపాలే కానీగాక పైన విషం అని అంటించిన కాగితమున్నచో, ఆ కాగితమును ముందుగ అదువక అందలి పాలను త్రాగిన పిదప విషం అనే పేరు చదివిన, త్రాగింది విషం అనే నమ్మకముతో స్పృహ తప్పవలసిందే. అందులకే మనస్సులో నమ్మకం కుదిరిన భావాలన్ని వెంటనే నిజమవుతాయి అనటంలో ఎట్టి సందేహంలేదు. ఎవరి విశ్వాసము వారిని స్వస్థపరుస్తుంది.

151. యోగాహ్యాసము, ప్రాణాయామముకూడ మానసిక శక్తుల వికాసమునకు ఉపకరించు దివ్యసాధనములు. మానసిక శక్తుల వికాసమును కోరువారలు ముందుగ మానసిక కల్లోలములను, చపలచిత్తమును, భావోద్రేకములను జయించినపుడే నిజస్థితిని తెలుసుకొనుటకు వీలవుతుంది. నిరర్ధకమైన ఆలోచనలను, అసంబద్ధమైన కోర్కెలను వదలి, మానసిక శక్తుల వికాసాభిలాషగలిగి దృఢనిశ్చయ దృక్పథముతో , సందేహము, నిర్లక్ష్యము, అజాగ్రత్త, సోమరితనమును వదలివేసి పాటుపడవలయును. క్రమేణ అణువునుండి అనంతమువరకు వ్యాపించగల సర్వశక్తివంతమైన స్థితిని చేరవచ్చును. దీనిని సాధించుటకు ఏకాగ్ర, సర్వేకాగ్ర శక్తి కావలయును. 152. అనుమానాలకైనను, మూఢనమ్మకాలకైనను అజ్ఞానమే మూలము. ఇది చాలా ప్రమాదము. ముందుగ నీ విశ్వాసమే నీకు ప్రథమ గురువు. వ్యక్తి వ్యతిరేకభావాలను నమ్మినపుడు అవి భయాందోళనలకు దారితీసి మనస్సులో ఒక మంత్రంగా మననమగుచు దుష్ఫలితాలకు దారితీయగలవు. అందులకే ఎదుటివారికి ప్రమాదహేతువగు ఏమాటను చెప్పరాదు, నమ్మరాదు. మంచి విషయము మీద మనస్సును కేంద్రీకరించటమే ఒక మంత్రము. పట్టుదల, నమ్మకము సాధన శక్తినిబట్టి మంత్రము ఫలిస్తుంది. శక్తివంతమైన ఊహ, ప్రగాఢ నమ్మకము అద్భుతమైన ఫలితమునిస్తుంది. మానసిక శక్తులు మనస్సులోని కోర్కెకు అనుగుణంగా పనిచేస్తాయి. అవి మంత్రాలద్వారా సునాయాసంగా అందుబాటులో ఉంటాయి. అందులకే మానసికశక్తి మంత్రశక్తిగా రూపొందుతుంది.

153. ప్రతివారు తమ జీవితమును సాధ్యమైనంతవరకు ఉత్సాహముగా గడపటానికి ప్రయత్నించాలి. భయం, కోపం, విచారం, బెంగ ఇవి కృంగదీస్తాయి. మనస్సుకు, శరీరానికి చాల చెరుపుచేస్తాయి. ఉద్రేకపూరిత మానసిక కల్లోలాలు అంతర్గత శతృవులు. అవి ఎప్పుడూ అదుపాజ్ఞలుదాటి పోకూడదు. అవి మన స్వాధీనంలో ఉండాలి.

- 24 - మనం వాటికి బానిసలు కాకూడదు. ఆశ, సంతోషం, ఉత్సాహం ఇవి మూడు దేహ, మనంబులకు మేలుచేయు ప్రియ మిత్రములు అని మరువరాదు.

154. తీవ్ర భయాందోళనలతో కూడుకొనిన ఉద్రేకములు శరీరములోని కొన్ని గ్రంథులకు ఎక్కువ పనికల్పిస్తాయి. కోపము నోటిలో ఊరే లాలాజలమును విషపూరితం చేస్తుంది. ఆ సమయంలో బాలింతలు తమ బిడ్డలకు పాలను ఇవ్వటం విషం ఇచ్చుటవంటిది. అసలు తగుమాత్రం కోపం, ఉద్రేకంలేకుండ ఏపని జరుగదు. ఉద్రేకం ఏపనినైనా సరె ముందుకు సాగించటానికి తగిన సత్తానిస్తుంది. కాని ఎప్పుడూ మితంగా, మోతాదుగ మాత్రమే స్వాధీనమై అదుపులో ఉండుట శ్రేయస్కర లక్షణము.

155. కొందరు యంత్రములను, తాయెత్తులను ధరించటంవల్ల ఆశించిన సత్ఫలితాలు చేకూరగలవనటంలో సందేహంలేదు. అవి ధరించినవారు అట్టి బలీయమైన విశ్వాసంతో నిరీక్షణ చేయగలరు. అపుడు వారిలో అంతర్గతముగ దాగియున్న మానసిక శక్తులు వికసించి, ఆశించిన ఫలితములను లభ్యంచేస్తాయి. పామరజనులు సలిపే తిరుపతి, శ్రీరంగ, కాశీ యాత్రా విశేషములు సైతము అంతే. అక్కడి దేవుడు కాదు ముఖ్యం, పోయేవారి ఆత్మవిశ్వాసం పనిచేస్తుంది. ఈ కిటుకు అందరికి తెలియక బయట ఆగంగ తిరుగుతారు. ఒక్కొక్కరికి ఒకరకమైన నమ్మకము. చిల్లర దేవతా భ్రమలుకూడా అంతేనని తెలియాలి. అన్నింటికి అంతరాత్మయే మూలమని తెలుసుకోండి.

156. నీలో ఉన్న విశ్వాసమే బయటి నమ్మకాలపై పనిచేస్తుంది. ముడుపులు కట్టటం, దండం పెట్టటం ఇలా కొన్ని దర్జాలుగలవు. ఇవి అన్నీ మానసిక శక్తుల నమ్మకాలతో ఫలిస్తాయి. వేరే ఏమిలేదు. అందులకే బయట బెంబెర్లెత్తి వెదకటo మాని, మీ ఆత్మశక్తిని మీరు సాధించండి.

157. ఓ వివేకి లే! నీ స్వాత్మ శక్తి సామర్థ్యాలను ఒక్కసారి చూచుకో. మండే మంటలో నీళ్ళుపోసినట్లు సంకుచిత పరిధిలో చిక్కి నీ శక్తిని నీవు చల్లార్చుకోవద్దు. లే! నీ శక్తిని నీవే శంకిస్తున్నావు. అదే అన్యాయం. సక్రమ భావములతో, ప్రగాఢమైన నమ్మకంతో, ఆత్మశక్తిని ఉద్దీపనచేయి. ధైర్యం జయాన్ని తెచ్చిపెడుతుంది. నిన్ను నీవు సందేహించి భయపడితివా అపజయం తప్పదు. ఇది తెలుసుకోదగ్గ నగ్నసత్యం.

158. ఈ విశ్వమంతా శక్తిమయం. ప్రకృతిలో మానవుడే అద్భుతమైన నిర్మాణశక్తి, గొప్ప పనివాడు. పైకి కనపడే మానవుడుకాదు, అంతర్ మానవుడు. అట్టి మానవుడే అపూర్వ దివ్యశక్తి. అందులకే నిద్రనుండి మేల్కొని విజృంభించు. లక్ష్యాన్ని చేరే పర్యంతం నిత్య ప్రయత్నం చేయరాదని వేదఘోష. అంతర్ మానవుని మేలుకొలుపును సూచిస్తుంది. లే! ముందుగ ప్రయత్నించుము. కష్టించి పనిచేసిన అంతయు సాధ్యమే. 159. మానసిక వెలుగులు, వాటి విలువలు, శక్తులు నిజమేనాయని వాటి రుచి చూడదలంచినవారు నిర్లక్ష్య భావంవదలి, నిర్నీత మార్గాలలో సాధన చేయటంద్వారా తప్పక సిద్ధి లభిస్తుందని తరువాత వారే బోధిస్తారు. దివ్య నిర్మాణ శక్తియే అసలైన సంతృప్తి. జీవితంలోని నిజమైన విజయసాధనకు మానసిక శక్తుల వికాసము ఎంతగానో పనిచేయును. నిర్లక్ష్యభావంతో వీటిని అణచిపెట్టరాదు. మానసిక శక్తులు మోసంకాదు, గారడి అంతకన్నా కాదు. అవి వాస్తవికములు. వీటి ఆంతర్యం తెలియక ఎగతాళి చేయువారే నవ్వులపాలు కాగలరు. ఇదిగో! మీ శక్తులను మీ దృష్టికి తీసుకురావడానికే ఈ రచన. - 25 - 160. ప్రయత్నాలకు తోడుగ సంతోషముతో నిండిన శుద్ధ మనస్సు అత్యవసరం. ధైర్యం, సాహసం, సహనం, దృఢదీక్ష, సడలని పట్టుదల, ఎడతెగని నిరంతర ప్రయత్నం ఇట్టి లక్షణములను ముందుగ అలవరచుకోవాలి. మేము బలహీనులం, క్షుధ్రులం అనుకొనేవారు ఘనకార్యములను మచ్చుకైనను సాధించలేరు. అందులకే సర్వశక్తి సంపన్నులు కండి.

161. ఇదిగో! కన్నులుమూసి చూడవచ్చు, కన్నులుతెరచి మరువవచ్చు. గాలిలో తేలవచ్చు. ప్రాణంతో భూస్థాపితమై క్షేమంగా జీవసమాధిలో ఉండవచ్చు. ఇవన్నియు ప్రత్యేక సాధనములు, భూటకములు మాత్రంకావు. మనోనేత్ర దృష్టి అలవడిన దూరదృష్టి, దూర శ్రవణము సాధ్యమగును. సర్వశక్తులను సాధించిననాడు ఆ ప్రతిభకు అంతుండదు. ఈ లోకంలో పేరెన్నికగన్న సత్పురుషులు, ప్రవక్తలు, అవతార పురుషులతో సహా అందరు ఆత్మశక్తులను అనుభూతిచేసికొనియే తేజరిల్లినారన్న నగ్నసత్యాన్ని ప్రతివారు నిరంతరము మరువరాదు.

162. స్వాత్మ సర్వశక్తులకు నిలయమైన గని. ఏకదీక్షతో, సాధించాలనే తీవ్ర పట్టుదలతో ఈ గనిని త్రవాలి. అపుడే మహిమలు బయల్పడును. ఇకనైనా ప్రతివారిలో నిగూఢంగా దాగియున్న మానసిక శక్తుల సంపదను పొందనేర్వండి. అపుడు ఊహకందని అతీతమైన అద్భుత విషయాలు అనుభవంకాగలవు.

163. ఆత్మశక్తి అపారము. కంటికి కనపడని శక్తి అంతగొప్పదా అను శంకరావచ్చు. అణువు చిన్నదే ఐనను అణ్వస్త్ర ప్రభావం అందరికి తెలుసు. బలమైన అద్భుత శక్తికి పరిమాణంతో పనిలేదు. బ్రహ్మాండ శక్తులన్నియు అతి సూక్ష్మంగానే ఉంటాయి. ఎవరూ ఆశ్చర్యపడవలసిన పనిలేదు. మీలోని శక్తుల ప్రభావం అట్టిది. అందులకే మీశక్తిని సాధించి బోధించండి. ముందుగ పరిశోధించండి. అపుడు మీలోని మహత్తర శక్తులను కంగొనగలరు.

164. సత్ శీలం, సత్ప్రవర్తన, ఆకర్షణశక్తిని వృద్ధిచేస్తుంది. నిష్కల్మష హృదయులైన పసిపాపలు అందరిచే ప్రీతిపాత్రులై ఆకర్షింపబడుదురు. పెరిగి పెద్దవారైనకొలది వారు చెడు లక్షణాలకు అలవడిన తిరస్కరింపబడుదురు. జీవితము మరణించటానికి మాత్రమేకాదు. జీవితంలో ఏదియో ఒక మంచి లక్ష్యాన్ని నిర్ణయించుకొని, సద్భావన పూరితమైన మనో ఏకాగ్రశక్తితో సాధించటానికి అని మరువరాదు.

165. పట్టువిడువని ప్రయత్నంతో ఒక సద్భావమును మాటలలో మాటిమాటికి స్మరించినను లేదా పఠించినను అవి కార్యసాధనలో అమితబలమును కలుగజేస్తాయి. అవియే మంత్రాలు అనవచ్చును. ఒక పనిని ప్రారంభించి ఇక లాభంలేదని వదలరాదు. ఒక మార్గంలో అపజయం కలిగిన మరొక మార్గం లేదనుకోరాదు. ఒకసారి పరీక్షలో తప్పిన విద్యార్థి మరొకసారి పాటుపడిన నెగ్గే వీలుంది. మానసిక భావశక్తులే మంత్రశక్తులుగా రూపొందగలవు. మంత్రాలను కూర్చుకోవటంలో లోపాలురాకుండ చూచుకోవాలి. అనగా ఆయా సందర్భాలకు అనుగుణ్యంగా మంత్రాలను కూర్చుకొని జపిస్తూ రావాలి. ఏకదీక్షతో ఎదురుచూడాలి. ఫలసిద్ధి తప్పక లభ్యంకాగలదు. సక్రమ వాతావరణంలోనే ఇది సాధ్యం.


- 26 - 166. గింజ పెట్టగానే చెట్టుకాదు. కాల పరిపాకం రావాలి. అటులే ఏదైనను ప్రారంభించి వెంటనే ఫలితం చేకూరలేదని కంగారు పడవలదు. సక్రమ వాతావరణంలో నిరీక్షించువారంతా శుభఘడియలు చూచేరోజు వస్తుంది. కేంద్రీకరింపబడిన మానసిక శక్తితో నిలువాలి. దీనికి నిలుకడ అవసరం. ఏకాగ్ర భావనిష్ఠ మానసిక శక్తిని బాగా అభివృద్ధిచేస్తుంది. దీనితో విశ్వజన శ్రేయస్కరమైన మంచిపనులు చేయవచ్చు. సమర్థుల శాపనాలుకాని, ఆశీర్వచనములుకాని సిద్ధించును.

167. వ్యక్తి వికాసము విశ్వ మనోశక్తి ప్రణాళికలోనే ఉన్నది. దానిని స్వశక్తితో సాధ్యమైనంతలో పొందాలి. కనపడని శక్తులు కనిపించే జీవితాలను నడుపుటకు ముఖ్యపాత్ర వహిస్తాయి. విశ్వప్రణాళిక ప్రకారము ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా నిలచి ఎదుర్కోవటం అభ్యసించాలి. అందుకు ఆలోచన, ఊహ, ధైర్యం, పట్టుదల, దీక్ష అన్నిటిని ఉపయోగించాలి. అలాకాకుండా కర్మయని విలపించి కూర్చోవటం సోమరులు తమ విధిని తప్పించుకోవటానికి పన్నిన కుతంత్రమనవచ్చు.

168. నీ మనస్సే నీకు మహా మంత్ర వైద్యాలయం కావాలి. ఇది గొప్ప రహస్యం. విశ్వాసపూరిత మంత్ర పఠనాభ్యాసమే ఆ రహస్యం. నీ సంస్కరణలకు తగిన ఏర్పాట్లన్నియు నీయొక్క చిత్ క్షేత్రమునందే విలీనములై యున్నవి. అసాధారణ శక్తులు, రహస్యాలెన్నియో నీ మెదడులోనే గలవు. కావున దానిని సక్రమ శిక్షణతో రాపిడిచేయాలి. సందేహము, భయము, ఆందోళనలు అభివృద్ధికి అంతరాయములు. మనో నిశ్చయము, నమ్మకము సత్ఫలితములను కలుగజేయును.

169. యోగమంటే మనస్సును దివ్యమనస్సుతో కలపటమని అర్థం. వ్యక్తి మనస్సు దైవమనస్సులో కలిసినప్పుడు వేడిమిచే చలి దూరమైనట్లు, దివ్యశక్తులన్ని వస్తాయి. ఊహ అన్ని ఆలోచనలకు మూలం. ఇది భావోద్రేకమును పెంచి, మానసిక శక్తులను వికసింపజేస్తుంది. వ్యక్తిలో పవిత్రత, సహనం, క్రమాభ్యాస సాధన అవసరం. నిద్రమేల్కలకు ముందు సాధనకు మంచి సమయాలు. అపుడు బాహ్యప్రపంచ ధోరణిని తగ్గించుకొని దివ్యశక్తితో సంబంధము కలిగించుకోవాలి. ఇదియే ఆత్మసిద్ధికి మూల రహస్యం.

170. జీవితానికి ఆనందం ముఖ్యం. నిరాశ, నిస్పృహగ్రస్థులు దీనిని పొందలేరు. చెడు జరుగుతుందని లోపాల గురించి దు:ఖిస్తే ప్రయోజనంలేదు. సదా మంచియే జరుగుతుందనే భావంతో నిలువాలి. జీవితంలో ఎన్నియో విజయాలను సాధించినవారు కూడా తీవ్ర అశాంతితో ఉంటారు. ఆనందం బయటినుండి బలవంతంగారాదు. ఆత్మానందం హృదయంలోనుంచి పుట్టాలి. ఆత్మశక్తియే మానవుని గొప్పవానిగా తీర్చిదిద్దుతుంది.

171. ప్రశాంతిలోనే ఏకాగ్రత ఉంటుంది. మనస్సులో ఏ విధమైన అలజడి ఉండరాదు. అంటే గాఢనిద్రలో మనస్సు ఎంత ప్రశాoతంగా ఉంటుందో, మెలకువలో కూడా అంత నిర్మలంగా, ప్రశాంతంగా ఉండాలి. అపుడే భావశక్తి మనో కేంద్రీకరణ శక్తిగా రూపొంది లక్ష్యం సిద్ధించును. తొలి ప్రయత్నం విఫలమైనంత మాత్రంచే నిరాశచెందరాదు. ఎడతెగని దీక్ష, పట్టుదల వదలరాదు.


- 27- 172. నమ్మకము గట్టిదైనప్పుడు దానికి సంబంధించిన ఫలితములు అట్లే ఉంటాయి. భావ ప్రభావం గొప్పది. ఒక భావమ్మీద మనస్సును సంపూర్ణంగా కేంద్రీకరిస్తే అది నిజంగా మారుతుందనటంలో వింతలేదు. అంతరాత్మ చాలా శక్తివంతమైనది. ఏకాగ్ర భావబలముతో అది పనిచేస్తుంది.

173. దివ్య శ్రవణము, దివ్య దృష్టి ఇవి అంతరాత్మలో ఉండే మానసిక అద్భుతశక్తులు. ఇవి అతిగాఢ యోగనిద్రలోనే పనిచేయగలవు. అందులకే యోగనిద్రను ప్రయోగించి ఇవి పనిచేసేలా చూడాలి. ఈ శక్తులు అందరిలో సమానంగా ఉండును. సాధకుల శక్తిసామర్థ్యాలపై కూడా వీటి చైతన్యం, ప్రభావం ఆధారపడి ఉంటుంది.

174. నెమలినిగాని, పాలపిట్టనుగాని చూచిన కన్నులకింపు, నేత్రానందము కాగలదు. కాకులను, కంచర గాడిదలను చూచిన మనసు ఆహ్లాదముకాదు. అందులకే రంగుల ప్రభావం కూడా ఉంటుంది. కొందరు వైద్యులు రంగుదీపాలతో వైద్య పరిశొధనలుచేసి ఈ క్రింది విషయాలు కనుగొన్నారు. ఆకుపచ్చ కాంతి శరీర వాపులను, మంటలను, నొప్పిని, నరముల సంచలనాన్ని తగ్గించి చల్లబరుస్తుంది. నీలపు కాంతి క్రిమి సంబంధమైన రోగములు రాకుందా, రక్తము లేమిని సరిచేయటానికి ఉపయోగిస్తుంది. పసుపు కాంతి మనో వికాసాన్ని కలిగిస్తుంది. ఎరుపు రంగు ఉద్రిక్తతను కలుగజేస్తుంది. ఊదా రంగు కాంతి గుండె, ఊపిరితిత్తులకు, రక్తనాళములకు మేలుచేసి, హృదయ వికాసానికి దోహదపడుతుంది. దుస్తుల విషయంలోకూడా అంతే. ఊదా కాంతి రంగు శక్తివంతము, నలుపు మనోవికారమును, బెంగను కలుగజేయును. తెలుపు సత్త్వగుణమును పెంచును. గచ్చకాయరంగు నిస్వార్థమును, పసుపు రంగు వైరాగ్య భావమును కలుగజేయును.

175. మన మనస్సుకు ఎదుటివారి మనస్సులోని భావాలు తెలుసుకునే శక్తి ఉంది. బాహ్య మాటలు, వ్రాతలు, సంజ్ఞలు లేకుండానే వాటిని తెలుసుకొనే శక్తి మనస్సుకుందని జ్ఞానదేవుడు, భర్తృహరి, పతంజలి మున్నగు యోగులు, మానసిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. తీగలులేని రేడియోలాగా భావాలను ప్రసారం చేయటం, తీసికోవటం అనే శక్తులు మనస్సుకున్నాయి. ఐతే ఉభయులకీ సాధన తెలిసియుండాలి. అపుడు సునాయాసంగా భావప్రసారం జరుగగలదు.

176. నేను అసమర్థుడను, నాకంతటి శక్తిలేదు అని స్వశక్తిని సందేహిస్తూ ఉండినంతకాలం ఎవరు పైకిరాలేరు. ముందుగ తన శక్తి సామర్థ్యాన్ని గుర్తించటం చాలా అవసరం. సమస్త ఘన విజయాలకు ఇదియే మూలము. ఓ వివేకి! నిండు నమ్మకముతో నిలువు. సర్వ శక్తిభరితమైన ప్రార్థన చేయి. గతాన్ని గూర్చి ఏ విచారము వద్దు. ఏది యోగ్యమో దానిని నిర్ణయించుకొని పాటుపడాలి. ఏమీ చేయలేము అనుకోవటం అసమర్థ లక్షణం. ముందుగ ఎవరిపై వారికి నమ్మకము, విలువ ఉండాలి. అపజయాల గురించి ఆలోచిస్తే ముందుకు సాగలేరు. ప్రయత్నలోపం ఉండరాదు. ఆపై దైవ విధి అనుకోవాలి. ఇదియే జీవిత విజయ గమ్యం.

177. ప్రతివారు విధిగ ప్రతికూల వాతావరణమునకు, దుష్టసంకల్పములకు స్వస్థిచెప్పాలి. సరియైన, యోగ్యమైన ప్రాణమిత్రులను ఎన్నుకోవాలి. ఎవరి విషయములోనైనను వారి తరువాతనే ఇతరులు. నీకు నీవే నిజమైన మిత్రము. నీ గురించి ఇతరులు ఎక్కువగా ఆలోచించే అవకాశము ఇవ్వరాదు. నీ గురించి తెలిసిన వ్యక్తి నిండా

- 28 - నీవే. శాస్త్రములు, గురువులు నిమిత్తమాత్రులు. వారు కేవలం సూచనలు, సలహాలు మాత్రమే ఇవ్వగలరు. తగువిధంగా ఆచరించటం నీవంతు. అందులకే ఎవరినివారే ఉద్ధరించుకోవాలి. నిన్ను నీవు ఏ సమయములోనైనను చులకనగా చూచుకోరాదు.

178. ఈ లోకంలో ఏ విషయంలోగాని, అసలుకంటే నకిలీకే ఎక్కువ ప్రచార ఆర్భాటం ఉంటుంది. నాణ్యతలేని కల్తీ విత్తనములవంటివి మోసపు దోషములు. నకిలీ సరుకును మెచ్చే లోకులు అసలు సరుకును నమ్మలేరు. కంచు మ్రోగునట్లు కనకము మ్రోగదు. మెరిసేదంతా బంగారంకాదు. తెల్లనివన్ని పాలుకావు. ప్రతి విషయంలో డూప్లికేట్ ఉంటుంది. ట్రూ కాపీ ఒరిగినల్ ను పోలియున్నను, విలువలో ఒరిగినల్ తర్వాతనే ట్రూ కాపీ రాణించగలదు. కావున భద్రం. నీ ఎన్నికలో లోపముండరాదు.

179. శ్రద్ధ, ఆసక్తి, విషయ అవగాహన లేకుండ గ్రంథాలయమును బట్టీపట్టువారికన్న, కేవలం ఏకాగ్రతను వృద్ధిపరచుకొనువారు మిన్నయని నిశ్చయించి చెప్పుచున్నాను. ఏకాగ్రతయే లక్ష్యసిద్ధికి ప్రధాన ద్వారము. ఈ సూత్రం విద్యార్థులవరకే కాదు, ప్రపంచంలోగల ఏ రంగములోని సాధకులకైనను వర్తించగలదు. ఇప్పటికి అద్భుత ఘనకార్యములు సాధించిన వారందరు ఏకాగ్రతను వృద్ధిపరచుకొన్న వారేనని మరువరాదు.

180. కేవలం మార్గాన్వేషణతో కాలయాపన చేయటం మాని, ఇష్టపూర్తిగ ఎన్నుకున్న మార్గంలో ప్రయత్నలోపం లేకుండ జాగ్రత్త వహించవలయును. ప్రతివారు తాము ఎన్నుకున్న పనిపట్ల గౌరవభావం కలిగి ఉండాలి. నిర్భంధముగ కాకుండ తనకు తానుగ అంకితభావంతో పనిచేసిన 1. విజయము 2. సరియైన గుర్తింపు రాగలదు. మానవ జీవితానికి దీనికి మించిన అవార్డు లేదు.

181. ప్రతివారికి నేను ఇచ్చు సలహా, సూచన ఏమనగా! చంచల స్వభావమును అరికట్టి, ప్రశాంత వాతావరణములో, ఎవరి పరిధిలో వారు ఏకదీక్షతో, నిశ్చింతగ నిలవాలి. ప్రతి చిన్న విషయానికి నిప్పులు తొక్కిన కోతివలె చీకాకుతో వ్యవహరించటం, బెంబేలెత్తి దీనాలాపన చేయకుండ అర్జునునివలె సదా లక్ష్యనిష్ఠ స్మృతిపథంలో ఉండాలి. అప్పుడు భ్రష్టత్వము నీదరికి రాదు. ప్రతి విద్యార్థి ముందుగ అలవరచుకోవలసిన సుగుణ సంపత్తి ఏమనగా? సోమరితనమునకు స్వస్థిచెప్పి శ్రద్ధ, ఆసక్తి, విశ్వాసము, నమ్రత, క్రమశిక్షణ, శీలనిర్మాణము, కఠోర పరిశ్రమ, దూరదృష్టి, దృఢ సంకల్పంతో, అంకితభావం కలిగి మెలగవలయును. జీవితాశయ సిద్ధికివి సత్ సంస్కార సోపానములు. 182. నిరంతరము ప్రవహించు సజీవ నదివలె సద్భావనా స్రవంతిని స్మృతి, ఏకాగ్ర, ధారణాశక్తులతో పెంపొందించవలయును. మరియు యుక్తాయుక్త పరిజ్ఞానముతో కూడిన అంతర్మథనము, చర్చ ఎవరికి వారు జరుపుకోవలయును. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడకుండ, స్వాత్మశక్తిని గుర్తించాలి. లోకమును తెలుసుకోవలయుననెటి జిజ్ఞాసకు ముందుగ నిన్ను నీవు పూర్తిగ అర్థం చేసికోగలగాలి. ప్రతి విషయంలో ఎవరో సలహానిచ్చి చెబితేనేతప్ప ఏమీచెయ్యలేని, స్వంత ఆలోచనలేని దీన, హీన, దౌర్భాగ్య స్థితికి అనగా అథమ స్థాయికి దిగజారరాదు. ఈ ఆంతర్యం సదా గుర్తుంచుకోండి.

- 29 -

183. ఏకాగ్ర శుభచిత్తమును మంచి గురువుగా, సలహాదారునిగ ఎన్నుకొని, చిత్త వికాసమునకు తోడ్పడు సాంగత్య, గ్రంథ పఠనాభ్యాసులై, ప్రతిఘటన, వైరుధ్య భావాలను అధిగమించండి. దీనికి మించిన ఆత్మశాంతి అవనిలో లేదు. వసంత రుతువునకు ముందుగ వృక్షములు పండుటాకులను నేలరాల్చి నూతనముగ చిగుర్చునట్లు, ప్రతివారు ముందుగ తమ చిత్తవృక్షమునుండి సమస్త అవలక్షణములనెటి ఆకులను రాల్చివేసి, కేవలం అఖండాత్మశక్తి సంపన్నులమనెటి నూతనోత్సాహముతో హృదయ సౌందర్య కళతో శోభిల్లవలయును.

184. ఈ లోకంలో చాలామంది అణువంత కర్మచేసి పర్వతమంత ఫలితాన్ని ఆశిస్తారు. మరియు ఇతరులు తమను గుర్తించి, గౌరవించాలని, పొగడ్తలతో సన్మానించాలని ఎదురు చూస్తుంటారు. ఇది చాలా అవివేకము. మీ సంకల్పములు, చర్యలు, శభాష్, మంచి పని చెశావని ఎవరిని వారు మెచ్చుకునే విధంగా ఉండవలయును. ఇతరుల ప్రశంసలకు ఎదురుచూడక, ఎవరిని వారు ప్రశంసించే ఉన్నత స్థితికి ఎదగాలి. విని ఆచరించేవారికి ఈ ఒక్క వాక్యంచాలు.

185. సర్వతోముఖ ప్రగతి సిద్ధ్యర్థం ప్రతివారలు ముందుగ విమర్శనాతీతులు కావలయును. చిల్లర పుకారులను లక్ష్యపెట్టని పర్వతనిష్ఠను కలిగి తమ పరిధిలో తాము స్వేచ్చగ విహరించవలయును. ఏ ప్రతిబంధకములు లేని నిర్మల వాతావరణమును సృష్టించుకోవలయును. తమ్ము తామే శాసించుకోవలయును. భవిష్యత్తులో నీ జీవితము ఎలా ఉండవలయునో పగటికలలు కంటూ, గాలిమేడలు నిర్మిస్తూ తక్షణ కర్తవ్యం విస్మరించరాదు. ఈ సూత్రం అందరికి వర్తించును. డైనమోవంటి మెదడును స్తంభింపజేయక దానికి పనిచెప్పిన ఎంతో మేలు జరుగుతుంది. నిరంతరము సద్విషయ చింతనయనెటి భావన కలిగియుండిన చాలు. దీనిచే సర్వాత్మ శక్తి భానోదయమగుట తథ్యం. జై బాబా!

*****

విజ్ఞప్తి: ఈ పుస్తకములోని విషయములు పదిమందికి ఉపయోగపడగలవని మీరు భావించినచో

            దయచేసి మీకున్న ముగ్గురు మంచి మిత్రులకు ఈమైల్ ద్వారా పంపగలరని కోరుచున్నాము.