కమ్యూనిస్టులంతా పునరేకీకరణ కావాల్సిందే

భారత స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించిన గొప్పనైన చరిత్ర కమ్యూనిస్టులదే.  అక్టోబర్ సోషలిస్టు విప్లవంతో ఉత్తేజం పొందిన విప్లవకారులంతా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పరచండంలో ప్రధాన పాత్ర వహించారు.   భారత్ కు సంపూర్ణ స్వరాజ్యం కావాలని,  నినదించింది కమ్యూనిస్టులే.  1922లో పెషావర్ కుట్రకేసు మోపబడింది. 1924 మార్చ్ 17 న అందజేసిన ఛార్జ్ షీట్లో నిందితులంతా కమ్యూనిస్టులే. ఆ కేసులో డాంగే, ముజఫర్ అహ్మద్, గుప్త, ఉస్మానీలకు నాలుగు సంవత్సరాల  కఠిన కారాగార జైలు శిక్ష పడింది. దీంతో ‘కమ్యూనిస్టులను తుడిచివేసాము’ అని విజయ గర్వంతో బ్రిటీష్ సామ్రాజ్యవాదులు ప్రకటించారు. కాన్పూర్ పట్టణంలో అధికారికంగా 1925  డిసెంబర్ 26  న భారత కమ్యూనిస్ట్ పార్టీ పురుడు పోసుకుంది. 1929 లో మీరట్ కుట్ర కేస్ ను ఎదుర్కొన్నారు.  దేశంలోని అనేక జైళ్లలోనే కాదు, అండమాన్ జైలులో కఠిన కారాగార శిక్ష ననుభవించారు. 1934 లో భారత కమ్యూనిస్ట్ పార్టీని బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది.    అంతే కాదు ఈ దేశంలో సోషలిజం రావాలని మహోన్నత  లక్ష్యంతో అనేక మంది కమ్యూనిస్టులు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వేలాదిమంది తుపాకి తుటాకి ప్రాణాలొడ్డారు. అనేక మంది చెరసాలలో బందీలుగా ఉన్నారు.

నేడు భారత స్వాతంత్రోద్యమంలో పైసెత్తు పాత్రలేని మనువాద ఫాసిస్ట్ పాలకుల చేతుల్లో దేశమే వశమై సంతలో సరుకైంది.   ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒక్కొక్కటి పేకమేడల్లా కూలిపోతూ, భారత ప్రజల చెమట చుక్కల తో నిర్మించిన సౌధాలన్నీ ఆదానీ లాంటి కార్పొరేట్ల పరమవుతున్నాయి.   రాజ్యాంగ సంస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సిగ్గుగా కూల్చివేస్తున్నారు. నిత్యవసర ధరలు నింగిని తాకుతున్నాయి.  జీఎస్టీ పేరుమీద పాలకులు ప్రజల మూలుగ తో సహా పీల్చి పిప్పిచేస్తున్నారు    భారత జనం బతుకు దిన దినం సంక్షోభం లోకి నెట్టివేయబడుతుంది. భారత ప్రజలకు భరోసాగా ఉన్న భారత రాజ్యాంగంలో రాసుకున్న స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము అనే పదాలకు తిలోదకాలిస్తూ వాళ్ళు బాహాటంగానే భారత రాజ్యాంగాన్నే తీసివేసి హిందూ రాష్ట్ర  రాజ్యాంగాన్నే తీసుకోస్తామని ప్రకటనలిస్తూనే ఉన్నారు. స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ, స్వాతంత్రోద్యమ ఆకాంక్షాలనన్నిటినీ అందకుండా జేస్తూ,  ప్రాచీన భారత రాజ్యాంగం మనుస్మృతి అంటూ కీర్తిస్తూ ముందుకొస్తున్నారు. ఇదే కనుక జరిగితే భారత జనం మళ్ళీ నాలుగు వేల సంవత్సరాలనాటి చరిత్రలోకి వెళ్లే దుర్మార్గమైన పరిస్థితి వస్తుంది.

జర్మనీలో 1946 లో నియంత హిట్లర్ పాశవిక దాడులపై చాలా ఆవేదనతో ఒక చర్చ్ లోని పాస్టర్ మార్టినా  నోముల్లర్ రాసినట్టి కవితను గుర్తుంచుకోవాల్సిన సందర్భమిది. …. మొదట వారు సోషలిస్టుల కోసం వచ్చారు- అయినా నేనేం మాట్లాడలేదు- ఎందుకంటే నేను సోషలిస్టును కాదు- తర్వాత వారు ట్రేడ్ యూనియనిస్ట్ ల కోసం వచ్చారు- అయినా నేనేం మాట్లాడలేదు- ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్ట్ ను  కాదు- తర్వాత వారు యూదుల కోసం వచ్చారు- అయినా నేనేం మాట్లాడలేదు - ఎందుకంటే నేను యూదుడిని కాదు. చివరకు వారు నా కోసం వచ్చారు - నా కోసం మాట్లాడటానికి ఎవరూ లేరు.  సరిగ్గా ఇప్పుడు భారత్ లో జరగబోయేది ఇదే.   సామాజిక ఆర్థిక అసమానతలకు ఏకైక పరిష్కారమమైన మార్క్సిజాన్ని అణువణువునా అవపాసన పట్టి  అనర్గళంగా ఆకర్షణీయంగా ఆగకుండా సహేతుకంగా గంటలకొద్దీ దీటైన ఘాటైన  విశ్లేషణలతో దోపిడీ దార్లకు దడ పుట్టించే కమ్మ్యూనిస్టులంతా పునరేకీకరణ దిశలో అడుగులు వేయాల్సిన సందర్భమిది.   కనీసం పార్లమెంటరీ పంథాలో పయనిస్తున్న కమ్యూనిస్టులంతా పునరేకీకరణ కోసం  చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతె చరిత్ర కమ్యూనిస్టులను క్షమించదు.  ఈ విపత్కర పరిస్థితిలో   కమ్యూనిస్టులు అధికారానికి ఎందుకు రాలేక పోయిండ్రో మనమంతా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.  

రాజ్యంతో చేసే పోరులో వేలాదిమంది రాటు దేలిన కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారు.  వాళ్ళ మరణం పూడ్చలేనిది.  ఒక కమ్యూనిస్ట్ గా తయారుకావడం అంత సులువైంది కాదు.  కారణాలు ఏమైనా కావచ్చు.   1964 లో సిపిఐ చీలి సిపిఎం ఏర్పడింది. అదైనా కొసదాకా ఉన్నదా అంటే అదీ లేదు. 1969 లో సిపిఎం చీలి సిపిఐ ఎంఎల్ గా ఏర్పడింది.  సిపిఐ ఎంఎల్ నుండి 1972 నుండి అనేక గ్రూపుల ఏర్పడ్డాయి.  ఈ చీలికలన్నీ అభ్యదయ వాదులను, ప్రగతిశీల వాదులను ఎంతో కలవరపరుచాయి. మనువాద ఫాసిస్టులకు ఎంతో బలాన్నిచ్చాయి. 

చీలికలన్నీ కూడా శ్రామికుల ఐక్యతకు తోడ్పడేవి కావు.  శ్రామికుల మధ్య చీలికలు శాశ్వత పరుస్తున్నాయి.  ఫలితంగా ప్రజల్లో విస్వాసం కోల్పోయి బలహీనపడిపోయాము.  కమ్యూనిస్టులంతా నిజాయితీపరులనీ, ప్రజల హక్కులకొరకు పోరాడుతారని ఇప్పటికీ ప్రజల్లో బలమైన విస్వాసం ఉంది.  అయితే కమ్యూనిస్టులు బలహీనపడటం దేశానికి ఇప్పటికే చలా నష్టం జరిగింది. కొత్తహక్కులకై పోరాటాలు లేని పరిస్థితి ఏర్పడి, పోరాడి సాధించుకున్న హక్కులకై పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.  మరోవైపు లౌకిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేసే పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిస్టుల ఐక్యత గురించి అక్కడక్కడా అన్ని కమ్యూనిస్టు పార్టీల అధినాయకులు మాట్లాడుతుండారు. కానీ ఆచరణకై ఇసుమంతయు ప్రయాణం మొదలుపెట్టాక పోవడం చాలా శోచనీయమైన విషయం.

వాళ్లలో వాళ్లకు ఎన్ని విభేదాలున్నాఫాసిస్టు పాలకులు దోపిడీదారులు ఐక్యమయ్యి ముందుకెళ్తున్నారు. ఘనమైన పోరాటచరిత్ర ఉండి, నరనరాన పోరాడే పటిమ ఉన్న కమ్యూనిస్టు శక్తులన్నీ ఐక్యం కాకపోవడం మూలాన భారత దేశంలో విప్లవం వాయిదాపడింది. కమ్యూనిష్టులు పునరేకీకరణై ఒకే సంస్థగా ఏర్పడకుంటే దేశప్రజలకు తీవ్ర నష్టం. దోపిడిదారులకెంతో లాభం.  రైతులకు, వ్యవసాయ కార్మికుల కు నష్టం. దళిత, గిరిజన, బీసీ , మైనార్టీలకు తీవ్ర నష్టం.  అగ్రకులసంపన్నవర్గాలకెంతో లాభం.  మతోన్మాద, పాసిస్టు మనువాద శక్తులకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది.  కమ్యూనిష్టులు కోల్పోయిన విశ్వాసం తిరిగి ప్రజలలో కల్పించాల్సివుంది.  అందుకు నేపాల్ కమ్యూనిష్టుల పునరేకీకరణ జరిగినట్లు ఇక్కడ కూడా జరగాల్సివుంది. నిజమైన కమ్యూనిష్టులెవరైనా బూర్జువా వర్గంలో చీలికలు తేవడానికి ప్రయత్నించాలి. పేదల, శ్రామికుల ఐక్యతకు కృషి చేయాలి.  కమ్యూనిష్టులలో చీలికలు నివారించి పునరేకీకరణ కు నడుంబిగించాలి.

కార్ల్ మార్క్స్ కమ్యూనిష్టులను చీలమనలేదు.  ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని చెప్పాడు.  శ్రామికులను చీల్చి ఎవరికివారు సొంత పార్టీ లను పెట్టుకోమనలేదు.  వైవిధ్యాలున్న సమాజం లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజం.  దేశానికొక కమ్యూనిష్టు పార్టీ మాత్రమే వుండాలని "కమ్యూనిష్టు ప్రణాళిక "లో స్పష్టం గా చెప్పడం జరిగింది.

మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ, పై కమిటీ నిర్ణయాన్ని క్రింది కమిటీ అమలు పరచడం ద్వారా పార్టీ ఐక్యత పరిరక్షించేందుకు చక్కని నిర్మాణసూత్రాలు ప్రతిపాదించారు కామ్రేడ్ లెనిన్.  మెజారిటీ గా ఆమోదం పొందిన విషయాలపై పార్టీ విధానంలో బాగంగా ఉమ్మడి పట్టు పట్టాలని, ఏకిభావం రానివాటిని ప్రజాస్వామ్యం పద్దతుల్లో చర్చలద్వారా కమిటీ ల్లో పరిష్కారించు కోవాలని చెప్పారు లెనిన్ . ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చీలికలు పేలికలైన నేపాల్ కమ్యూనిష్టులు పునరేకీకరణయి బలమైన పార్టీగా అవతరించింది. అన్ని కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్న సాధారణ సభ్యులు, కార్యకర్తలు, క్రింది స్థాయి నాయకులు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్యంకావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. ఏ కామ్రేడ్ ను అడిగినా ఇదే మాట చెబుతారు.  ముప్పై, నలభై ఏళ్ల క్రితం ఏ కమ్యూనిస్ట్ సమావేశాల్లో నైనా, సభల్లోనైనా  అంతా యువతతో నిండి ఉండేది. ఇప్పుడు అప్పటి కామ్రేడ్లు యాబై , అరవై ఏళ్లకు పైన ఉన్నవాళ్లే ఎక్కువగా  కనపడతారు. ఉద్యమాల్లో గాని, సమావేశాల్లో గాని విద్యార్థుల పాత్ర అంతంత మాత్రమే వుంది. ఈ పరిణామం కమ్యూనిస్టుల్లో వచ్చిన చీలికల ఫలితంగా ఏర్పడింది. నిజానికి మార్క్సిజం తమ సిద్దాంతం గా ఎంచుకున్న పార్టీ ల మద్య వుండేది శతృ వైరుధ్యం కాదు. ఉన్నది మిత్ర వైరుధ్యమే.  కాబట్టి పునరేకీకరణ కు ఇది ఏమాత్రం అడ్డంకి కాదు.  ఖచ్చితమైన కార్యక్రమంతో నిర్థిష్ట సమయం లో పునరేకీకరణ జరిగేలా ప్రయత్నాలు ప్రారంభం కావాల్సి కావాల్సిన అవసరం వుంది. దీనికోసం కమ్యూనిస్ట్ పార్టీల  అధినాయకత్వం ఎంతో చొరవ చూపాలి. మా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అసలు సిసలైన కమ్యూనిస్ట్ పార్టీ అని, నిజమైన కమ్యూనిస్టులం మేమే అనే దృక్పథాన్ని విడనాడాలి.  ఐక్యతా సూత్రానికి వక్రభాష్యం చెప్పే కొంతమంది కమ్యునిస్టుల మాటలు చర్చలు అంతిమంగా ఏ  వర్గానికి దోహదపడుతాయో ఆలోచించాలి.  బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత కమ్యూనిష్టుల పునరేకీకరణ అవసరం మరింత పెరిగింది. బిజెపి దేశాన్ని అధోగతికి తీసుకెళ్లింది.  స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని హరిస్తుంది.  ప్రజల పరమైన జాతిసంపదను దోసి అంబానీ,ఆదాని,నీరజ్ మోడీ, విజయమాల్యా లకు కట్టబెట్టారు.  ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటికరిస్తున్నారు.  నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగింది.  విధ్య, వైద్యం ప్రజలకు అందుబాటులో లేక, కొనలేక సతమతమవుతున్నారు.  మతం విద్వేషాలు, కులోన్మాదహత్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.  ఊపా లాంటి చట్టాలు తెచ్చి నానా విధములుగా వేధింపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నవి.  కులోన్మాదహత్యలు సర్వసాధారణం అయిపోయాయి. మత మౌడ్యం పెచ్చరిల్లిపోతుంది. అణగిపోయి, అదృశ్యం అయిన మూడనమ్మకాలు తిరిగి ప్రాణం పోసుకుంటున్నవి. దేశాన్ని మద్య యుగాలకు మళ్లించాలని పాలకులు కంకణం కట్టుకున్నారు.  ఈ స్థితిని గమనించి భారత కమ్యూనిష్టు లు తప్పనిసరిగా ఆలోచించాల్సిన తరుణమొచ్చింది. ఫాసిజాన్ని ఓడించడానికి నీల్ శక్తులను, ప్రజాతంత్ర లౌకిక శక్తులను కలుపుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.