Abhisirikonda
అలసిన వానికి ఊరడించు మాటలు*
- "ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవచేయుచున్నాము" (రోమా 7:6)*
దేవుని వాక్యము నుండి, మనలో ప్రతి ఒక్కరు ఏ విధముగా దేవునికి సాక్షులముగా, ఫలవంతముగా నుండగలమో మరియు దేవుని సేవలో ఇంకను సమృద్ధిగా ఫలవంతులముగా నుండగలమో చూడగలుగు చున్నాము. మనమందరము సహ విశ్వాసులముగా దేవుని ఉన్నతమైన పరలోకపు పిలుపుతో ఆయన జతపని వారముగా ఆయనను సేవించుటకు పిలువబడియున్నాము. లేఖనములలో రెండు స్థలములలో ఆయన జతపనివారమని కలదు ( 1 కొరింతి 3:9.. 2 కొరింతి 6:1) అట్టి ఆధిక్యత దేవతలకు ఇవ్వబడలేదు. అందుచేతనే పరిశుద్ధ గ్రంధములో ఎచ్చటను దేవుని దూతలు ఆయన జత పనివారుగా పిలువబడుట మనము చదవము. మన ఉన్నతమైన, పరలోకపు పిలుపు ఏదనగా, ఆయన కొరకు మహిమా యుక్తమైన, శాశ్వతమైన, పరలోకపు పరిశుద్ధ స్థలమును నిర్మించుటయే.
మోషే కథ నుండి దేవుడు మనలను తన పరిచర్య కొరకు ఎట్లు సిద్ధపరచగలడో మనము చూడగలము. మొట్టమొదటిగా, మన ఆసక్తి మనలను దేవునికి ఉపయోగకరంగా చేయజాలదని చూచుచున్నాము. మోషే తన ఆసక్తితో దేవుని సేవించ ప్రయత్నించి అపజయము పొందెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు నిరాకరించి గొప్ప త్యాగమును చేసినప్పటికిని, దేవుని ప్రజలకు సేవచేయుటకు, సహాయము చేయుటకు ఎంతో ఆసక్తిని కనబరచినప్పటికిని అతడు అపజయమునే ఎదుర్కొనవలసి వచ్చెను. అతడు పారిపోయి 40 సంవత్సరములు తన మామ యొద్ద దాగుకొనవలసి వచ్చెను. ఆ 40 సంవత్సరముల కాలములో అతడు నేర్చుకొనినదంతయు మరచిపోయెను. ఆ దైవ జనుడు ఐగుప్తు విద్య నంతటిని అభ్యసించినప్పటికిని, మాటలయందు , కార్యములయందు నేర్పరియైనప్పటికిని, దేవుడతనిని ఉపయోగించుకొనలేక పోయెను. ఐగుప్తులో నేర్చుకొనినదంతయు మరచిపోవునట్లు చేయుటకు దేవుడు అతనిని ఐగుప్తు నుండి తీసికొని పోవలసి వచ్చెను. దేవుడతనిని శక్తివంతముగా, ఫలవంతముగా ఉపయోగించుకొనక మునుపు అతడు ఖాళీ చేయబడెను.
అప్పుడు దేవుడు అతనికి తన పరిశుద్ధతను గూర్చిన స్పష్టమైన వ్యక్తిగత అనుభవమును కలుగ జేసెను (నిర్గమ 3) మన అర్హతలు, జ్ఞానము, తెలివితేటలద్వారా మనలో ఎవరమూ దేవునికి ఉపయోగకరంగా ఉండలేము. మొట్టమొదటిగా, మనము పరిశుద్ధుడును, ప్రేమగలవాడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవము కలిగియుండవలెను. " ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు (నిర్గమ 3:2) మోషే 40 సంవత్సరములు మామతో అరణ్యములో నుండుటచే అతడు ఎండిపోయిన పొదవలె అయ్యెను. అప్పుడు మాత్రమే అతడు దేవునిపై, ఆయన వాక్యముపై ఆధారపడి దేవుని సేవించి, వెంబడించగలడు.
అప్పుడతడు పొదలో అగ్నిని చూచెను గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడతడు దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడగలిగెను. దేవుడు మనలో నివసించ గోరుచున్నాడు. ఇది నూతన జన్మ యొక్క అనుభవమునకు గుర్తుగా నున్నది. మనలో మంచిదేదియు నివసింపదని యెరుగుదుము (రోమా 7:18) దేవుడు తన స్థాయిని బట్టి మనము నిత్వత్వమునకు సంబంధించిన నీతిని కలిగి యుండవలెనని కోరుచున్నారు. పరలోకరాజ్యములో నిత్యత్వము వరకు మనము ఆయన జతపనివారము కాగలము. ఆ మండుచున్నపొద, దైవిక అగ్ని, దేవుని నీతిని, దేవుని స్వంత నీతిని గురించి మాటలాడుచున్నాడు. రోమా 10: 3,4 లలో దేవుని నీతి కలదు, మన స్వంత నీతి కలదు. తన ప్రజల యెడల తనకు గల ఆసక్తితో, తన జ్ఞానముతో మోషే దేవుని ఎదుట నీతిమంతుడు కాగోరుటకు ప్రయత్నించెను. ఆ సమయములో ఎవరును అతని జీవితములో ఏ లోపమును కనుగొన లేదు. అతడు ఎంతో గొప్ప త్యాగమును చేసిన వ్యక్తి. ఏదో ఒక విధానములో తన ప్రజలకు సహాయము చేసెడివాడు. ఆ విధముగా అతడు స్వనీతి పరుడయ్యెను. *మనము స్వనీతి తో చేసిన దేదియు దేవుని తృప్తి పరచలేదు.* మోషే అగ్నిని చూచినప్పుడు, తాను ఏ విధముగా దేవుని ఎదుట నీతిమంతుడుగా కావలెనో ఎరిగెను. మోషే నీతిమంతుడుగా తీర్చబడిన తరువాత అతడు దేవుని స్వరమును వినెను (నిర్గమ 3:4) దేవుని నీతి మనము నీతిమంతులముగా తీర్చబడిన తరువాత, కొంత పరిమాణములో ఆయనను సేవించుటకు మనము పరసంబంధమైన, స్పష్టమైన బాధ్యతను స్వీకరించవలెను.
Please share 🙏Praise the LORD.🙏