వాడుకరి:Chaduvari/ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి గురించి, బ్లాగుల గురించి, వికీపీడియా గురించీ రాసిన తొట్టతొలి వ్యాసాల్లో ఇదొకటి. ఇందులోని పాఠ్యంతోటే, ఆ తరువాతి కాలంలో అనేక ఇతర వ్యాసాలొచ్చాయి. ఒకట్రెండు పుస్తకాల్లో కూడా ఈ పాఠ్యం చోటు చేసుకుంది.



ఈ పేజీలోని వ్యాసాలకు మీరు మార్పులు చెయ్యదలిస్తే.. చేసెయ్యండి, ఏం పర్లేదు. అసలీ వ్యాసం రాయడానికి కారణం ఇది.

ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి

మార్చు

ఇంటర్నెట్లో తెలుగు బాగా వ్యాప్తి చెందకపోవడానికి పెద్ద అడ్డంకి - కంప్యూటరుకు తెలుగు రాకపోవడం.., దానికి తెలుగెలా నేర్పాలో మనకు తెలీకపోవడం. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే తెలుగు సైట్లు, బ్లాగులు, గ్రూపులు, పత్రికలు, పుస్తకాలు, కథలు, నవల్లూ తామరతంపరగా పుట్టుకొస్తాయి.. ఇంటర్నెట్లో తెలుగు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందనడంలో సందేహమేం లేదు.


మనకు ఆనందాశ్చర్యాలు కలిగించే వాస్తవమొకటుంది.. కంప్యూటర్లో తెలుగు రాయడానికి పద్ధతులిప్పటికే ఉన్నాయి. ఒకటి కాదు.. కనీసం నాలుగు పద్ధతులున్నాయి. పెద్దగా కష్టపడకుండానే మనం తెలుగు చూడొచ్చు, తెలుగులో రాయొచ్చు. అవేంటో చూద్దాం.


కంప్యూటరుకు తెలుగు నేర్పడమనేది జోడెద్దుల సవారీ లాంటిది.

  1. తెలుగు లిపిని అది చూపించగలగాలి. మీ కంప్యూటరులో తెలుగు కనపడకుండా పెట్టెలు పెట్టెలుగా కనపడుతోందనుకోండి.. దానికి తెలుగు రానట్లే!
  2. మనం తెలుగులో టైపు చేస్తే స్వీకరించే తెలివితేటలు దానికి ఉండాలి.


ఇప్పుడు మొదటి విషయం చూద్దాం.

తెలుగు లిపిని చూపించాలంటే సంబంధిత ఫాంటులు (అక్షరాలు) కంప్యూటరులో ఉండాలి లేదా తెలుగు యూనికోడ్ (ఇది ప్రపంచవ్యాప్తముగా లిపిని వ్యక్తీకరించే ఒక ప్రమాణము) ని అర్ధం చేసుకునగలగాలి. కొన్ని కంప్యూటర్లలో అయితే ఈ ఫాంటులు ముందే ఉంటాయి. వాటిని వెలికితీసి, దానికి అనుకూలమైన చోట పెడితే పని అయినట్లే! ఈ వివరాలన్నీ http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts - ఇక్కడ దొరుకుతాయి. మీ కంప్యూటరు ఆపరేటింగు సిస్టమును బట్టి ఏమేం చెయ్యాలనే సమగ్ర సమాచారం మీకక్కడ దొరుకుతుంది.


ఇక రెండో విషయం.. కంప్యూటర్లో తెలుగు రాయడం. తెలుగులో చాలా సులభంగా రాయగలిగే పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. కీబోర్డులో ఒక మీట నొక్కగానే అది తెలుగు టైపు చెయ్యడానికి సిద్ధమౌతుంది. ఇక తెలుగు టైపురైటరులాగా టైపు చేసుకుంటూ పోవడమే! మరో కీ నొక్కగానే మళ్ళీ ఇంగ్లీషుకు మారిపోతుంది. దీన్నే ప్రత్యక్ష అమరిక(inscript layout) అని అంటారు. ఇది ఒక పద్ధతి.

ఇక మరో పద్ధతి ఉంది.. మీరు మామూలుగా ఇంగ్లీషు లిపిలోనే టైపు చేస్తారు, కానీ అది తెలుగులో రాసుకుంటూ పోతుంది! దీనినే మనం శబ్దానుగుణ అమరిక(Phonetic Layout) అనవచ్చును. ఉదాహరణకు మీరు "రామా" అని రాయాలనుకుంటే "raamaa" అని రాస్తే చాలు. మరిన్ని వివరాలకు కింది లింకులు చూడండి.

వీటిల్లో దేని సౌలభ్యము దానికి ఉన్నది.

ఇవి రెండూ చాలా తేలికగా అలవాటుచేసికొనగలిగిన ఉపకరణాలు. 15 నిముషాల ప్రయత్నముతో తెలుగు టైపు చేయడం మొదలు పెట్టవచ్చును. ఐతే, ఈ ఉపకరణాలలో టైపు చేసి, దానిని కత్తిరించి, మీకు కావలసిన చోట అతికించుకోవాలి (paste). ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ వర్డ్ లో గాని, మీ వెబ్ పేజ్ ఎడిటర్ లో గాని, ఈ-లేఖలలో గాని.


  • మీరు గనుక విండోస్ XP వాడుతున్నట్లయితే http://telugublog.blogspot.com/2006/03/xp.html లోని సోపానాలు పాటించి, ఏ ఉపకరణంలో అయినా తెలుగులో వ్రాసుకొనవచ్చు. దీనితో మీరు ప్రత్యక్ష అమరిక(inscript layout)ను వాడి నేరుగా తెలుగులో వ్రాసుకోవచ్చు. ఒకవేళ మీరు శబ్ధానుగుణం అమరికలో తెలుగు టైపు చెయ్యాలనుకొంటే, భాషాఇండియా వారు విడుదలచేసిన చిన్న ఉపకరణాన్ని http://www.bhashaindia.com/PhoneticTool/ నుండి దిగుమతి చేసుకోవచ్చు.
  • మీరు Linuxను కనుక వాడుతున్నట్లయితే http://people.ucsc.edu/~skurapat/telugu_rts.html లోని సూచనలను పాటించి విండోస్ XP లో వలె ప్రత్యక్ష అమరిక మరియు శబ్ధానుగుణ అమరికలను వాడి తెలుగులో టైపు చేసుకొనవచ్చు.


ఇది సంపూర్ణమైన మాటల యంత్రము (వర్డ్ ప్రాసెసర్). మీకు కావలసిన వ్యాసాలు, ఉత్తరాలు, పద్యాలు రాసుకోవచ్చును.ఈ ఉపకరణము మీరు వ్యవస్థాపితం చేసుకునాల్సి వస్తుంది.

  • దేశికాచారి http://www.kavya-nandanam.com/dload.htm తిరుమల కృష్ణ దేశికాచారి గారి సృష్టి, పోతన, వేమన వర్ణమాలలు (ఫాంట్ లు) తో సహా. - ఉచితం గా లభ్యం ఇది డౌనులోడు చేసుకొన్నపుడు, దీనితో పాటు Tavulte Soft Keyman అనే ప్రోగ్రాము లభిస్తుంది, సూచనలతో సహా. అది వ్యవస్థాపితం చేసినట్లైతే, కీబోర్డును తెలుగు కీబోర్డుగా వాడుకొనవచ్చును. దీనితో నేరుగా తెలుగు వికి పెట్టెలో గాని, మైక్రోసాప్ట్ వర్డ్ లో గాని, ఇతర ప్రోగ్రాములో గాని తెలుగు టైపు చేసుకోవచ్చును. కత్తిరింపుల అవుసరం లేదు. దీనిని అలవాటు చేసుకోవడానికి ఒకటి రెండు గంటల ప్రయోగము సరిపోతుంది.


ఇంటర్నెట్లో తెలుగు కు సంబంధించిన ఆసక్తి కలిగించే విశేషాలు కొన్నిటిని చూద్దాం..

  1. ఇంటర్నెట్ పత్రికల్లో అన్ని భాషల పత్రికలలోకీ ఈనాడు ముందుంది. మనవాళ్ళు తెలుగులో చదివేందుకు అంతలా ఇష్టపడుతున్నారు.
  2. ప్రత్యేకించి నెట్లో తెలుగు పత్రికలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్నిటిని కొని మరీ చదువుతారు.
  3. తెలుగు భాషలో వికీపీడియా (http://te.wikipedia.org) అనే ఒక బృహత్తర విజ్ఞాన సర్వస్వం తయారవుతోంది. అక్కడ రాసేవారంతా మనలాంటి పాఠకులే. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతీ ఊరికీ ఒక పేజీ రాయాలనేది దాని లక్ష్యాల్లో ఒకటి. ప్రస్తుతం ఈ విషయంపై అక్కడ చురుగ్గా పని జరుగుతోంది. మీరూ ఓ చెయ్యి వెయ్యండి.. మీ ఊరి గురించి రాయండి.
  4. అలానే విక్షనరీ (http://te.wiktionary.org) అనే ఒక బహుభాషా నిఘంటువు/పదకోశం కూడా తయారవుతోంది. మనం మరచిపోయిన పాత పదాలను మళ్ళీ మనమధ్యకు తెస్తూ, మనకిప్పటివరకు లేని కొత్త పదాలను సృష్టిస్తూ ఈ నిఘంటువు తయారవుతోంది.
  5. కవిత్రయం రాసిన మహాభారతం మొత్తాన్ని కంప్యూటర్లో (http://te.wikibooks.org) రాస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరూ పాల్గొనవచ్చు (http://groups.google.com/group/andhramahabharatam).
  6. ఇక తెలుగు గ్రూపులు.. తెలుగువారికోసం తెలుగులోనే రాసే గ్రూపులు బోలెడన్ని ఉన్నాయి. మచ్చుకిక్కడ కొన్ని.. http://groups.google.com/group/telugublog, http://groups.google.com/group/teluguwiki, http://groups.google.com/group/sahityam
  7. ఆర్కుట్ తెలుగు సమూహాలు ఉదాహరణకు..http://www.orkut.com/Community.aspx?cmm=19827054
  8. ఇక బ్లాగులు.. మన అభిప్రాయాల్నీ, ఆలోచనల్నీ, ఉత్సాహ ఉద్వేగాలను రాసుకునే చోటిది. వందలాది తెలుగు బ్లాగర్లు వేలాది బ్లాగులు రాసారు, రాస్తున్నారు. ఈ బ్లాగుల జాబితా http://telugubloggers.blogspot.com/ లో చూడండి. గూగుల్ బ్లాగు సెర్చికి (http://blogsearch.google.com/) వెళ్ళండి.. అక్కడ "తెలుగు" అని రాసి మీట నొక్కండి. కనీసం ఓ వెయ్యి బ్లాగు జాబుల జాబితా ప్రత్యక్షమవుతుంది.

ఇంకెందుకాలస్యం.. మొదలు పెట్టండి మరి!

బ్లాగుల గురించి ఓ వ్యాసం

మార్చు

(ఇది పైవ్యాసం లోని భాగం కాదు)

బ్లాగు గురించి విన్నారా?

మనక్కొన్ని ఆలోచనలుంటాయి, కొన్ని అభిప్రాయాలుంటాయి. అవినీతిపై ఆగ్రహము, అన్యాయంపై ఆక్రోశము ఉంటుంది. మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని ఓట్లడుక్కుని గెల్చినవాళ్ళు సభలో ప్రశ్నలడిగేందుకు డబ్బులడుక్కుంటున్నారని తెలిసినపుడూ.., ఎంతో అద్భుతంగా ఉందని ఓ టీవీ ఛానెలు చెప్పిందిగదాని ఓ చెత్త సినిమా చూసినపుడు.. మీకు మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాలనిపించొచ్చు.


ప్రభుత్వమే తెలుగును నిర్లక్ష్యం చేస్తున్న విధానంపై మీ ఆక్రోశాన్ని వెళ్ళగక్కాలని మీకనిపించవచ్చు. కొత్త కొత్త రాకెట్లతో, ప్రయోగించిన ప్రతీసారీ ఆకాశపు సరిహద్దులను విస్తరించుకుంటూ పోతున్న ఇస్రోను అభినందించాలని అనిపించొచ్చు. ఈ మధ్య మీరు చదివిన చక్కటి కథ గురించి రాయాలనిపించొచ్చు.. అసలు మీరే ఓ కథ రాయాలనుకోవచ్చు.


కానీ ఎలా!? పత్రికలకు రాస్తే వేసుకోరు. వేసుకున్నా మీర్రాసిన నాలుగు పేజీల ఉత్తరాన్ని కుదించి నాలుగు లైన్లు వేస్తారు. (పత్రికలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక్కోసారి ఎంతో మంచి రచనలు కూడా పత్రికల్లో ప్రచురణకు వెంటనే నోచుకోవు. ఈ లోపల అవి రాసిన వాళ్ళు నిరుత్సాహంతో నీరసపడిపోవచ్చు.) మరెలా? ఇదిగో.. దానికి పనికొచ్చేదే బ్లాగు! మీ రచనల ప్రచురణ కోసం ఎదురుచూపులేవీ అవసరం లేకుండా మీకు ఆలోచన వచ్చిన వెంటనే రాసిపడేదే బ్లాగు. "వెబ్ లాగ్" అనే పదబంధం బంధాలు మార్చుకుని బ్లాగ్ అయి.. ఆపై బ్లాగు గా తెలుగీకరణం చెందింది.


చక్కగా మీకిష్టమైన విషయం మీద, మీకు నచ్చిన విధంగా, మీకు అలుపొచ్చేదాకా రాస్తూ పోవడమే బ్లాగు. రాసే మీరు బ్లాగరి. ఈ భాగోతం మొత్తం బ్లాగోతం! ఇంచక్కా తెలుగులో రాసుకోవచ్చు. మీ ఆనందం, బాధ, కసి, కోపం, ఆక్రోశం, ఉక్రోషం మీ బ్లాగులో తెలుపండి; మిమ్మల్నడిగేవారూ, ఆపేవారు ఉండరు. పైగా అదంతా చదివి అభిప్రాయాలు చెప్పేవారు, అభినందించే వారు, విమర్శించే వారు ఉంటారు. ప్రస్తుతం 200కు పైగా చక్కటి తెలుగు బ్లాగులు ఉన్నాయి. వాటిని చదవండి.. తరువాత మీరూ రాయండి.


(మీ పక్కింటివాడి స్థలంలోకి ఓ రెండడుగులు చొచ్చుకెళ్ళి మీరు గోడ కట్టినపుడు, అంత చిన్న విషయానికే ఏదో కొంపలు మునిగినట్లు ఏడ్చాడు కదా.. వాణ్ణి తిడుతూ కూడా రాయొచ్చు.)


ఈ బ్లాగుల జాబితా http://telugubloggers.blogspot.com/ లో చూడండి. గూగుల్ బ్లాగు సెర్చికి (http://blogsearch.google.com) వెళ్ళండి.. అక్కడ "తెలుగు" అని రాసి మీట నొక్కండి. కనీసం ఓ వెయ్యి బ్లాగు జాబుల జాబితా ప్రత్యక్షమవుతుంది.


బ్లాగుల పేర్లు ఫక్తు వాడుకపదాలతో, విభిన్నంగా ఉంటాయి. మనవాళ్ళ బ్లాగుల పేర్లు కొన్ని..


ఇలా వందలాది బ్లాగులున్నాయి. కొడవటిగంటి రోహిణీప్రసాద్ లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా తెలుగులో బ్లాగులు రాస్తున్నారు(http://rohiniprasadkscience.blogspot.com/). ప్రతీ బ్లాగుకు వెళ్ళి మరీ చదువుకునే కంటే.. అన్నిటినీ ఒకచోట చేర్చితే చదువుకోను బాగా వీలుంటుంది కదా! అవును వీలే మరి! మనవాళ్ళు ఈ సౌకర్యాన్ని కూడా కలుగజేసారు. http://veeven.com/koodali, http://www.telugubloggers.com అనే రెండు సైట్లకు వెళితే చక్కగా బ్లాగులన్నిటినీ అక్కడే చదువుకోవచ్చు. కేవలం ఒక భారతీయ భాషా బ్లాగులను మాత్రమే ఒకచోట చేర్చే ఇటువంటి భారతీయ కూడళ్ళు బహుశా మరో భారతీయ భాషలో లేవేమో! తెలుగు బ్లాగుల్లో ఎక్కడ కొత్త జాబు చేరినా, వెంటనే, లేదా కొద్ది గంటల తేడాలో ఇవి తమ సైట్లలో చేరుస్తాయి.


బ్లాగు మొదలుపెట్టాక, మీకు తోచినప్పుడల్లా దానిలో వ్యాసాలు రాసుకుంటూ పోవచ్చు. ఒక్కో వ్యాసాన్ని జాబు అని అంటాం. ఒక బ్లాగులో ఎన్ని జాబులైనా రాయవచ్చు. రోజుకెన్ని జాబులైనా రాయవచ్చు. బ్లాగరు జాబు రాసి ఆయా వెబ్‌సైటులకు సమర్పించగానే, సదరు సాఫ్టువేరే చక్కగా దానికి తేదీ వగైరాలు తగిలించి ఒక పద్ధతి ప్రకారం బ్లాగులో చూపిస్తుంది.


రాజకీయాలు, సామాజిక అంశాలు, జరుగుతున్న చరిత్ర, సినిమా, హాస్యం, వార్తలు, మాధ్యమాలు, తెలుగు భాష ఇలా విభిన్న విషయాలపై బ్లాగులు రాస్తున్నారు. తమ స్పందనను కవితాత్మకంగా వెలిబుచ్చేవారూ ఉన్నారు. తెలుగు బ్లాగరులలో స్త్రీలు కూడా ఉత్సాహంగానే రాస్తున్నారు (కల్హార, అభిసారిక, సౌమ్య, స్నేహమా...., షడ్రుచులు). అద్భుతమైన ఫోటోలను బ్లాగుల్లో పొదిగేవారూ ఉన్నారు. కేవలం కాలక్షేపం కోసమే కాక, సమకాలీన అంశాలపై చక్కటి విశ్లేషణతో కూడిన బ్లాగులు ఎన్నో వస్తున్నాయి. బ్లాగుల మంచిచెడులను విశ్లేషిస్తూ సమీక్షలు కూడా వస్తున్నాయి: పారదర్శి, పొద్దు.

బ్లాగు పదసంపద: బ్లాగోళం, బ్లాగావరణం, బ్లహసనం, బ్లాస్యం, బ్లాక్కవిత, బ్లాక్కథ, బ్లాగరి, బ్లాగోతం, బ్లాగు సందడి, బ్లాగుడు, బ్లాగుడుకాయ, బ్లాగ్దానం, బ్లాగ్ధోరణి, బ్లాగ్పటిమ, బ్లాగ్శూరుడు, బ్లాగ్శోధన, బ్లాగుమాయ, బ్లాజకీయాలు, బ్లాశ, బ్లూతు, సినీ బ్లాగు, బ్లోటో (బ్లాగు ఫోటో), బ్లాగ్వరులు, బ్లాగురులు,బ్లాగాధినేతలు.


తెలుగు బ్లాగరులు ఎవరికి వారే యమునాతీరే అని కాకుండా సమష్టిగా పనిచేస్తున్న అంశాలు కూడా ఉన్నాయి. వందలాదిగా ఉన్న అందరి బ్లాగులనూ గుర్తుపెట్టుకుని రోజూ తెరిచిచూడడం కాలహరణమేగాక శ్రమతో కూడుకున్న పని. తెలుగు బ్లాగరులు తమ తమ బ్లాగుల్లో రాసే కొత్త జాబులన్నిటినీ ఎప్పటికప్పుడు ఒకేచోట చదవగలిగితే బాగుంటుందని ఒక బ్లాగరి (చావా కిరణ్)కి వచ్చిన ఆలోచనను ఇంకొక బ్లాగరి (వీవెన్) అమలుచేయగా ఏర్పడిందే కూడలి. తెలుగులో రాయడానికి బ్లాగరులు, వికీపీడియనులు అందరూ వాడే లేఖినిని అభివృద్ధి చేసింది కూడా ఈ బ్లాగరే. ఆర్కుట్ లో లేఖిని,తెలుగు వికీపీడియా మరియు తెలుగు బ్లాగర్లకు సమూహాలున్నాయి. అక్కడ చాలా మంది తెలుగు అభిమానులను కలుసుకోవచ్చు.


హైదరాబాదులో ఉన్న తెలుగు బ్లాగరులు కొందరు ప్రతి నెలా ఒక ఆదివారం రోజు సమావేశమై ఇంటర్నెట్లో తెలుగువ్యాప్తికి గల అవకాశాలను, అవరోధాలను గుర్తించి; కంప్యూటర్లు మరింత సులభంగా తెలుగును అర్థం చేసుకోవడానికి అవసరమైన అప్లికేషన్లు అభివృద్ధి చేయడానికి మార్గాలను చర్చించి, అభివృద్ధి చేస్తున్నారు. ఇంటర్నెట్లో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆన్‌లైన్ తెలుగు విజ్ఞానసర్వస్వం వికీపీడియా నిర్మాణంలో చురుగ్గా పాల్గొంటున్నదీ తెలుగు బ్లాగరులే.


బ్లాగులు నేటి నెట్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో 3కోట్ల 80 లక్షల మంది ఇంటర్నెట్ వాడకందార్లుండగా భారతీయులు నడిపేవి కొన్ని లక్షల బ్లాగులున్నాయి. గతంలో వరదలు, సునామీ లాంటి ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల సంబంధీకులకు బాధితులను గురించిన సమాచారం అందించడంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సమాచారకేంద్రాలన్నిటి కంటే బ్లాగులే ముందున్నాయి. ఇప్పుడు ముంబై బాంబుపేలుళ్ళలో చనిపోయిన, గాయపడినవారి గురించి ఏ ప్రభుత్వ శాఖా ఇవ్వలేని సమాచారాన్ని బాధితుల బంధువులకు, సంబంధీకులకు ఇవ్వగలిగింది http://mumbaihelp.blogspot.com అనే బ్లాగు. ప్రపంచవ్యాప్తంగా బ్లాగులనేవి సమాచారాన్ని, అభిప్రాయాలను అందరితో పంచుకోవడంలో ఇంతకుమునుపెన్నడూ కనీ వినీ ఎరుగనంత విప్లవాత్మకమైన ముందడుగు.


మీరు కూడా మీకు తోచిన విషయాలను గురించి మీకు తెలిసిన సమాచారం లేదా విశేషాలు, మీ అభిప్రాయాలు ఓపికున్నంత వరకూ రాస్తూపోవచ్చు. అది మీ సాటి తెలుగువారు అనేకుల్ని ఉత్తేజితుల్ని చేయవచ్చు కూడా! తెలుగులో బ్లాగాయణం ప్రారంభించడానికి సాధనాలన్నీ సిద్ధంగా ఉండగా ఇంకెందుకాలస్యం.. మీరూ మొదలు పెట్టండి మరి! కింది బ్లాగు సైట్లలో ఎక్కడైనా మీ బ్లాగును రాయవచ్చు.


బ్లాగు మొదలుపెట్టే విషయంలో మీకింకా సాయం కావాలా? చక్కటి స్థలం ఒకటి ఉంది. గూగుల్‌లో తెలుగుబ్లాగరులకో ప్రత్యేక గుంపు (http://groups.google.com/group/telugublog/) ఉంది. ఆ గుంపులో బ్లాగెలా రాయాలో చెప్పండంటూ సాయం అడిగండి. మీ చెయ్యి పట్టుకుని మీ చేత బ్లాగు రాయించేందుకు అక్కడి సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు.

తెలుగు బ్లాగుల తీరుతెన్నులు

మార్చు

తెలుగు బ్లాగులు ఎలా ఉన్నాయి

మార్చు

ప్రస్తుత తెలుగు బ్లాగుల పరిస్థితి ఇలా ఉంది.

  • చాలా ముఖ్యమైనది.. తెలుగు బ్లాగులు రాసేవారు ఎలాగూ తక్కువగానే ఉన్నారు. కానీ తెలుగు బ్లాగులను క్రమం తప్పకుండా చదివేవారూ తక్కువే. ఆర్కుట్ లాంటి చోట్ల ఉన్నంత చురుగ్గా బ్లాగుల్లో తెలుగువారు లేరు. ఆర్కుట్‌లోని కొన్ని తెలుగు వారి సమాజాల్లో నాలుగైదు వేల మంది కూడా సభ్యులుగా ఉన్నారు. వీరు బ్లాగుల్లోనూ చురుగ్గా ఉంటే.. ఒక్కొక్కరు నెలకు ఒక్క వ్యాఖ్య - జాబు కాదు, కేవలం వేరే వారి బ్లాగులో వ్యాఖ్య - రాసినా.., నెలకు నాలుగైదు వేల వ్యాఖ్యలు వస్తాయి. ప్రస్తుతం నెలకు నాలుగైదు వందల వ్యాఖ్యలు కూడా వస్తున్న జాడలు లేవు. ఇక బ్లాగులు రాసే వారు వందా రెండొందలే! తెలుగు బ్లాగుల ప్రపంచవేదిక ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఆర్కుట్ సంభాషణాత్మకమైనది, చిరు రచనలతో కూడినది కావడం బహుశా ఒక కారణం కావచ్చు.
  • తొలి మెట్టు: తెలుగు భాషలో రాసి, బ్లాగరి తృప్తి పొందుతారు. ఇక్కడ తెలుగులో రాస్తున్నామన్నదే ముఖ్యం గానీ, ఏమి రాసామన్నది కాదు. ఉత్సాహంగా మొదలుపెట్టినా.., ఎక్కువమంది నిదానంగా చల్లబడి పోతారు. తెలుగు బ్లాగుల్లో ఎక్కువ శాతం ఈ స్థాయిలో ఉన్నాయి. ఈ బ్లాగరుల్లో ఎక్కువ మంది నెట్లో పాతకాపులే అయి ఉంటారు. ఇతర వ్యాపకాలపై నెట్ సమయం వెచ్చిస్తూ ఉంటారు. వీరిలో బ్లాగోత్సాహం పెంచేలా తెలుగు బ్లాగుల ప్రపంచవేదిక కార్యక్రమం రూపొందిస్తే, వీరి నుండి మంచి బ్లాగులు వచ్చే అవకాశం ఉంది.
  • తప్పటడుగులు: తెలుగూ ఇంగ్లీషు కలిపి ఉండే బ్లాగులు. తెలుగులో చకచకా రాసేందుకు ఇబ్బందిగా ఉండటం గానీ, వేరే కారణం వలన గానీ తెలుగు, ఇంగ్లీషు కలగలిపి రాస్తూ ఉంటారు. బ్లాగోత్సాహం బాగా ఉన్నవారు తొలిమెట్టును దాటి ఈ స్థాయికి గానీ మూడో స్థాయికి గానీ చేరుతారు. భాష విషయమై నిఘంటువుల్లాంటి తగు వనరులు ఉంటే వీరు మంచి బ్లాగులు రాయగలిగిన వారు.
  • భాషపై పట్టు కలిగిన, తొలిమెట్టును దాటిన ఉత్సాహవంతులు తమ బ్లాగోతాన్ని కొనసాగిస్తూ విడవకుండా రాస్తూ ఉంటారు. తెలుగులో చక్కగా రాసే శక్తి కలిగిన వీరు తమకిష్టమైన విషయాలపై రాసుకుంటూ వెళ్తారు. వీరినుండి నాణ్యమైన బ్లాగులు వస్తాయి, వస్తున్నాయి.
  • భాష విషయమై, తెలుగు బ్లాగుల్లో చెప్పుకోదగ్గ కృషి జరుగుతున్నది. కొత్త పదాలను చెలామణిలో పెట్టడం, అందరూ కలిసి గూగుల్, వర్డ్‌ప్రెస్ వంటి ఇంటరుఫేసులను అనువదించడం లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. బ్లాగు కున్న శక్తి సామర్థ్యాలను ఎంతటివంటే, బ్లాగరుల సంఖ్య పెరిగితే భాష విషయమై అద్భుతాలు జరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ప్రస్తుత తెలుగు బ్లాగుల్లోని రకాలు
రాస్తున్న విషయాలను బట్టి తెలుగు బ్లాగులను కింది విధాలుగా వర్గీకరించవచ్చు. ఒక బ్లాగులోని జాబులన్నీ ఒకే రకానికి చెంది ఉండవు. ఒక్కో జాబు ఒక్కో రకంగా ఉండొచ్చు. కొన్ని బ్లాగులు ఎప్పుడూ ఒకే రకానికి చెందిన బ్లాగులను రాస్తూ ఉండొచ్చు కూడా.
  • సొంత విషయాల బ్లాగులు. తమ రుచులు, అభిరుచులు, చిన్ననాటి సంగతులు, కాలేజీ కబుర్లు, కాలక్షేపం కబుర్లు ఈ జాబితాలోకి వస్తాయి. జాబులు పూర్తిగా స్వంతమే అయి ఉంటాయి.
  • వివిధ విషయాలపై అభిప్రాయాలు వెల్లడించే బ్లాగులు. తెలుగు భాష, రాజకీయాలు, సమాజం, ఆటలు, సినిమాలు లాంటి వర్గాలకు చెందిన విషయాలు ఈ జాబితాలో ఉంటాయి. జాబుల్లో ఎక్కువగా స్వంత వచనమూ, స్వంత అభిప్రాయాలే ఉంటాయి.
  • వార్తా బ్లాగులు: రకరకాల చోట్ల కానవచ్చే ఆసక్తికరమైన వార్తలను తమ బ్లాగుల్లో రాస్తూ ఉంటారు. ఆయా వార్తలను యథాతథంగా రాయడమే ఎక్కువగా కనిపిస్తుంది. వార్తలపై బ్లాగరి వ్యాఖ్యలు జోడించడం కూడా కద్దు.
  • కవితలు, కథల వంటి సృజనాత్మక బ్లాగులు: తమ కల్పనా శక్తికి, సృజనాత్మకతకు పదును పెడుతూ బ్లాగులు రాస్తారు.
  • సాంకేతిక బ్లాగులు: సాంకేతిక అంశాలపై, ముఖ్యంగా కంప్యూటరు సాంకేతిక అంశాలపై బ్లాగులు. కొత్త కొత్త సాఫ్టువేరులు మొదలైనవాటి గురించిన విషయాలు ఇక్కడ తెలుస్తాయి.
  • ఫోటో బ్లాగులు: ఎక్కువగానో లేకా పూర్తిగానో ఫోటోలుండే బ్లాగులు. ముచ్చటైన ఫొటోలను గుది గుచ్చిన బ్లాగులివి. ఫోటోలతో పాటు వాటికి చక్కటి వ్యాఖ్యలు కూడా రాస్తారు కొందరు.

బ్లాగులు ఎలా ఉండబోతున్నాయి

మార్చు

రాబోయే ఒకటీ రెండేళ్ళలో బ్లాగులు అనేక మార్పులు చెందవచ్చు. కొన్ని మార్పులు ఇలా ఉండొచ్చు

  • బ్లాగులను సీరియస్సుగా చదివే పాఠకులు పెరుగుతారు. బ్లాగుల వ్యాప్తి కూడా పెరుగుతుంది.
  • మార్కెటింగు బ్లాగులు: బ్లాగుల ద్వారా మార్కెటింగు చేస్తారు. ప్రస్తుతానికి ఈ విభాగంలో బ్లాగులు అసలు లేవు. కానీ రాబోయే కాలంలో బాగా వ్యాప్తిలోకి వస్తాయి. ముఖ్యమైన రంగాలు: సాఫ్టువేరు, రేడియో, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, హోటళ్ళు, సేవా రంగంలోని సంస్థలు (ఉద్యోగాలు ఇప్పించే సంస్థలు మొదలైనవి) మొదలైనవి. వెబ్ మార్కెటింగులో బ్లాగు కీలక స్థానాన్ని ఆక్రమించే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే ఇంగ్లీషులో మార్కెటింగు బ్లాగులు మెండుగా ఉన్నాయి.
  • బ్లాగు పత్రికలు: కొందరు మాన్యులు /సామాన్యులు (అసామాన్యులు కూడా) కలిసి బ్లాగు పత్రికను మొదలెట్టవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి రెండు మూడు రోజులకో జాబు ఈ పత్రికల్లో రాస్తారు. విషయ నిపుణులు రాయడంచేత వీటికి బహుళ ప్రచారం లభిస్తుంది. ఈ బ్లాగు పత్రికల్లో అతిథి బ్లాగర్లు కూడా రాసే అవకాశం ఉంది. ఈ పత్రికలు ప్రకటనల ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం చాలా ఉంది. ముఖ్య ప్రకటన దారులు.. సినిమాలు, పుస్తకాలు, హోటళ్ళు, విద్యా సంస్థలు మొదలైనవి.
  • అంశాల ప్రాముఖ్యత కలిగిన బ్లాగులు ఎక్కువగా వస్తాయి. రాజకీయాలు, సినిమాలు, విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు మొదలైనవి వీటిలో ప్రముఖమైనవి.
  • రాజకీయ పక్షాల బ్లాగులు: రాజకీయ పక్షాలు తామే స్వయంగా నిర్వహించే బ్లాగులివి. వాగ్దానాలు, ఆత్మ స్తుతి, పరనింద.. ఇవన్నీ మామూలే! ఓపిక ఉన్నవాళ్ళు చూస్తారు.
  • సినిమా బ్లాగులు: ఫలానా సినిమాకని ప్రత్యేకించిన బ్లాగులివి. సినిమా నిర్మాణం మొదలైనప్పటి నుండీ మొదలయ్యే ఈ బ్లాగులు నిదానంగా పుంజుకుంటాయి. విడుదలకు ఓ వారం ముందు నుండీ విడుదలైన నెల వరకూ ఉధృతంగా ఉంటాయి ఇందులో జాబులు. ఈ బ్లాగుల్లో రెండు రకాలుండొచ్చు. సినిమా నిర్మాత స్వంత బ్లాగులు ఒక రకం. ఇందులో అంతా మంచే ఉంటుంది.. విమర్శలుండవు. టీవీ ఛానెల్లో సమీక్ష చూస్తున్నట్లే ఉంటుంది. ఈ బ్లాగుల్లో పెట్టే బొమ్మల కోసమే ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు. రెండో రకం నిష్పాక్షిక సమీక్షలు. ఈ సమీక్షల కోసమే జనం ఇక్కడకు వస్తారు. (ఫలానా సినిమాకని ఇలాంటివి కొన్ని ఇప్పటికే ఉన్నాయి, కానీ ఇంగ్లీషులో ఉన్నాయి.) అయితే ఈ ముసుగులో అభిమానులు, నిర్మాతలు సినిమా ప్రచార బ్లాగులు నిర్వహించే అవకాశం లేకపోలేదు.
  • కాలేజీ బ్లాగులు: వివిధ కాలేజీల మంచి చెడులతో కూడిన బ్లాగులు వస్తాయి. ఏ కాలేజీలో చేరాలో నిర్ణయించుకోడంలో భావి విద్యార్థులకీ బ్లాగులు బాగా ఉపయోగపడతాయి.
  • పర్యాటక బ్లాగులు: పర్యాటక కేంద్రాలకు సంబంధించి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడెళ్ళాలి, అక్కడి విశేషాలేమిటి మొదలైన విషయాలతో కూడిన బ్లాగులు.
  • ఆత్మకథాత్మక బ్లాగులు: పచ్చనాకు సాక్షిగా, దర్గామిట్ట కథలు, మా పసలపూడి కథలు, ఇల్లేరమ్మ కథలు లాంటివి బ్లాగుల్లో వచ్చే అవకాశం లేకపోలేదు. నిజానికి ఇప్పటికే కొందరి బ్లాగుల్లో అప్పుడప్పుడూ ఇలాంటివి మెరుస్తూ ఉంటాయి.

తెలుగు బ్లాగు - ఒక విశ్లేషణ

మార్చు
  • తెలుగు బ్లాగుకు అనుకూలాలు:
    • మాతృభాషాభిమానం
    • తెలుగులో రాయాలన్న కాంక్ష.
    • ఇంగ్లీషులో కంటే తెలుగులో సులభంగా రాయగలిగిన వాళ్ళు ఎక్కువ
  • ప్రతికూలాలు:
    • తెలుగు లో రాసేందుకు కంప్యూటర్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి కష్టాలు
    • తెలుగు పద సంపదకు సంబంధించి బ్లాగరి యొక్క పరిమిత జ్ఞానం
  • అవసరాలు: తెలుగులో బ్లాగులు బాగా వ్యాప్తి చెందేందుకు కిందివి కావాలి:
    • కంప్యూటరును ఎవరైనా తేలిగ్గా తెలుగు కోసం మలచుకోగలిగే వీలు
    • ఇంగ్లీషులో రాసినట్లుగానే కంప్యూటర్లో తెలుగులో కూడా రాయొచ్చనే విషయాన్ని వ్యాపింపజేయడం
    • నెట్లో ఉన్న తెలుగు సంగ్రహాన్ని తెలియజేసే ఒక సూచిక ఉండాలి
    • పద సంపద కోసం ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు నెట్లో అందుబాటులో ఉండాలి.
    • బ్లాగరుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే కార్యక్రమాలు చేపట్టేందుకు ఒక వేదిక ఉండాలి. ఆ మధ్య జరిగిన పుస్తకాల పురుగు కార్యక్రమం, ఈ వారం బ్లాగు లాంటి కార్యక్రమాలు విరివిగా జరగాలి. తెలుగువారి చేత తెలుగులో బ్లాగు రాయించడమే వేదిక మొదటి లక్ష్యం కావాలి. ఏమి రాసారన్నది కాదు ప్రధానం, రాయడమే ముఖ్యం. ఇది లక్ష్యంగా వేదిక పనిచెయ్యాలి.
  • తెలుగు వారు తెలుగులో రాయకుండా ఇంగ్లీషులో ఎందుకు రాస్తున్నారు? కింది కారణాలలో ఏ ఒకటో లేదా కొన్నో అయి ఉండవచ్చు. మొదటి రెండు విషయాలపై తెలుగు బ్లాగరుల ప్రపంచ వేదిక దృష్టి పెట్టింది. నెట్లో తెలుగు వ్యాప్తి అనే అంశంపై విస్తృత అవగాహనా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
    • తెలుగులో కూడా రాసే వీలుందని తెలీకపోవడం
    • కంప్యూటరులో తెలుగెలా రాయాలో తెలీకపోవడం లేదా కష్టమనిపించడం
    • తెలుగు సరిగ్గా రాకపోవడం
    • ఇంగ్లీషు ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం బ్లాగు రాయడం ద్వారా సాధన చెయ్యడం
    • ఇంగ్లీషుపై ఉన్న మోజు/ఇంగ్లీషులో రాయడం గొప్ప అనుకోవడం
    • తెలుగులో రాయడం నామోషీ/ఇంగ్లీషు రాదనుకుంటారేమోనని పీకులాట/బోడి తెలుగనే చులకన