వాడుకరి:Svpnikhil/పదోతరగతి, ఇంటర్ లలో బట్టీ విధానం మంచిదేనా ?

ఇంటర్, పదవ తరగతే కాదు అసలు బట్టీ విధానం అనేది మంచి పద్ధతే కాదు. బట్టీ అంటే ఒక విషయం చదువుతున్నప్పుడు దాని అంతర్యాన్ని గ్రహించకుండా అక్కడ ఉన్నదాన్ని పదే పదే వల్లే వేయడం. అలా చదవడం వాళ్ళ ఒక గంటో లేదా ఓ నెలో , పరిక్ష వరకో ఆ విద్యార్ధి సామర్థ్యాన్ని బట్టి గుర్తుంటుంది. మహా అయితే ఆ విద్యాసంవత్సరం వరకు. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుతం మన దేశం – ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బట్టీ విద్యా విధానానికి చిరునామాగా మారింది.

బట్టీ విధానం

మార్చు

బట్టీ విధానానికఒక కారణం (ముఖ్య కారణం) కార్పోరేట్ విద్యా వ్యవస్థ[1] . భారతదేశం మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ. కాని ఇందులో ప్రైవేటు విద్యావ్యవస్థదే నేడు గుత్తాధిపత్యం. దాన్ని నియంత్రించే సరైన యంత్రాంగాన్ని తయారుచేసే పనిలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీనికి కారణం ఒకటి డబ్బు మరొకటి రాజకీయ పలుకుబడి. ఈ విద్యావ్యవస్థ గురించి ప్రభుత్వం ఎన్ని వాగ్దానాలు చేసినా వారి లోపాయికారీతనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

మన విద్యావిధానం

మార్చు

ఇందులో ఎన్నో లోపాలున్నాయని మన పెద్దలు ఎప్పుడో తేల్చేశారు. ఎవరికివారు తప్పు మాది కాదంటే కాదు అని పక్క వారి పై నిందలు వేస్తారు కాని దాని ప్రక్షాళన విషయంలో ఎవరు తమ వంతు బాధ్యత తీసుకోరు. మన పాఠ్య ప్రణాళిక ఒక ఉదాహరణగా తీసుకుంటే తెలుగు – తెలుగు ఉపాధ్యాయుడు వచ్చి వర్ణమాల , పద్యభాగం, చెప్పడం ,పరీక్షలు పెట్టడం , సరిగ్గా రాకపోతే దండించడం జరుగుతుంది కాని తెలుగు అనే పదం ఎలా పుట్టిందో ఏ ఉపాధ్యాయుడు చెప్పరు. సాంఘిక శాస్త్రం ఉదాహరణగా తీసుకుంటే చిత్రపటం(మ్యాప్ పాయింటింగ్ ) అనేది పాఠంతో అనుగుణంగా చెప్పాలి . అశోకుడు కళింగ సామ్రాజ్యాన్ని పాలించాడని విద్యాసంవత్సరం మొదట్లో చెప్తారు. కానీ కళింగ సామ్రాజ్యం (నేటి ఒడిష) ఎక్కడుందో పరీక్షకు రెండు రోజుల ముందు చూపిస్తారు.

పాఠ్య ప్రణాళిక –లోపాలు

మార్చు

పుస్తకం ముద్రించే వారు తప్పు ఉపాధ్యాయులది అని అంటే ఉపాధ్యాయులేమో తల్లిదండ్రులే రాంకుల కోసం వారిని ఇలా ఒత్తిడి చేయమంటారని వాపోతారు. ఏది ఎలా ఉన్నా మధ్యలో నలిగిపోయేది విద్యార్ధి. ఈ విద్యావ్యవస్థ చిన్నారుల జీవితానికి పెను సవాలుగా పరిణమిస్తోంది . పాఠశాలల్లో ఆటస్థలాలు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. ఇక శ్రేణుల (గ్రేడుల) వారీగా తరగతులను విభజించి, వారాంతపు పరీక్షలు పెట్టి లేనిపోని మానసిక ఒత్తిడి కలిగించి పసి హృదయాలను తీవ్రమైన భయాందోళనలకు గురిచేస్తున్నారు. నగరాల్లో కళాశాలలు ,పాఠశాలలు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటాయి. ప్రభుత్వం 2012 లో ఆట స్థలాల ప్రమాణాలకు సంబంధించి చట్టం తెచ్చింది కానీ అంతలోనే అది నీరు గారిపోయింది. ప్రయోగశాలలు, గ్రంథాలయాలు మచ్చుకైనా కనిపించవు. ఇక ఫలితాల విడుదల రోజున టి.వి.లలో హోరు గురించి చెప్పకర్లేదు. కళాశాల ప్రతినిధులు ఇళ్ళకు వచ్చి చెప్పే అతిశయోక్తులు అంతా ఇంతా కాదు. వారి మాటలు నమ్మి ఎక్కడో దూరంగా గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తే అక్కడ చాలిచాలని సౌకర్యాలతో విద్యార్థులు పడే అవస్థలు వర్ణనాతీతం .

ఇంటర్ విద్యా ప్రమాణాలు ఎంత దారుణంగా పడిపోయాయో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం, ఇటీవల ‘ఈనాడు‘ పత్రికలో వచ్చిన ఒక వార్త – ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్‌లో ఒక ఆచార్యుడు విలేఖరికి ఇచ్చిన ముఖాముఖి లో తనకు ఎదురైన ఒక అనుభవం గురించి ఇలా చెప్పారు - ఒక విద్యార్ధి పరీక్షలప్పుడు వచ్చి ముఖ్యమైన ప్రశ్నలు గుర్తుపెట్టమని అడిగాడంట. దాంతో ఆ ఆచార్యుడు విస్తుపోయినంత పనైంది . తర్వాత పత్రాలు వెతికితే తెలిసింది- అతడు ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖ కార్పొరేట్ కళాశాల నుంచి వచ్చాడని ! ప్రైవేటు విద్యావ్యవస్థ విద్యార్థులను ఏ విధంగా తయారుచేస్తోందో ఈ ఉదంతం తేటతెల్లం చేస్తుంది.

ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్య ఒక ప్రకటన ఇచ్చింది –పదవ తరగతి లో ప్రభుత్వ పాఠశాలలలో అత్యధిక మర్కులు సాధించిన వారిని ప్రైవేటు జూనియర్ కళాశాలలో తమ ఖర్చుతో ఇంటర్ చదివిస్తామని . దాన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు ప్రభుత్వానికి తమ కళాశాలలపై ఏ మాత్రం నమ్మకం ఉందో ! ఘనత వహించిన మన ప్రజాప్రతినిధులు (ఎం.ఎల్.ఏ.లు) దీని గురించి పట్టించుకుంటున్నారో లేదో వారికే తెలియాలి. ప్రైవేటు కళాశాలలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని నిబంధన ఉంది కానీ దాన్ని పాటించేదేవరు?

ప్రభుత్వ చర్య

మార్చు

“ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యాభోదన , పిల్లలపై ప్రభావం” [2] అనే అంశంపై అద్యయనం కోసం ప్రభుత్వం ‘నీరదరెడ్డి’అనే విద్యావేత్త నేతృత్వంలో ఒక కమిటీనీ నియమించింది. వారి విచారణలో నివ్వెరపరిచే విషయాలు బయటపడ్డాయి.

 • రోజుకు పదహారు గంటలు తరగతి గదిలోనే పాఠాలను బోధిస్తున్నారు .
 • . మార్కుల విడుదల రోజున ఎక్కడో అక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి
 • వసతి గృహాలలో సరైన వసతులు లేవు
 • విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించినట్టుగా కౌన్సిలర్లు లేరు.
 • 60% పైగా పాఠశాలల్లో ఆటస్థలాలు లేవు.

ఈ కమిటీ సిఫార్సులు విద్యావ్యవస్థపై మన పాలకులకున్న శ్రద్ధను ఎండగట్టాయి. ఇక రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా ఏర్పడే కోచింగ్ కేంద్రాలకు లెక్కేలేదు.

తల్లిదండ్రులు , ఉపాధ్యాయుల పాత్ర

మార్చు

పాఠ్యప్రణాళికకు లోబడి పాఠ్యాంశాలను పూర్తి చేయాలని ఉపాధ్యాయులపై కళాశాల యాజమాన్యాలు తెచ్చే ఒత్తిడి కూడా ఈ స్థితికి కారణం అని చెప్పవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు సుఖంగా ఉండాలనే ఎల్లప్పుడూ ఆశిస్తారు. అయితే తమ పిల్లలను ఇతరులతో పోల్చి నిందించడం వలన వారు మానసికంగా కుంగిపోయి తల్లిదండ్రుల మీదే కక్ష పెంచుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురి చేసే విషయం.

నివారణ చర్యలు

మార్చు
 • పాఠశాలలలో తల్లిదండ్రులు కమిటీగా ఏర్పడి పాఠశాల విధానాల గురించి చర్చించాలి.
 • ఉపాధ్యాయులపై యాజమాన్యాల అజమాయిషీ తగ్గాలి.
 • కేవలం పుస్తకాలలో ఉన్నదే కాకుండా వివరణాత్మకంగా వర్ణించాలి.
 • తక్షణమే పాఠ్యప్రణాళిక ప్రక్షాళన చేయాలి.

ముగింపు

మార్చు

దేశ అభ్యున్నతికి తోడ్పడాల్సిన భవిష్యత్ తరం మార్కులు సాధించే యంత్రాలుగా మిగిలిపోతోంది తప్ప సామజిక స్పృహ, మానవ సంబంధాలతో సమున్నతంగా రూపుదిద్దుకోవటంలేదు. ఇందుకు నిపుణులతో ఆత్మస్థైర్యం నింపే ప్రసంగాలిప్పించాలి. ఇందుకు సర్కారీ విధానాలు పటిష్టంగా అమలు జరగాలి. అలా కాకుండా ఏమి పట్టనట్లు వ్యవహరించినంత కాలం విద్య పేరుతో వ్యాపారం తప్పదు.


ఇప్పుడున్న విద్యావిధానం చదవడం మాత్రమే నేర్పుతుంది. ఆలోచించడం ఎలాగో చెప్పదు. పోటిప్రపంచంలో నిలవాలన్నా, గెలవాలన్నా- ఆలోచన ఉండాలి. పరిజ్ఞానం అవసరమే కానీ దాన్ని ఎలా ఉపయోగించాలన్న ఆలోచన లేకపోతే పరిజ్ఞానం ఉండి ఏం లాభం? కొత్త తరం ముందుగా ఆలోచించడం నేర్చుకోవాలి - అది కూడా కొత్తగా, వైవిధ్యంగా .

సబీర్ భాటియా,హాట్ మెయిల్ సృష్టికర్త

అంతర్గత లింకులు

మార్చు
 1. http://archives.eenadu.net/06-16-2013/news/newsitem.aspx?item=panel&no=1
 2. http://archives.eenadu.net/06-20-2013/news/newsitem.aspx?item=panel&no=5

బాహ్య లింకులు

మార్చు
 1. http://archives.eenadu.net/07-15-2013/news/newsitem.aspx?item=panel&no=11