స్వాతంత్ర సమరయోధుడు కొత్తపల్లి వెంకటకృష్ణవర్మ{వెంకటకృష్ణయ్య} జన్మస్థలం గుంటూరు జిల్లా మైనేనివారిపాలెం. తల్లి వెంకటరత్నమ్మ, తండ్రి లక్ష్మీనారాయణ. పుట్టినరోజు 15-6-1907, మరణం 26-3-1984.

ఈయనకు నలుగురు చెల్లెళ్ళు. ఈయన ప్రాథమిక విద్య తెనాలి సమీపంలోని కూచిపూడిలో సాగింది. 15వ ఏట శ్రీగోపాల సచ్చిదానంద బ్రహ్మశ్రీ సరస్వతీ స్వామి శిష్యరికంలో వేదాధ్యయనం, పౌరోహిత్యం అభ్యసించాడు. జాతీయోద్యమ స్ఫూర్తితో యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ నేర్చుకొని, కాశీలో 'వర్మ'పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రోత్సాహంతో జాతీయోద్యమంలో పాల్గొని, 1930 జులై 9న అరెస్టు అయి, ఆలీపూర్ జైల్లో ఏడాది కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. రెండవ పర్యాయం సత్యాగ్రహంలో పాల్గొని 1932 మార్చి 29న అరెస్టు అయి ఆరునెలలు రాజమండ్రి కారాగారంలో కఠిన కారాగారావాసం చేసాడు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈయనను ముత్తేవి వెంకటసుబ్బయ్యను గ్రామ బహిష్కారం చేస్తే, ఆశ్రయంలేక యాచనతో జీవిచాడుగాని ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరలేదు.

1932లో ఈయనకు సరళాదేవితో "దండల మార్పు"తో వివాహం జరిగింది. సరళాదేవి కూడా జాతీయోద్యమంలో కారాగారానికి వెళ్ళింది. ఈ దంపతులు రాష్ట్రభాష హిందీ ప్రచారం, ఖాదీ ఉత్పత్తి, తేనెటీగల పెంపకం, దంపుడుబియ్యం, వంటి విషయాలను ప్రచారంచేస్తూ మునిపల్లి, బ్రాహ్మణ కోడూరు,దొండపాడు. పెదముత్తేవి, కసునూరు మొదలయిన గ్రామాల్లో జీవించారు. 1941లో దక్షిణభారత హిందీ ప్రచారసభ పక్షాన కడప, కర్నూల్, చిత్తూరు, రాజముండ్రి, అనకాపల్లి పట్టణాల్లో హిదీ ప్రచారసభ వారి పీఠాల్లో ప్రధాన అధ్యాపకుడిగా పనిచేసాడు.

1956లో విజయవాడ సమీపంలో పెనమలూరులో "గాంధీ స్మారక నిధి" "గాంధీఘర్" నిర్మించి ఇచ్చారు. అక్కడ ఈయన సేవాశ్రమం నెలకొల్పి తొమ్మిదేళ్లు ఆ సంస్థ కార్యదర్శిగా నిర్వహించాడు.

భారత ప్రభుత్వం ఈయన సేవలకుగాను 1972లో తామ్రపత్రం బహూకరించింది.

ఆకరాలు:1. కొత్తపల్లి వెంకటకృష్ణవర్మ{వెంకటకృష్ణయ్య} స్వీయచరిత్ర {రాతప్రతి}, 2. కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమర యోధులు, 3. రేపల్లె చరిత: రచయిత, ప్రచురణకర్త, మన్నే శ్రీనివాసరావు.