చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)గా పనిచేశాడు.[5] తన బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో సింహభాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానం లో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య పురస్కారం, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు గెలుచుకున్నాడు. 2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది.[6] మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.[7]

1978లో వచ్చిన పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది.[8] 1987లో చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది.[9] ఈ చిత్రానికి గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్ ప్రెస్ బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నాడు.[10][11][12] అదే సంవత్సరంలో 59 వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకడిగా వెళ్ళాడు.[13][14] 1988 లో చిరంజీవి సహ-నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది.[15]

1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా స్థూల వసూళ్ళు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.[16] ఈ చిత్రం 1993 లో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శింపబడింది.[17] ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికల ముఖచిత్రంపై ఎక్కాడు.[18] ఫిల్మ్ ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అని శీర్షికలు వెలువరించాయి.[19] ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మెషీన్ గా అభివర్ణించింది.[20] 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు. అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడూ తీసుకోనంత పారితోషికం.[21] 2002లో భారత కేంద్రప్రభుత్వ ఆర్థిక శాఖ 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది.[22] 2006 లో సి.ఎన్.ఎన్. ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది.[23]

చిరంజీవి 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది.