వాడుకరి:Bhagathkumar1/చిన నాగయ్య

చిరస్మరణీయుడు 'చిన నాగయ్య'

"నాగయ్య గారు! మీరు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు కదా! అందుకు గాను మీకు నేను స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ మంజూరు చేయిస్తాను' అని మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి గారు నాగయ్య గారితో ఓ సందర్భంలో అంటే, రెడ్డిగారు, మీ అభిమానానికి ధన్యవాదాలు. నేనేదో మనదేశం కోసం నాకు తోచింది చేశాను. అది చాలంటూ 'ఆ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారు. గాంధీజీ పిలుపుతో 1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మందడపు చిన నాగయ్య ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలంలోని గుంటుపల్లి గోపవరం గ్రామంలో 1929 జూలై 1 న పాపయ్య, వెంకమ్మ దంపలతులకు 6 వ సంతానంగా జన్మించారు. పాపయ్య, వెంకమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పాపయ్య వ్యవసాయ కూలి. 1920-50ల మధ్య తెలంగాణ సమాజం అనేక అవరోధాలని ఎదుర్కొంది. ఒకవైపు బ్రిటీష్ వారి పాలన, మరోవైపు నైజాం నవాబు నిరంకుశత్వంతో తెలంగాణ నలిగిపోయింది. దొరల పెత్తనంతో సామాన్యులు వెట్టిచాకిరి చేయవలసి వచ్చింది. ఆనాటి సామాజిక పరిస్థితులు పాపయ్య కుటుంబంపై కూడా పడ్డాయి. పేదరికంతో వారు చాలా రోజులు పస్తులుండేవారు. పాపయ్య కుటుంబంలో చిన్నవాడైన నాగయ్య చురుకైనవాడు. నైజాం పరిపాలనలో మాతృభాషలకు ఆదరణ కరువైంది. ఆ రోజుల్లో చదువుకోవడానికి కనీసం పాఠశాలలు ఉండేవి కావు. నిరక్షరాస్యత, పేదరికం తెలంగాణ సమాజానికి శాపాలుగా మారాయి. పేదరికం వల్ల నాగయ్య చదువుకు దూరం కావల్సివచ్చింది. జీవనోపాధికోసం ఆయన గొర్రెలని కాశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జైలుపాలయ్యారు. నాగయ్యకు అదే గ్రామానికి చెందిన శేషమ్మతో 1944 లో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానంగా జన్మించారు. ఆయన ఎప్పుడూ ఉద్యమాలు, పోరాటాలతో నిరంతరం బిజీగా ఉండటం వల్ల శేషమ్మే కుటుంబ భారాన్ని మోసింది. నాగయ్య 1946-52 మధ్యకాలంలో తెలంగాణాలో జరిగిన పలుపోరాటాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. గ్రామంలో సామినేని సత్యం, దొడ్డ సూర్యనారాయణ, మందడపు బసవయ్యలతో కలిసి పలు ఉద్యమాలలో పాల్గొన్నారు. రైతు ఉద్యమాలలో పాల్గొని పలుసార్లు గాయాల పాలయ్యారు. ఉద్యమాలలో ఆయనకు పలువురు నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, నల్లమల గిరిప్రసాద్, జలగం వెంగళరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, శీలం సిద్ధారెడ్డి వంటి వారితో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. వారి స్నేహాన్ని ఏనాడూ ఆయన తన వ్యక్తిగత స్వార్ధానికి ఉపయోగించుకోలేదు. గుంటుపల్లి గోపవరం అడవుల్లో ఉండటం వల్ల నాటుసారా కాసేవారికి అనువైన ప్రదేశంగా ఉండేది. పైగా మండల కేంద్రానికి దూరంగా ఉండటం వల్ల, ఆంధ్రసరిహద్దుల్లో ఉండటం వల్ల కాపుసారా తయారీదారులపై ఎక్కువగా కేసులు నమోదయ్యేవి కావు. ఇటువంటి కారణాలతో గోపవరాన్ని 'సారా గోపవరం' గా పిలిచేవారు. ప్రజలలో అక్షరాస్యత పెంచి చైతన్యం కల్గిస్తేనే నాటుసారా తయారీని అరికట్టవచ్చని నాగయ్య భావించారు. తాను చదువుకోకపోయినా తన కుమారుడు సత్యనారాయణని ఉన్నత విద్యావంతుడిని చేశారు. సత్యనారాయణ సత్తుపల్లిలో తన స్నేహితులతో కలిసి ఒక కళాశాలని స్థాపించి తాను ఉపాధి పొందడమేగాకుండా పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గోపవరం గ్రామంలో ఎందరో విద్యార్ధులకు స్వల్ప ఫీజులకే విద్యనందించారు. ఆరోజుల్లో గోపవరంలో మంచి నీటి సమస్య ఎక్కువగా ఉండేది. మంచినీటి బావికోసం కొంత భూమిని నాగయ్య వితరణ చేశారు. జలగం వెంగళరావు గారి సహకారంతో ఆయన బావిని నిర్మించారు. ఈ బావి నీరుని నిమ్న, వెనుకబడిన వర్గాల వారు ఎక్కువగా ఉపయోగించుకొనేవారు. బెజవాడ పరిసర ప్రాంతాలలోని ధనిక రైతులు గోపవరం, భీమవరం గ్రామాలలో పొలాలని తక్కువ ధరలకి కొని మామిడితోటలు పెంచేవారు. ఈ తోటలకి ఈ గ్రామాల ప్రజలలోని కొందరిని తోటల యజమానులు కాపలాగా పెట్టుకొనేవారు. నాగయ్య కూడా ఒక వైపు మేకలు, గొర్రెలని కాచుకుంటూనే, మరో వైపు తోటలకు కాపలాగా ఉండేవారు. ఆయన నిజాయితీగా కాపలా కాసి తోటలని రక్షించడంతో ఒక తోట యజమాని కొంత భూమిని నాగయ్యకు దానంగా ఇచ్చాడు. నాగయ్య తన భార్య సహకారంతో వ్యవసాయాన్ని ఆ భూమిలో ప్రారంభించారు . ఆయన గొప్ప పర్యావరణ ప్రేమికుడు. మొక్కలని పెంచడం ఆయనకు అలవాటు. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలలో చేరడం ఇష్టం ఉండేది కాదు. గ్రామంలో ఎవరికి సమస్య వచ్చినా తనకున్న పరిచయాలతో వారి సమస్యలని పరిష్కరించేవారు. అందులో భాగంగా ఆయన పలుమార్లు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు. ఆయనకు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావుతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆరోజుల్లో గోపవరం గ్రామానికి సాగర్ కాల్వ నీరు సక్రమంగా వచ్చేవి కావు. ఆయన స్థానిక రైతులతో కల్సి పంటకు నీరొచ్చేంతవరకు పోరాడేవారు. బోడేపూడి కృషితో ఎర్రుపాలెం మండలంలోని చివరి గ్రామాలకి నాగార్జునసాగర్ నీళ్ళోచ్చేవి. గోపవరంలో ఒక ప్రాధమిక పాఠశాల వుండేది. ఇది మారుమూల గ్రామం కావడం వల్ల అక్కడ పనిచేయడానికి ఉపాధ్యాయులు ఎవరూ ఇష్టపడేవారు కాదు. అటువంటి సమయంలో సీతారామిరెడ్డి అనే ఉపాధ్యాయుడిని ఒప్పించి అతనికి వసతి కల్పించి గ్రామంలో విద్యార్థులకు చదువు చెప్పించేందుకు కృషిచేశారు. అప్పట్లో పెద్ద సైజులో రేడియోలుండేవి. అందరూ వార్తలు విని సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో రేడియోని కరంట్ స్థంబానికి కట్టి వార్తలు వినమని గ్రామ ప్రజలని కోరేవారు. ఆయన చివరి పరకు వామపక్ష భావజాలాన్ని అనుసరించి తీవ్ర అనారోగ్యంతో 1998 నవంబర్ 17 న తుదిశ్వాస విడిచారు. ( జూలై 1 నాగయ్య జయంతి సందర్భంగా ) ఆర్. రఘునందన్ సెల్ నెం . 9440848924