వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 21వ వారం

శ్రీశైలము ప్రసిద్ధ శైవ క్షేత్రము. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. ఎందరో రాజులు, పురాణ పురుషులు సేవలు చేసిన మహాక్షేత్రం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.


శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు కలవు. క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి శ్రీశైల దేవాలయ ప్రాంతము, సున్నిపెంట ప్రాంతము, మండపాలు, పంచమఠాల ప్రాంతము, అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు. శ్రీమల్లికార్జునుని దేవాలయము అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. మనోహర గుండము తప్పకుండా చూడవలసిన వాటిలో ఒకటి. చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది.


శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. సాక్షి గణపతి ఆలయము ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని. అందుకే ఇతనిని సాక్షి గణపతి అంటారు. శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ....పూర్తివ్యాసం: పాతవి