వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల/తెవికీ 11వ వార్షికోత్సవ కార్యక్రమం గురించి

విశ్వవిజ్ఞానానికి ప్రతీకగా, స్వేచ్ఛా విజ్ఞానమనే ఆశయానికి పట్టుకొమ్మగా నిలిచిన వికీపీడియా 2015 జనవరి నాటికి 14 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. విజ్ఞాన సమీకరణలో తెలుగు వారూ ఏమాత్రం వెనుకబడిలేరని నిరూపిస్తూ ముందుకు సాగుతున్న తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాలను నిర్వహించుకుంటోంది. 61వేల పైచిలుకు వ్యాసాలతో భారతీయ భాషా వికీపీడియాల్లో ముందువరుసలో స్థానం పొందింది. స్వేచ్ఛా విజ్ఞానమనే ఆశయంతో ముందుకు సాగుతున్న వికీపీడియన్లను ఒక దగ్గర చేర్చి సంవత్సరాలుగా వికీపీడియాలో కృషిచేస్తున్నవారి అనుభవాలు, కొత్తసభ్యుల ఆశయాలు సమన్వయం చేస్తూ ఓ మేధోమధనంగా ఈ నెల 13, 14 తేదీల్లో వార్షికోత్సవ కార్యక్రమం తిరుపతిలో జరగనుంది. ఆ సందర్భంగా కార్యక్రమం గురించి, తెలుగు వికీపీడియా గురించీ పరిచయ వ్యాసం.

వికీపీడియా

మార్చు

వికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమిష్టి కృషితో సులభంగా వెబ్ సైటు ను సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించ బడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్ లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

వికీపీడియా ప్రస్థానం

మార్చు
1.చరిత్ర

వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియా లో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాసేవారు. వాటిని ఒక పద్దతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో మార్చి 9, 2000 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరు జిమ్మీ వేల్స్, మరియు దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పి రిచర్డ్ స్టాల్​మన్ కోరిక మేరకు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు.

లారీ సాంగర్ మరియు జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు. అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్స్ ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది.

వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005 లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతే కాకుండా కొన్ని ప్రపంచంలోని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో పని జనవరిలో ప్రారంభించింది.

2.ఫౌండేషన్ చరిత్ర

వికీమీడియా ఫౌండేషన్ [1]జూన్ 2003 లో ప్రారంభించబడినది. వికీపీడియా వ్యవస్థాపకులలో ఒకరైన జిమ్మీ వేల్స్, తన సంస్థ ద్వారా ప్రారంభించిన వికీపీడియా మరియు ఇతర సోదర ప్రాజెక్టుల నిర్వహణ భాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషలలో విజ్ఞాన సర్వస్వాలు మరియు సోదర ప్రణాళికల పెంపు, అభివృద్ధి మరియు వీటిలో సమాచారాన్ని ఉచిత పంపిణీ చేయటం దీని ముఖ్యోద్దేశం. దీని నిర్వహణకు ధర్మకర్తల (ట్రస్టీల) మండలి వుంది. ఇది మూడు చోట్ల కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే దాదాపు నెలసరిగా అరకోటి ప్రజలకు సేవలందిస్తున్నది. దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, మరియు ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజల నుండి మరియు సంస్థలనుండి ధన మరియు వనరుల సేకరణ మరియు ప్రాజెక్టులలో వాడబడే మీడియావికీ సాఫ్ట్వేర్ నిర్వహణ మరియు అభివృద్ధి చేస్తుంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, మొబైల్ మరియు జాలసంపర్కంలేని పద్దతులలో వికీ ప్రాజెక్టుల సమాచారాన్ని అందచేయటం, శిక్షణా వీడియోలు తయారి మరియు ప్రాజెక్టుల గణాంకాలలో మార్పులను విశ్లేషించి కొత్త తరహా ప్రాజెక్టులను చేపట్టటం, దీని ఇతర కార్యక్రమాలు. వికీమీడియా సంఘాలు., వికీమీడియా భారతదేశం చిహ్నం , వికీపీడియా అవగాహన సదస్సు

వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.

2.1 వికీమీడియా భారతదేశం

భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ [2]సంఘం జనవరి 3, 2011 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబర్ 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జులై 30 న నకలు హక్కులు మరియు స్వేచ్ఛా పంపక షరతులు అనబడే దానిపై సదస్సు ఆ తరువాత సెప్టెంబర్ 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా గ్రంథాలయాల శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు [3]ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేక అనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో వుంది.

కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి మరియు విస్తరించటానికి, మరియు కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర మరియు భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయం చేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార మరియు ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.

2.2వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు

వికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ,భారతీయ వికీ ప్రాజెక్టుల [5] అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించటం ప్రారంభించింది. సంవత్సరాంతానికి ఈ జట్టులో భారతీయ ప్రణాళికల సలహాదారు, ఆయనతో పాటు, భారతీయ భాషల సలహాదారు, విద్యా‌విషయక సలహాదారు, అవగాహన సదస్సుల సలహాదారు వున్నారు. ఇంకా ప్రజాసంబంధాల సలహదారుని నియమించ వలసివుంది. పూనె లో భారతీయ విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ కళాశాల విద్యార్థులతో వికీ వ్యాసాల ప్రణా‌‌ళిక చేపట్టింది.

2.3. ఇతర భాషలు

ప్రస్తుతం వికీపీడియా 253 భాషల్లో లభిస్తోంది. వీటిలో 16 భాషల వికీపీడీయా 1,00,000 పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 145 వర్షన్లు 1000కి పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. డిసెంబర్ 2007 గణాంకాల ననుసరించి వ్యాసాల సంఖ్య పరంగా చూస్తే ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి, పోలిష్, జపనీస్ మొదటి ఐదు పెద్ద వర్షన్లు.

3.వికీ విధానాలు

మౌలిక పరిశోధనలు నిషిద్ధం: వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. మీరు వ్రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం.. మీరు వ్రాసిన విషయానికి సంబంధించిన విశ్వసనీయ మూలం లేదా వనరులను ఉదహరించడమే! రచనలో తటస్థ దృక్కోణం ప్రతిఫలించాలి. దీన్నే ఇంగ్లీషు వికీలో NPOV (Neutral Point Of View) అంటారు. రచనలో తటస్థత ఉండాలి. వివాదాస్పద విషయాలలో ఏదో ఒక దృక్కోణం రాయక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు, వివాదంలో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసాన్ని వ్రాయాలి. నిర్ధారత్వం: మీరు ఉదహరించిన వనరులును సంప్రదించి, విషయాన్ని నిర్ధారించుకునేందుకు వీలుగా ఉండాలి.

4.వికీ రచనా శైలి

వికీ ఒక విజ్ఞాన సర్వస్వం. పాఠకులకు ఇది ఒక పాఠ్య పుస్తకంలాగా ప్రామాణికంగా ఉండాలి. రచయిత ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తన అభిప్రాయాలు వ్రాయరాదు. కింది సూచనలను పాటించండి.

నేను భావిస్తున్నాను, నాకు తెలిసినంతవరకు, నా అనుభవంలో.. ఇలాంటి వాక్యాలు వ్రాయవద్దు.
వ్యాస విషయానికి సంబంధించి అవసరమైన చోట్ల దృష్టాంతాలను, రుజువులను ఉదహరించండి.
గౌరవ వాచకాలు వికీపీడియా శైలి కాదు. అంచేత గారు, శ్రీ వంటివి వ్రాయవద్దు. అలాగే చెప్పారు, వెళ్ళారు, చేసారు వంటి మాటలకు బదులుగా చెప్పాడు, వెళ్ళింది, చేసాడు వంటి పద ప్రయోగం ఉండాలి. ఈ విషయమై మీ అభిప్రాయాలను రచ్చబండలో వ్రాయండి. చర్చా పేజీలు ఇందుకు మినహాయింపు.
వికీపీడియా వ్యాసంలో తమ పేరు నమోదుచేయకూడదు. ఉదాహరణకు కూర్పు, సంగ్రహణ లేదా మూలం అని తమ స్వంతపేర్లు వ్రాయకూడదు.

తెలుగు వికీపీడియా: ప్రగతి:

మార్చు

తెలుగు వికీపీడియా దశాబ్ధిఉత్సవాల తరువాత మరింత ప్రగతిని సాధించింది. తెవికీలో వ్యాసాల సంఖ్య 60,000 అధిగమించించింది. అలాగే తెలిగు విక్షనరీలో 1,00,000 పేజీల సృష్టి జరగడం మరొక మైలు రాయి. తెలుగు వికీసౌర్స్ పేజీల సంఖ్య 10,000 లను దాటడం ముదావహం. ఇలా బహుముఖంగా సాధించడం అభినందించవలసిన విషయం. అందుకు సహకరిస్తూ ఈ మహత్తర అక్షరయజ్ఞంలో పాల్గొన్న క్రియాశీలక సభ్యులందరికీ ఈ అభినందన స్వంతం. తెలుగు వికీపీడియా శిక్షణా కార్యక్రమాలు (అకాడమీ), తెవీకీ హాకథాన్, పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్, ఫేస్‌బుక్‌లో ఎడతెగకుండా పోస్ట్‌లు చేస్తూ తెవికీ ప్రగతిని అందరికీ తెలియజేస్తూ తెవికీని ప్రజలలోకి తీసుకువెళుతూ గుర్తింపును పెంపొందించడం వంటి కృషి విశేషంగా జరిగింది.

1. తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సవాలు:

తెలుగు వికీపీడియా పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడలో తెలుగు వికీ పీడియా దశాబ్ధి ఉత్సవాలు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రముఖులు వికీపీడియాకు సంబందించి వివిధ సూచనలు చేశారు. ఈ సందర్భంగానే తెలుగు వికీపీడియాలో గత పది సంవత్సరాలలో విశిష్ట కృషి చేసిన పది మంది వికీపీడియన్ లను విశిష్ట వికీపీడియన్ పథకంతో, ప్రశంసాపత్రముతో సత్కరించారు.

తెలుగు వికీపీడియా అంశాలు:

మార్చు
1.తెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు

తెలుగు వికీపీడియా వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. 13 వేలకు పైగా సభ్యులు 60 వేలకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల లోని అన్ని గ్రామాల గురించీ రాయాలనే సంకల్పంతో సభ్యులు రేయింబవళ్ళు పని చేస్తున్నారు. చాల వరకు పని పూర్తయింది. రేయింబవళ్ళు అనే మాట వాక్యంలో తూకం కోసం వాడింది కాదు.., భారత్, అమెరికా, కెనడా, బ్రిటను, ఫ్రాన్సు, కొరియా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచం నలుమూలలలోనూ ఉన్న తెలుగువారు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంచేతే ఎల్లవేళలా వికీపీడియాలో ఎవరో ఒకరు రాస్తూనే వుంటారు.

2.ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?

అవును, సరిగ్గా అందుకే!! లోకంలో లభించే విజ్ఞానాన్నంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతోనే వికీపీడియా మొదలయింది. వికీపీడియా స్థాపనకు ప్రాతిపదికే అది. అన్నట్టు అష్టకష్టాలు ఏమిటో మీకు తెలుసా? తెలియకపోతే తెలుగు వికీపీడియాలో ఆ పదాన్ని వెతుకు పెట్టెలో వ్రాసి వెతకండి. విజ్ఞానాన్ని అందరికి ఉచితంగా అందుబాటులో వుంచాలనేదే వికీపీడియా ఉద్దేశము గదా.......

3.ఇంతటి గొప్ప పనికి ఖర్చు కూడా గొప్ప గానే అవుతుంది కదా, మరి ఆ ఖర్చుకు డబ్బులెలా సమకూరుస్తున్నారు?

సర్వర్లు, ఇతర మిషన్లు కొనడానికి, హోస్టింగుకు అవసరమైన ఖర్చుల కోసం పెద్ద మొత్తంలోనే డబ్బులు ఖర్చవుతాయి. దానికొరకు ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తారు. సాఫ్టువేరును అభివృద్ధి చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా చేస్తారు. ఇక వ్యాసాలు - ఇతరత్రా వ్యాసాలు రాసేవాళ్ళంతా మనబోటి వాళ్ళే. తమకు తెలిసిన విషయాలను ఉచితంగానే రాస్తున్నారు. ఎవరికి తెలిసిన విషయాలను వాళ్ళు రాస్తూ పోతే వికీపీడియాలో ఎంతటి విషయ సంపద పోగు పడుతుందో ఊహాతీతమే గదా......

4.ఎవరైనా రాయవచ్చంటున్నారు, మరి, నేనూ రాయవచ్చా?

నిక్షేపంగా రాయవచ్చు, ఇతరులు రాసిన వ్యాసాలను సరిదిద్దనూ వచ్చు. వికీపీడియా ఉద్దేశమే అది. విషయ పరిజ్ఞానమున్న వారు ఆ విషయాలలోని ఇదివరకు వున్న వ్యాసాలలోని విషయము తక్కువగా వుంటే అటువంటివారు తమ వద్ద వున్న అధిక సమాచారాన్ని జోడించ వచ్చు. ఏదైనా వ్యాసం అసలు లేకుంటే ఆ విషయమై కొత్త వ్యాసాన్ని తయారు చేయవచ్చు. ఆ వ్వాసంలో వారి వద్ద పూర్తి సమాచారము లేకున్న పరవాలేదు. వారి వద్ద వున్నకొద్ది పాటి విషయాన్ని పొందుపరచి వ్యాసాన్ని సృష్టించ వచ్చు. పూర్తి సమాచారముతో ఆ వ్యాసాన్ని మీలాగే మరొకరు పూరుస్తారు. భాషా పరమైన పరిజ్ఞానమున్నవారు వ్యాసాలలోని వ్యాకరణ/అక్షర దోషాలను సరిదిద్దవచ్చు. వ్యాసాలు వ్రాసేవారు గాని ఇదివరకే వున్న వ్యాసంలో కొత్త సమాచారము పొందు పరచే వారు గాని ఆ వ్యాసం గాని, వ్యాస భాగము గాని ఎక్కడినుండి సేకరించారో అనగా ఏదేని గ్రంధం, వార్తా పత్రిక మొదలగువాటి పేర్లను మూలం గా తప్పని సరిగా పేర్కొనాలి.

5.దేని గురించి రాయవచ్చు?

మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను. వికీపీడియా లోని విషయాన్ని సంకలన పరచి పుస్తకంగా ముద్రించి అమ్ముకోవచ్చు కూడ. అంతా ఉచితమే. కాని ఆ పుస్తకంలో 'ఈ సమాచారాన్ని వికీపీడియా నుండి గ్రహించ బడినది ' అని మాత్రము వ్రాస్తే చాలు.

6.పేపర్లో చదివే వార్తలు.

ఏదైనా ఊరి గురించి కాని, సినిమా గురించి కాని, వ్యక్తి గురించి కాని ఆసక్తికరమైన వార్త పేపర్లో చదవొచ్చు. లేదా టీవీలో చూడొచ్చు. తెలుగు వికీలో ఆ వూరు లేదా సినిమాకు సంబంధించిన పేజీ తెరిచి ఆ విషయాన్ని క్లుప్తంగా వ్రాసేయండి. రిఫరెన్సుగా ఆ పేపరు, తేదీలను పేర్కోవడం మరచి పోకండి.

7.టీ.వీ.లో సినిమా చూశాను.

మీరు క్రొత్తది కాని, పాతదికాని సినిమా చూశారనుకోండి. మరిచిపోక ముందే ఆ సినిమా గురించి వికీలో ఆ సినిమా వ్యాసం వ్రాసెయ్యండి. ఆ సినిమా గురించి ఇప్పటికే ఒక పేజీ ఉండవచ్చును. వర్గం:తెలుగు సినిమాలు చూడండి. అందులో మరింత సమాచారం చేర్చవచ్చును. టైటిల్స్‌లో నటులు, నిపుణుల పేర్లు వ్రాస్తే మరీ మంచిది. "సినిమా బాగుంది. బాలేదు" వంటి అభిప్రాయాలు మాత్రం వ్రాయొద్దండి.

8.మీకు తెలియని వూరు గురించి వ్రాయండి.

ఎవరైనా పరిచయమున్న మిత్రులను వారి వూరి గురించి అడగండి. వూరెక్కడుంది? పంటలేంటి? గుళ్ళు, గోపురాలు, తిరణాలు, సంబరాలు, నీటి వనరులు - ఇలాంటి విషయాలు. వికీలో ఆ వూరి గురించి వ్యాసం కొద్దిగా వ్రాసేయవచ్చును. చర్చా పేజీలో "ఫలాని వారు ఇచ్చిన సమాచారం ప్రకారం" అని వ్రాస్తే మర్యాదగా ఉంటుంది. (వారికి అభ్యంతరం లేకపోతేనే).

9.మీ వూరి గురించి ఏం వ్రాయొచ్చు?

మాది చాలా చిన్న పల్లె. దాన్ని గురించి ఏం వ్రాయగలం? అనిపించవచ్చును. - అందుకు సూచనల కోసం ఈ సూచనాపేజీ చూడండి. ఇంకా కొన్ని ఉదాహరణల కోసం బ్రాహ్మణగూడెం, చిమిర్యాల, పెదవేగి చూడండి. జనాల గురించి, పంటల గురించి, సౌకర్యాల గురించి వ్రాయొచ్చు. ఒకసారి రాయడం మొదలు పెడితే మీరే ఆశ్చర్యపోతారు - ఇంత వ్రాయొచ్చునా అని.

10.మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా?

ఏం పర్లేదు, తెలుగు వికీలో అప్రమేయం తెలుగు టైపింగ్ సహాయం వుపకరణం వుంది. అదేకాక ప్రతి కంప్యూటర్ వ్యవస్థలో పని చేసే వివిధ రకాల కీ బోర్డులున్నాయి . వికీపీడియాలో ప్రవేశించగానే అంతా తెలుగులోనే మొదటి పుట కనబడుతుంది. అందులో ఏదేని వ్యాసంకొరకు వెతకండి. (వెతుకు పెట్టెలో వ్యాసం పేరు వ్రాసి వెతుకు. అనే పెట్టెను నొక్కితే ఆవ్యాసం ఇదివరకే వున్నట్లయితే ఆవ్యాసం కనబడుతుంది. లేకపోతే..... ఆ వ్యాసం పేరు ఎర్రని రంగులో కనబడుతుంది. అంటే ఆ వ్యాసం లేదని అర్థము. అక్షర దోషాలు లేకుండా వ్యాసం పేరు వ్రాయండి. ఆ ప్రక్కనే సృష్టించు అని కూడ కనబడుతుంది. దానిని నొక్కితే ఆ వ్యాసంపేరుతో ఖాళీ పుట తెరుచు కుంటుంది. ఇక మీరు వ్రాయవచ్చు. ఇంగ్లీషు కీ బోర్డునే వాడవచ్చు. ఒక వేళ తెలుగులో కనబడక పోతే ....... ctrs. + Capital M టాబ్ లను ఒక్కసారె నొక్కండి. తెలుగులోకి మారిపోతుంది. తిరిగి ఇంగ్లీషులోని మారాలనుకుంటే అవే బటన్ లను మరొక సారి నొక్కండి. ఇంగ్లీషులోనికి మారి పోతుంది. తెలుగులో టైప్ చేయడము రాదు అనేది సమస్యే కాదు. ఇంగ్లీషు కీ బోర్డునేవాడ వచ్చు. ఉదాహరణకు ..... అమ్మ అని వ్రాయాలంటే amma = అమ్మ అని anna = అన్న అని akka = అక్క అని nEnu = నేను అని nuvvu = నువ్వు అని mIru =మీరు eMduku = ఎందుకు eppuDu = ఎప్పుడు అని వ్రాస్తే తెలుగులో టైప్ అయి పోతుంటాయి. ద్విత్తాక్షరాలు, సంయుక్తాక్షరాల వ్రాయడానికి మాత్రము కొంత శ్రమ. అంతా ఒక పది రోజులలోనే అలవాటయి పోతుంది. దీనికి సహకారిగా మీరు వ్రాస్తున్న పుటలోనే టైప్ సహాయం కాలి అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద నొక్కితే తెలుగు + ఇంగ్లీషు అక్షరాలున్న కీ బోర్డు కనబడుతుంది. అందులో ఏ అక్షరానికి ఏ కీ నొక్కాలి అని తెలియజేసే కీ బోర్డు కనబడుతుంది. అందులో చూసి వ్రాయవచ్చు. ఒక పది రోజుల పాటు అప్పుడప్పుడు ఆ కీ బోర్డును చూసి వ్రాయవచ్చు తర్వాత దాని అవసరమే వుండదు. దాని అవసరము లేకుంటే ఆ కీబోర్డును మూసి వేయవచ్చు. ఇంతకీ ముందు మీకుండాల్సింది వ్రాయాలనే ఉత్సాహమే గాని...... విషయ పరిజ్ఞానము గాని, టైప్ చేయడం రాదనే విషయాలు అతి చిన్నవి. ఉత్సాహంతో ప్రయత్నించండి. .నా కంప్యూటర్ లో తెలుగు లేదు.... ఎలా స్థాపివుకో వాలి? దీనికి జవాబు ఈ పుస్తకంలోనే మరొక చోట వున్నది చూడండి.

11.కానీ నా ఆఫీసు పనులు, ఇంటి పనులతో బిజీగా ఉంటాను కదా, వికీపీడియాలో రాస్తూ ఉంటే ఆ పనులేం గాను?

మీ పనులన్నీ వదిలేసి, అక్కడ రాయనవసరం లేదు. మీ తీరిక సమయంలోనే రాయండి. అక్కడ రాసే సభ్యులంతా అలా రాసేవాళ్ళే! మీ పనులు మానుకొని వ్రాయనవసరము లేదు. మీ తీరిక సమయంలో రోజుకు కనీసం ఒక గంట దీనికి కేటాయిస్తే చాలు. ఎంతో సమాచారము ప్రోగవుతుంది. ఇక్కడ వ్రాస్తున్న వారు అదే పనిగా ఏమీ వ్రాయడము లేదు. వారి వారి తీరిక సమయంలోనే వ్రాస్తున్నారు. రోజు కాకపోయినా అప్పుడప్పుడు మీకు విషయము దొరికినప్పుడు, ఉత్సాహం కలిగినప్పుడు ఇందులో ప్రవేశించి వ్రాయవచ్చు. ఇక్కడ అందరూ అలాగే వ్రాస్తారు. మీకు ఉత్సాహం వుంటే.... ఇందులో ప్రవేశించి ఎవరెవరు ఏమేమి వ్రాస్తున్నారో గమనించండి, చదవండి. నాలుగైదు రోజులు అలా చూస్తే మీకు అర్థం అయిపోతుంది.

12.కానీ నాకున్న భాషా పరిజ్ఞానం పరిమితం. తప్పులు దొర్లుతాయేమో!?

నిజమే, మొదట్లో తప్పులు దొర్లవచ్చు. కానీ రాసుకుంటూ పోతుంటే ఆ తప్పులన్నీ సద్దుమణిగి, మీ భాష వికసిస్తుంది. వికీపీడియా సభ్యులకిది అనుభవమే. అంతేగాక, మీ రచనలోని భాషా దోషాలను సరిదిద్దడానికి ఇతర సభ్యులు సదా సిద్ధంగా ఉంటారు. కాబట్టి దోషాల గురించి మీకు చింత అక్కరలేదు. “వెనకాడవద్దు, చొరవ చెయ్యండి” అనేది వికీపీడియా విధానాల్లో ఒకటి. చొరవ చేసి రచనలు చెయ్యండి. అనుభవజ్ఞులైన సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు అవసరమైన సాయం చేస్తారు. అంతే కాక ఇక్కడ వ్రాస్తున్న వారు మహా రచయితలో, భాషా పండితులో కాదు. అంతా మీలాంటి వారే.

13.సమాచార సేకరణ

వికీపీడియాలో చేర్చడానికి సమాచారం ఎక్కడనుంచి సేకరించాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో కేవలం ఆంగ్ల పుస్తకాలే కాక తెలుగు పుస్తకాలు కూడా బోలెడు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మంచి పేరున్న రచయితలు రాసినవి చదివి సేకరించవచ్చు. లేకపొతే అన్నింటికన్నా ఉత్తమమైన పద్దతి గ్రంథాలయాలకు వెళ్ళి సేకరించడం. అలా సేకరించిన సమాచారాన్ని యదా తదంగా వ్రాసేయకుండా... దాన్ని కొంత క్లుప్తీకరించి వ్రాయండి. ఆ మూల గ్రంధం పేరును మూలాలలో చేర్చడము మరచి పోవద్దు.

14.దేని గురించి రాయాలా అని ఆలోచిస్తున్నారా?

మీ స్నేహితులతో సంభాషిస్తున్నపుడు వారు మీరు చెప్పే విజ్ఞాన దాయకమైన విషయాలను ఆసక్తిగా వింటున్నారా? అయితే వాటి గురించి వికీపీడియాలో రాయండి.

వికీపీడియాలో మీ రచనలను ఎక్కడ ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నారా?. మీరు కనుక గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే, మీ ఊరి గురించి వికీపీడియాలో లేకపోతే మీ ఊరి గురించి వ్రాయండి. లేదా ఈ వారము సమైక్య కృషి అన్న లింకుపై నొక్కి, ఇప్పుడు మార్పులు అవసరమైన పేజీలేవో తెలుసుకోండి. అక్కడ మీ పని ప్రారంబించండి.

15.మీ వీలును బట్టే వికీలో కృషి చేయండి.

వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వమని మీకందరికీ తెలిసిందే. ఇదే స్వేచ్చ వికీపీడియా కోసం పని చేసే సభ్యులకూ వర్తిస్తుంది. వికీ సభ్యులు తమకు ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన సమయాల్లో, ఇష్టం వచ్చిన వ్యాసాలలో మార్పులు చేయవచ్చు. ఒక వేళ వికీ సభ్యులు తాము తగినంత సమయం కేటాయించలేక పోతే అందుకు సదరు సభ్యులు భాద పడనక్కర లేదు. ఇతర సభ్యులు అందుకు ఆక్షేపించడం కూడా సరియైన పద్దతి కాదు. అది నిర్వాహకుల విషయంలో నైనా సరే. ఎవరికైనా వాళ్ళ స్వంత పనులు, అభిరుచులు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని గౌరవించడం ఉత్తమం.

ఎక్కువ సమయం దొరకడం లేదు. నాకు వికీపీడియాలో పని చేయడానికి ఎక్కువ సమయం దొరకడం లేదు కనుక పెద్ద వ్యాసాలు వ్రాయలేకపోతున్నాను.
వ్యాసం పొడవును బట్టి వికీ నాణ్యత గాని, మీ విలువ గాని పెరగవు. వికీలో ఎంత చిన్న దిద్దుబాటైనా స్వాగతించబడుతుంది. ఉదాహరణకు అక్షర దోషాల సవరణ. "భాగవతం" బదులు "బాగవతం" అని మీకు ఎక్కడైనా కనిపించిందనుకోండి. వెంటనే దిద్దెయ్యండి. కాలిలో చిన్న ముల్లు ఉంటే ఉపేక్షిస్తామా?

2001 లో స్లాష్ డాట్ అనే వెబ్ పత్రికలో వచ్చిన వ్యాసం కారణంగా ఇంగ్లీషు వికీపీడియాకు ప్రజల్లో మంచి ప్రచారం లభించింది. అలాగే 2006 నవంబరు 5 నాటి ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చిన వ్యాసం కారణంగా తెలుగు వికీపీడియాకు ఎంతో ప్రచారం లభించింది. ఆ వ్యాసం కారణంగా సభ్యుల సంఖ్య 12 రోజుల్లోనే రెట్టింపై ఒక్కసారిగా తెలుగు వికీపీడియా భారతీయ భాషల్లోకెల్లా మొదటి స్థానానికి దూసుకుపోయింది.

మీరూ వికీపీడియాలో చేరండి. వ్యాసాలను వ్రాయండి. మీ స్నేహితులనూ చేర్పించండి. వారిచేత కూడ వ్రాయించండి. భావి తరాల వారికి ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. మీరు వ్రాసిన సమాచారము చిరకాలము మీపేరుతోనే వుంటాయి. మీరు సృష్టించిన వ్యాసము యొక్క సృష్టి కర్త గా మీపేరే నామోదవుతుంది. ఆ తర్వాత ఆ వ్యాసంలో ఎవరెవరు ఎంత విషయాన్ని పొందు పరచినా సృష్టికర్తగా మీపేరే వుంటుంది. ఆ విధంగా మీకు శ్రేయస్సు ఆపాదించ బడుతుంది. ఇది మీకు గర్వ కారణం కాదా........

11వ వార్షికోత్సవాలు

మార్చు

ఈ క్రమంలోనే 2015-16 సంవత్సరంలో తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. వార్షికోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తిరుపతిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం తెలుగు వికీపీడియా సాధించిన విజయాలు, నేర్చుకున్న అనుభవాలు, వికీపీడియా అభివృద్ధి గురించి నిపుణుల సూచనలు వంటివి వుంటాయి. కార్యక్రమంలో భాగంగా హాజరైన వికీపీడియన్లకు వికీ క్విజ్ వంటి పోటీలు కూడా నిర్వహిస్తారు. వికీ ఉద్యమంలో తమ అనుభవాలూ, ఆలోచనలు పంచుకుంటూంటే, భవిష్యత్తులో వికీపీడియాను ఎలా అభివృద్ధి చేయాలి, కొత్త సభ్యుల కృషి ఏ విధంగా వుంటే బావుంటుంది వంటి విషయాలపై చర్చాగోష్ఠులూ వుంటాయి. ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న కొమఱ్ఱాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారంతో గత సంవత్సరం అత్యుత్తమ కృషి చేసిన వికీపీడియన్లలో ఐదుగురిని ఎంపికచేసి వారిని కార్యక్రమంలో భాగంగా సన్మానిస్తారు. ఇవి కాక జూలై, ఆగస్టు నెలల్లో కొత్త సభ్యులను ఉత్సాహపరిచేలా వికీపీడియాలో కొన్ని పోటీలను కూడా నిర్వహించే ఆలోచన ఉన్నట్టు ఉత్సవకమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వికీపై ఆసక్తి ఉన్నవారంతా ఆహ్వానితులేనని, తెలుగు వికీపీడియాలో కృషిచేసిన సభ్యులకు ప్రత్యేకించి హాజరయ్యేందుకు స్కాలర్ షిప్ కూడా అందిస్తున్నామని వారు పేర్కొన్నారు.

గత సంవత్సరం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వికీపీడియా పట్ల చైతన్యం, స్వేచ్ఛా విజ్ఞానం గురించి అవగాహన బాగా పెరగగా, ఈ సంవత్సరంలో నిర్వహించుకుంటున్న 11వ వార్షికోత్సవాలు నాణ్యతాపరంగా తెలుగు వికీపీడియాను మరింత సమున్నత శిఖరాలకు చేర్చేలా కార్యకలాపాలను రూపొందించినట్టు కమిటీ పేర్కొంది.

వికీ గణాంకాలు

మార్చు

పేజీ గణాంకాలు

మార్చు
  • విషయపు పేజీలు 61,116
  • పేజీలు (ఈ వికీలోని అన్ని పేజీలు (చర్చా పేజీలు, దారిమార్పులు, మొదలైనవన్నీ కలుపుకొని).) 1,67,350
  • ఎక్కించిన దస్త్రాలు 9,547
  • మార్పుల గణాంకాలు
  • వికీపీడియాని మొదలుపెట్టినప్పటినుండి జరిగిన మార్పులు 13,82,094
  • పేజీకి సగటు మార్పులు 8.26

వాడుకరులు

మార్చు
  • నమోదైన వాడుకరులు 43,144
  • క్రియాశీల వాడుకరులు (సభ్యుల జాబితా) (గత 30 రోజులలో పని చేసిన వాడుకరులు) 263
  • బాట్‌లు (సభ్యుల జాబితా) 40
  • నిర్వాహకులు (సభ్యుల జాబితా) 17
  • అధికారులు (సభ్యుల జాబితా) 4