వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 28వ వారం

హామ్ రేడియో ఒక అభిరుచి. ఖాళీ సమయాలలో తమకున్న ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞావంతో, స్వయంగా రేడియో ట్రాన్సీవరు - తయారు చేసి, తమలాంటి ఇతరులతో ఆ రేడియో ద్వారా సంభాషించటమే ఈ అభిరుచి. ప్రారంభ కాలంలో, స్వయంగా సెట్ తయారు చేసుకోగలిగేవారు మాత్రమే ఈ అభిరుచి చూపగలిగేవారు. కాలక్రమేణా ఇతరులు తయారు చేసిన సెట్లు లేదా మార్కెట్‌లో కొనుక్కొని ఈ అభిరుచిని కొనసాగించటం మొదలు పెట్టారు. హామ్ (H A M) అనే పదం ఎలా వచ్చిందో అన్న విషయం మీద చాలా రకాల వివరణలు ఉన్నయి - Home Amateur Mechanic కు పొడి అక్షరాలే HAM అని ఒక వివరణ. అలాగే సుప్రసిద్ద రేడియో సాంకేతిక నిపుణులు, శాస్త్రజ్ఞులు అయిన Hertz, Armstrong (చంద్రుడిమీద దిగిన ఆయన కాదు) మరియు Marconi ల పేర్లలో మొదటి అక్షరాలతో HAM అని వచ్చిందని మరొక వాదన.


హామ్‌లు తమ రేడియో తయారీ, వారున్న ప్రదేశంలో వాతావరణం వంటి విషయాలు మాట్లాడుకుంటారు. సాంకేతిక అనుభవాలు పంచుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు - తుఫాన్లు, భూకంపాలు మొదలగునవి- సంభవించినప్పుడు, సాధారణ సమాచార సాధనాలు పనిచేయని పరిస్తితులలో హామ్ రేడియో ద్వారా సమాచారం ఒక చోట నుండి మరొకచోటికి పంపటం తేలిక. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం "హామ్ క్లబ్ స్టేషన్" లను ఏర్పరిచి ప్రోత్సహిస్తున్నది. రాజకీయాలు, మత సంబంధ విషయాలు, డబ్బుల గురించి, వ్యాపార సంబంధమయిన విషయాలు, అసభ్య విషయాల గురించి మాట్లాడటం హామ్‌లో పూర్తిగా నిషేధం.


ఎక్కువ ఫ్రీక్వెన్సీ (HF) సుదూర ప్రాంతాలతో మాట్లాడేందుకు వాడతారు. అతి ఎక్కువ ఫ్రీక్వెన్సీ (VHF) స్థానికంగా 20-30 కిలోమీటర్ల పరిధిలో వాడతారు. రేడియోలో సంభాషించటానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వంలోని కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ వారు పరీక్ష నిర్వహించి, అందులో ఉతీర్ణులైన వారికి, పోలీసు దర్యాప్తు తరువాత ఒక లైసెన్సు ఇస్తారు. హామ్ లైసెన్సులో ఆ హామ్‌కు ఇవ్వబడ్డ ప్రత్యేక సంకేతనామము ఉంటంది. ప్రపంచములోని అన్ని దేశాలూ కూడా ఒక ఒప్పందమునకు వచ్చి, దేశములన్నిటికి కూడా ఒక నిర్దిష్ట సంకేత నామమును ఇచ్చుకొన్నారు. తెలుగు వారిలో హామ్‌లు చాలామంది, పట్టణాలలోనే కాకుండా చిన్న ఊళ్ళలో కూడా ఉన్నారు. వీరిలో అధికంగా తమ సొంత సెట్లు తయారు చేసుకొని "బ్యాండు లోకి" (హామ్ పరిభాషలో ఈ హాబీలోకి వచ్చి ఇతరులతో సంభాషణ మొదలుపెట్టటం) వచ్చినవారే. ......పూర్తివ్యాసం: పాతవి