నేను, నాలో నేను - 1

- - - - - - - - - - - - - - - - - - - - - - - - -

నేను, నాలో నేను, నాతో నేను

నేను ఒంటరిని కాని ఏకాకిని కాదు

కనిపించని కారుణ్యమూర్తి

కలసి తోడుగా అడుగులేస్తుంటే

నేనేకాకినా?!

ఆకారం అవగతమవక పోవచ్చు

కాలిముద్రలు కనిపించక పోవచ్చు

మాట చేవిని చేరకపోవచ్చు

పరులు పిచ్చివాడనుకోవచ్చు

కాని, మనసు మాత్రం మైమరచి పోతుంది.

నెమలి అయి నాట్యమాడుతుంది.

గమ్మత్తేమిటంటే,

పుట్టు గుడ్డికి కాంతి ఎలా చూపిస్తాము?

చెవిటికి మధుర సంగీతం ఎలా వినిపిస్తాము?

మూగవానితో మంచి సాహిత్యం ఎలా పలికించగలం?

నేను ఇదే అవస్థనుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాను

అందుకే అంటాను ధైర్యంగా

సత్యం విడ్డూరంగా వుటుందని.

సహనం కావాలి సత్య శోధనకని.

= = = = = = = = = = = = = = = = = = = = =

నేను, నాలో నేను - 2

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

నేను, నాలో నేను, నాతో నేను

నేను ఒంటరిని కాని ఏకాకిని కాదు

కనిపించని కారుణ్యమూర్తి

కలసి తోడుగా అడుగులేస్తుంటే

నేనేకాకినా?!

నేనున్నానంటే

నువ్వు, అతను కూడా ఉన్నట్లేకదా!

సత్యం సులభం మరియు సానుకూలం

నేను నువ్వైతే, అంతా ఒకటే కదా!

రూపురేఖలతో విడివిడిగా వున్న

మనస్సున మనమంతా ఒకటే కదా!

సత్యం సత్యమే కాని, మరేమీ కాదు

కన్నులు చూడలేనిది, మనస్సు చూస్తుంది

మనస్సు చూడగలగాలంటే, మురికి పోవాలి

ప్రశాంతత రావాలి

మనిషిగా మనుగడ సాగిస్తూ

మాటలకతీతమైన భావసంద్రములో

పదిలంగా, ప్రేమగా, ఒదిగి, మునిగి

పట్టుకొని, అనుభవించి

నేను అన్నది తెలుసుకొని

నాలో వున్నది నేనా లేక నువ్వా లేక మనమా

అన్న నిజాన్ని అణుకవతో తెలిసుకొని

సత్య స్వరూపాన్ని సమూలంగా గ్రహించి

ఆనంద అవధులను అధిగమించి

మాటలకందని అనుభవాలను

మదినిండా మూటకట్టుకొని

నేను నేనూ కాదు, నువ్వూకాదు

అంతా ఏకం మమేకం